Skip to main content

జనవరి 2017 రాష్ట్రీయం

ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.1,07,532
Current Affairs

2015-16లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,07,532 గా నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ నివేదిక విడుదల చేసింది. నివేదిక ప్రకారం రూ.1,40,628 తలసరి ఆదాయంతో విశాఖపట్నం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా రూ. 74,638 లతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది. విశాఖపట్నం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాలు రాష్ట్ర తలసరి ఆదాయం కన్నా ముందంజలో ఉన్నాయి.

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ - 2017
7వ హైదరాబాద్ సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు ప్రారంభమమయ్యాయి. జనవరి 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రముఖ హిందీ రచయిత అశోక్ వాజ్‌పేయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ లిటరరీ ట్రస్టు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తోంది.

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 23వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII- Partnership Summit-2017) ప్రారంభమైంది. జనవరి 27 నుంచి 28 వరకు రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు. 50 దేశాలకు చెందిన అధికారులు, 2,500 మందికిపైగా పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తొలిరోజు రూ.4.25 లక్షల కోట్ల విలువైన 128 ఒప్పందాలు కుదిరాయి.

తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు
తెలంగాణలోని బ్రాహ్మణుల సంక్షేమానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఛైర్మన్‌గా 17 మంది సభ్యులతో పరిషత్‌ను ఏర్పాటు చేస్తూ జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది.

పాస్‌పోర్టుల జారీలో హైదరాబాద్‌కు రెండో స్థానం
2016లో పాస్‌పోర్టుల జారీలో హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం దేశవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. గతేడాది దేశంలో 1.3 కోట్ల పాస్‌పోర్టులు జారీగా కాగా 6.6 లక్షల పాస్‌పోర్టుల జారీతో హైదరాబాద్ ఈ స్థానాన్ని దక్కించుకుంది. లక్నో కార్యాలయం అత్యధిక పాస్‌పోర్టుల జారీతో మొదటి స్థానంలో నిలిచింది.

డాక్టర్ అబ్బూరి గోపాల కృష్ణ మృతి
బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అబ్బూరి గోపాల కృష్ణ (81) విశాఖపట్నంలో జనవరి 31న కన్నుమూశారు. విశాఖలో పుట్టిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నాటక విభాగం అధిపతిగా పని చేసి పదవీ విరమణ పొందారు. నటన, రచన, రంగస్థల దర్శకత్వం, చిత్రలేఖనం, సాహిత్యం, సంగీతం వంటి విభిన్న రంగాల్లో అబ్బూరి రాణించారు.

భక్త రామదాసు ఎత్తిపోతల ప్రారంభం
ఖమ్మం జిల్లాలోని భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితం చేశారు. ఈ మేరకు కొత్తూరు పంచాయతీ ఎర్రగడ్డ తండా వద్ద జనవరి 31న పథకాన్ని ప్రారంభించారు. ఈ ఎత్తిపోతల ద్వారా జిల్లాలోని 60 వేల ఎకరాలకు నీరు అందుతుంది.

హైదరాబాద్‌లో ఫ్రాన్స్ వైమానిక నైపుణ్య శిక్షణ కేంద్రం
హైదరాబాద్‌లో వైమానిక నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు కోసం ఫ్రాన్స్‌కు చెందిన బోర్డ్‌యాక్స్ అనుబంధ సంస్థ ఏరో క్యాంపస్ ఆక్విటెన్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 27న ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంపై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్; ఆక్విటెన్ సంస్థ జనరల్ మేనేజర్ జెరేమ్ వర్చేవ్ లు సంతకాలు చేశారు. ఈ శిక్షణ కేంద్రాన్ని రూ.200 కోట్ల వ్యయంతో బేగంపేట విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.

