Skip to main content

10వ తేదీ నాటికి వెరిఫికేషన్ ...తెలంగాణలో ఎంసెట్‌పై ఏపీ ఉన్నత విద్యా మండలి

హైదరాబాద్:ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం (7వ తేదీ) నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కానుందని, తెలంగాణలో 10వ తేదీ నాటికి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కమిటీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం వేణుగోపాలరెడ్డి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఈనెల 23 నాటికి ధ్రువపత్రాల తనిఖీ పూర్తవుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియకు అంగీకరించిందన్నారు. అయితే తెలంగాణలో హెల్ప్‌లైన్ కేంద్రాలను తెరవబోమని పాలిటెక్నిక్ అధ్యాపక సంఘాలు ప్రకటించాయని, వాటితో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పించేందుకు రెండు మూడు రోజులు పడుతుందని తెలంగాణ అధికారులు వివరించారని వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి 10వ తేదీ నాటికి తెలంగాణలో ధ్రువపత్రాల పరిశీలనను చేపడతామని చెప్పారని వివరించారు. ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రక్రియ జరుగుతుందని, తెలంగాణలో కొంత ఆలస్యంగా ప్రారంభమైనా.. మొదటి రోజు 1వ ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు లేదా 20 వేల ర్యాంకు వరకు పరిశీలన చేపడతామన్నారు. వెబ్ ఆప్షన్లపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. శుక్ర లేదా శనివారాల్లో మరోసారి సమావేశమై వెబ్ ఆప్షన్లను ఏయే తేదీల నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్ణయిస్తామని చెప్పారు. మొత్తానికి ఈనెల 29వ తేదీ నాటికి ప్రవేశాలు పూర్తి చేసి.. 30, 31 తేదీల్లో విద్యార్థులకు సీటు కేటాయింపు లేఖలు పంపిస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల 1 లేదా 2వ తేదీన తరగతులను ప్రారంభిస్తామని వివరించారు.

తెలంగాణ స్పష్టత ఇస్తుందనుకుంటా..!
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలుచేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని వేణుగోపాలరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పష్టత ఇస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. కాలేజీల్లో ఫీజులపై స్పష్టత లేదని, తెలంగాణలో విద్యార్థులకు నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేవని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘దానిపై నాకు క్లారిటీ లేదు. అవసరమైతే ప్రభుత్వాలను సంప్రదిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు కూడా అవసరమైన చర్యలు చేపడతాయని భావిస్తున్నాం. కళాశాలల అనుమతులు, మేనేజ్‌మెంట్ కోటా, ఎన్‌ఆర్‌ఐ కోటాకు సంబంధించి ఉత్తర్వులు రావాల్సి ఉంది. వాటిని త్వరగా ఇవ్వాలని రెండు ప్రభుత్వాలను కోరుతాం..’’ అని చైర్మన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌన్సిల్ చైర్మన్‌ను భేటీకి పిలవలేదేమని ప్రశ్నించగా... పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తామే కాంపిటెంట్ అథారిటీ అని, కొత్త చైర్మన్ ప్రవేశాల కమిటీలో సభ్యుడు కానందున సమావేశానికి పిలవలేదని తెలిపారు.

‘టీ’ చైర్మన్‌కు అందని పిలుపు..
ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను ఆహ్వానించలేదు. టీ మండలి చైర్మన్‌ను పిలవకపోవడంతోపాటు కాంపిటెంట్ అథారిటీ ఎవరనే అంశంపైనా సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా కాంపిటెంట్ అథారిటీ ఎవరనే విషయంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, కౌన్సిల్ చట్టం ప్రకారం చైర్మన్‌గా తనకున్న అధికారాల పరిధిని వేణుగోపాలరెడ్డి వివరించినట్లు తెలిసింది. ఇక తెలంగాణ మండలికి చైర్మన్‌ను నియమించాక కూడా సమావేశానికి పిలవకపోవడం ఏమిటని, ఆయనను సమావేశానికి పిలవాలని లేఖ రాసిన తరువాత కూడా పట్టించుకోకపోవడం ఏమిటనే అంశంపై తెలంగాణ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది.
Published date : 07 Aug 2014 12:13PM

Photo Stories