Skip to main content

Success Story: స్మార్ట్‌ఫోన్‌కు క‌ల్లెం వేశా.. రోజుకు ఐదు గంట‌లు చ‌దివా.. మాఅమ్మ‌ క‌ల నెర‌వేర్చానిలా...

ఒక‌వైపు ఉద్యోగం.. మ‌రోవైపు క‌న్న‌తల్లి క‌ల‌.. రెండూ ముఖ్య‌మే.. కానీ, ఉద్యోగం చేస్తూనే మ‌రోప‌క్క త‌ల్లి క‌ల సాకారం చేసేందుకు శ్ర‌మించాడు ఆ కుమారుడు. ఉద్యోగం చేస్తూనే రోజుకు ఐదారు గంట‌ల పాటు చదివి.. చివ‌రికి తన తల్లి ఆశ‌యాన్ని నెర‌వేర్చాడు.
PavanSwaroop Reddy

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించే ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఐఇఎస్‌–2022)లో  హైదరాబాద్‌కు చెందిన పవన్‌ స్వరూప్‌ రెడ్డి 5వ ర్యాంక్‌ సాధించి ప‌లువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.
విద్యాభ్యాసం ఇలా....
సూరత్‌ ‘నిట్‌’ లో సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసిన పవన్‌ స్వరూప్‌రెడ్డి ఐఐటీ, కాన్పూర్‌లో స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ చేశాడు. ‘మెట్రో మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరుగాంచిన డా.శ్రీధరన్‌ ఆటోబయోగ్రఫీ ‘కర్మ యోగి’ చదివాడు. ఆ పుస్తకం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ప‌వ‌న్‌ చెప్తాడు. బలమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి అదే కారణమైంది.

చ‌ద‌వండి: పేప‌ర్‌బాయ్‌గా ప‌ని చేసి ప్ర‌పంచ‌మే గ‌ర్వించ‌ద‌గ్గ‌స్థాయికి చేరుకున్న తెలుగుతేజం 

శ్రీధరన్‌ చేసిన ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌లతో స్ఫూర్తి పొందిన పవన్‌ ఇంజనీరింగ్‌ సర్వీస్‌లలోకి రావాలనుకున్నాడు. తనను ఐ.ఇ.ఎస్‌ ఆఫీసర్‌గా చూడాలనేది తల్లి కల. తండ్రి ఆంజనేయులురెడ్డి ఇదే పరీక్షల్లో ఒకప్పుడు 13వ ర్యాంక్‌ సాధించాడు. ప్రస్తుతం ఆయన సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, సికింద్రాబాద్‌లో చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
రోజుకు ఆరు గంటలపాటు సాధ‌న‌...
బెంగళూరులోని అమెరికాకు చెందిన ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీలో స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు రోజుకు 5–6 గంటలు, సెలవు రోజు 8–10 గంటల పాటు ‘ఐఇఎస్‌’ పరీక్షల కోసం ప్రిపేరయ్యేవాడు. ‘ఒకవైపు ఉద్యోగబాధ్యతలకు వందశాతం న్యాయం చేయాలి. మరోవైపు ఆఫీస్‌ నుంచి వచ్చిన తరువాత పరీక్షలకు గట్టిగా ప్రిపేర్‌ కావాలి’ అనుకొని రంగంలోకి దిగాడు. 

చ‌ద‌వండి: పది నెలల పాపతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది... మీరు ఓ లుక్కేయండి
అప‌జ‌యాలు ఎదురైనా...
స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టాడు. స్టడీ మెటీరియల్‌ మాత్రమే తన కళ్ల ముందు కనిపించేది. స్వరూప్‌ కష్టం వృథాపోలేదు. ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌లో 5వ ర్యాంకుతో విజయకేతనం ఎగరేశాడు. ‘ఒక్కసారి మీ ప్రయత్నంలో విఫలం అయితే ఎంతమాత్రం నిరాశ పడనక్కర్లేదు. మనం చేసిన తప్పుల నుంచి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఏంచేయకూడదో తెలుసుకోవచ్చు. మనం నిర్దేశించుకున్న లక్ష్యంపై గట్టి సంకల్పబలం ఉంటే విజయం దక్కడం కష్టమేమీ కాదు’ అంటున్న పవన్‌ స్వరూప్‌రెడ్డి తన వృత్తిజీవితంలో విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Published date : 25 Feb 2023 05:51PM

Photo Stories