టీఎస్‌లో చిన్న విమానాశ్రయాల అభివృద్ధికి ఒప్పందం
తెలంగాణలో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీతో జనవరి 18న ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, తెలంగాణ ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె. తారకరామారావుల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీంతో 2016, అక్టోబర్‌లో పౌరవిమానయాన శాఖ ప్రారంభించిన ప్రాంతీయ అనుసంధాన పథకంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామి అయింది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో విమానాశ్రయాలను నెలకొల్పుతారు. తద్వారా జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లోని ప్రజలకు తక్కువ ధరకే విమానయాన అవకాశం లభిస్తుంది. ఆర్థికంగా, సాంకేతికంగా అనువుగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌లను వినియోగంలోకి తీసుకొచ్చి.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ద్వారా చిన్న పట్టణాలకు విమాన సర్వీసులను నడుపుతారు. కొత్తగూడెం, వరంగల్‌తోపాటు మరో తొమ్మిది విమానాశ్రయాలను వినియోగంలోకి తేనున్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ పరిధి పెంపు
ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ- సీఆర్‌డీఏ పరిధిని రాష్ట్ర ప్రభుత్వం మరింత పెంచింది. అదనంగా 7 గ్రామాల్లోని 311.19 చదరపు కి. మీ.ను సంస్థ పరిధిలోకి చేర్చింది. దీంతో సీఆర్‌డీఏ పరిధి 8,914.51 చదరపు కి.మీ. లకు చేరింది.

అమరావతిపై నేషనల్ జియోగ్రఫీ ఛానల్ డాక్యుమెంటరీ
Current Affairs
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంపై నేషనల్ జియోగ్రఫీ ఛానల్ డాక్యుమెంటరీ తీయనుంది. ఈ మేరకు ఛానల్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జనవరి 18న నిర్ణయం తీసుకుంది.

మాంసం వినియోగంలో హైదరాబాద్ 'టాప్'
మాంసాహార వినియోగంలో హైదరాబాద్ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా సగటున ఒక్కొక్కరు ఏడాదికి 5 కిలోల మాంసం వినియోగిస్తుండగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 31 కిలోలు తీసుకుంటున్నారని తేలింది. పౌల్ట్రీ ఫెడరేషన్, బ్రీడర్స్ అసోసియేషన్లు నిర్వహించిన సర్వే ఈ వివరాలు వెల్లడించింది.

2017-18 తెలంగాణ రుణ ప్రణాళిక రూ.65,590 కోట్లు
2017-18 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రుణ ప్రణాళికను జనవరి 20న నాబార్డు విడుదల చేసింది. మొత్తం రుణ ప్రణాళికను రూ.65,590 కోట్లుగా లెక్కించిన సంస్థ ఇందులోరూ.32,830 కోట్లను వ్యవసాయ రుణాల కింద చేర్చింది. ఇది 2016-17కన్నా 17 శాతం అధికం.

కస్టమ్స్ కమిషనరేట్‌కు ఐఎస్‌వో గుర్తింపు
విజయవాడలోని కస్టమ్స్ కమిషనరేట్‌కు దేశంలోనే తొలిసారిగా ప్రతిష్టాత్మక ఐఎస్‌వో 15700: 2005 గుర్తింపు లభించింది. ఈ మేరకు జనవరి 20న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ ఎస్‌ఎం భట్నాగర్ ఈ గుర్తింపు పత్రాన్ని ఆవిష్కరించారు.

ఉమ్మడి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా జడ్జీల కోటాలో డాక్టర్ షమీమ్ అక్తర్, జవలకర్ ఉమాదేవి, నక్కా బాలయోగి, తెల్లప్రోలు రజనీ లను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరింది. నల్గొండకు చెందిన డాక్టర్ షమీమ్ ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు రిజిష్ట్రార్(జ్యుడీషియల్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనంతపురానికి చెందిన జె.ఉమాదేవి హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తూర్పుగోదావరికి చెందిన నక్కా బాలయోగి ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి కాగా, ప్రకాశం జిల్లాకు చెందిన టి.రజని హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్‌‌స జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ నృత్యోత్సవాలు
ప్రథమ ఏషియన్ బ్రాడ్ కాస్టింగ్ యూనియన్ (ఏబీయూ) ఇంటర్ నేషనల్ డ్యాన్‌‌స ఫెస్టివల్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు జనవరి 15న హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నృత్యమనేది విశ్వవ్యాప్త భాష, ఇది మానసికోల్లాసాన్ని ప్రసాదిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం మన కర్తవ్యం అన్నారు. ఈ ఉత్సవాల్లో సుమారు పది దేశాలకు చెందిన 47 మంది కళాకారులు పాల్గొన్నారు.

