Skip to main content

Vacuum Bomb: థర్మోబారిక్‌ బాంబులు ఏ సూత్రం ఆధారంగా విధ్వంసం సృష్టిస్తాయి?

Vacuum Bomb 1

అణ్వాయుధాల తర్వాత అంతటి విధ్వంసాన్ని, ప్రాణనష్టాన్ని సృష్టించగల ఆయుధాలు.. థర్మో బారిక్‌ బాంబులు. అటు భారీ ఆస్తి నష్టంతో పాటు, ఇటు పెద్ద ఎత్తున జనహననానికి కారణమయ్యే ఈ బాంబులను తమ నగరాలపై రష్యా ప్రయోగిస్తోందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. ఇంతకీ ఏమిటీ బాంబులు? ఎందుకు అంతగా విధ్వంసం సృష్టిస్తాయి? చూద్దాం..

వాక్యూం బాంబ్‌ అని.. ఏరోసాల్‌ బాంబ్‌ అని..
అత్యధిక నష్టాన్ని కలిగించే ఈ థర్మోబారిక్‌ ఆయుధాల తయారీ 1960లో యూఎస్, సోవియట్‌ పోటాపోటీగా చేపట్టాయి. అప్పటినుంచి అంచెలంచెలుగా వీటిని అభివృద్ధి చేస్తూ వచ్చాయి. 2007లో రష్యా అతిపెద్ద థర్మోబారిక్‌ ఆయుధాన్ని పరీక్షించింది. ఈ ఆయుధం 39.9 టన్నుల పేలుడును సృష్టించింది. వీటి తయారీకి ఒక్కో బాంబుకు దాదాపు 1.6 కోట్ల డాలర్ల వరకు ఖర్చవుతుంది. 2017లో అమెరికా తాలిబన్లపై అఫ్గాన్‌లో ఈ బాంబును ప్రయోగించింది. దీని బరువు 21,600 పౌండ్లు. దీని ప్రయోగంతో దాదాపు వెయ్యి అడుగుల విస్తీర్ణంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. వీటిని వాక్యూం బాంబ్‌ అని, ఏరోసాల్‌ బాంబ్‌ అని, ఫ్యూయల్‌ ఎయిర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ అని వ్యవహరిస్తారు.

ఉక్రెయిన్‌పై ప్రయోగించారా?
ఉక్రెయిన్‌పై దాడిలో రష్యా టీఓఎస్‌1 బురాటినో అనే థర్మోబారిక్‌ రాకెట్‌ సిస్టమ్‌ను వాడినట్లు కొన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఆయుధాన్ని ఫ్లేమ్‌ త్రోయర్‌ అని కూడా వ్యవహరిస్తారు. రష్యా తమపై వాక్యూమ్‌ బాంబ్‌ను ప్రయోగించిందని ఐరాసలో ఉక్రెయిన్‌ రాయబారి విలేకరులతో ధ్రువీకరించారు. అయితే రష్యా నిజంగా వీటిని ప్రయోగించిందనేందుకు మరే ఇతర అధికారిక ఆధారాలు ఇంతవరకు లభించలేదు.

ఆవిరి మేఘాల పేలుడు సూత్రం ఆధారంగా..
వాక్యూం బాంబులను పేల్చినప్పుడు పేల్చిన పరిసరాల్లోనుంచి ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన పేలుడును సృష్టిస్తాయి. సాధారణ బాంబు పేలుడు వల్ల ఉద్భవించే పేలుడు తరంగాలతో పోలిస్తే ఈ బాంబుల వల్ల ఉత్పత్తయ్యే పేలుడు తరంగం (బ్లాస్ట్‌ వేవ్‌) ఎక్కువకాలం ఉంటుంది. ఈ బాంబులు సృష్టించే అధిక ఉష్ణోగ్రత కారణంగా దీన్ని ప్రయోగించిన ప్రాంతంలోని మానవ శరీరాలు ఆవిరైపోతాయి. ఆవిరి మేఘాల పేలుడు సూత్రం ఆధారంగా ఈ బాంబులు విధ్వంసం సృష్టిస్తాయి.

బాంబుల ప్రయోగ, పేలుడు దశలు ఇలా..

Vacuum Bomb

​​​​​​​1. థర్మోబారిక్‌ బాంబులను యుద్ధ ట్యాంకులపై అమర్చే మినీ రాకెట్‌ లాంచర్ల నుంచి ప్రయోగిస్తారు. ఐదారు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయవచ్చు.
2. లక్ష్యంగా చేసుకున్న ప్రదేశంలో 100 అడుగుల (సుమారు 30 మీటర్ల) ఎత్తున ఈ బాంబులోని ఒక భాగం విడిపోయి, అతితీవ్రంగా మండే లక్షణమున్న ఏరోసాల్‌ ఇంధనాన్ని విడుదల చేస్తుంది. అది ఆవిర మేఘంలాగా వేగంగా పరిసరాలను చుట్టేస్తుంది.
3. బాంబు మిగిలిన భాగం మరికాస్త దిగువకు ప్రయాణించిన తర్వాత పేలిపోతుంది (బ్లాస్ట్‌). ఇది తొలిదశలో విడుదలైన ఏరోసాల్‌ ఇంధనాన్ని మండించడంతోపాటు షాక్‌వేవ్‌ను సృష్టిస్తుంది.
4. ఏరోసాల్‌ ఇంధనం అంటుకోవడం, పేలుడుతో షాక్‌వేవ్‌ ఏర్పడడంతో చుట్టుపక్కల ఉన్న గాలి వేగంగా పేలుడువైపు దూసుకొస్తుంది.
5. అలా వచ్చిన గాలిలోని ఆక్సిజన్‌ను వినియోగించుకుని ఏరోసాల్‌ ఇంధనం ఒక్కసారిగా మండి తీవ్ర ఉష్ణోగ్రతతో, భారీ విస్ఫోటనాన్ని (ఎక్స్‌ప్లోజన్‌) సృష్టిస్తుంది.

చ‌ద‌వండి: స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి అణు జలాంతర్గామి?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Mar 2022 04:10PM

Photo Stories