Skip to main content

నవంబర్ 2019 రాష్ట్రీయం

ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసా ప్రారంభం
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం’ ప్రారంభమైంది. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొమానపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మత్స్యకార భరోసా పథకం పథకం ద్వారా 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించింది.
ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • మత్స్యకారులకు ఇచ్చే వేట నిషేధ పరిహారంను రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతున్నాం. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం ఉంటుంది.
  • మత్స్యకారుల కోసం.. లీటరు డీజిల్‌కు ఇస్తున్న సబ్సిడీని ఈ రోజు నుంచి రూ.6 నుంచి రూ.9కి పెంచుతున్నాం.
  • సముద్ర తీరంలో అవసరమైన చోటల్లా రాబోయే కాలంలో జెట్టీలు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
  • సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. (ఇప్పటి దాకా రూ.5 లక్షలు మాత్రమే)
  • 2012లో సముద్రంలో చమురు, సహజ వాయువుల నిక్షేపాల అన్వేషణకు జరిపిన తవ్వకాల్లో ముమ్మిడివరం ప్రాంతంలో జీవన భృతి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు రూ.78.24 కోట్ల పరిహారం (జీఎస్‌పీసీ బకాయిలు) రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తుంది. తర్వాత ఆ డబ్బు కేంద్రం నుంచి ఎలా తెచ్చుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. దీని ద్వారా 16,559 మత్స్యకార కుటుంబాలు లబ్ధిపొందనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కొమానపల్లి, ముమ్మిడివరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

తూర్పుగోదావరిలో వైఎస్సార్ వారధి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలంలోని పశువుల్లంక- సలాదివారి పాలెం గ్రామాల మధ్య నిర్మించిన ‘డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారధి’ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 21న ప్రారంభించారు. అలాగే వారధి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వృద్ధ గౌతమి గోదావరి నదిపై రూ.35 కోట్లతో ఈ వంతెనను నిర్మించారు.
మరోవైపు రూ.1.62 కోట్లతో నిర్మించే టూరిజం బోటు కంట్రోల్ రూమ్‌ల నిర్మాణానికి తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం సమీపంలోని కొమ్మనాలపల్లి గ్రామం వద్ద సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. తొలిదశలో పర్యాటకుల రద్దీ అధికంగా ఉండే తొమ్మిదిచోట్ల బోటు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాక్టర్ వైఎస్ రాజ శేఖర్‌రెడ్డి వారధి ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పశువుల్లంక- సలాదివారి పాలెం, ఐ.పోలవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా

అహ్మదాబాద్ ఐఐఎంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం, సిఫార్సుల కోసం అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో అహ్మదాబాద్ ఐఐఎం ప్రజా విధానాల బృందం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి, ఏపీ అవినీతి నిరోధకశాఖ చీఫ్ విశ్వజిత్ నవంబర్ 21న సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి 2020, ఫిబ్రవరి మూడోవారం నాటికి అహ్మదాబాద్ ఐఐఎం నివేదిక అందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అహ్మదాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)తో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ప్రభుత్వ విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలపై అధ్యయనం, సిఫార్సుల కోసం

అనంతపురంలో బస్సుల తయారీ యూనిట్
అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ‘వీర వాహన ఉద్యోగ్ లిమిటెడ్’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నవంబర్ 21న వెల్లడించారు. వీర వాహన లిమిటెడ్ ఏటా 3,000 బస్సుల తయారీ సామర్థ్యంతో, రూ.1,000 కోట్ల పెట్టుబడి అంచనాతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ఈ యూనిట్‌కు 120 ఎకరాలు కేటాయించామని చెప్పారు. భారీ రాయితీలు కాకుండా విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించే విధంగా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఎక్కడ : అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్ ప్రారంభం
హైదరాబాద్‌లోని మౌలాలిలో నిర్మించిన ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఐఆర్‌ఐఎఫ్‌ఎం) నూతన క్యాంపస్‌ను రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ నవంబర్ 24న ప్రారంభించారు. రైల్వేలోని ఆర్థికపరమైన అంశాలను చూసే విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ శిక్షణ ఇచ్చేందుకు రైల్ వికాస్ నిగమ్ ఆధ్వర్యంలో రూ.85 కోట్ల వ్యయంతో ఈ క్యాంపస్‌ను నిర్మించారు.
ఇరిసెట్ 62వ వార్షికోత్సవం
హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలీ కమ్యూనికేషన్ (ఇరిసెట్) 62వ వార్షికోత్సవంలో రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పాల్గొన్నారు. దీప్ పేరుతో ఇరిసెట్ రూపొందించిన పత్రికను వినోద్‌కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. రైళ్లు ఢీకొనకుండా యూరోపియన్ ట్రెయిన్ కంట్రోల్ సిస్టం (యూటీసీఎస్) సాంకేతిక వ్యవస్థను భారతీయ రైల్వేలో ప్రవేశపెట్టే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఆర్‌ఐఎఫ్‌ఎం నూతన క్యాంపస్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 24
ఎవరు : రైల్వే బోర్డు చైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్
ఎక్కడ : మౌలాలి, హైదరాబాద్

ఏపీలో అవినీతిపై కాల్ సెంటర్ ప్రారంభం
అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన కాల్ సెంటర్‌ను ప్రారంభించింది. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేసిన 14400 కాల్ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 25న తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ‘ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి మీ దృష్టికి వస్తే వెంటనే గళం ఎత్తండి.. 14400 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే నినాదం ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఫిర్యాదు అందిన 15 రోజుల నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గించడానికి అధ్యయనం, సిఫార్సుల కోసం ప్రతిష్టాత్మక మేనేజ్‌మెంట్ సంస్థ అహ్మదాబాద్ ఐఐఎంతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. అలాగే ఇసుక అక్రమాలపై 14500 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 14400 కాల్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో

