Shooting World Cup: ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్‌కు రెండో స్థానం
ఓవరాల్‌గా భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఐదు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలను సాధించింది. చైనా ఎనిమిది స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. చివరిరోజు మార్చి 26న మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్‌లో సిఫ్ట్ కౌర్ సామ్రా మూడో స్థానంలో నిలిచింది. ఎంబీబీఎస్ చదువుతోన్న పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల సిఫ్ట్ కౌర్ క్వాలిఫయింగ్‌లో 588 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి ర్యాంకింగ్ రౌండ్‌కు అర్హత సాధించింది. ఎనిమిది మంది పాల్గొన్న ర్యాంకింగ్ రౌండ్‌లో సిఫ్ట్ కౌర్ 403.9 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. సిఫ్ట్ కౌర్‌కిది రెండో ప్రపంచకప్ పతకం. గత ఏడాది కొరియాలో జరిగిన ప్రపంచకప్‌లోనూ ఆమె కాంస్య పతకం సాధించింది.
మనూ భాకర్‌కు కాంస్యం
మార్చి 25న జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మనూ భాకర్ (20 పాయింట్లు) కాంస్య పతకం గెలుచుకుంది. టోర్నీలో భాకర్‌కు ఇదే మొదటి పతకం. ఈ పోరులో డొరీనా (30 పాయింట్లు), జియూ డు (29 పాయింట్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.