Telangana: ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్
ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీ సేథీ ఒక ప్రశంసాపత్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు డిసెంబర్ 23వ తేదీన పంపారు. ఆన్లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై కేంద్ర ఆర్థిక సంఘం ఎప్పటికప్పుడు ఆడిటింగ్ నిర్వహిస్తున్నది. 2020–21 సంవత్సరానికి నిధులు వినియోగంపై ఆన్లైన్ ఆడిటింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నాయి. కేంద్రం విధించిన నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్‌లైన్ ఆడిటింగ్ పూర్తిచేసిన తెలంగాణ, దేశంలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతం తో తమిళనాడు, 60 శాతంతో ఆంధ్ర ప్రదేశ్, 59శాతంతో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు 25 శాతానికి లోపే ఆన్లైన్ ఎడిటింగ్ పూర్తి చేశాయి. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. వరుసగా రెండోసారి రాష్ట్రం ఆన్లైన్ ఆడిటింగ్‌లో నంబర్‌వన్‌గా నిలవడం విశేషం.