ఆబర్న్ వర్సిటీతో తెలంగాణ ఎఫ్‌సీఆర్‌ఐ ఒప్పందం
అటవీశాస్త్ర పరిజ్ఞానంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంతోపాటు విద్యాప్రమాణాలను పెంపునకు... అమెరికా అలబామా రాష్ట్రంలోని ఆబర్న్ వర్సిటీతో తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో నవంబర్ 25న జరిగిన కార్యక్రమంలో ఆబర్న్ యూనివర్సిటీ డీన్ జానకి రాంరెడ్డి, ఎఫ్‌సీఆర్‌ఐ డీన్ చంద్రశేఖర్ రెడ్డిలు ఎంఓయూపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం విషయమై తెలంగాణ అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్పందిస్తూ... విద్యా విధానం ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ ఒప్పందం వల్ల ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. పరిశోధన వల్ల కలిగే ప్రయోజనంతో ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా అలబామా రాష్ట్రంలోని ఆబర్న్ వర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అటవీశాస్త్ర పరిజ్ఞానంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంతోపాటు విద్యాప్రమాణాలను పెంపునకు

మంగళగిరిలో వోల్టీ ఐవోటీ తయారీ కేంద్రం
జీపీఎస్, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో తయారీ ప్లాంటును నెలకొల్పనుంది. దాదాపు రూ.50 కోట్లతో, రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి నవంబర్ 25న తెలిపారు. 2020 జూలై నాటికి ఈ కేంద్రంలో తయారీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ కేంద్రం ద్వారా 400-500 మందికి ఉపాధి లభించనుంది. వోల్టీ సంస్థకు హైదరాబాద్‌లో1000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంటు ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ తయారీ కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : వోల్టీ సంస్థ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి
ఎక్కడ : మంగళగిరి, గుంటురూ జిల్లా, ఆంధ్రప్రదేశ్

ఐటీడీఏల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం
ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లాల్లో ఉన్న ఏడు ఐటీడీఏలు, 77 షెడ్యూల్డ్, గిరిజన మండలాల్లో ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం’ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ నవంబర్ 26న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అదనపు పోషకాహారం అందిస్తారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వం రూ.42.71 కోట్లు విడుదల చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం అమలు
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు ఐటీడీఏలు, 77 షెడ్యూల్డ్, గిరిజన మండ లాలు
ఎందుకు : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అదనపు పోషకాహారం అందించేందుకు

ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో కేటీఆర్
దేశ రాజధాని నగరం ఢిల్లీలో నవంబర్ 26న జరిగిన క్రిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్-2019 సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు పాల్గొన్నారు. తెలంగాణలో పౌరులకు మౌలికసదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను కేటీఆర్ సదస్సులో వివరించారు. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు ఇన్నొవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూషన్ (3-ఐ) విధానం అవలంబిస్తున్నట్లు తెలిపారు.
జౌళి శాఖ మంత్రితో సమావేశం
కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో నవంబర్ 26న కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో చేపట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు గ్రాంట్ సహకారం అందించాల్సిందిగా ఇరానీని కేటీఆర్ కోరారు. అలాగే సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌ను మంజూరు చేసి దానికి అవసరమైన రూ. 49.84 కోట్లు విడుదల చేయాలని విన్నవించారు.
ఫార్మాసిటీకి సహకరించండి
హైదరాబాద్ ఫార్మా సిటీకి అవసరమైన సహకారం అందించాల్సిందిగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను మంత్రి కేటీఆర్ కోరారు. కేంద్ర మంత్రిని కలసిన కేటీఆర్.. ఫార్మా సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి రావాల్సిన అనుమతిలిచ్చి సహకరించాలని కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిసిల్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాన్‌క్లేవ్-2019 సదస్సు
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు
ఎక్కడ : ఢిల్లీ

వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు సాయం
ఆంధ్రప్రదేశ్‌లోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో చేపట్టే వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం నవంబర్ 27న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో సమావేశమై వాటర్ షెడ్ ప్రాజెక్టు అమలుపై చర్చించారు. ఈ విషయమై నీలం సాహ్ని మాట్లాడుతూ... ‘5 జిల్లాల్లో చేపట్టే వాటర్ షెడ్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు 70 శాతం నిధులు (178.50 మిలియన్ డాలర్లు) అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద 30 శాతం నిధులను సమకూర్చనుంది’ అని తెలిపారు. వాటర్ షెడ్ ప్రాజెక్టు మంజూరైన తర్వాత ఆరేళ్లలో పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాటర్ షెడ్ ప్రాజెక్టుకు సాయం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ప్రపంచ బ్యాంకు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

వైఎస్సార్ కాపు నేస్తంకు ఏపీ కేబినెట్ ఆమోదం
మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకానికి ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27న వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాపు నేస్తంతోపాటు పలు తీర్మానాలను మంత్రిమండలి ఆమోదించింది.
వైఎస్సార్ కాపు నేస్తం
కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉప కులాల మహిళల జీవన ప్రమాణాలు పెంపు, ఆర్థిక స్వావలంబన, ఉపాధి మెరుగుపరిచేందుకు ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కోసం ఈ ఏడాది రూ.1,101 కోట్లు కేటాయించేందుకు ఆమోదం కేబినెట్ ఆమోదం తెలిపింది. 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఏటా రూ.15 వేలు చొప్పున ఐదేళ్లపాటు రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకానికి వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.900 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
కడప స్టీల్ ప్లాంట్
వైఎస్సార్ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌కు 2019, డిసెంబరు 26వతేదీన శంకుస్థాపన చేయాలని కేబినెట్ నిర్ణయించింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి - పెద్ద నందలూరు గ్రామాల మధ్య స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది. స్టీల్‌ప్లాంట్ కోసం 3,295 ఎకరాల భూసేకరణకు కేబినెట్ ఆమోదించింది. స్టీల్‌ప్లాంట్‌కు ఇనుప ఖనిజం కోసం ఎన్‌ఎండీసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.
అధికారుల బృందం ఏర్పాటు
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం(సీపీఎస్) రద్దు ప్రక్రియపై మంత్రుల బృందం ఏర్పాటైంది. ఈ మంత్రుల బృందానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారుల బృందం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటయ్యే అధికారుల బృందానికి ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి
ఎందుకు : కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఉప కులాల మహిళల జీవన ప్రమాణాలు పెంపు, ఆర్థిక స్వావలంబన, ఉపాధి మెరుగుపరిచేందుకు

