సెప్టెంబర్ 2019 రాష్ట్రీయం
విశాఖపట్నం-విజయవాడ మధ్య వారానికి 5 రోజుల పాటునడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఉదయ్ ఎక్స్‌ప్రెస్(22701/02) ప్రారంభమైంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో సెప్టెంబర్ 26న రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు 9 ఏసీ డబుల్ డెక్కర్ కోచ్‌లు, 2-మోటార్ పవర్‌కార్‌లతో నడుస్తుంది. రైల్వేల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించడం ద్వారా మెరుగైన సౌకర్యాల కల్పన, ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఈ సందర్భంగా కేంద్ర అంగడి పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని హెచ్‌ఐఐసీలో సెప్టెంబర్ 26న 17వ సీఐఐ-ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2019ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో సుమారు వందకు పైగా కంపెనీలు గ్రీన్ బిల్డింగ్ ఉత్పత్తులు, టెక్నాలజీలను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... జనాభా పెరుగుదల, వలసలు, నియంత్రణ లేని అభివృద్ధి వంటి కారణాల వల్ల సహజ వనరులు దోపిడీకి గురువుతున్నాయని, ఇవే వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలని అన్నారు. బాధ్యతాయుతమైన పౌరుడిగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 17వ సీఐఐ-ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్-2019 ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 26
ఎవరు : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : హైదరాబాద్
హైదరాబాద్‌లో ఎంఫసిస్ ఎక్సలెన్స్ సెంటర్
ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ఎంఫసిస్ హైదరాబాద్‌లోని రాయదుర్గంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల కోసం ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సెప్టెంబర్ 27న ప్రారంభించారు. ఈ నూతన సెంటర్‌తో హైదరాబాద్‌లో ఎంఫసిస్ ఆఫీసుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఐటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణను నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎంఫసిస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : రాయదుర్గం, హైదరాబాద్
ఎందుకు : బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల కోసం
అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి వెలుగు
ఆంధ్రప్రదేశ్‌లో 2019, అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ప్రారభించనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెప్టెంబర్ 28న వెల్లడించారు. అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఇంటి వద్దకే పాలన అందించేందుకే గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద విద్యార్థులతో పాటు అందరికీ ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019, అక్టోబర్ 10న వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించేందుకు
ఐఐటీ మద్రాసు స్నాతకోత్సవంలో మోదీ
తమిళనాడు రాజధాని చెన్నైలో సెప్టెంబర్ 30న జరిగిన ఐఐటీ మద్రాసు 56వ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్ వైపు ప్రపంచం ఒక ఆశావహ దృక్పథంతో చూస్తోందని, భారతీయ యువత శక్తి సామర్థ్యాలపై ప్రగాఢ విశ్వాసం చూపుతోందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. గృహావసరాలకు వాడుతున్న నీటిని పునర్వినియోగించడంపై, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌కు పర్యావరణ హిత ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంపై పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. అలాగే, విద్యార్థులు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దని, ఫిట్‌నెస్ పైన దృష్టిపెట్టాలని కోరారు. మరోవైపు ‘సింగపూర్, ఇండియా హ్యాకథాన్ 2019’ విజేతలకు మోదీ బహుమతులను అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఐటీ మద్రాసు 56వ స్నాతకోత్సవంలో ప్రసంగం
ఎప్పుడు : సెప్టెంబర్ 30
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
విశాఖలో డీఆర్‌డీవో డేటా సెంటర్
దేశ రక్షణ రంగంలో కీలకపాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో డేటా సెంటర్‌ను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు విశాఖ సమీపంలోని కాపులపాడు వద్ద 15 ఎకరాల ఏపీఐఐసీ భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఆర్‌డీవోకు కేటాయించింది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా రక్షణ రంగంలో సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేయడం ఈ డేటా సెంటర్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం డీఆర్‌డీవో చైర్మన్‌గా డాక్టర్ జి. సతీష్‌రెడ్డి ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీఆర్‌డీవో డేటా సెంటర్ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)
ఎక్కడ : కాపులపాడు, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రక్షణ రంగంలో సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు
ఏపీలో పోక్సో కోర్టు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటైన పోక్సో కోర్టు (ప్రత్యేక న్యాయస్థానం)ను ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఏపీకి ఎనిమిది పోక్సో కోర్టులు మంజూరయ్యాయని.. అందులో భాగంగా కృష్ణా జిల్లాకు ఒకటి మంజూరైనట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో నమోదయ్యే మైనర్ బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల విచారణ పోక్సో కోర్టులో జరుగుతుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో పోక్సో కోర్టు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్
ఎక్కడ : విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మైనర్ బాలికలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసుల విచారణకు
ఏపీలో సచివాలయ వ్యవస్థ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రారంభమైంది. మహాత్మ గాంధీజీ 150వ జయంతి సందర్భంగా గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థను తూర్పు గోదావరి జిల్లా కరప మండల కేంద్రంలో అక్టోబర్ 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సచివాలయ పైలాన్‌ను ఆవిష్కరించారు. సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. విధులు, బాధ్యతలపై వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- జాతిపిత మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం సాకారం కావాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశాం.
- పరిపాలనలో అవినీతి, వివక్షకు తావులేకుండా చేయడానికే ఈ గ్రామ సచివాలయాలు.
- ప్రతి 2,000 జనాభాకు 10 నుంచి 12 మంది ప్రభుత్వ ఉద్యోగులను కొత్తగా నియమించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం.