రూర్బన్ పథకానికి ఏపీ నుంచి ఆరు మండలాల ఎంపిక
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి వసతుల కల్పనకు ఉద్దేశించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తాజాగా ఆరు మండలాలు ఎంపికయ్యాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి నందలూరు (వైఎస్సార్ జిల్లా), ఆలూరు (కర్నూలు), గరివిడి (విజయనగరం), సోంపేట (శ్రీకాకుళం), నూజెండ్ల (గుంటూరు), చందర్లపాడు (కృష్ణా)ను ఎంపిక చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అదనంగా మూడేళ్ల కాలంలో మండలానికి రూ.30 కోట్ల నిధులను సమకూర్చుతారు. 2015-16 సంవత్సరంలో ఈ పథకానికి కంబదూరు (అనంతపురం), కుప్పం(చిత్తూరు), సింగరాయకొండ(ప్రకాశం), వెంకటాచలం(నెల్లూరు), అరకు(విశాఖపట్నం) ప్రాంతాలు ఎంపికయ్యాయి.

పశ్చిమ గోదావరిలో బొగ్గు నిక్షేపాలు
Current Affairs
పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) అన్వేషణలో తేలింది. జీఎస్‌ఐ ఆధ్వర్యంలో సౌత్ వెస్ట్ పినాకిల్, మహేశ్వరి సంస్థలు చింతలపూడి, శెట్టివారిగూడెం ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేసి 50-70 మీటర్ల లోతులోనే బొగ్గు నిల్వలు ఉన్నట్టు గుర్తించారు. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల పరిధిలో భూమి ఉపరితలానికి 500 మీటర్ల లోపు 2 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా.

ప్రముఖ ఇరిగేషన్ ఇంజనీర్ టి. హనుమంతరావు కన్నుమూత
ప్రముఖ నీటిపారుదల శాఖ ఇంజనీర్, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ), ఐక్యరాజ్యసమితి మాజీ సలహాదారు టి.హనుమంతరావు (86) జనవరి 8న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన 1988లో ఏపీ రాష్ట్రానికి సాగునీటి శాఖ ఈఎన్‌సీగా వ్యవహరించారు. తక్కువ వ్యయంతో సత్ఫలితాలను ఇచ్చే చతుర్విధ జల ప్రక్రియను అభివృద్ధి చేశారు. 2000-2004 మధ్య ఏపీ రాష్ట్ర జలసంరక్షణ మిషన్ సాంకేతిక కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు.

తెలంగాణ వృద్ధి రేటు 10.02 శాతం
2016-17 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 10.02 శాతంగా (రూ.2,14,608 కోట్లు) నమోదయింది. జాతీయ వృద్ధి రేటు 7.2 శాతం (రూ.54,70,837) కంటే ఇది ఎక్కువ. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిన వృద్ధి రేటు నివేదికను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ జనవరి 7న విడుదల చేశారు.
జాతీయ స్థాయితో పోల్చినప్పుడు ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాష్ట్రం 4.7 శాతం వృద్ధి సాధించింది. జాతీయ వృద్ధి రేటు 2.5 శాతం.
ద్వితీయ రంగాలైన ఉత్పత్తి రంగంలో జాతీయ వృద్ధి రేటు 8.1 శాతం కంటే ఎక్కువగా 8.3 శాతం వృద్ధి నమోదైంది.
తృతీయ రంగాలైన ఆర్థిక, స్థిరాస్తి, వృత్తి సేవల రంగాల్లో రాష్ట్రం అత్యధికంగా 13.1 శాతం వృద్ధి రేటు సాధించింది. ఈ రంగాల్లో జాతీయ వృద్ధి రేటు 8.8 శాతమే.
వ్యాపారం, రవాణా, హోటల్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో రాష్ట్రం 10.4 శాతం వృద్ధి రేటును నమోదు చేయగా, జాతీయ వృద్ధి 7.6 శాతంగా నమోదైంది.