జగనన్న విద్యాదీవెన, వసతి పథకాలకు ఆమోదం
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించేందుకు ఉద్దేశించిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27న వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీటితోపాటు పలు తీర్మానాలను మంత్రిమండలి ఆమోదించింది.
విద్యాదీవెన, వసతి దేవెన
అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించేలా విద్యాదీవెన పథకాన్ని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగులకు పథకాన్ని వర్తింపజేస్తారు. ఈసారి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ కోర్సులకు పూర్తిస్థాయిలో రీయింబర్స్‌మెంట్ అందజేస్తారు. వసతి దీవెన పథకం ద్వారా అర్హులైన విద్యార్థులందరికీ వసతి, భోజన సదుపాయాల కోసం నగదు చెల్లిస్తారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తారు.
జగనన్న విద్యా దీవెన ద్వారా ఏటా రూ.3,400 కోట్లు, వసతి దీవెన కింద ఏటా రూ.2,300 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా ఈ రెండు పథకాల కోసం ప్రభుత్వం ఏటా రూ.5,700 కోట్లు ఖర్చు చేయనుంది.
కేబినెట్ భేటీలో మరికొన్ని నిర్ణయాలు
  • ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ స్టేట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ యాక్ట్ సవరణకు ఆమోదం.
  • ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు ఆమోదం.
  • నడికుడి - శ్రీకాళహస్తి బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వేకు 92.05 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం.
  • టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
  • గిరిజన ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ లైజన్ వర్కర్ల జీతాల పెంపునకు ఆమోదం. నెలకు కేవలం రూ.400గా ఉన్న వారి జీతాలను రూ.4000కి ప్రభుత్వం పెంచింది.
  • అర్హులందరికీ కొత్తగా బియ్యం కార్డులు జారీ చేసేలా నిబంధనల సడలింపు.
  • రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వేర్వేరుగా కార్డులు జారీకి ఆమోదం.
  • నవరత్నాల ద్వారా పేదలందరికీ ఇళ్ల పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుంది.

ఏపీలో మనబడి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభం
Current Affairs
ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 14న ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో 45 వేలపై చిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిని మూడేళ్లలో మూడు దశల్లో బాగు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మొదటి దశ ఈ రోజు(నవంబర్ 14) ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది జూన్, జూలై నాటికి 15,715 స్కూళ్లలో రూ.3,500 కోట్లతో మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, నాణ్యమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు, మంచి రంగులు ఉంటాయి. ఆ మేరకు మరమ్మతులు చేస్తాం. అవసరమైన మేరకు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్, ఇంగ్లిష్ ల్యాబ్‌లు వస్తాయి. ఇలా తొమ్మిది రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
15,715 బడుల ఫొటోలు తీస్తాం. వాటిని బడి ముందే అతికిస్తాం. జూన్, జూలై మాసం కల్లా మార్పు చేసిన తర్వాత ఎలా ఉంటాయో పక్కనే ఫొటో పెట్టి చూపిస్తాం.

ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్ ప్రారంభం
రైతుల కోసం రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్’ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్ 18న ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నవంబర్ 18న జరిగిన ఐదో అగ్రి మిషన్ సమావేశం సందర్భంగా ఈ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అగ్రి మిషన్ సమావేశంలో సీఎం మాట్లాడుతూ... వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు వేదికలైన మార్కెట్ యార్డులను ‘నాడు-నేడు’ కింద ఆధునికీకరించడంతో పాటు మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్ట పరచాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల పక్కన ఏర్పాటు చేసే దుకాణాలు, వర్క్‌షాపులు జనవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంప్ కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా

హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
హజ్, జెరూసలేం యాత్రికులకు అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు నవంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. హజ్, జెరూసలేం యాత్రకు వెళ్లేవారిలో వార్షికాదాయం మూడు లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 40 వేల సహాయాన్ని రూ. 60 వేలకు, మూడు లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 20 వేలను రూ. 30 వేలకు ప్రభుత్వం పెంచింది. హజ్, జెరూసలేం యాత్రికుల కోసం 2019-20 బడ్జెట్‌లో వేర్వేరుగా చెరో రూ. 14.22 కోట్లు కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

