Fruits and vegetables: పండ్లు, కూరగాయలను తాజాగా ఉంచే పూత
పండ్లు, కూరగాయలను రెండు నెలల పాటు తాజాగా ఉంచే సరికొత్త పూతను గువాహటిలోని ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆహార ఉత్పత్తి, సరఫరాలో వృథాను తగ్గించాలన్న ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ పరిశోధన తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 'భారత వ్యవసాయ పరిశోధన మండలి గణాంకాల ప్రకారం పండ్లు, కూరగాయల్లో 4.6 నుంచి 15.9 శాతం వృథా అవుతోంది. సరైన నిల్వ సౌకర్యాలు లేకపోవడమే ఇందుకు కారణం' అని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలుపేర్కొన్నారు. సముద్రంలో లభించే దునాలియెల్లా టెర్టియోలెక్టా అనే మైక్రోఆల్గేతో ఈ పూతను తయారు చేశారు. ఈ ఆల్గేలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఆల్గాల్ ఆయిల్‌కూ ఇదే వనరు. ఈ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఈ మైక్రో ఆల్గే నుంచి ఆయిల్‌ను సేకరించాక.. మిగిలిపోయే పదార్థాన్ని పడేస్తారు. ఈ వ్యర్థ పదార్థానికి చిటొసన్ అనే కార్బోహైడ్రేట్‌తో కలిపి తాజా పూతను పరిశోధకులు రూపొందించారు. 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వరకు ఇది స్థిరంగా ఉంటుంది. దీనివల్ల పళ్లు, కూరగాయల రంగు, రూపం, రుచి, పోషక విలువలు కొన్ని వారాల పాటు యథాతథంగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP