Skip to main content

డిసెంబర్ 2019 అవార్డ్స్

అమితాబ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం
Current Affairs
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో డిసెంబర్ 29నజరిగిన ఓ కార్యక్రమంలో కోవింద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారతీయ సినీ రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది.
అత్యున్నత పురస్కారం
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమాలో ఇది అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు కింద రూ.10 లక్షలతో పాటు స్వర్ణ కమలం అందజేస్తారు. భారతీయ సినిమా పితామహుడు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీదుగా 1969 నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తున్నారు. అదే ఏడాది అమితాబ్ ‘సాత్ హిందుస్తానీ’అనే హిందీ సినిమాతో అరంగేట్రం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమితాబ్ బచ్చన్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ

క్లైవ్ లాయిడ్‌కు నైట్‌హుడ్ పురస్కారం
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్‌ను బ్రిటీష్ అత్యుత్తమ పురస్కారం ‘నైట్‌హుడ్’వరించింది. లాయిడ్‌కు ఈ అవార్డును అందజేయనున్నట్లు ‘న్యూ ఇయర్ ఆనర్స్ లిస్ట్’లో బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ‘సర్’బిరుదును సొంతం చేసుకున్న విండీస్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, ఎవర్టన్ వీక్స్, వివియన్ రిచర్డ్స్ సరసన క్లైవ్ లాయిడ్ నిలవబోతున్నాడు. క్లైవ్ హ్యూబర్ట్ లాయిడ్ 1944లో గయానాలో జన్మించాడు. 22 ఏళ్ల వయస్సులో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మొత్తం 110 టెస్టుల్లో 46కు పైగా సగటుతో 7,515 పరుగులు చేశాడు. అలాగే 87 వన్డే మాచ్‌ల్లో 1,977 పరుగులు సాధించాడు. 1975, 1979లో వన్డే ప్రపంచ కప్‌ను గెలిచిన వెస్టిండీస్ జట్టుకు సారథ్యం వహించాడు. 1985లో చివరి మ్యాచ్ ఆడాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్లైవ్ లాయిడ్‌కు నైట్‌హుడ్ పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : బ్రిటన్ ప్రభుత్వం

పర్యావరణ ఆవిష్కరణలకు ఎర్త్‌షాట్ పురస్కారం
ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేసేలా వినూత్న ఆవిష్కరణలు చేపట్టేవారికి ‘ఎర్త్‌షాట్’ పేరుతో పురస్కారాలు అందజేయనున్నట్లు బ్రిటన్ రాకుమారుడు విలియమ్ డిసెంబర్ 31న ప్రకటించారు. బ్రిటన్ రానున్న దశాబ్ద కాలంపాటు ఏటా ఐదుగురికి ఈ బహుమతులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. పర్యావరణానికి సంబంధించి ఎర్త్‌షాట్ పురస్కారాలు అత్యంత ప్రతిష్ఠాత్మమైనవని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎర్త్‌షాట్ పేరుతో పురస్కారాలు ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : బ్రిటన్ రాకుమారుడు విలియమ్
ఎందుకు : ప్రపంచానికి పెను ముప్పుగా పరిణమిస్తున్న పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేసేలా వినూత్న ఆవిష్కరణలు చేపట్టేవారికి

66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం
Current Affairs
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో డిసెంబర్ 23న 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య ప్రసంగిస్తూ... సినిమాల్లో అశ్లీలత, అసభ్యత, హింసకు తావివ్వరాదని, ప్రజలపై సినిమా చూపే ప్రభావాన్ని దర్శక నిర్మాతలు తెలుసుకోవాలని చిత్రరంగానికి పిలుపునిచ్చారు. మన సినిమాలు భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పా లని సందేశం ఇస్తూ అవార్డు గ్రహీతలను అభినందించారు.
66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు
ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను 2019, ఆగస్టు 9న ప్రకటించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు అవార్డు విజేతల జాబితాను కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అందజేశారు. 2019, ఏప్రిల్‌లో ఈ అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మహానటి, రంగస్థలం, అ!, చి॥సినిమాలకు అవార్డులు లభించాయి.
66వ జాతీయ పురస్కారాలు

ఉత్తమ నటుడు

: ఆయుష్మాన్‌ ఖురానా

ఉత్తమ నటి

: కీర్తి సురేశ్‌ (మహానటి)

ఉత్తమ దర్శకుడు

: ఆదిత్య ధర్‌(ఉడి)

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌

: మహానటి

బెస్ట్‌ మేకప్, విజువల్‌ ఎఫెక్ట్‌

: అ!