2022 నాటికి ప్లాస్టిక్ వ్యర్థ రహితంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి ప్లాస్టిక్ వ్యర్థ రహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో అజిత్ సింగ్ నగర్‌లోని ఎక్సెల్‌ప్లాంట్ చెత్త డంపింగ్ యార్డ్‌లో తలపెట్టిన ప్లాస్టిక్ వ్యర్థాల యాజమాన్య కార్యక్రమాన్ని నవంబర్ 19న మంత్రి ప్రారంభించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను అల్ట్రాటెక్ సిమెంట్స్ పరిశ్రమకు పంపే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాలలో 44 చోట్ల వ్యర్థాల సేకరణ సదుపాయాలున్నాయని, మిగిలిన 66 పురపాలక సంఘాల్లో ఏర్పాటు చేసి 2022 నాటికల్లా ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2022 నాటికి ప్లాస్టిక్ వ్యర్థ రహితంగా ఆంధ్రప్రదేశ్
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఏడో స్థానం
రోడ్డు ప్రమాదాల విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో నిలిచింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నవంబర్ 19న విడుదల చేసిన ‘భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు-2018’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం... రోడ్డు ప్రమాదాల్లో 2014లో ఏపీ 8వ స్థానంలో ఉండగా.. 2015, 2016, 2017, 2018లలో ఏడో స్థానంలో నిలిచింది.
రోడ్డు ప్రమాదాల నివేదికలోని అంశాలు
  • ఆంధ్రప్రదేశ్ 2017లో 25,727, 2018లో 24,475 ప్రమాదాలు సంభవించాయి.
  • మృతుల సంఖ్యలో 2017లో ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానం ఉండగా.. 2018లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 2017లో 8,060 మంది మృతి చెందగా, 2018లో 7,556 మంది మరణించారు.
  • రోడ్డు ప్రమాదాల్లో 2018లో తొలి ఆరు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నిలిచాయి.
  • 2018లో దేశంలో రోడ్డు ప్రమాదాలు 0.46 శాతం పెరిగాయి.
  • 2017లో 4,64,910 ప్రమాదాలు సంభవించగా, 2018లో 4,67,044 ప్రమాదాలు సంభవించాయి. ఇదేసమయంలో రోడ్డు ప్రమాద మరణాలు 2.37 శాతం పెరిగాయి.
  • 2017లో 1,47,913 మంది, 2018లో 1,51,471 మంది మృతి చెందారు.
  • మొత్తం రోడ్డు నెట్‌వర్క్‌లో 1.94 శాతం మాత్రమే ఉన్న జాతీయ రహదారులపైనే మొత్తం ప్రమాదాల్లో 30.2 శాతం ప్రమాదాలు జరిగాయి.
  • రాష్ట్ర రహదారుల నెట్‌వర్క్ 2.97 శాతం మాత్రమే ఉండగా మొత్తం ప్రమాదాల్లో 25.2 శాతం వీటిపైనే సంభవించాయి.
  • రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో పాదచారుల సంఖ్య 15 శాతం.. సైక్లిస్టుల సంఖ్య 2.4 శాతం, ద్విచక్రవాహనదారుల సంఖ్య 36.5 శాతం.
  • మొత్తం ప్రమాద మరణాణాల్లో పురుషుల సంఖ్య 86 శాతం ఉండగా, మహిళలు 14 శాతం వరకు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఏడో స్థానం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు-2018 నివేదిక
ఎక్కడ : దేశంలో

తెలంగాణ ఐటీ మంత్రితో సింగపూర్ జనరల్ భేటీ
తెలంగాణ పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి కె.తారక రామారావుతో సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయింది. హైదరాబాద్‌లో నవంబర్ 19న జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, సింగపూర్ నడుమ మరింత బలమైన వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనేక విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయని కాక్‌టియన్‌కు కేటీఆర్ వివరించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే సంస్థలకు పూర్తి సహకారం అందిస్తామని, స్థానికంగా ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించేందుకు సింగపూర్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోరారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి కె.తారక రామారావుతో భేటీ
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : సింగపూర్ కాన్సుల్ జనరల్ పొంగ్ కాక్‌టియన్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : తెలంగాణ, సింగపూర్ నడుమ వ్యాపార, వాణిజ్య సంబంధాలు నెలకొల్పేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించేందుకు

హెచ్‌ఐసీసీలో ఇండియా జాయ్ 2019 ప్రారంభం
హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో గేమింగ్, మీడియా, వినోద రంగాలకు సంబంధించి దేశంలోనే అతిపెద్ద ప్రదర్శన ‘ఇండియా జాయ్ 2019’ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు నవంబర్ 20న ప్రారంభించారు. నవంబర్ 23 వరకు జరగనున్న ఇండియా జాయ్ ప్రదర్శనలో ప్రపంచ డిజిటల్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కార్పొరేషన్లు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శనకు సుమారు 30 వేల మంది సందర్శకులు వస్తారని అంచనా.
ఈ ప్రద ర్శనలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... గేమింగ్, టెక్నాలజీ, వినోద రంగాల్లో దక్షిణాసియాకు తెలంగాణను కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఇంటర్నెట్ మాధ్యమంగా టీవీ, సినీ ప్రసారాలను అందించే ఓటీటీ (ఓవర్ ది టాప్) రంగం ఏటా 8 శాతం చొప్పున వృద్ధి చెందుతోందని, ప్రస్తుతం యానిమేషన్ విభాగంలో ఓటీటీ వాటా 2.9 బిలియన్ డాలర్లుగా ఉందని వెల్లడించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా జాయ్ 2019 వేడుక ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్

ఫారెస్ట్ ప్లస్-2.0 కార్యక్రమం ప్రారంభం
అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్ ఎయిడ్), కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సంయుక్త సహకారంతో తెలంగాణలో చేపడుతున్న ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. అటవీ సమగ్రాభివృద్ధి, నీటివనరుల సంరక్షణతో పాటు అడవులపై ఆధారపడి జీవించేవారి ఆర్థిక ప్రమాణాలు పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని యూఎస్ ఎయిడ్, కేంద్ర, రాష్ట్ర అటవీ అధికారులతో కలిసి తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నవంబర్ 20న ప్రారంభించారు.
ఐక్యరాజ్య సమితి 2021 నుంచి 2030 సంవత్సరాలను అంతర్జాతీయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థల పునరుద్ధరణ దశాబ్దంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో యూఎస్ ఎయిడ్ సహకారంతో 3 రాష్ట్రాల్లోని మూడు అటవీ సర్కిళ్లలో ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని కేంద్ర అటవీ శాఖ అమలుచేస్తోంది. బీహార్, కేరళతో పాటు తెలంగాణలో మెదక్ అటవీ డివిజన్‌ను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫారెస్ట్ ప్లస్-2.0 కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అటవీ సమగ్రాభివృద్ధి, నీటివనరుల సంరక్షణతో పాటు అడవులపై ఆధారపడి జీవించేవారి ఆర్థిక ప్రమాణాలు పెంచటమే లక్ష్యంగా

ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ల చెల్లింపు
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌లోని అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ డబ్బులను చెల్లించే కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌‌సలో నవంబర్ 7న జరిగిన అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ డబ్బుల చెల్లింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ... తొలి విడతగా రూ.10 వేల వరకు డిపాజిట్ చేసి నష్టపోయిన 3.70 లక్షల మంది కుటుంబాల అకౌంట్లలోకి రూ.264 కోట్ల డబ్బును జమ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రూ.20 వేల లోపు వరకు డిపాజిట్‌దారులకు డబ్బులు అందజేస్తామన్నారు. డిపాజిట్లు రూ.20 వేలలోపు కట్టిన వారు దాదాపు 14 లక్షల మంది ఉన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2019-20 వార్షిక బడ్జెట్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు రూ. 1,150 కోట్లు కేటాయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ల చెల్లింపు
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్

తీవ్ర తుపానుగా బుల్‌బుల్ : ఐఎండీ
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్‌బుల్ తుపాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతవరణ విభాగం(ఐఎండీ) నవంబర్ 7న వెల్లడించింది. ఈ తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. బుల్‌బుల్ తుపాను నవంబర్ 9వ తేదీ వరకు ఉత్తర దిశగా పయనించి... తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది.

కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌పోర్టల్ ఆవిష్కరణ
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ కింద నిధులు, అలాగే దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం రూపొందించిన ‘కనెక్ట్ టు ఆంధ్రా’ వెబ్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో నవంబర్ 8న జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... సొంత గ్రామంలో అమలవుతున్న నవరత్నాలు, నాడు-నేడు సహా.. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సాయం చేయొచ్చని.. రాష్ట్రంపై ఉన్న ప్రేమాభిమానాలు చాటేందుకు ఇదో మంచి అవకాశమన్నారు. కనెక్ట్ టు ఆంధ్రాకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా, సీఎస్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌పోర్టల్ ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఏపీ సచివాలయం
ఎందుకు : కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ కింద నిధులు, అలాగే దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కోసం

కృష్ణా జిల్లాలో ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని వక్కపట్లవారిపాలెం ఓఎన్‌జీసీ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన నూతన గ్యాస్ పైప్‌లైన్‌ను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నవంబర్ 8న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయడం వల్ల వినియోగదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చెప్పారు. ఓఎన్‌జీసీ బావులను పరిశీలించి ఆయిల్, గ్యాస్ వెలికితీత వివరాలు తెలుసుకున్నారు. ప్లాంట్ ఆవరణలో మొక్కలు నాటారు.
మరోవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు, ఉక్కుశాఖ ఉన్నతాధికారులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఏపీ సచివాలయంలో నవంబర్ 8న జరిగిన ఈ భేటీలో కడప స్టీల్ ప్లాంట్‌తో పాటు ఆయా శాఖలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఓఎన్‌జీసీ గ్యాస్ పైప్‌లైన్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ఎక్కడ : వక్కపట్లవారిపాలెం, నాగాయలంక మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

నిర్మలా సీతారామన్‌తో ఏపీ ఆర్థిక మంత్రి భేటీ
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. ఢిల్లీలో నవంబర్ 11న జరిగిన ఈ సమావేశం సందర్భంగా ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్రమంత్రికి బుగ్గన వివరించారు. రాష్ట్ర విభజన సమస్యలతోపాటు గత సర్కారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు ఉదారంగా సాయం చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు రెవెన్యూ లోటు, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాల్సి ఉందని బుగ్గన నివేదించారు.
గత ప్రభుత్వం తీసుకున్న అప్పులను 2021 నుంచి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని కేంద్రమంత్రికి బుగ్గన వివరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చేయాల్సిన అప్పులను కూడా గత సర్కారే తీసుకోవడమే కాకుండా రూ. 40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు మిగిల్చి దిగిపోయిందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఏపీ ఆర్థిక పరిస్థితుల గురించి కేంద్రమంత్రికి వివరించేందుకు

దేశవ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం
మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశవ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన కేంద్రప్రభుత్వానికి ఉందని కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటించారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మురుగు నీటిని (సీవరేజ్) ట్రీట్ చేసి ఆ నీళ్లను వ్యవసాయ, గృహోపయోగానికి ఉపయోగించే విధానాలు అవలంబించాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నవంబర్ 11న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం గురించి షెకావత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశవ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్
ఎందుకు : ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు అందించించేందుకు

హైదరాబాద్‌లో ఇండియా జాయ్ వేడుక
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో 2019, నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు ‘ఇండియా జాయ్-2019’వేడుకను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) నిర్వహిస్తున్న ఈ వేడుకలో 9 అంశాలపై సదస్సులు జరపనున్నారు. డిజిటల్ మీడియా, వినోదం రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు సంస్థలు ఈ వేడుకలో పాల్గొననున్నాయి. ఇండియా జాయ్-2019 సంద ర్భంగా గేమింగ్, వినోదం తదితర రంగాల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇమేజ్ టవర్స్’కు ప్రచారం కల్పించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019, నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు ‘ఇండియా జాయ్-2019’వేడుక
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : తెలంగాణ వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ)
ఎక్కడ : హైటెక్ సిటీ, హైదరాబాద్