పరిశ్రమల సంఖ్యలో తెలంగాణకు 6వ స్థానం
Current Affairsపరిశ్రమల సంఖ్య పరంగా తెలంగాణ దేశంలో 6వ స్థానంలో నిలిచింది. స్థూల పారిశ్రామిక ఉత్పత్తుల పరంగా రూ.35,985 కోట్లతో 9వ స్థానం సంపాదించింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012-13, 2013-14 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతం సాధించిన పారిశ్రామిక పురోగతిపై ప్రణాళిక శాఖ రూపొందించిన నివేదికను జనవరి 7న ఆవిష్కరించారు. 2012-13లో రాష్ట్రంలో 10,279 పరిశ్రమలుండగా 2013-14లో 11,068 కి పెరిగాయి. మొత్తం 7.45 లక్షల మంది వీటిల్లో పనిచేస్తున్నారు.

పారిశ్రామిక ఉత్పత్తి పరంగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. పారిశ్రామికపరంగా అన్ని అంశాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, మెదక్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో 36.58 శాతం పరిశ్రమల్లో 34.25 శాతం మంది కార్మికులు, మెదక్ జిల్లాలో 12.84 శాతం పరిశ్రమల్లో 15.51 శాతం మంది కార్మికులు పనిచేస్తున్నారు.

తెలంగాణలో అనాథ పిల్లలకు ఎస్సీ హోదా
తెలంగాణ రాష్ట్రంలోని అనాథ పిల్లలకు ఎస్సీ హోదాతో పాటు ఎస్సీ రిజర్వేషన్‌ను కలించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జనవరి 5న ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్లు తగ్గించకుండానే వారికి అదనపు కోటా కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆదాయ ధ్రువీకరణ పత్రం పొందడంలో అనాథలు ఎదుక్కొంటున్న ఇబ్బందులను కూడా తొలగించనున్నట్లు తెలిపారు.

తిరుపతిలో చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్
తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్‌ను జనవరి 4న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నోబెల్ పురస్కారాన్ని సాధించే తెలుగు శాస్త్రవేత్తలకు ప్రభుత్వం తరుపున రూ.100 కోట్ల నగదు పారితోషికాన్ని అందిస్తామని ప్రకటించాడు. ఈ కార్యక్రమానికి జపాన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత టకాకి కజిటా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఒంటరి మహిళలకు రూ.1000 జీవన భృతి
సంపాదించే అండలేని ఒంటరి పేద మహిళలకు ఆర్థిక చేయూతనందించే కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఒంటరి జీవితం గడుపుతున్న పేద మహిళలకు జీవన భృతిగా నెలకు రూ.1000 చొప్పున అందించనున్నట్లు సీఎం కేసీఆర్ జనవరి 6న అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పథకానికి మార్చిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని తెలిపారు.

కృష్ణా జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్ బెటాలియన్ ఏర్పాటు
జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్) పదో బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్‌కు జనవరి 9న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేశారు. దీనిని కృష్ణా జిల్లా కొండపావులూరులో 50 ఎకరాల్లో నిర్మించనున్నారు. విపత్తుల సమయంలో జరిగే నష్టాన్నిపూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో National Disaster Response Force ను 2006లో ఏర్పాటు చేశారు.

విశాఖపట్నంలో ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు
విశాఖపట్నంలో 20వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సును జనవరి 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు దేశ నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

‘హాక్-ఐ’ యాప్‌కు జాతీయ అవార్డు
బాధితులకు తక్షణ సహాయం అందించడానికి హైదరాబాద్ పోలీసులు రూపొందించిన మొబైల్ యాప్ ‘హాక్-ఐ’ నేషనల్ ఈ- గవర్నెన్‌‌స గోల్డ్ అవార్డు గెల్చుకుంది. జనవరి 10న విశాఖపట్నంలో జరిగిన ట్రాన్‌‌సఫార్మింగ్ ఇండియా సదస్సులో కేంద్ర మంత్రి పీపీ చౌదరి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డికి ఈ అవార్డును అందచేశారు. ‘ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ మొబైల్ టెక్నాలజీ’ అనే అంశంలో ఈ అవార్డు దక్కింది. ‘హాక్-ఐ’ యాప్‌కు గత ఏడాది మార్చిలో ‘సోషల్ మీడియా ఫర్ ఎంపవర్‌మెంట్-2016’ అంతర్జాతీయ అవార్డు లభించింది.