ఒరిజినల్‌ స్కీన్ర్‌ ప్లే

: చి.ల.సౌ

ఉత్తమ ఆడియోగ్రఫీ

: రంగస్థలం

ఉత్తమ తమిళ చిత్రం

: బారమ్‌

ఉత్తమ కన్నడ సినిమా

: నాతిచరామి

ఉత్తమ యాక్షన్‌ సినిమా

: కేజీఎఫ్‌

ఉత్తమ సినిమాటోగ్రఫీ

: పద్మావత్‌

ఉత్తమ ఉర్దూ చిత్రం

: హమీద్‌

ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌

: ఉత్తరాఖండ్‌

జాతీయ ఉత్తమ హిందీ సినిమా

: అంధాధున్‌

ప్రజాదరణ పొందిన సినిమా

: బదాయిహో (హిందీ)

ఉత్తమ సామాజిక చిత్రం

: ప్యాడ్‌మాన్‌ (హిందీ)

ఉత్తమ సహాయనటి

: సురేఖ సిక్రీ(బదాయిహో)

ఉత్తమ సహాయ నటుడు

: స్వానంద్‌ కిర్‌కిరే (చంబక్‌)

ఉత్తమ గాయకుడు

: అరిజిత్‌ సింగ్‌(పద్మావత్‌)

ఉత్తమ గాయని

: బిందు మాలిని (నాతిచరామి)

ఉత్తమ సాహిత్యం

: నాతిచరామి (కన్నడ)

బెస్ట్‌ ఎడిటింగ్‌

: నాతిచరామి (కన్నడ)

బెస్ట్‌ డైలాగ్స్‌

: తరీఖ్‌

బెస్ట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌

: ఉడి (హిందీ)

ఉత్తమ బాల నటులు

: పీవీ రోహిత్‌ (కన్నడ), సందీప్‌ సింగ్‌(పంజాబీ), తల్హా అర్‌షాద్‌(ఉర్దూ), శ్రీనివాస్‌ పొకాలే(మరాఠి)

ఉత్తమ బాలల చిత్రం

: సర్కారీ హిరియా ప్రాథమిక శాల, కాశరగోడు(కన్నడ)

ఉత్తమ సినీ విమర్శకులు

: బ్లాసే జానీ(మలయాళం), అనంత్‌ విజయ్‌(హిందీ)

నర్గీస్‌ దత్‌ అవార్డు

: వండల్లా ఎరడల్లా(కన్నడ)


ఐసీటీ జాతీయ అవార్డులు ప్రదానం
విద్యార్థుల అభ్యాసాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) ద్వారా మెరుగుపరిచిన ఉపాధ్యాయులకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సంజయ్ శ్యామ్‌రావు ధోత్రే జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. ఢిల్లీలో డిసెంబర్ 23న జరిగిన కార్యక్రమంలో 2017 సంవత్సరానికి 43 మంది టీచర్లకు ఈ అవార్డులు అందజేశారు. ఈ పురస్కారంకింద ఒక ల్యాప్‌టాప్, వెండి పతకం, ఐసీటీ కిట్, ప్రశంసాపత్రం అందజేశారు.
తెలంగాణ నుంచి ఇద్దరికి..
తెలంగాణ నుంచి లాలాగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల-2 ఉపాధ్యాయురాలు చిలుకా ఉమారాణికి, నవాబ్‌పేట ప్రభుత్వ ప్రాథమికోన్న త పాఠశాల ఉపాధ్యాయుడు దేవనపల్లి నాగరాజుకు ఐసీటీ పురస్కారం లభించింది.
ఏపీ నుంచి నరసింహారెడ్డికి.. ఆంధ్రప్రదేశ్ నుంచి మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు టి.వజ్ర నరసింహారెడ్డికి ఈ పురస్కారం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2017 ఐసీటీ జాతీయ అవార్డులు ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సంజయ్ శ్యామ్‌రావు ధోత్రే
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : విద్యార్థుల అభ్యాసాన్ని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) ద్వారా మెరుగుపరిచిన ఉపాధ్యాయులకు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఇంధన పొదుపు అవార్డు
Current Affairs విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ ఇంధన పొదుపు అవార్డుల్లో మొదటి స్థానం లభించింది. 2018-19 సంవత్సరానికి గాను దేశంలోని ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ విభాగంలో ఈ అవార్డును ప్రకటించారు. కేంద్ర విద్యుత్ సహాయ మంత్రి ఆర్‌కే సింగ్ నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.కె.రథ్, ఈడీ రామానుజం అవార్డు అందుకున్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వేస్ట్ హీట్ రికవరీ టెక్నాలజీ చర్యల్లో భాగంగా కోక్ డ్రై క్వెంచింగ్, బీఎఫ్ టాఫ్ ప్రెజర్ రికవరీ సిస్టం, బీఎఫ్ స్టవ్‌‌స వేస్ట్ హీట్ రికవరీ, ఎల్‌డీ గ్యాస్ రికవరీ, సింటర్ కూలర్ హీట్ రికవరీ పద్ధతుల ద్వారా ఇంధన పొదుపు చేపట్టారు. 2015-16లో టన్ను ఉక్కు ఉత్పత్తికి 6.40 గెగా కేలరీ ఇంధనం వినియోగించగా, దానిని 2018-19లో 5.98 గెగా కేలరీకి తగ్గించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఇంధన పొదుపు అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎక్కడ : 2018-19 సంవత్సరానికి గాను దేశంలోని ఇంటిగ్రేటెడ్ స్టీల్‌ప్లాంట్ విభాగంలో

మిస్ వరల్డ్-2019గా టోనీ-ఆన్ సింగ్
జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ మిస్ వరల్డ్-2019 కిరీటం దక్కించుకున్నారు. లండన్‌లోని ఎక్సెల్ లండన్ కన్వెన్షన్ సెంటర్‌లో డిసెంబర్ 14న జరిగిన కార్యక్రమంలో ఆమెను ఈ కిరీటం వరించింది. మిస్ వరల్డ్-2018 వనెస్సా పొన్స్ డి లియోన్(మెక్సికో).. టోనీ-ఆన్ సింగ్ తలపై మిస్ వరల్డ్ కిరీటాన్ని అలంకరించారు. జమైకా నుంచి మిస్ వరల్డ్ గెలుచుకున్న నాలుగో మహిళగా టోనీ-ఆన్ చరిత్ర సృష్టించారు. తొమ్మిదేళ్ల వయస్సులో ఆమె కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, ఫ్లోరిడాలో స్థిరపడింది. మిస్ వరల్డ్-2019 పోటీల్లో మొదటి రన్నరప్‌గా ఒఫ్లి మెజినో(ఫ్రాన్స్), రెండో రన్నరప్‌గా సుమన్ రావ్(భారత్) నిలిచారు. నవంబర్ 20నుంచి మొదలైన 69వ మిస్ వరల్డ్-2019 పోటీలో 120 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. తుదిపోరుకు చేరిన ఐదుగురికి న్యాయనిర్ణేతల బృందం పలు ప్రశ్నలు సంధించింది. వారి సమాధానాల ఆధారంగా విజేతలను ఎంపిక చేసింది. తన సొంతూరుతోపాటు ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం కోసం పోరాడతానని ఈ సందర్భంగా భారత్‌కు చెందిన రన్నరప్ సుమన్ రావ్ అన్నారు.
సుమన్ రావ్
జననం: 1998 నవంబర్ 23
స్వస్థలం: రాజస్తాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ సమీపంలోని అయిదానా
తల్లి: సుశీలా కున్వర్ రావ్, గృహిణి
తండ్రి: రతన్ సింగ్, నగల వ్యాపారి
విద్య: నవీముంబైలోని మహాత్మా స్కూల్ ఆఫ్ అకాడెమిక్స్ అండ్ స్పోర్‌‌ట్సలో పాఠశాల విద్య పూర్తి చేశారు, ప్రస్తుతం ముంబై యూనివర్సిటీలో చార్టెర్డ్ అకౌంటెన్సీ చదువుతున్నారు.
భాషలు: ఇంగ్లిష్, హిందీతోపాటు మాతృభాష మేవారీ
వృత్తి: మోడల్, డ్యాన్సర్(కథక్)
2018లో మిస్ నవీముంబై పోటీలో పాల్గొని మొదటి రన్నరప్‌గా నిలిచారు. అనంతరం రాజస్తాన్ తరఫున పాల్గొని ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ -2019ను, ఆ పోటీల్లోనే మిస్ ర్యాంప్‌వాక్ అవార్డు గెలుచుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ వరల్డ్-2019 విజేత
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : టోనీ-ఆన్ సింగ్
ఎక్కడ : లండన్, బ్రిటన్

