Skip to main content

National sports awards : శ్రీజ, నిఖత్‌లకు ‘అర్జున’.. శరత్‌ కమల్‌కు ‘ఖేల్‌రత్న’

న్యూఢిల్లీ: తెలంగాణ క్రీడాకారిణులు నిఖత్‌ జరీన్, ఆకుల శ్రీజ ‘అర్జున’ విజేతలయ్యారు. అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పతకాలతో సత్తా చాటుకుంటున్న తెలంగాణ మహిళా చాంపియన్లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
National sports awards ceremony on 30
National sports awards ceremony on 30

జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా బాక్సర్‌ నిఖత్, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్‌ శ్రీజలను ‘అర్జున’ అవార్డుకు ఎంపిక చేసింది. శ్రీజ ‘మిక్స్‌డ్‌’ భాగస్వామి, స్టార్‌ టీటీ ప్లేయర్‌ అచంట శరత్‌ కమల్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న’ లభించింది. నవంబర్ 30న రాష్ట్రపతి భవన్‌లో జరిగే వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల్ని అందజేయనున్నారు. కొన్నేళ్లుగా ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ముగ్గురు, నలుగురేసి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. కానీ ఈసారి శరత్‌ మాత్రమే ఆ అవార్డుకు ఎంపికయ్యాడు. 

Also read: ICC T20 : టీ20 వరల్డ్‌కప్‌-2022 అత్యుత్తమ జట్టులో భార‌త్ నుంచి చోటు వీరికే..

తమిళనాడుకు చెందిన 40 ఏళ్ల శరత్‌ కమల్‌ నాలుగు ఒలింపిక్స్‌ క్రీడల్లో (204 ఏథెన్స్, 2008 బీజింగ్, 2016 రియో, 2020 టోక్యో) భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐదుసార్లు కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొని ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు, ఆసియా చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్యాలు గెల్చుకున్నాడు.  

మొత్తం 25 మంది క్రీడాకారులకు ‘అర్జున’ దక్కింది. ఇందులో నలుగురు పారాథ్లెట్లున్నారు కానీ ఒక్క భారత మహిళా, పురుష క్రికెటర్‌ లేడు. ఆటగాళ్లను తీర్చిదిద్దే కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య రెగ్యులర్‌ అవార్డుకు జీవన్‌జోత్‌ సింగ్‌ తేజ (ఆర్చరీ), మొహమ్మద్‌ అలీ ఖమర్‌ (బాక్సింగ్‌), సుమ షిరూర్‌ (పారా షూటింగ్‌), సుజీత్‌ మాన్‌ (రెజ్లింగ్‌)... ద్రోణాచార్య ‘లైఫ్‌ టైమ్‌’ అవార్డుకు దినేశ్‌ లాడ్‌ (క్రికెట్‌), బిమల్‌ ఘోష్‌ (ఫుట్‌బాల్‌), రాజ్‌ సింగ్‌ (రెజ్లింగ్‌) ఎంపికయ్యారు. అశ్విని అకుంజీ (అథ్లెటిక్స్‌), ధరమ్‌వీర్‌ (హాకీ), సురేశ్‌ (కబడ్డీ), నీర్‌ బహదూర్‌ (పారాథ్లెటిక్స్‌) ధ్యాన్‌చంద్‌ జీవిత సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.  

Also read: Asian Boxing Championship: రజతంతో శివ థాపా రికార్డు

తెలంగాణ స్టార్లకు... 
ఇంటాబయటా అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలతో మెరిసిన ఆకుల శ్రీజ ఈ ఏడాది కెరీర్‌లోనే అత్యుత్తమ సాఫల్యాన్ని బర్మింగ్‌హామ్‌లో సాకారం చేసుకొంది. ఈ ఏడాది అక్కడ జరిగిన ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ గేమ్స్‌లో వెటరన్‌ స్టార్‌ శరత్‌ కమల్‌తో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బంగారు పతకం సాధించింది. 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో ఆమె మహిళల డబుల్స్, టీమ్‌ ఈవెంట్లలో పసిడి పతకాలు నెగ్గింది. నిఖత్‌ ఈ ఏడాది ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, బర్మింగ్‌హమ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించింది. 2019లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకంతో మెరిసింది. 

Also read: Filmfare Awards 2022 : 'పుష్ప' తగ్గేదేలె.. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల్లో క్లీన్‌ స్వీప్‌..

అవార్డీల జాబితా 
మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న: శరత్‌ కమల్‌ (టేబుల్‌ టెన్నిస్‌). 
అర్జున: నిఖత్‌ జరీన్, అమిత్‌ (బాక్సింగ్‌), శ్రీజ (టేబుల్‌ టెన్నిస్‌), సీమా పూనియా, ఎల్డోస్‌ పాల్, అవినాశ్‌ సాబ్లే (అథ్లెటిక్స్‌), లక్ష్య సేన్, ప్రణయ్‌ (బ్యాడ్మింటన్‌), భక్తి కులకరి్ణ, ప్రజ్ఞానంద (చెస్‌), దీప్‌గ్రేస్‌ ఎక్కా (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్‌ మోని సైకియా (లాన్‌ బౌల్‌), సాగర్‌ కైలాస్‌ (మల్లకంబ), ఇలవేనిల్‌ వలరివన్, ఓంప్రకాశ్‌ మిథర్వాల్‌ (షూటింగ్‌), వికాస్‌ ఠాకూర్‌ (వెయిట్‌లిఫ్టింగ్‌), అన్షు, సరిత (రెజ్లింగ్‌), పర్విన్‌ (వుషు), మానసి జోషి, తరుణ్‌ థిల్లాన్, జెర్లిన్‌ అనిక (పారా బ్యాడ్మింటన్‌), స్వప్నిల్‌ పాటిల్‌ (పారా స్విమ్మింగ్‌).  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 15 Nov 2022 02:52PM

Photo Stories