విజయవాడలో జాతీయ విద్యా దినోత్సవం
భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్భంగా మైనార్టీ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ విద్యా, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. విజయవాడలో నవంబర్ 11న జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ మౌలానా.. సుదీర్ఘంగా 1958 వరకు 11 ఏళ్ల పాటు దేశ తొలి విద్యా మంత్రిగా ఎన్నో మంచి పనులు చేశారని, నేడు ఉన్న పలు విద్యా సంస్థలు ఆయన ప్రారంభించినవేనని తెలిపారు. మౌలానా జయంతిని 2008లో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2019-20 బడ్జెట్‌లో రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి రూ.952 కోట్లు కేటాయించారు.
మరోవైపు ఉర్దూ భాషలో సేవలు అందించిన వారితో పాటు పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యలో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ పురస్కారాలను ప్రదానం చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ అవార్డు కింద లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సీఎస్ అబ్దుల్ సలాం షహెమేరీకి ప్రదానం చేశారు. అలాగే పదవ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విద్యా పురస్కారాలను సీఎం అందజేశారు..
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ విద్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్భంగా

హైదరాబాద్‌లో జల్‌జీవన్ మిషన్ సమావేశం
జల్‌జీవన్ మిషన్ అంశంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దక్షిణాది రాష్ట్రాలతో హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో నవంబర్ 11న సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ నుంచి నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులు హాజరయ్యారు. తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ జలవనరుల మంత్రి అనిల్ కుమార్, కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప హాజరయ్యారు.
ఈ సమావేశం సందర్భంగా జలశక్తి శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ జల్‌మిషన్ ప్రాథమ్యాలను వివరించారు. దేశంలోని 14.60 కోట్ల గ్రామీణ ప్రాంత గృహాలకు సురక్షిత నీటి సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని, దీనికోసం 2024 నాటికి ఏడాదికి రూ.40 వేల కోట్ల చొప్పున రూ.2 లక్షల కోట్లు కేంద్రం ఖర్చు చేయనుందని తెలిపారు. కేంద్రమంత్రి షేకావత్ మాట్లాడుతూ... గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే భారీ ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. అద్భుతాల కోసం ప్రాజెక్టులు కట్టొద్దన్నారు. ఎక్కడి నీటిని అక్కడే వినియోగించేలా ప్రభుత్వాల విధానాలు, కార్యాచరణలు ఉండాలని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జల్‌జీవన్ మిషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాలతో సమావేశం
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్
ఎక్కడ : హైదరాబాద్

కాస్ట్ ఆఫ్ లివింగ్’లో..విశాఖ బెస్ట్ : నంబియో’ సర్వే
ఉపాధి, ఉద్యోగాల కోసం నగరాలకు వలసపోయే సామాన్య, పేద వర్గాలు ముందుగా అడిగేది అక్కడి ప్రజల జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) గురించే. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని 352 నగరాల్లో ప్రజల జీవన వ్యయంపై ‘నంబియో’ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయవాడ, విశాఖపట్నంలలో తక్కువ జీవన వ్యయంతో సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయని తేలింది. మన దేశంలోని నగరాల్లో జీవన వ్యయం అంతకంతకూ పెరుగుతున్నా, ప్రపంచంలోని ఇతర నగరాలతో పోల్చినప్పుడు సామాన్యుడికి కాస్త అందుబాటులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. నివేదికలో విజయవాడ, విశాఖపట్నం నగరాలకు 350, 351 ర్యాంకులు దక్కగా.. ముంబై 316, ఢిల్లీ 323, బెంగుళూరు 327, పూణె 328, హైదరాబాద్ 333, చెన్నై 334, కోల్‌కతాలు 336 ర్యాంకుల్లో నిలిచాయి. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్, బేసల్, లాసన్నె, జెనీవా, బెర్న్ నగరాలు అత్యధిక జీవన వ్యయంతో జాబితాలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి.
ఎలా అంచనా వేశారు?
న్యూయార్క్ నగర జీవన వ్యయం ప్రాతిపదికగా ఇతర నగరాల స్థాయిని నిర్ణయించారు. ఇందుకోసం నిత్యవసర వస్తువులు, ఆభరణాల ధరలు, రెస్టారెంట్లలో రేట్లు, రవాణా, ఇతర అవసరాల ధరల్ని లెక్కించి న్యూయార్క్ నగరం సూచీని వందగా అంచనా వేశారు. ఆ ధరల్ని ఇతర నగరాల ధరలతో పోల్చి ర్యాంకింగ్ నిర్ధారించారు. ఉదాహరణకు జెనీవా ధరలను న్యూయార్క్‌తో పోల్చగా.. సూచీ 121 శాతంగా వచ్చింది. అంటే జెనీవాలో న్యూయార్క్ కంటె జీవన వ్యయం 21 శాతం ఎక్కువ. పారిస్ నగరం ఇండెక్స్ 85 శాతం కాగా న్యూయార్క్ కంటే అక్కడ 15 శాతం తక్కువగా జీవనవ్యయం ఉన్నట్లు లెక్కించారు. విజయవాడ, విశాఖపట్నంలో సూచీలు 21.64, 21.21 శాతంగా ఉండడంతో న్యూయార్క్ కంటే ఈ రెండు నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ 78.36, 78.79 శాతం తక్కువ ఉందని తేల్చారు.
యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు
తెలంగాణలోని నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలకు సంబంధించి అటామిక్ మినరల్ డెరైక్టరేట్ (ఏఎండీ)కు తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఇచ్చిన అనుమతులు రద్దయ్యాయి. యురేనియం నిల్వలున్నాయో లేదో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్‌తోపాటు వెలికితీతకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని తెలంగాణ అటవీ శాఖ నవంబర్ 13న స్పష్టం చేసింది. నల్లమలలో 4 వేల బోర్లు వేసి యురేనియం అన్వేషిస్తామంటూ ఏఎండీ పంపించిన కొత్త ప్రతి పాదనలు తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. యురేనియం అన్వేషణకు 2016 డిసెంబర్‌లో తెలంగాణ స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం ఇచ్చిన అనుమతులు, ఒప్పందాలు రద్దయినట్టుగా ఏఎండీ, కేంద్ర అటవీశాఖ, కేంద్ర వన్యప్రాణి బోర్డుకు లేఖలు పంపింది.
యురేనియం నిక్షేపాల పరిశోధన, తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదంటూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయం విదితమే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యురేనియం తవ్వకాల అనుమతులు రద్దు
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : తెలంగాణ అటవీ శాఖ
ఎక్కడ : నల్లమల అటవీ ప్రాంతం, తెలంగాణ