- గ్రామ సచివాయాల్లో దాదాపుగా 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులోకి రానున్నాయి. జనవరి 1వ తేదీకల్లా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.
- గ్రామ సచివాలయం పక్కనే గ్రామ సచివాలయం పక్కనే ఒక దుకాణం ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అందుబాటులోకి తీసుకొస్తాం. అలాగే రైతుల కోసం ఒక వర్క్‌షాప్ కూడా ఏర్పాటు చేస్తాం.
- ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మారుస్తాం. అంతేకాకుండా గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ) మండల స్థాయిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు.. ఇలా అన్నింటిలోనూ మార్పు తీసుకురావాలి.
- రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువురాని వారు 33 శాతం మంది ఉన్నారు. అందరూ అక్షరాస్యులు కావాలి.
- మహాత్మాగాంధీని స్ఫూర్తిని తీసుకుని ఏ గ్రామంలోనూ మద్యం బెల్టుషాపులు లేకుండా రద్దు చేశాం. మద్యం నియంత్రణకు కృషి చేస్తాం.
- పేదలకు దాదాపుగా ఉగాది నాటికల్లా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తాం.
- ఒకసారి వినియోగించి వదిలేసే(సింగిల్ యూజ్) ప్లాస్టిక్‌ను విడిచిపెట్టి జ్యూట్, క్లాత్‌తో తయారయ్యే సంచులను వాడుకోవడం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రామ/వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కరప మండల కేంద్రం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
తెలంగాణ ఐటీ మంత్రితో లక్సెంబర్గ్ రాయబారి భేటీ
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో వివిధ విదేశీ ప్రతినిధి బృందాలు భేటీ అయ్యాయి. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 19న జరిగిన వేర్వేరు సమావేశాల్లో భారత్‌లో దక్షిణాఫ్రికా హైకమిషనర్, లక్సెంబర్గ్ రాయబారితో పాటు ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్‌తోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. తొలుత భారత్‌లో దక్షిణాఫ్రికా హైకమిషనర్ సిబుసిసో ఎన్డెబెలో నేతృత్వంలోని బృందంతో కేటీఆర్ చర్చలు జరిపారు. దక్షిణాఫ్రికాకు చెందిన పలు కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను పరిశీలించేందుకు పర్యటిస్తున్నట్లు హైకమిషనర్ తెలిపారు.
భారతదేశంలో లక్సంబెర్గ్ రాయబారి జీన్ క్లాడ్ కుగెనర్ కూడా కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఫిన్‌టెక్, ఏరోస్పేస్, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టబడులకు సంబంధించి తెలంగాణతో కలిసి పనిచేస్తామని కుగెనర్ అన్నారు. అనంతరం ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మార్జరీ వాన్ బేలిగమ్ కేటీఆర్‌తో సమావేశమయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : భారత్‌లో దక్షిణాఫ్రికా హైకమిషనర్, లక్సెంబర్గ్ రాయబారితో పాటు ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్
ఎక్కడ : హైదరాబాద్
బెంగళూరులో గూగుల్ ఏఐ ల్యాబ్ ప్రారంభం
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కర్ణాటక రాజధాని బెంగళూరులో గూగుల్ రీసెర్చ్ ఇండియా పేరుతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశోధనా యూనిట్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 19న జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర న్యాయ, సమాచార, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. బెంగళూరు ఏఐ కేంద్రంలో భారత్ కోసం ఉత్పత్తులను అభివృద్ధి చేయడంతోపాటు, వాటిని అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లాలన్నది గూగుల్ ప్రణాళిక. హెల్త్‌కేర్, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో సవాళ్ల పరిష్కారానికి కంప్యూటర్ సైన్స్, ఏఐ పరిశోధనలను ఈ కేంద్రం మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గూగుల్ రీసెర్చ్ ఇండియా పేరుతో ఏఐ పరిశోధనా యూనిట్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : గూగుల్
ఎక్కడ : బెంగళూరు, కర్ణాటక
ఏపీ సీఎంతో కొరియా కాన్సులేట్ జనరల్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో దక్షిణ కొరియాలో భారత గౌరవ కాన్సులేట్ జనరల్ జంగ్ డియాక్ మిన్ నేతృత్వంలోని పారిశ్రామికవేత్తల బృందం భేటీ అయి్యంది. అమరావతిలో సెప్టెంబర్ 20న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలున్నాయని, వీటిని అందిపుచ్చుకోవాలని కొరియా ప్రతినిధులను సీఎం కోరారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో కొరియా బృందం సమావేశమైంది. రాష్టంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ), ఇన్‌ఫ్రా వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : దక్షిణ కొరియాలో భారత గౌరవ కాన్సులేట్ జనరల్ జంగ్ డియాక్ మిన్
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రాష్ట్రం పెట్టుబడుల అంశంపై చర్చించేందుకు
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో సెప్టెంబర్ 23న జరిగిన ఈ భేటీలో గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్‌మెంట్ ఎలా ఉండాలి అనే విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. అలాగే దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్‌లోకి గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని తరలించే అంశంపై చర్చలు జరిపారు.