కడప యురేనియం పరిశ్రమకు జాతీయ అవార్డు
ప్రమాదరహితంగా యురేనియం తవ్వకాలు చేపట్టినందుకు కడప జిల్లా ఎం.తుమ్మలపల్లె వద్ద ఉన్న యురేనియం పరిశ్రమకు నేషనల్ సేఫ్టీ అవార్డు-2015 లభించింది. కేంద్ర కార్మికశాఖ న్యూఢిల్లీలో డిసెంబర్ 16న నేషనల్ సేఫ్టీ అవార్డ్స్-2015, 2016 ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా కడప యూరేనియం పరిశ్రమ మైనింగ్ మేనేజర్ కమలాకర్‌రావ్ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కడప యురేనియం పరిశ్రమకు నేషనల్ సేఫ్టీ అవార్డు-2015
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎందుకు : ప్రమాదరహితంగా యురేనియం తవ్వకాలు చేపట్టినందుకు

సీఆర్‌ఐ పంప్స్‌కు ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు
పంపుల తయారీకి సంబంధించి ప్రఖ్యాతి పొందిన సీఆర్‌ఐ పంప్స్ కంపెనీకి కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ నుంచి ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2019’ లభించింది. న్యూఢిల్లీలో డిసెంబర్ 17న జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయమంత్రి ఆర్‌కే సింగ్ నుంచి సీఆర్‌ఐ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ జీ సెల్వరాజ్ ఈ అవార్డును స్వీకరించారు. విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ సీఆర్‌ఐకు ఈ అవార్డు దక్కింది. సీఆర్‌ఐ పంప్స్‌కు ఈ అవార్డు రావడం ఇది ఐదోసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీఆర్‌ఐ పంప్స్‌కు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు-2019
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ
ఎందుకు : విద్యుత్‌ను ఆదా చేసే పంప్స్ ఉత్పత్తికిగానూ

నారాయణస్వామికి కేంద్ర సాహిత్య పురస్కారం
ప్రముఖ తెలుగు రచయిత బండి నారాయణస్వామికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ-2019 పురస్కారం లభించింది. రాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన ‘శప్తభూమి’నవలకు ఈ అవార్డు దక్కింది. కేంద్ర సాహిత్య అకాడెమీ 23 భారతీయ భాషలలో రచనలకు వార్షిక అవార్డులను డిసెంబర్ 18న ప్రకటించింది. 7 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 లఘు కథలు, 3వ్యాసాలు, ఒక నాన్ ఫిక్షన్, ఒక ఆటోబయోగ్రఫీ, ఒక బయోగ్రఫీని అవార్డుల కోసం ఎంపిక చేసినట్లు అకాడెమీ తెలిపింది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన 23 మంది రచయితల్లో కాంగ్రెస్ నేత, రచయిత శశిథరూర్, నాటక రచయిత నంద కిశోర్ ఆచార్య ఉన్నారు. థరూర్ ఆంగ్లంలో రాసిన ‘యాన్ ఎరా ఆఫ్ డార్క్‌నెస్’పుస్తకం, నందకిశోర్ ఆచార్య హిందీలో రాసిన ‘చలాతే హుయే ఆప్నే కో’కవితకు ఈ పురస్కారం లభించింది. విజేతలకు 2020, ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో తామ్ర పత్రంతోపాటు రూ.లక్ష నగదు అందజేస్తారు.
కొంగవాలు కత్తికి యువ పురస్కార్
గడ్డం మోహన్‌రావు రాసిన ‘కొంగవాలు కత్తి’నవలకు సాహిత్య అకాడెమీ యువ పురస్కార్ లభించింది. అదేవిధంగా బెలగం భీమేశ్వరరావు రచన ‘తాత మాట వరాల మూట’కు ‘బాల సాహిత్య పురస్కారం’ దక్కింది.
నారాయణస్వామి నేపథ్యం...
బండి నారాయణస్వామి 1952 జూన్ 3న అనంతపురం జిల్లా పాతూరులో హన్నూరప్ప, పోలేరమ్మ దంపతులకు జన్మించారు. ఎంఏ, బీఈడీ చేసిన ఆయన 30 ఏళ్లపాటు ఉపాధ్యాయునిగా పని చేశారు. నారాయణస్వామి రచించిన తొలికథ పరుగు కాగా, గద్దలాడతాండాయి పేరిట తొలి నవల రచించారు. వీరగల్లు (కథల సంపుటి), రంకె (పెద్ద కథ), మీ రాజ్యం మీరేలండి, నిసర్గమ్, రెండు కలల దేశమ్, శప్తభూమి (నవలలు) ఆయన రచనల్లో పేరొందాయి.
శప్తభూమి : రాయలసీమ చరిత్ర ఆధారంగా శప్తభూమి నవలను నారాయణస్వామి రచించారు. శ్రీకృష్ణదేవరాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు, ప్రజలు, పాలకుల సంగతులు ఇందులో ఉన్నాయి. శప్తభూమి అంటే శాపగ్రస్త ప్రదేశం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బండి నారాయణస్వామికి కేంద్ర సాహిత్య అకాడమీ-2019 పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : కేంద్ర సాహిత్య అకాడమీ
ఎందుకు : రాయలసీమ చరిత్ర నేపథ్యంగా ఆయన రాసిన ‘శప్తభూమి’నవలకు

