APP: భారతదేశంలో అత్యంత ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసిన యాప్ ఇదే..
ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ పరంగా చూస్తే చైనా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న భారత్ ఉంది. మొబైల్ డేటా ఎనలిటిక్స్ ఫ్లాట్ ఫారం యాప్ అన్నీ(Annie) విడుదల చేసిన మొబైల్ మార్కెట్ స్పాట్ లైట్ రిపోర్ట్ 2021 నివేదికలో ఈ విషయం బయట పడింది. భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రపంచ యాప్ మార్కెట్లో బూమ్ ఏర్పడినట్లు ఈ నివేదిక హైలైట్ చేసింది.
కరోనా రాకముందు కంటే..
డౌన్‌లోడ్ పరంగా చూస్తే గేమ్ యాప్స్, సోషల్ యాప్స్, ఎంటర్ టైన్ మెంట్ యాప్స్‌ను అత్యధికంగా డౌన్‌లోడ్ చేశారు. ఇందులో అధికంగా యూట్యూబ్, వాట్సాప్ మెసెంజర్, ఫేస్‌బుక్ యాప్స్‌ను ఎక్కువగా డౌన్‌లోడ్ చేసినట్లు నివేదిక తెలిపింది. 2020లో భారతీయులు 651 బిలియన్ గంటలు ఆన్‌లైన్‌లో గడిపారు. మన దేశంలో ఒక సగటు మొబైల్ వినియోగదారుడు ప్రతిరోజూ ఫోన్లలో 4.8 గంటలు గడిపారని తెలిపింది. 2019లో రోజుకు 3.3 గంటల నుంచి 40 శాతం పెరిగింది.కోవిడ్-19 మహమ్మారి సమయంలో మొబైల్ వాడకం భారీగా పెరిగిన సంగతి మనకు తెలిసిందే. కరోనా రాకముందు కంటే 2021లో మొబైల్ వాడకం 80 శాతం పెరిగింది.
మొదటి స్థానంలో..
ఆండ్రాయిడ్ గేమింగ్ యాప్స్ భారతదేశంలో తమ పట్టు నిలుపుకున్నాయి. 2021 హెచ్1లో గేమ్ డౌన్‌లోడ్ సంఖ్య 4.8 బిలియన్లకు చేరుకుంది. 2021 హెచ్1లో భారతదేశంలో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన గేమ్ యాప్ గా లుడో కింగ్ నిలిచింది. ఆ తర్వాత స్థానాలలో ఫౌజీ, క్యారమ్ పూల్ నిలిచాయి. ఇక పెట్టుబడి యాప్స్ విషయానికి వస్తే అప్ స్టోక్స్ మొదటి స్థానంలో నిలిస్తే.. ఆ తర్వాత స్థానాలలో వజీర్ఎక్స్, కాయిన్ స్విచ్ వంటి క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ యాప్స్ నిలిచాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపీఐ) కూడా వినియోగదారులకు ఆసక్తి కలిగించింది. యుపీఐ లావాదేవీల పరిమాణం క్యూ2 2021లో దాదాపు ఎనిమిది బిలియన్లకు చేరుకుంది.