2019, సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ నెల 8 వరకు జరగనున్న తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సావాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్‌ను సీఎం జగన్ ఆహ్వానించారు. తెలంగాణలో 18 వేల మంది పోలీసులను ఒకేసారి నియమిస్తున్నందున వారిలో 4 వేల మందికి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వాలని జగన్‌ను కేసీఆర్ కోరారు. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు
ఎక్కడ : ప్రగతి భవ న్, హైదరాబాద్
ఎందుకు : గోదావరి నీటిని కృష్ణాకు తరిలించే విషయమై చర్చించేందుకు
ఏపీలో నైపుణ్యాభివృద్ధి కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలు, మార్గదర్శకాల రూపకల్పనకు ముగ్గురు సభ్యులతో టాస్క్ ఫోర్సు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిని చైర్మన్‌గా, విద్యాశాఖ మంత్రిని కో-చైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కన్వీనర్‌గా ప్రభుత్వం నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో నైపుణ్యాభివృద్ధి కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకై
ఏపీలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం
ఆంధ్రప్రదేశ్‌లోని ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థికసాయానికి ‘వైఎస్సార్ వాహన మిత్ర పథకం’గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు సెప్టెంబర్ 25న తెలిపారు. ఈ పథకం ద్వారా సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకునే డ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందుతుందన్నారు. వాహన బీమా, ఫిట్‌నెస్, మరమ్మతులకు ఈ సాయం ఉపయోగపడతుందని ఆయన పేర్కొన్నారు. 2019, అక్టోబర్ 5న లబ్ధిదారులకు నేరుగా చెల్లింపుల రశీదులు అందిస్తామని చెప్పారు.
సరకు రవాణాలో ఏపీకి మూడో ర్యాంకు
రాష్ట్రాల మధ్య సులభతర సరకు రవాణా (లాజిస్టిక్స్) సౌకర్యాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో ర్యాంకు లభించింది. ఢిల్లీలో సెప్టెంబర్ 12న వాణిజ్య బోర్డు సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఏపీ ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్లగ్ అండ్ ప్లే, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల క్లస్టర్ల అభివృద్ధిపై దృష్టిసారిస్తోందని.. కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా మేకపాటి కోరారు. మరోవైపు రాష్ట్రంలో గిరిజన ఒలింపిక్స్ నిర్వహించాలని కేంద్ర యువజన, క్రీడల మంత్రి కిరెన్ రిజ్జుకు మేకపాటి విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రాష్ట్రాల మధ్య సులభతర సరకు రవాణా (లాజిస్టిక్స్) సౌకర్యాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో ర్యాంకు
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడితో ఏపీ సీఎం భేటీ
నీతి ఆమోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని బృందంతో బృందంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర అధికారులు భేటీ అయ్యారు. అమరావతి సచివాలయంలో సెప్టెంబర్ 13న జరిగిన ఈ సమావేశంలో రంగాల వారీగా రాష్ట్రం పరిస్థితిని అధికారులు ప్రజెంటేషన్ ద్వారా నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో రాష్ట్రం బాధపడుతోందని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు తగ్గకుండా చూడాలని రాజీవ్‌కుమార్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రెవిన్యూ లోటు కాస్త ఆందోళనకరంగా ఉందని, బడ్జెటేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయని రాజీవ్ కుమార్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి ఆమోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌తో భేటీ
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో తమిళిసై
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సెప్టెంబర్ 14న జరిగిన ‘ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్, ట్రాన్స్ ఫార్మింగ్ హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ ముగింపు కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణలో మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలు పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డిలతోపాటు డాక్టర్లు, 2,500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్ పేషెంట్ సేఫ్టీ కాన్ఫరెన్స్, ట్రాన్స్ ఫార్మింగ్ హెల్త్ కేర్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యక్రమం
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఎక్కడ : హెచ్‌ఐసీసీ, హైదరాబాద్
గోదావరిలో ఘోర పడవ ప్రమాదం
గోదావరి నదిలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపాన కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న పర్యాటక పడవ నీట మునిగింది. 9 మంది సిబ్బంది సహా మొత్తం 71 మందికిపైగా జనంతో పాపికొండలు విహార యాత్రకు వెళ్తున్న బోటు నీట మునిగి 12 మంది మృత్యువాత పడ్డారు. సెప్టెంబర్ 15నాటికి 27 మంది సురక్షితంగా బయటపడగా.. దాదాపు 37 మంది గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఎక్కువ మంది తెలంగాణాకు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, ఖాజీపేట, హయత్‌నగర్, ఎల్‌బీనగర్, కృష్ణాజిల్లా బాపులపాడు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, విశాఖపట్నం జిల్లా వేపగుంట, అరిలోవ, గుంటూరుజిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు.