Current Affairsతెలంగాణ కొత్త సీఎస్‌గా ఎస్‌పీ సింగ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనూతన ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్ జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 30న సీఎస్‌గా ఎంపికైన ప్రదీప్ చంద్ర డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయిన ఎస్‌పీ సింగ్‌ను సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ సింగ్ బీహార్‌కు చెందిన వారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేశారు. స్పెషల్ సీఎస్ హోదా కూడా పొందారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ‘మిషన్ భగీరథ’ప్రాజెక్టు పురోగతిలో ముఖ్య పాత్ర పోషించారు.

ఏపీలోని మోరి గ్రామంలో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు ప్రారంభం
తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామంలో ఫైబర్‌గ్రిడ్ పెలైట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 29న ఆవిష్కరించారు. తద్వారా ఏపీలో తొలి ఫైబర్ గ్రిడ్ గ్రామంగా, తొలి డిజిటల్ గ్రామంగా మోరి నిలవనుంది. To Home scheme ద్వారా రూ.149 కే ఇంటర్‌నెట్, 250కి పైగా చానళ్లు, ప్రపంచంలో ఎక్కడికైనా వీడియో కాల్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో తొలి బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా మోరిని ప్రకటించారు.

నెల్లూరు జిల్లాలో ఎన్‌సీఈఆర్‌టీ కేంద్రానికి భూమి పూజ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెంలో 55 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కేంద్రానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిసెంబర్ 27న భూమి పూజ చేశారు.

కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్స్ సభ్యురాలిగా కవిత
కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్స్ (సీడబ్ల్యూపీ) సభ్యురాలిగా నిజామాబాద్ ఎంపీ కవిత నియమితులయ్యారు. ఈ మేరకు కామన్వెల్త్ పార్లమెంటరీ సంఘం భారత చైర్‌పర్సన్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ డిసెంబర్ 28న నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సీపీఏలో భాగమైన సీడబ్ల్యూపీలో సభ్యురాలిగా కవిత.. నియామక తేదీ నుంచి మూడేళ్లపాటు కొనసాగనున్నారు. అలాగే ఏపీ నుంచి ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరో సభ్యురాలిగా నియమితులయ్యారు.

ఏపీలో ‘ఆరోగ్య రక్ష’ బీమా పథకం ప్రారంభం
రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ‘ఆరోగ్య రక్ష’ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జనవరి 1న విజయవాడలోని తుమ్మలపల్లిలో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా నెలకు రూ.100 చొప్పున ఏటా 1200 చెల్లించిన వారికి రూ.2 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తారు. ఇది ప్రభుత్వం అందించే ఏ ఆరోగ్య పథకంలో లేని వారికి వర్తిస్తుంది. పథకంలో చేరాలనుకునేవారు ఫిబ్రవరి 28 లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.

హైదరాబాద్‌లో నుమారుష్ 2017 ప్రారంభం
77వ అఖిల భారత పారిశ్రామిక వస్తుప్రదర్శన-2017 హైదరాబాద్‌లో జనవరి 1న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. ఇందులో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా తయారయ్యే వస్తువులను ప్రదర్శిస్తారు. ఏటా తెలంగాణ ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహించే నుమాయిష్ 77 సంవత్సరాల కింద ప్రారంభైమైంది.

తిరుపతిలో భారత ఆర్థిక సదస్సు
99వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సును తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు డిసెంబర్ 27న ప్రారంభించారు.

తిరుపతిలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 3న ప్రారంభించారు. ‘దేశాభివృద్ధికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం’ (Science & Technology for National Development) అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.
జనవరి 7 వరకు జరగనున్న సదస్సుకు దేశ విదేశాల నుంచి 12,000 మంది ప్రతినిధులు, 500 మంది శాస్త్రవేత్తలు, 6 మంది నోబెల్ గ్రహీతలు హాజరవుతున్నారు.
Published date : 09 Jan 2017 04:33PM

Photo Stories