వైఎస్సార్ మత్య్సకార భరోసాకు కేబినెట్ ఆమోదం
సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ మత్య్సకార భరోసా’ పథకానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నవంబర్ 13న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మత్య్సకార భరోసా పథకం వైఎస్సార్ బీమా పథకం కింద నమోదు చేసుకున్న 18-60 సంవత్సరాల మధ్య వయసున్న వారికి వర్తిస్తుంది. 2019, నవంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
మంత్రిమండలి భేటీలోని మరికొన్ని నిర్ణయాలు
2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టు చేయాలన్న నిర్ణయానికి ఆమోదం. 12వ తరగతి వరకు ప్రతి ఒక్కరూ తెలుగు లేదా ఉర్దూను రెండో సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలి.
  • రాష్ట్రంలో కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల పరిధిలో అక్రమంగా వేసిన లే అవుట్లలో ప్లాట్ కొని, ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారి ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా.. రవాణా చేసినా.. బ్లాక్‌మార్కెట్‌లో అమ్మినా.. ఒకరి పేరిట కొని, మరొకరికి అమ్మినా రూ. 2 లక్షల వరకు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడేలా చట్టానికి సవరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
  • పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర వ్యర్థాలతో నదీ, భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ఆమోదం.
  • మొక్కజొన్న క్వింటాల్ ధర రూ. 2,200 నుంచి రూ.1,500కి పడిపోయిన నేపథ్యంలో వెంటనే విజయనగరం, కర్నూలులో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం.
  • ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ పాలసీ-2018, ఆంధ్రప్రదేశ్ విండ్ పవర్ పాలసీ-2018, ఆంధ్రప్రదేశ్ విండ్, సోలార్, హైబ్రిడ్ పవర్ పాలసీ-2018 పాలసీల సవరణలకు ఆమోదం.
  • రాష్ట్రంలో 84 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు అనుగుణంగా గ్రామ న్యాయాలయాల చట్టం -2008 సవరణకు అంగీకారం.
  • ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం సవరణ, మున్సిపల్ లా చట్టంలో సవరణలకు గ్రీన్‌సిగ్నల్.
  • రూ. 20 కోట్లకు పైగా ఆదాయముండే 8 ప్రముఖ ఆలయాలకు కొత్తగా ట్రస్టు బోర్డుల నియామకానికి మంత్రిమండలి పచ్చజెండా.

కేంద్ర హోంమంత్రితో కేటీఆర్ సమావేశం
Current Affairs
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో అక్టోబర్ 31న జరిగిన ఈ భేటీలో హైదరాబాద్‌ను గ్లోబల్ స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా అమిత్ షాను కేటీఆర్ కోరారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఆర్డీ)లో భాగంగా చేపడుతున్న పలు రహదారుల విస్తరణకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రి కేటీఆర్ కలిసారు. హైదరాబాద్ ఫార్మా సిటీ (హెచ్‌పీసీ)కి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ సహా బడ్జెటరీ సాయం చేయాల్సిందిగా గోయల్‌ను కేటీఆర్ కోరారు. ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు జిల్లాలోని పండిళ్లపల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వే సైడింగ్ వసతి ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవించారు. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు
ఎక్కడ : న్యూఢిల్లీ

యునెస్కో సృజనాత్మక నగరాల్లో హైదరాబాద్
ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ‘క్రియేటివ్ సిటీస్’(సృజనాత్మక నగరాలు) జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. ప్రపంచ నగరాల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 31న క్రియేటివ్ సిటీస్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో గ్యాస్ట్రానమీ (రుచికరమైన ఆహారం, తినుబండారాలకు సంబంధించింది) కేటగిరీలో ప్రపంచవ్యాప్తంగా 10 నగరాలను ఎంపిక చేయగా, అందులో హైదరాబాద్ స్థానం సంపాదించింది. టర్కీ, పెరు, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇటలీ, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఈక్వెడార్, చైనా దేశాలకు చెందిన నగరాలు కూడా ఈ జాబితాలో ఎంపికయ్యాయి.
మరోవైపు క్రియేటివ్ సిటీస్-ఫిల్మ్ కేటగిరీలో దేశ వాణిజ్య రాజధాని ముంబైకి చోటు దక్కింది. భారత్ నుంచి హైదరాబాద్, ముంబైలు మాత్రమే క్రియేటివ్ సిటీల జాబితాలో స్థానం సంపాదించాయి. ప్రపంచవ్యాప్తంగా 246 నగరాలను వివిధ కేటగిరీల్లో పరిశీలించిన యునెస్కో 66 నగరాలను ఎంపిక చేసింది. విన్నూత పద్ధతులు, ఆలోచనల ద్వారా నగర ప్రాంతాల ప్రజలకు ప్రత్యక్ష లబ్ధి కలగజేస్తోన్న నగరాలను క్రియేటివ్ సిటీలుగా యునెస్కో ప్రకటించింది. ప్రస్తుతం యునెస్కో డెరైక్టర్ జనరల్‌గా ఆడ్రే అజౌలే ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యునెస్కో సృజనాత్మక నగరాల జాబితాలో చోటు
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : హైదరాబాద్
ఎక్కడ : గ్యాస్ట్రానమీ (రుచికరమైన ఆహారం, తినుబండారాలకు సంబంధించింది) కేటగిరీలో