దేవీపట్నం మండలం గండిపోశమ్మ గుడి వద్ద నుంచి బయలుదేరిన బోటు పేరంటాలపల్లికి చేరుకొవాల్సి ఉండగా... ఈ ప్రమాదం జరిగింది. గోదావరి నది చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద ప్రమాదాలలో ఇది రెండోది. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీలో వైఎస్సార్ పెళ్లి కానుక పెంపు
వైఎస్సార్ పెళ్లి కానుక పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులైన వధువులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు సెప్టెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మొత్తం 2020 ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
వైఎస్సార్ పెళ్లికానుక వివరాలు
కేటగిరి | ప్రస్తుతం ఇస్తున్నది | పెంచినది |
షెడ్యూల్డ్ కులాలు | 40,000 | 1,00,000 |
షెడ్యూల్డ్ కులాలు (కులాంతర వివాహాలు) | 75,000 | 1,20,000 |
షెడ్యూల్డ్ తెగలు | 50,000 | 1,00,000 |
షెడ్యూల్డ్ తెగలు (కులాంతర వివాహాలు) | 75,000 | 1,20,000 |
వెనుకబడిన తరగతులు | 35,000 | 50,000 |
వెనుకబడిన తరగతులు (కులాంతర వివాహాలు) | 50,000 | 75,000 |
మైనార్టీలు | 50,000 | 1,00,000 |
దివ్యాంగులు | 1,00,000 | 1,50,000 |
భవన ఇతర నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు సభ్యులకు | 20,000 | 1,00,000 |
యురేనియంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం
పర్యావరణానికి, జీవావరణానికి, ప్రకృతి రమణీయతకు నెలవైన నల్లమల అడవులతోపాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా యురేనియం తవ్వకాలను అనుమతించేదిలేదని తెలంగాణ శాసనసభ తీర్మానించింది. యురేనియం నిక్షేపాల తవ్వకాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర కె. తారక రామారావు సెప్టెంబర్ 16న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. యురేనియం నుంచి వెలువడే అణుధార్మికతతో పంటలు పండే భూమి, పీల్చే గాలి, తాగే నీరు కలుషితమయ్యే ప్రమాదముందని.. యురేనియం తవ్వకాల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ కేంద్రాన్ని కోరింది. ప్రజల ఆందోళనలతో ప్రభుత్వం ఏకీభవిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యురేనియంకు అనుమతించం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : తెలంగాణ అసెంబ్లీ
ఎక్కడ : తెలంగాణ
తెలంగాణలో ఐసీజేఎస్ సర్వీసు ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా చేపట్టిన ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్) సర్వీసును తెలంగాణలో ప్రారంభించారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో సెప్టెంబర్ 16న తెలంగాణ హెకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ఐసీజేఎస్‌ను ప్రారంభించారు. ఐసీజేఎస్‌తో న్యాయవిచారణ మరింత వేగవంతమవుతుందని ఈ సందర్భంగా చౌహాన్ అన్నారు.
కరీంనగర్ నుంచి డెమో..
తెలంగాణ పోలీసు శాఖ వరంగల్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. 2018 డిసెంబర్ 15న జస్టిస్ మదన్ బి.లోకూర్ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఐసీజేఎస్ సేవలను ప్రారంభించారు. ఇది విజయవంతమయ్యాక కరీంనగర్‌ను ఎంచుకున్నారు. సెప్టెంబర్ 16న కరీంనగర్ త్రీటౌన్ నుంచి కమిషనర్ కమలాసన్‌రెడ్డి, హుజూరాబాద్ జేఎఫ్‌సీఎం రాధిక డెమోను వివరించారు. ఐసీజేఎస్ ద్వారా పోలీసు వ్యవస్థలో రియల్‌టైమ్ విధానంలో డేటాబదిలీ జరుగుతుంది. అధికారులు మరింత మెరుగ్గా కేసుల పర్యవేక్షణ చేయగలుగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో ఐసీజేఎస్ సర్వీసు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : తెలంగాణ హెకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్
హెచ్‌ఐసీసీలో బ్లెడ్ ప్యూరిఫికేషన్ సదస్సు
హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో 37వ ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లెడ్ ప్యూరిఫికేషన్, 22వ పెరిటోనియల్ డయాలసిస్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సెప్టెంబర్ 18న ఈ సదస్సును ప్రారంభించారు. పెరిటోనియల్ డయాలసిస్‌కి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తమిళిసై అన్నారు.
ఇండో-చైనా హెల్త్ కేర్ సమ్మిట్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మారియెట్ హోటల్‌లో సెప్టెంబర్ 18న ఇండో-చైనా హెల్త్ కేర్ సమ్మిట్- 2019ను తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ప్రపంచ స్థాయిలో మెడికల్ టూరిజానికి కేంద్రంగా హైదరాబాద్ పేరొందిందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. నాణ్యమైన వైద్యం చౌకగా హైదరాబాద్‌లో లభిస్తుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లెడ్ ప్యూరిఫికేషన్ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
ఎక్కడ : మాదాపూర్ హెచ్‌ఐసీసీ, హైదరాబాద్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రితో న్యూజెర్సీ గవర్నర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావుతో అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ నేతృత్వంలోని బృందం భేటీ అయింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 18న జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఇరు రాష్ట్రాలు ‘సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్’ కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సంతకాలు చేశారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సెన్సైస్, బయోటెక్, ఫిన్‌టెక్, డేటా సెంటర్స్, క్లీన్ ఎనర్జీ, ఉన్నత విద్య, టూరిజం వంటి రంగాల్లో ఈ ఒప్పందం జరిగినట్లు మంత్రి కేటీఆర్ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ మర్ఫీ
ఎక్కడ : హైదరాబాద్
భీమవరంలో ఆక్వా ల్యాబ్ ప్రారంభం
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొవ్వాడ అన్నవరంలో ఏర్పాటు చేసిన ఆక్వా ల్యాబ్‌ను కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ సెప్టెంబర్ 5న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో ఆక్వా రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.వెయి్య కోట్లు కేటాయించిందని చెప్పారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జనార్దనపురంలో ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డితో కలిసి చేపల రైతులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు.
మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై ఇరువురు చర్చించారు. సమావేశంలో రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆక్వా ల్యాబ్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : కేంద్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్
ఎక్కడ : కొవ్వాడ అన్నవరం, భీమవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి ఆమోదం
ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) విలీనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను రీ డిజిగ్నేట్ చేయాలన్న మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సులను కేబినెట్ ఆమోదించింది. అమరావతిలో సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో 52,813 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఇకపై ఆర్టీసీలోని ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వీరంతా కొత్తగా ఏర్పాటయ్యే ప్రజా రవాణా శాఖ కిందకు వస్తారు. డెరైక్టర్ జనరల్ నేతృత్వంలో ప్రజా రవాణా శాఖ పని చేయనుంది. ఆర్టీసీకి వీసీ అండ్ ఎండీ ఎక్స్ అఫీషియోగా కొనసాగుతారు.
కమిటీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు
- విభజన తర్వాత కూడా ఏపీఎస్‌ఆర్టీసీ మంచి పనితీరు కనపరుస్తోంది. ప్రమాణాలను అందుకుంటోంది.
- 108 మేజర్, 311 మైనర్ బస్ స్టేషన్ల ద్వారా 12,027 బస్సులను నడుపుతోంది.
- మొత్తం 14,123 గ్రామాలకు బస్సులు నడుస్తున్నాయి.
- ప్రతి రోజూ 43.02 లక్షల కిలోమీటర్ల మేర సర్వీసులు తిప్పుతూ 62 లక్షల మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది.
- ప్రతి రోజూ నిర్వహణ ఆదాయం రూ.15 కోట్లు.
- ప్రస్తుతం ప్రతి కిలోమీటరుకు అవుతున్న ఖర్చు రూ.44.72.. ఆదాయం రూ.38.19
- 2019 జూన్ 30 నాటికి ఆర్టీసీపై అప్పులు ఇతరత్రా భారం రూ.6,639 కోట్లు
- ప్రతి నెలా ఆర్టీసీకి వాటిల్లుతున్న నష్టం రూ.100 కోట్లు
- ప్రతి ఏటా డీజిల్‌పై భారం రూ.660 కోట్లు
- ఇప్పుడున్న బస్సుల స్థానంలో దశల వారీగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలి.
- రోడ్డు ప్రమాదాల రేటు కూడా ఆర్టీసీలో చాలా తక్కువ. లక్ష కిలోమీటర్ల దూరంలో ప్రమాదాలు 0.08 శాతం మాత్రమే.
- ప్రతి పది వేల కిలోమీటర్లకు బ్రేక్ డౌన్స్ రేటు 0.04 శాతం
- ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేటు 78 శాతం
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన అమరావతిలో సెప్టెంబర్ 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త ఇసుక విధానంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక మాఫియాను అరికట్టి ప్రజలకు సరసమైన ధరలకు ఇసుకను అందజేసే నూతన విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇసుకపై ఇదీ విధానం..
రాష్ట్రంలో ఇసుక తవ్వకం, రవాణాను ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కాార్పొరేషన్ (ఏపీఎండీసీ) చేపట్టనుంది. ఇసుకపై పర్యావరణ హితమైన కొత్త విధానం సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చింది. రీచ్‌లు ఉన్న జిల్లాల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. అక్కడి నుంచి రవాణా ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టన్నుకు కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున రవాణా ఖర్చును నిర్థారించారు. 10 కిలోమీటర్ల లోపు వరకు ట్రాక్టర్ల ద్వారా రవాణా ఖర్చు రూ.500గా నిర్ణయించారు.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
- 3.97 లక్షల మంది ఆటో, టాక్సీవాలాలకు రూ.397.93 కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సొంతంగా ప్యాసింజర్ ఆటోలు, ట్యాక్సీలు నడిపేవారికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇస్తారు.
- శ్రీరామనవమి నుంచి పెంచిన ‘వైఎస్‌ఆర్ పెళ్లి కానుక’ను అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ఏడాదికి రూ.746.55 కోట్లు ఖర్చు కానుంది.
- ఆశా వర్కర్ల వేతనాలను రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఉపసంహరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
- జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2014 నుంచి 2019 వరకు పతకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు చెల్లిస్తారు. ఇందుకోసం రూ. 5 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు.
- డా.భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్రాబ్యాంకు పేరును యథాతథంగా ఉంచాలని కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ప్రధానికి సీఎం లేఖ రాయనున్నారు.
- కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం వద్ద డీఆర్డీఓకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అక్కడ రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థను డీఆర్డీఓ ఏర్పాటు చేయనుంది.
- చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఇంటర్మీడియట్ లెవల్ పంపింగ్ కోసం సుమారు 25 ఎకరాలు భూమిని కేబినెట్ కేటాయించింది.
- నడికుడి-శ్రీకాళహస్తి మార్గంలో దేకనకొండ బ్రాడ్‌గేజ్ కోసం 20.19 ఎకరాలను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు.
- మచిలీపట్నం పోర్టు ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
- టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 19 నుంచి 25 (ఎక్స్‌అఫీషియో సభ్యుడు కాకుండా)కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
- మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 2005 నుంచి మావోయిస్టులపై నిషేధం కొనసాగుతోంది.
- నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ. 3,216.11 కోట్ల టెండర్ రద్దును కేబినెట్ ఆమోదించింది.
