Shane Warne: ఆస్ట్రేలియన్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం
స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ షేన్ కీత్ వార్న్(52) మార్చి 4న హఠాన్మరణం చెందాడు. థాయ్‌లాండ్‌లోని కోహ్ సమూయ్‌లో ఉన్న తన విల్లాలో తీవ్ర గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగర సమీపంలోని అప్పర్ ఫెర్న్ ట్రీ గల్లీ నగరంలో జన్మించిన వార్న్.. 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా తరఫున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీసి ‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని దాటిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. సొంతగడ్డపై యాషెస్‌లో ఇంగ్లండ్‌ను 5–0తో చిత్తు చేసిన అనంతరం 2007 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు సగర్వంగా వీడ్కోలు పలికాడు. తదనంతరం క్రికెట్ కామెంటేటర్‌గా చురుగ్గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాడు.
ఐపీఎల్‌తోనూ అనుబంధం..
2013లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌గా వార్న్ నిలిచాడు. 1999 వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగానూ ఉన్నాడు. ఇక ఐపీఎల్‌తోనూ షేన్ వార్న్‌కు అనుబంధం ఉంది. 2008 ఆరంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు వార్న్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ సీజన్‌లో రాజస్తాన్ టైటిల్ గెలవడంలో అటు కెప్టెన్‌గా.. ఆటగాడిగా షేన్ వార్న్ కీలకపాత్ర పోషించాడు.
ఒక సెంచరీ కూడా లేకుండానే..
- టెస్టుల్లో షేన్‌వార్న్ వికెట్ల సంఖ్య 708. మురళీధరన్ (800) తర్వాత రెండో స్థానం.
- 2005లో వార్న్ తీసిన వికెట్ల సంఖ్య 96. ఒక ఏడాదిలో ఇదే అత్యధిక వికెట్ల రికార్డు.
- టెస్టుల్లో వార్న్ పరుగులు 3154. కెరీర్‌లో ఒక సెంచరీ కూడా లేకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు
రాడ్ మార్ష్ కన్నుమూత
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్(74) మార్చి 4న ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో కన్నుమూశారు. 1970, 80వ దశకాల్లో మరెవరికీ సాటిరాని మెరుపు వికెట్‌కీపింగ్‌తో ఆయన ఆకట్టుకున్నారు. కెరీర్‌లో ఆయన 355 వికెట్లను తీయడంలో భాగమయ్యారు. 96 టెస్టులు ఆడిన మార్ష్ 3,633 పరుగులు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ హఠాన్మరణం
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : షేన్ కీత్ వార్న్(52)
ఎక్కడ : కోహ్ సమూయ్, థాయ్‌లాండ్
ఎందుకు : గుండెపోటు కారణంగా..