Skip to main content

India's first display fab to be established in Telangana: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్న డిస్‌ప్లే ఫ్యాబ్‌

దేశ చరిత్రలో తొలిసారిగా ‘డిస్‌ప్లే ఫ్యాబ్‌’తయారీ రంగంలో రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడి లభించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రముఖ ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్‌ ద్వారా తెలంగాణలో అడ్వాన్స్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోటీపడుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సాధించింది. జూన్‌ 12(ఆదివారం) బెంగళూరులో మంత్రి కె. తారక రామారావుతో జరిగిన సమావేశంలో ఎలెస్ట్‌ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాçహనా ఒప్పందం కుదిరింది. ఎలెస్ట్‌ తరఫున రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌ రాజేష్‌ మెహతా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో 6వ తరం అమోలెడ్‌ డిస్‌ప్లే ఫ్యాబ్‌ ఉత్పత్తి కోసం రూ. 24 వేల కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది.
India's first display fab to be established in Telangana
India's first display fab to be established in Telangana
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల తయారీ కంపెనీలకు అవసరమైన అమోలెడ్‌ డిస్‌ప్లేలను ‘ఎలెస్ట్‌’తయారు చేసి సరఫరా చేయనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ విభాగం డైరెక్టర్‌ (ఎలక్ట్రానిక్స్‌) సుజయ్‌ కారంపురి, ఎలెస్ట్‌ సీఈఓ శ్యామ్‌ రఘుపతి తదితరులు పాల్గొన్నారు. 

గ్లోబల్‌ టాలెంట్‌ను
ఆకర్షించే అవకాశం: రాజేశ్‌ మెహతా 

  • తెలంగాణలో తాము ఏర్పాటు చేయబోయే డిస్‌ప్లే ఫ్యాబ్‌ వల్ల అత్యుత్తమ గ్లోబల్‌ టాలెంట్‌ను ఆకర్షించే అవకాశం ఉందని రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌ రాజేశ్‌ మెహతా తెలిపారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పనిచేసే ఈ ప్లాంట్‌లో 3,000 మంది శాస్త్రవేత్తలు, ఇతర సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. దీంతోపాటు డిస్‌ప్లే ఫ్యాబ్‌ భాగస్వాములు, అనుబంధ సంస్థలు, సరఫరాదారుల రూపంలో వేలాది ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 6వ తరం అమోలెడ్‌ డిస్‌ప్లే తయారీ ద్వారా భారత్‌ నుంచి ఫ్యూచర్‌ టెక్నాలజీని తమ ఎలెస్ట్‌ కంపెనీ ప్రపంచానికి అందిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజు: మంత్రి కేటీఆర్‌ 

  • రాష్ట్రానికి రూ. 24 వేల కోట్ల పెట్టుబడి వచ్చిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. ఈ పరిణామాన్ని తెలంగాణకు చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. దేశ హైటెక్‌ తయారీ రంగానికి వచ్చిన భారీ పెట్టుబడుల్లో ఇది కూడా ఒకటని పేర్కొన్నారు. డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో రానున్న రూ. 24 వేల కోట్ల పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం భారత్‌ను ప్రపంచ హైటెక్‌ పరికరాలను తయారు చేస్తున్న దేశాల సరసన నిలుపుతుందన్నారు. ఇప్పటివరకు జపాన్, కొరియా, తైవాన్‌లకు మాత్రమే సాధ్యమైనది ఇకపై తెలంగాణలో అవుతుందన్నారు.
  • దేశ సెమీ కండక్టర్‌ మిషన్‌ ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోకి ఫ్యాబ్‌ రంగంలో పెట్టుబడులు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నామని వివరించారు. ఈ పెట్టుబడి తర్వాత ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డిస్‌ప్లే ఫ్యాబ్‌ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ ఎకోసిస్టం, అనుబంధ రంగాల్లో వృద్ధికి గణనీయమైన అవకాశాలు లభిస్తాయన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్‌ , డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం పోటీ పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో  నిలవనుందన్నారు. 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 

  • తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

    యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
    డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 13 Jun 2022 04:55PM

Photo Stories