Supreme Court Chief Justice NV Ramana : దేశంలోనే తొలిసారిగా.. జడ్జీల కోసం రిక్రియేషన్ సెంటర్
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని వికార్ మంజిల్‌లో హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన కల్చరల్ సెంటర్, గెస్ట్‌హౌస్ నిర్మాణానికి ఆగస్టు 19వ తేదీన (శుక్రవారం) ఆయన భూమి పూజ చేశారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. సుదీర్ఘకాలంగా న్యాయమూర్తుల గెస్ట్‌హౌస్ అంశం పెండింగ్‌లో ఉందన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు పలు అవసరాల కోసం వస్తే వసతి కల్పనకు ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే న్యాయమూర్తులకు వసతి కల్సించేందుకు ఈ గెస్ట్‌హౌస్ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సుప్రీంకోర్టులో మాత్రమే జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయని, ఇప్పుడు హైకోర్టుల్లో ఆ తరహా వసతుల కల్పన చేయబోయేది తెలంగాణ హైకోర్టేనని చెప్పారు.
రాష్ట్ర సర్కార్ తీరు హర్షణీయం..
ప్రతిపాదన చేయగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై సీజేఐ హర్షం వ్యక్తం చేశారు. భవనాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ చెప్పడంపై ఆనందం వెలిబుచ్చారు. కోర్టులకు భవనాల నిర్మాణాలు ఎలా ఉండాలో నమూనాను రూపొందిస్తూ తయారు చేసిన ‘న్యాయ నిర్మాణ్’పుస్తకాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ భూయాన్ ఆవిష్కరించారు. జస్టిస్ పి.నవీన్‌రావు నేతృత్వంలోని కమిటీ న్యాయ నిర్మాణ్ నమూనాను రూపొందించిందని సీజేఐ తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు. కలెక్టరేట్, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల భవనాల మాదిరిగానే ప్రజలు గుర్తించే రీతిలో కోర్టు భవనాలు జిల్లా, తాలూకా స్థాయిల్లో కూడా ఉండాలన్నారు. జడ్జీల పోస్టుల భర్తీతోపాటు మౌలిక వసతుల కల్పన చేస్తేనే న్యాయం అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
18 నెలల్లో నిర్మాణం..
2.27 ఎకరాల్లో నిర్మించనున్న హైకోర్టు జడ్జీల గెస్ట్‌హౌస్, కల్చరల్ సెంటర్ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం పట్ల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధన్యవాదాలు తెలియజేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ఐదు వీఐపీ సూట్‌లు, మరో 20 సూట్‌లు, 12 డీలక్స్ గదులు, సాంస్కృతిక భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు.