Babar Azam: ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా బాబర్ ఆజమ్
మూడు ఫార్మాట్‌లలో రాణించిన బాబర్‌ను ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపిక చేసింది. 2022లో ఓవరాల్‌గా 44 మ్యాచ్‌లు ఆడిన బాబర్ 54.12 సగటుతో 2598 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దిగ్గజ క్రికెటర్ పేరిట ఏడాది ఉత్తమ ఆటగాడికి ఇచ్చే ‘సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ’ని బాబర్ అందుకుంటాడు. దీంతో పాటు బాబర్ ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా కూడా ఎంపిక కావడం విశేషం. వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న అతను... గత సంవత్సరం 9 వన్డేల్లో 84.87 సగటుతో 679 పరుగులు సాధించాడు.
2022 ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు లభించింది. 15 టెస్టుల్లో స్టోక్స్ 870 పరుగులు చేసి 26 వికెట్లు కూడా పడగొట్టాడు. అతను సారథిగా వ్యవహరించిన 10 టెస్టుల్లో 9 మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలిచింది. ఇంగ్లండ్‌కే చెందిన మహిళా క్రికెటర్ నాట్ సివర్ ‘ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుతో పాటు ‘ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు కూడా ఎంపికైంది. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఆమె 1346 పరుగులు చేసి 22 వికెట్లు తీసింది.