Skip to main content

ఏపీలో ఓపెన్ వర్సిటీ ఏర్పాటుకు కృషి చేయండి

వైఎస్ జగన్‌కు అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగుల వినతి
సాక్షి, హైదరాబాద్: బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని విడిగా ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించేలా కృషిచేయాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డికి విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యయన కేంద్రాల సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు వారి ప్రతినిధులు పలువురు జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం కలసి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, షేక్ బేపారి అంజాద్‌బాషా నేతృత్వంలో వారు వైఎస్సార్‌సీపీ అధినేతను కలిశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు 1982లో ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని, 35 ఏళ్లుగా విద్యను అందజేస్తున్నదని వారు వినతిపత్రంలో తెలిపారు. ఏపీలో 13 ప్రాంతీయ కేంద్రాలు, 92 అధ్యయన కేంద్రాలున్నాయన్నారు. ఈ విశ్వవిద్యాలయం పదో షెడ్యూలులో ఉన్నందున రెండు రాష్ట్రాలకు సమానాధికారం ఉందన్నారు. అయితే ఈ వర్సిటీలో తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను జారీచేశారని, ఏపీకి విడుదల చేయలేదని తెలిపారు. ఏపీకి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేసినట్లయిందని ఆవేదన వెలిబుచ్చారు. అందువల్ల వెంటనే ఏపీకి కూడా అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేయించడంగానీ లేదా విడిగా రాష్ట్రంలో ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయించడంగానీ జరగాలని అంటూ.. ఇందుకోసం కృషిచేయాలని వారు విన్నవించారు. జగన్‌ను కలసిన విద్యార్థి ప్రతినిధుల్లో.. కర్నూలు జిల్లాలోని సిల్వర్ జూబిలీ కళాశాల, నంద్యాల, డోన్, శ్రీశైలం, ఎమ్మిగనూరు, కేవీఆర్ మహిళా కళాశాలల అధ్యయన కేంద్రాల్లో విద్యనభ్యసిస్తున్న వారినుంచి వచ్చిన వారున్నారు.
Published date : 31 Jul 2015 02:18PM

Photo Stories