Andhra Pradesh : పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు.. వేలమందికి ఉపాధి.. పూర్తి వివరాలు ఇవే..
ఇందులో భాగంగా రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహారశుద్ధి ప్రాజెక్టులకు జూలై 25వ తేదీన (మంగళవారం) ఉదయం వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఆరు యూనిట్లకు ప్రారంభోత్సవం, ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేశారు.
ఈ యూనిట్ల ద్వారా..
ఏటా 3.14 లక్షల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ల ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుండగా.. 40,307 మంది రైతులకు మేలు జరగనుంది. వీటితోపాటు ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, 43 కోల్డ్ రూమ్స్‌ను ముఖ్యమంత్రి రైతులకు అంకితం చేశారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం అవసరమైన ముడిసరుకును రైతుల నుంచి సేకరించే సందర్భంగా వారికి ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన ఆరు ప్రాజెక్టుల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లు, ఒక మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి.
పరిశ్రమలు.. ఉద్యోగాలు ఇలా..
☛ ఆపరేషన్ గ్రీన్స్ కింద ఒక్కొక్కటి రూ.5.5 కోట్లతో అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం తుమ్మగుంటపల్లి, చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ, బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లి, సోమల మండలం కామిరెడ్డివారిపల్లెల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం ఏడాదికి 3,600 టన్నులు. ఒక్కో యూనిట్‌లో 15 మంది చొప్పున నాలుగు యూనిట్ల ద్వారా 60 మందికి ఉపాధికి లభిస్తుంది. 2,414 మంది రైతులకు లబ్ధి కలుగుతుంది.
☛ విజయనగరంలో రూ.4 కోట్లతో నిర్మించిన ఆరోగ్య మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఏటా 7,600 టన్నుల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ ద్వారా రాగిపిండి, మిల్లెట్ చిక్కీలు, బిస్కెట్లు, సేమ్యా తయారు చేస్తారు. 20 మందికి ఉపాధికి లభిస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ యూనిట్ నిర్వహణ కోసం వెయ్యిమంది రైతులతో ఏర్పడిన ఆరోగ్య మహిళా రైతు ఉత్పత్తిదారుల్లో సభ్యులంతా మహిళలే. యూనిట్‌ను నిర్వహించేది, పనిచేసేది అందరూ మహిళలే.
☛ కర్నూలు జిల్లాలో ఉల్లి విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం ఒక్కో యూనిట్ రూ.లక్ష చొప్పున రూ.కోటితో 100 సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు (సూక్ష్మ పరిశ్రమలు) ఏర్పాటు చేశారు. ఒక్కో యూనిట్ ఆరుటన్నుల చొప్పున ఏటా మొత్తం ఆరువేల టన్నుల ఉల్లిని ప్రాసెస్‌చేసే సామర్థ్యం ఈ యూనిట్లకు ఉంది. సీఎం ప్రారంభించనున్న వీటిద్వారా 100 మందికి ఉపాధి లభించనుండగా 500 మంది ఉల్లి రైతులకు లబ్ధిచేకూరనుంది.
వీటిద్వారా 745 మందికి ఉపాధి..
మరోవైపు రూ.1,692 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఐదు ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ భూమిపూజ చేశారు. వీటిలో చాక్లెట్ల కంపెనీ, వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్, మూడు టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిద్వారా 745 మందికి ఉపాధి లభించనుండగా, 36,588 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
☛ వీటిలో ప్రధానమైది మాండలిజ్ చాక్లెట్ కంపెనీ యూనిట్. బిస్కెట్లు, చాక్లెట్ల తయారీలో ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీల్లో ఒకటైన మాండలిజ్ కంపెనీ రూ.1,600 కోట్లతో శ్రీసిటీలో అతిపెద్ద చాక్సెట్ల తయారీ కంపెనీ నిర్మిస్తోంది. ఏటా 2.20 లక్షల టన్నుల కోకోవా ప్రాసెసింగ్ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుంది. 18 వేలమంది రైతులకు లబ్ధి కలుగుతుంది.
☛ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామం వద్ద 11 ఎకరాల్లో రూ.75 కోట్లతో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వేరుశనగ నూనె, పీనట్ బటర్, చిక్కీ, రోస్టర్డ్ సాల్టెడ్ పీనట్స్ తయారు చేస్తారు. ఏటా 55,620 టన్నుల వేరుశనగను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి లభిస్తుంది. 15వేల మందికి రైతులకు లబ్ధి చేకూరుతుంది.
☛ ఆపరేషన్ గ్రీన్స్ స్కీమ్‌లో భాగంగా ఒక్కొక్కటి రూ.5.5 కోట్ల అంచనాతో అనంతపురం జిల్లాలో కల్యాణదుర్గం, కుందుర్పి, సత్యసాయి జిల్లాలో చెన్నేకొత్తపల్లిల్లో టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క యూనిట్ సామర్థ్యం ఏటా 3600 టన్నులు. వీటి ద్వారా 45 మందికి ఉపాధి లభిస్తుంది. 3,588 మంది రైతులకు లబ్ధి కలుగుతుంది.
రైతులకు అంకితం..
ఉద్యానపంట ఉత్పత్తుల నిల్వ, గ్రేడింగ్ కోసం గ్రామస్థాయిలో రూ.63.15 కోట్లతో నిర్మించిన 421 కలెక్షన్ సెంటర్లు, రూ.5.37 కోట్లతో నిర్మించిన 43 కోల్డ్ రూమ్స్‌ను సీఎం వైఎస్ జగన్ రైతులకు అంకితం చేశారు. 1,912 ఆర్బీకేలకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ కలెక్షన్ సెంటర్ల సామర్థ్యం ఒక్కొక్కటి వందటన్నుల వంతున మొత్తం 42,100 టన్నులు. ఈ సెంటర్ల ద్వారా 1.80 లక్షలమంది రైతులకు మేలు జరగనుంది. అలాగే 194 ఆర్బీకేలకు అనుబంధంగా ఒక్కొక్కటి 10 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన 43 కోల్డ్ రూమ్స్ ద్వారా 26,420 మంది రైతులు లబ్ధి పొందనున్నారు.