టెక్నాలజీ సదస్సులో ఏపీ ఉప ముఖ్యమంత్రి
విజయవాడలో సెప్టెంబర్ 6న బిల్డింగ్ న్యూ ఇండియా లివరేజింగ్ జియో స్పేషియల్ టెక్నాలజీ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జియో స్పేషియల్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్, భారతదేశ సర్వేయర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిల్డింగ్ న్యూ ఇండియా లివరేజింగ్ జియో స్పేషియల్ టెక్నాలజీ సదస్సు
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ సెప్టెంబర్ 8న ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే తమిళిసై రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన ఆరుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి కొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఏ గవర్నర్ కూడా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : తమిళిసై సౌందర రాజన్
ఎక్కడ : రాజ్‌భవన్, హైదరాబాద్
నెల్లూరుకు ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రం
ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరులోని ఎన్‌సీఈఆర్‌టీ క్యాంపస్‌కు తరలించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్చార్డీ) నిర్ణయించింది. ఈ మేరకు భారతీయ భాషా కేంద్రీయ సంస్థ (సీఐఐఎల్)కు సెప్టెంబర్ 5న ఆదేశాలు జారీ చేసింది. ప్రాచీన తెలుగు భాష అధ్యయన కేంద్రాన్ని రాష్ట్రానికి తరలించే విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇటీవల చర్చించారు. అనంతరం అధ్యయన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు చేసేందుకు సహకరించాల్సిందిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి యార్లగడ్డ లేఖ రాశారు.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించారు. రాజ్‌భవన్‌లో సెప్టెంబర్ 8న జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ఆరుగురు కొత్త మంత్రులకు కేసీఆర్ సలహా మేరకు శాఖలను కేటాయిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
తాజాగా మంత్రివర్గంలోకి చేరిన ఆరుగురు
- అజయ్‌కుమార్
పుట్టిన తేదీ: ఏప్రిల్ 19, 1965
కుటుంబం: భార్య, ఒక కుమారుడు
ఎమ్మెల్యేగా అనుభవం: 2014, 2018లో గెలుపు
మంత్రి బాధ్యతలు: మొదటిసారి
- సబితా ఇంద్రారెడ్డి
పుట్టిన తేదీ: మే 5, 1963
కుటుంబం: ముగ్గురు కుమారులు
ఎమ్మెల్యేగా అనుభవం: 2000 (ఉపఎన్నిక), 2004, 2009, 2018లలో ఎమ్మెల్యేగా విజయం
మంత్రి బాధ్యతలు: 2004లో వైఎస్ కేబినెట్‌లో గనుల మంత్రిగా, 2009లో తొలి మహిళా హోంమంత్రిగా బాధ్యతలు
- కె. తారకరామారావు
పుట్టిన తేదీ: జూలై 24, 1976
కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె
ఎమ్మెల్యేగా అనుభవం: 2009, 2010 (ఉప ఎన్నిక), 2014, 2018లో ఎమ్మెల్యేగా గెలుపు
మంత్రి బాధ్యతలు: 2014లో పంచాయతీరాజ్ మంత్రి, ఆ తర్వాత మున్సిపల్, ఐటీ, పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు
- టి.హరీశ్‌రావు
పుట్టిన తేదీ: జూన్ 3, 1972
కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె
ఎమ్మెల్యేగా అనుభవం: 2004, 2008, 2009, 2010, 2014, 2018 వరుసగా విజయం
మంత్రి బాధ్యతలు: 2004లో వైఎస్ కేబినెట్‌లో యువజన సర్వీసుల మంత్రిగా ప్రమాణం, ఆ తర్వాతే ఎమ్మెల్యేగా గెలుపు, 2014లో సాగునీటి మంత్రిగా బాధ్యతలు
- సత్యవతి రాథోడ్
పుట్టిన తేదీ: అక్టోబర్ 31, 1969
కుటుంబం: భర్త, ఇద్దరు కుమారులు
ఎమ్మెల్యేగా అనుభవం: 2009లో ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ
మంత్రి బాధ్యతలు: మొదటిసారి
- గంగుల కమలాకర్
పుట్టిన తేదీ: మే 8, 1968
కుటుంబం: భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె
ఎమ్మెల్యేగా అనుభవం: 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం
మంత్రి బాధ్యతలు: మొదటిసారి
పేరు | శాఖలు |
కె. చంద్రశేఖర్‌రావు | ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, ప్రణాళిక, శాంతిభద్రతలు, రెవెన్యూ, నీటిపారుదల, గనులు, ఎవరికీ కేటాయించని ఇతర శాఖలు |
కె.తారక రామారావు | పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ |
టి.హరీశ్‌రావు | ఆర్థిక |
పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి | విద్య |
గంగుల కమలాకర్ | బీసీ సంక్షేమం, ఆహార, పౌర సరఫరాల, వినియోగదారుల వ్యవహారాలు |
సత్యవతి రాథోడ్ | ఎస్టీ సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమం |
పువ్వాడ అజయ్ కుమార్ | రవాణా |
మహమూద్ అలీ | హోం, జైళ్లు, అగ్నిమాపక |
ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి | అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక, దేవాదాయ, న్యాయ |
తలసాని శ్రీనివాస్ యాదవ్ | పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ |
జి. జగదీశ్‌రెడ్డి | ఇంధన |
ఈటల రాజేందర్ | వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమం |
సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి : | వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ |
కొప్పుల ఈశ్వర్ | ఎస్సీల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగ, వయోజనుల సంక్షేమం |
ఎర్రబెల్లి దయాకర్‌రావు | పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా |
వి. శ్రీనివాస్‌గౌడ్ | ఆబ్కారీ, క్రీడలు, యువజన సంక్షేమం, పర్యాటక, సాంస్కృతిక, పురాతత్వ |
వేముల ప్రశాంత్‌రెడ్డి | రహదారులు, భవనాలు, శాసన వ్యవహారాలు, గృహ నిర్మాణం |
చామకూర మల్లారెడ్డి | కార్మిక, ఉపాధి కల్పన, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి |
పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌కు శంకుస్థాపన
శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఉద్దాన ప్రాంత ప్రజల కోసం రూ.600 కోట్లతో నిర్మించనున్న శుద్ధ జలాల సరఫరా ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 6న శంకుస్థాపన చేశారు. రూ.50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, కిడ్నీ రిసెర్చ్ సెంటర్ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేశారు. వీటితోపాటు జ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11.95 కోట్లతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎం పురం పంచాయతీలో ఉన్న రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో(శ్రీకాకుళం ఆర్జీయూకేటీ) రూ.28 కోట్ల వ్యయంతో నిర్మించిన అకడమిక్ భవనం, వసతి గృహం, మెస్‌ను ముఖ్యమంత్రి సెప్టెంబర్ 6న ప్రారంభించారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిడ్నీ రిసెర్చ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పలాస, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
అక్షయపాత్ర మోడ్రన్ కిచెన్ ప్రారంభం
శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ కేజీబీవీ పాఠశాల సమీపంలో నిర్మించిన అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ మోడ్రన్ కిచెన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 6న ప్రారంభించారు. అనంతరం అక్షయపాత్ర వాహనాలను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా పలాసలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఏడాది క్రితం తిత్లీ తుపాన్‌లో తీవ్రంగా నష్టపోయిన ఉద్దాన రైతులకు పెంచిన పరిహారం రూ.150 కోట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ చేపట్టారు. కొబ్బరి చెట్టుకు పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచి చెక్కు రూపంలో అందించారు. హెక్టారు జీడి తోటలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచిన పరిహారం అందజేశారు. 9 మంది తిత్లీ బాధితులకు చెక్కులను అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అక్షయపాత్ర సెంట్రలైజ్డ్ మోడ్రన్ కిచెన్ ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కేజీబీవీ పాఠశాల సమీపం, సింగుపురం పంచాయతీ, శ్రీకాకుళం రూరల్ మండలం, ఆంధ్రప్రదేశ్
ఏపీలో నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా నుంచి పెలైట్ ప్రాజెక్టుగా ‘నాణ్యమైన బియ్యం పంపిణీ’ పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో సెప్టెంబర్ 6న నిర్వహించిన బహిరంగ సభలో ముగ్గురు మహిళలకు నాణ్యమైన బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రేషన్ షాపుల్లో తినగలిగే స్వర్ణ బియ్యాన్ని పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి 100 శాతం స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం’ అని సీఎం అన్నారు.
సీఎం ప్రసంగంలోని అంశాలు
- కిడ్నీ బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని స్టేజ్ - 3 దశ నుంచే వారికి పెన్షన్‌ను అమలు చేయనున్నాం. వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేలు చొప్పున పింఛన్ అందచేస్తాం.
- దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల (సీకేడీ) బారిన పడ్డ ప్రతి 500 మంది రోగులకు ఒక హెల్త్ వర్కర్‌ను నియమిస్తాం.
- కిడ్నీ బాధితులతోపాటు సహాయకులకు కూడా ఉచితంగా బస్ పాస్ అందిస్తాం. కిడ్నీ రోగులకు ఉచితంగా ల్యాబ్ పరీక్షలతోపాటు నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తాం.
- మత్స్యకార దినోత్సవం సందర్భంగా పడవలు, బోట్లు ఉన్న మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఇవ్వబోతున్నాం.
- ఎస్టీ కుల ధ్రువీకరణకు వన్‌మ్యాన్ కమిషన్‌ను జేసీ శర్మ ఆధ్వర్యంలో నియమిస్తున్నాం. బుడగ జంగాల వాళ్ల సమస్యలనూ జేసీ శర్మ పరిగణనలోకి తీసుకుంటారు.
- సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని నవంబర్ 21న చేపట్టనున్నాం.
- వంశధారపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడతాం.
ఏమిటి : నాణ్యమైన బియ్యం పంపిణీ’ పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో ఈ-మ్యాగజైన్ ప్రారంభం
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూపొందించిన ఈ-మ్యాగజైన్(ఎడ్యుసర్)ను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 11న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఈ- మ్యాగజైన్(ఎడ్యుసర్)ను ఆవిష్కరించారు. ఈ- మ్యాగజైన్‌లో విద్యార్థుల విజయగాథలు, పాఠ్యాంశబోధన, అభ్యసన కార్యక్రమాలపై ఉపాధ్యాయుల సలహాలు, సూచనలు ప్రస్తావిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ ఎడిషన్‌ను ప్రదర్శిస్తారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సైతం వీటిని చూసే అవకాశం ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాఠశాలల విద్యార్థుల కోసం రూపొందించిన ఈ-మ్యాగజైన్(ఎడ్యుసర్) ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ
తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా గుత్తా
తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. నూతన చైర్మన్‌గా గుత్తా ఎన్నికైనట్లు సెప్టెంబర్ 11న ప్రకటించారు. అనంతరం మండలి చైర్మన్‌గా గుత్తా బాధ్యతలు స్వీకరించారు. శాసన మండలిలో జరిగే చర్చల్లో ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సభ్యులు పనిచేయాలని ఈ సందర్భంగా గుత్తా సూచించారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డి కెరీర్
జననం: 1954, ఫిబ్రవరి 02
జన్మస్థలం: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల
విద్యార్హత: బీఎస్సీ
పొలిటికల్ కెరీర్:
- ఉరుమడ్ల గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు (1981).
- చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ (1984).
