10 కాలేజీల్లో 50 మంది చొప్పునే!
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణలో 10 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్కొక్క దాంట్లో 50 మంది లోపే విద్యార్థులు చేరారు. ఒక కాలేజీలోనైతే ఒక్కరు కూడా చేరలేదు. రాష్ట్రంలో 174 ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్లు లభించని సంగతి తెలిసిందే. ఇక పది మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు రెండున్నాయి. వంద మందిలోపే చేరిన కాలేజీలు 21 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 9 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 10 మందిలోపే విద్యార్థులు చేరిన కాలేజీలు 31 ఉన్నాయి. 88 కాలేజీల్లోనైతే ఒక్కోదాంట్లో 50 మందిలోపే విద్యార్థులు చేరడం గమనార్హం. ఇంజనీరింగ్ మొదటి దశ ప్రవేశాల సీట్లు కేటాయింపు ముగియడంతో ఏపీ ఉన్నత విద్యా మండలి ఈ వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది తెలంగాణలో 149 కాలేజీలకు, ఆంధ్రప్రదేశ్‌లో 326 కాలేజీలకు ఇంజనీరింగ్‌కోర్సులకు ప్రవేశాలు చేపట్టగా, రెండు రాష్ట్రాల్లో కలిపి 103 కాలేజీల్లో సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. ఇందులో తెలంగాణలో 60 కాలేజీలు, ఆంధ్రప్రదేశ్‌లో 38 కాలేజీలు, ప్రభుత్వ రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు ఐదింటిలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మిగితా కాలేజీల్లో కొన్ని బ్రాంచీలకు ఆదరణ లేకపోగా, మరికొన్ని బ్రాంచీలు భర్తీ అయ్యాయి.
Published date : 03 Sep 2014 11:49AM