Filling of 2.25 lakh jobs in nine years: తొమ్మిదేళ్లలో 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ల కాలంలో సుమారు 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు సిద్ధమవుతున్న తెలంగాణ యువతకు తాజాగా మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు.
గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. తొలిదఫా అధికారంలో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను.. రెండోసారి అధికారంలోకి వచ్చాక 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టిన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సుమారు 32 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఉద్యోగాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యతనిచ్చేలా సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిన తరువాత ఆఫీస్ సబార్డినేట్ నుంచి ఆర్డీవో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయన్నారు.
త్వరలో మరో 10 వేల మంది రెగ్యులరైజ్...
ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే.. ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. త్వరలో 10 వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించబోతున్నామని తెలిపారు. ప్రతి ఉద్యోగాన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి వివక్షకు తావులేకుండా గ్రూపు–1 ఉద్యోగాల్లోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికినట్లు చెప్పారు. అలాగే ఈ తొమ్మిదేళ్లలో సుమారు 17 లక్షల మందికిపైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత తెలంగాణకే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా స్టార్టప్ ఎకో సిస్టంను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వినూత్నంగా ఆలోచించే యువతకు అండగా ఉండేందుకు టీ హబ్, టీ వర్క్స్, వీ హబ్, టీఎస్‌ఐసీ వంటి వేదికలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.