- చిట్యాల సింగిల్ విండో చైర్మన్ (1991).
- నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ చైర్మన్ (1992-99).
- నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు ఆఫ్ ఇండియా డెరైక్టర్ (1998).
- నల్లగొండ లోక్‌సభ సభ్యులు (13, 15, 16 లోక్‌సభలో).
- తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్ (2018-19).
ఏమిటి : తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఏపీలో సచివాలయాల ద్వారా 237 సేవలు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 237 సేవలను అందించనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్ 11న వెల్లడించారు. ఇందులో 72 గంటల్లోనే 115 సేవలు ప్రజలకు అందించనున్నామని, మిగతా 122 సేవలను ఎప్పటిలోగా అందించగలమో వర్గీకరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు, సమస్యలను నివేదించడానికి 1902 కాల్ సెంటర్‌ను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. 2019, అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
జాబ్ చార్టు ఆవిష్కరణ
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ప్రజల మధ్యే చర్చ జరిపేందుకు ఇక గ్రామాల్లో ప్రతి ఏటా తప్పనిసరిగా 8 విడతలుగా గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ సచివాలయ విధులు, సచివాలయ ఉద్యోగులు బాధ్యతలను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టు పుస్తకాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయం మొత్తం చేపట్టాల్సిన విధులతో పాటు అందులో పనిచేసే ఒక్కో రకమైన ఉద్యోగికి ఒక్కో రకం జాబ్ చార్టును విడుదల చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 237 సేవలు
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఏపీలోని మూడు నగరాల్లో క్రీడా కాంప్లెక్స్‌లు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో అన్ని వసతులతో సమీకృత క్రీడా కాంప్లెక్స్‌లు నిర్మించనున్నట్లు రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 29న విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ క్రీడల అభివృద్ధికి, మౌలికవసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా 2014 నుంచి జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఏపీ క్రీడాకారులకు వైఎస్సార్ క్రీడాప్రోత్సాహకం కింద నగదు అందించనున్నట్లు మంత్రి తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలోని మూడు నగరాల్లో క్రీడా కాంప్లెక్స్‌లు
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఏపీ పర్యాటక, క్రీడా శాఖల మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్
ఎక్కడ : తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ
తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా మహిళ గవర్నర్
సాక్షి, హైదరాబాద్/చెన్నై: బీజేపీలో ‘సుష్మాజీ ఆఫ్ తమిళనాడు’గా పేరు సంపాదించుకున్న డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న ఆమెను కేంద్రం రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. ఆమె రాష్ట్రానికి నియమితులైన తొలి మహిళా గవర్నర్ కావడం విశేషం. వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తమిళిసై.. అనతి కాలంలోనే అగ్రశ్రేణి మహిళా నేతగా ఎదిగారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో 1961 జూన్ 2వ తేదీన జన్మించారు.
కుటుంబ నేపథ్యం :
తమిళనాడులో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కుమరి ఆనందన్, కృష్ణకుమారి దంపతులకు తమిళిసై సౌందర్‌రాజన్ జన్మించారు. తండ్రి ఆనందన్ ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, తమిళనాడు పీసీసీ చీఫ్‌గా పని చేశారు. తమిళిసై భర్త డాక్టర్ పి.సౌందర్‌రాజన్ తమిళనాడులో ప్రముఖ వైద్యుడు. రామచంద్ర మెడికల్ కాలేజీలో నెఫ్రాలజీ, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విభాగం డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఉన్నారు. సౌందరరాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీలో గైనకాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె కెనడాలో సానోలజీ, ఫీటల్ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. రామచంద్ర మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఐదేళ్లు పనిచేశారు.
చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి :
ఆమె తండ్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కావడంతో చిన్నతనం నుంచే తమిళిసై రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. అయితే తన తండ్రి బాటలో కాంగ్రెస్ వైపు కాకుండా ఆరెస్సెస్, బీజేపీ సిద్ధాంతాలపై ఆసక్తి పెంచుకున్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలోనే విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి ఆనేక హోదాల్లో పార్టీకి సేవలందించారు.
సౌందరరాజన్ రాజకీయ ప్రస్థానం..
- ఆరెస్సెస్, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులరాలైన ఆమె సౌత్ చెన్నై డిస్ట్రిక్ట్ మెడికల్ వింగ్ సెక్రటరీగా 19990-2001 మధ్య పని చేశారు.
- 2001-2004 వరకు స్టేట్ మెడికల్ వింగ్ జనరల్ సెక్రటరీ.
- 2004-2005 వరకు మూడు జిల్లాల జోనల్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు.
- 2005-2007 వరకు సదరన్ స్టేట్స్ మెడికల్ వింగ్ ఆల్ ఇండియా కో-కన్వీనర్.
- 2007-2010 వరకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి.
- 2010-2013 వరకు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు.
- 2013నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు.
- 2014 ఆగస్టు 16 నుంచి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు.
ఏమిటి: తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్ నియమాకం
ఎప్పుడు: సెప్టెంబర్ 1, 2019
ఎవరు: డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్
ఎక్కడ: తెలంగాణ
విజయవాడలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పదో వర్థంతిని పురస్కరించుకుని విజయవాడలోని కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్సార్ పార్కులో సెప్టెంబర్ 2న ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు.. వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో వైఎస్ జగన్.. ఆయన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులు అర్పించారు. కడప జిల్లాలోని పులివెందుల చేరుకుని మాజీమంత్రి, చిన్నాన్న దివంగత వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్