అమ్మ ఒడి పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదం
ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు పేద విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు పంపే తల్లులకు జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని వర్తింప చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అక్టోబర్ 30న సచివాలయంలోముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం
మంత్రివర్గ కీలక నిర్ణయాలు
 
  • వివిధ రంగాల ద్వారా ప్రజా సేవ అందించిన వారికి, ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులను అందించేందుకు ఆమోదం. ఏటా జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15వ తేదీన 50 మంది చొప్పున ప్రతి సంవత్సరం 100 మందికి అవార్డులిస్తారు.
  • ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ మత్స్యకార నేస్తం అమలుకు ఆమోదం.
  • 9 జిల్లాల్లో 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు.
  • కార్పొరేట్ రెస్పాన్స్ బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రా పేరిట సంస్థ ఏర్పాటు.
  • కృష్ణా-గోదావరి డెల్టా కాల్వల శుద్ధికి ప్రత్యేక మిషన్ ఏర్పాటు.
  • కంకర నుంచి రోబో శ్యాండ్ (ఇసుక) తయారు చేసే స్టోన్ క్రషర్స్ యూనిట్లను కొత్త యంత్రాలతో అప్‌గ్రేడ్ చేసుకునేవారికి రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకూ పావలా వడ్డీ కింద రుణాలివ్వడం.
  • అభ్యంతరం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ ఇళ్ల క్రమబద్ధీకరణకు ఆమోదం. 300 చదరపు గజాల వరకూ క్రమబద్ధీకరణ చేస్తారు.
  • విశాఖపట్నం బీచ్‌రోడ్డులో లులూ సంస్థకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత విలువైన 13.83 ఎకరాల కేటాయింపు ఒప్పందం రద్దు.
  • కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 498.93 ఎకరాల కేటాయింపును రద్దు.
  • అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ పరస్పర అంగీకారంతో అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ (ఏడీపీ) లిమిటెడ్ మూసివేత.
  • పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 8 జిల్లాల్లోని సబ్‌ప్లాన్ ఏరియాల్లో 77 గిరిజన మండలాల్లో గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు ఆమోదం.
  • నవంబర్ 7న అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు. 3,69,655 మందికి సుమారు రూ.264 కోట్లు చెల్లింపు.
  • హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపుకు ఆమోదం. వార్షికాదాయం రూ.మూడు లక్షలలోపు ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.40 వేల నుంచి రూ.60 వేలకు.. వార్షికాదాయం రూ.మూడు లక్షలకు పైబడి ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతారు.
  • ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రెల్లి, ఇతర కులాల సంక్షేమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు ఆమోదం.

ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల్లో సీఎం జగన్
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవంబర్ 1న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా కలిసికట్టుగా పనిచేస్తే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ముందుగు సాగుతోందని గవర్నర్ పేర్కొన్నారు. 2014 ముందు వరకు జరిగినట్టుగానే నవంబర్ 1వ తేదీనే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
అవతరణ: అక్టోబర్ 1, 1953లో ఆంధ్ర ప్రాంతం, మద్రాసులో కొంతభాగం కలసి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల మేరకు హైదరాబాద్ రాష్ట్రంలో కొంతభాగం, ఆంధ్ర రాష్ట్రం కలసి 1956, నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అవతరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : మున్సిపల్ స్టేడియం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్

యాదాద్రిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభం
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో ఏర్పాటుచేసిన టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎంఎస్‌ఎంఈ-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభమైంది. తెలంగాణ ఇంధన శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డితో కలిసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు 2019, నవంబర్ 1న ఈ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... రూ.1,552 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో 450 యూనిట్ల స్థాపనకు వీలుగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ద్వారా ప్రత్యక్షంగా 19 వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వాక్-టు-వర్క్ విధానంలో భాగంగా పార్కులోనే 192 ఎకరాల్లో హౌసింగ్ కాలనీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. పార్క్‌ను ప్రస్తుతం 440 ఎకరాల్లో ప్రారంభించినా భవిష్యత్తులో 2 వేల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌లలోనూ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు డ్రైపోర్టు రాబోతుందన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టీఎస్‌ఐఐసీ-టీఐఎఫ్-ఎంఎస్‌ఎంఈ-గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : దండుమల్కాపురం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ

ఏపీలో ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పారదర్శకంగా ఎంపిక చేయడానికి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ (ఏపీసీవోఎస్) ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4న ఉత్తర్వులు జారీచేసింది. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే ఏపీసీవోఎస్ తక్షణ కార్యకలాపాలు ప్రారంభించడానికి రూ.10 కోట్ల సీడ్ క్యాపిటల్‌ను ప్రభుత్వం సమకూర్చింది. ఈ కార్పొరేషన్ సబ్‌స్క్రిప్షన్ క్యాపిటల్ రూ.10 లక్షలుగా ఉంటుంది.
మొత్తం తొమ్మిది మంది బోర్డు సభ్యులతో ఏర్పాటైన ఏపీసీవోఎస్‌కు సాధారణ పరిపాలన విభాగం(సర్వీసెస్, హెచ్‌ఆర్‌ఎం)కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ప్రధాన కార్యదర్శి/ప్రభుత్వ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎటువంటి లాభాపేక్ష లేని ఈ సంస్థకు ఆదాయాన్ని వివిధ విభాగాల సంక్షేమ నిధుల నుంచి సమీకరిస్తారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడడంతోపాటు దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా, సమర్థులైన ఉద్యోగులను ఎంపిక చేయడం లక్ష్యంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ (ఏపీసీవోఎస్) ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : వివిధ ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పారదర్శకంగా ఎంపిక చేయడానికి
Published date : 27 Nov 2019 04:29PM

Photo Stories