క్లిమామ్ సంస్థకు ఐఎఫ్‌ఏహెచ్ పురస్కారం
హైదరాబాద్ కేంద్రంగా పాలు, పాల ఉత్పత్తుల పంపిణీతో పాటు ఇతర ఆరోగ్య సేవలు అందిస్తున్న క్లిమామ్ వెల్‌నెస్ అండ్ ఫారమ్స్ సంస్థకు అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి వేదిక (ఐఎఫ్‌ఏహెచ్) పురస్కారం లభించింది. యూఏఈలోని దుబాయ్‌లో డిసెంబర్ 18న జరిగిన ఇంటర్నేషనల్ ఫోరం ఆన్ అడ్వాన్స్ మెంట్స్ ఇన్ హెల్త్ కేర్ కార్యక్రమంలో క్లిమామ్ ఫౌండర్ అల్లోల దివ్యారెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. ఆరోగ్యసంరక్షణ (హెల్త్‌కేర్ లీడర్) విభాగంలో ప్రపంచ దేశాల నుంచి పలు సంస్థలు పోటీపడగా క్లిమామ్ మొదటి 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి వేదిక (ఐఎఫ్‌ఏహెచ్) పురస్కారం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : క్లిమామ్ వెల్‌నెస్ అండ్ ఫారమ్స్ సంస్థ
ఎక్కడ : దుబాయ్, యూఏఈ

ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖకు జాతీయ పురస్కారం
Education News
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘సైబర్ మిత్ర’కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ.. డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ) ఎక్స్‌లెన్సీ అవార్డు-2019ను ప్రకటించింది. దీన్ని డిసెంబర్ 6న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ పోలీస్ టెక్ సర్వీసెస్ డీఐజీ పాల్‌రాజ్ అందుకున్నారు. మహిళలపై పెరిగిపోయిన సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొద్ది రోజుల కిత్రం ‘సైబర్ మిత్ర’ను ప్రారంభించారు. ‘సెక్యూరిటీ ఫర్ ఉమెన్ ఇన్ సైబర్ స్పేస్’ పేరుతో డీజీపీ గౌతమ్ సవాంగ్ పర్యవేక్షణలో సైబర్ మిత్ర మంచి ఫలితాలను సాధిస్తోందని పాల్‌రాజ్ చెప్పారు. ఇప్పటివరకు 400కు పైగా సైబర్ సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించామన్నారు.
సైబర్ మిత్ర’ ఇలా...
  • సైబర్ మిత్రలో భాగంగా జిల్లా, సబ్ డివిజన్ స్థాయిల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సైబర్ వారియర్ (సైబర్ యోధులు) అనే కాన్సెప్ట్ ద్వారా నిపుణుల సేవలను అందుబాటులోకి తెచ్చారు. వీరు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారు.
  • సైబర్ బృందాలకు సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఆధునిక పరికరాలను, సైబర్ కిట్లను అందుబాటులో ఉంచారు. సైబర్ నేరగాళ్లు వాడే సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి వాటిని సులువుగా తెలుసుకోవడానికి సైబర్ బృందాలు వీటిని వినియోగిస్తాయి.
  • సైబర్ సంబంధిత సమస్యలు ఎదుర్కొనేవారు ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు.
  • సమస్య ఉత్పన్నమైనప్పుడు తక్షణం స్పందించి పరిష్కరించడానికి పోలీస్ శాఖ సహాయం అందిస్తుంది.
  • సైబర్ నేరాల బారిన పడే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు నేరుగా 112, 181, 100 టోల్‌ఫ్రీ నంబర్లు, 9121211100 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేసేలా పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి: సైబర్ మిత్ర’కు కేంద్ర ప్రభుత్వ అవార్డు
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: ఢిల్లీ
ఎందుకు: మహిళలపై పెరిగిపోయిన సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు..

నలుగురు దౌత్యవేత్తలకు దీవాలీ వన్ పురస్కారాలు
శాంతియుత ప్రపంచం కోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన కృషికి గాను నలుగురు ప్రముఖ దౌత్యవేత్తలకు ద దీవాలీ- పవర్ ఆఫ్ వన్’ పురస్కారాలు లభించాయి. ఈ నలుగురిలో కజకిస్తాన్ చెందిన కైరాత్ అబ్దాఖ్‌మ్రనోవ్, సైప్రస్ దౌత్యవేత్త నికోలస్ ఎమ్లియోవ్, స్లొవేకియాకు చెందిన ఫ్రాంటియెస్క్ రుజికా, ఐరాసలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి వోలోదిమిర్ యెల్‌చెంకో ఉన్నారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. దౌత్యంలో ఆస్కార్‌లుగా పరిగణించే దీవాలీ వన్ అవార్డులను అమెరికాలోని దీవాలీ ఫౌండేషన్ ప్రారంభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ద దీవాలీ- పవర్ ఆఫ్ వన్ పురస్కారాలు
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : కైరాత్ అబ్దాఖ్‌మ్రనోవ్, నికోలస్ ఎమ్లియోవ్, ఫ్రాంటియెస్క్ రుజికా, వోలోదిమిర్ యెల్‌చెంకో
ఎందుకు : శాంతియుత ప్రపంచం కోసం ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన కృషికి గాను

విశ్వసుందరిగా జొజిబిని తుంజి ఎంపిక
విశ్వసుందరి(మిస్ యూనివర్స్)-2019గా దక్షిణాఫ్రికాలోని సోలో పట్టణానికి చెందిన జొజిబిని తుంజి ఎంపికయ్యారు. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలో ఉన్న టైలర్ పెర్రీ స్టూడియోస్‌లో డిసెంబర్ 8న జరిగిన అందాల పోటీల్లో 26 ఏళ్ల తుంజీని విజేతగా ప్రకటించారు. అనంతరం మిస్ యూనివర్స్-2018 కాట్రియోనా గ్రే(ఫిలిప్పైన్స్) తుంజీకి విశ్వ సుందరి కిరీటం అలంకరించింది. ఈ సందర్భంగా తుంజీ మాట్లాడుతూ.. ‘నా రంగు, నా జుట్టును చూసి ఎవరూ అందంగా ఉందని అనరు. అలాంటి ప్రపంచంలో నేను పెరిగాను. ఇక అలాంటి వివక్షకు ముగింపు పలికే సమయం ఇదే అని నేను భావిస్తున్నా’ అని ఉద్వేగానికి లోనయ్యారు. లింగ ఆధారిత వివక్ష, హింసకు వ్యతిరేకంగా తుంజీ పోరాటం చేస్తున్నారు.
మొత్తం 90 మంది పాల్గొన్న ఈ అందాల పోటీలకు పాపులర్ టీవీ పర్సనాలిటీ స్టీవ్ హార్వే హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ పోటీలలో మిస్ పొర్టొ రీకో ఫస్ట్ రన్నరప్‌గా, మిస్ మెక్సికో సెకండ్ రన్నరప్‌గా నిలిస్తే భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వర్తికా సింగ్ టాప్ 20 స్థానాలలో నిలిచి సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశ్వసుందరి(మిస్ యూనివర్స్)-2019గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 8
ఎవరు : జొజిబిని తుంజి
ఎక్కడ : అట్లాంటా, జార్జియా, అమెరికా

అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్ర నోబెల్ ప్రదానం
భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీకి స్వీడన్ రాజు కార్ల్-16 గుస్తాఫ్ 2019 ఏడాదికి ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో డిసెంబర్ 10న పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బెనర్జీ భార్య ఎస్తేర్ డఫ్లో సైతం ఈ విభాగంలోనే నోబెల్‌ను అందుకున్నారు. అవార్డు ప్రదాన కార్యక్రమంలో దంపతులిద్దరూ భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు.
2019 ఏడాదికి గానూ ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లను సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ఈ ముగ్గిరికి ఆర్థిక నోబెల్ దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అభిజిత్ బెనర్జీకి ఆర్థిక శాస్త్ర నోబెల్ ప్రదానం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : స్వీడన్ రాజు కార్ల్-16 గుస్తాఫ్
ఎక్కడ : స్టాక్‌హోమ్, స్వీడన్

మలయాళ కవి అక్కితమ్‌కు జ్ఞానపీఠ్ పురస్కారం
Current Affairs సాహిత్యరంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ్ ప్రముఖ మలయాళీ కవి అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రిని వరించింది. అక్కితమ్‌ను 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు జ్ఞానపీఠ్ ఎంపిక బోర్డు చైర్మన్ ప్రతిభా నవంబర్ 29న ప్రకటించారు. మలయాళ సాహితీవేత్తల్లో ప్రముఖుడైన అక్కితమ్ కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గల కుమారనెల్లూర్‌లో 1926, మార్చి 18న జన్మించారు. అక్కితమ్ కవితలతోపాటు నాటకాలు, విమర్శనాత్మక వ్యాసాలు, పిల్లల సాహిత్యం, కథలు, అనువాదాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు 55 పుస్తకాలు రాశారు. మలయాళీ సాహిత్యంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డు అందించింది. సాహిత్య అకాడమీ అవార్డు, కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, కబీర్ సమ్మాన్ వంటి పురస్కారాలను అక్కితమ్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 55వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అక్కితమ్ అచ్యుతన్ నంబూద్రి

ది సెలైంట్ వాయిస్ చిత్రానికి జాతీయ అవార్డు
ప్రతి చెరువుకు ఓ స్వరం ఉందనే సందేశాన్నిస్తూ చెరువుల పరిరక్షణపై అవగాహనతో తెరకెక్కిన ‘ది సెలైంట్ వాయిస్’అనే లఘు చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. హైదరాబాద్‌కు చెందిన ఐటీ ప్రొఫెషనల్ సునీల్ సత్యవోలు దర్శకుడిగా, అన్షుల్ సిన్హా నిర్మాతగా ఈ చిత్రాన్ని తీశారు. సీఎంఎస్ ఫిలిం ఫెస్టివల్‌లో ది సెలైంట్ వాయిస్‌కు రెండో స్థానం దక్కింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి రవి అగర్వాల్ చేతుల మీదుగా సునీల్, అన్షుల్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణపై సమాజంలో జవాబుదారీతనాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.

జయేశ్ రంజన్‌కు ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు
స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో చేసిన కృషికి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’అవార్డును అందుకున్నారు. ఢిల్లీలోని స్వీడన్ రాయబార కార్యాలయంలో స్వీడన్ రాజు కార్ల్ గుస్తాఫ్, రాణి సిల్వియా డిసెంబర్ 4న జయేశ్ రంజన్‌కు ఈ అవార్డును అందజేశారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అవార్డును స్వీడన్ దేశ ప్రయోజనాలకు తోడ్పడే వారికి అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్
ఎందుకు : స్వీడన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో చేసిన కృషికి
Published date : 31 Dec 2019 04:51PM

Photo Stories