Anganwadi Centres: అంగన్‌వాడీ కేంద్రాల ఆధునికీకరణ.. రూ.7.5 కోట్ల నిధుల కేటాయింపు
మనబడి నాడు నేడు పథకంలో మాదిరిగా అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరించనున్నారు. ఈ మేరకు జిల్లాలో గల 752 అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.7.5 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించినట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. ఆ నిధులతో ఆధునికీకరణ పనులు చేపడతారు. పాడైన భవనాలకు మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల ఏర్పాటు, మరమ్మతులు వంటి పనులు నిర్వహిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలను పెయింటింగులతో ముస్తాబు చేసి ఆహ్లదకరంగా తీర్చిదిద్దనున్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు సైతం కొత్తసొబగులు సంతరించకోనున్నాయి.
మదర్స్ కమిటీ ద్వారా పనులు
ప్రభుత్వం మంజూరు చేసిన నాడునేడు ఫేజ్–2 బి పనుల నిధులను మదర్స్ కమిటీ ద్వారా ఖర్చు చేయనున్నారు. ఈ కమిటీలో అంగన్‌వాడీ వర్కర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్, హెచ్‌ఎం, అంగన్‌వాడీ కేంద్రంలో 1 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లల పేర్లు నమోదు చేసుకున్న ముగ్గురు తల్లులతో పాటు సచివాలయం ఇంజినీరింగ్ అసిస్టెంట్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వారి ద్వారా పనులు చేపట్టనున్నారు.
చదవండి: Free Coaching: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఉచిత కోచింగ్.. ఎవరు అర్హులంటే..
తల్లుల కమిటీ ద్వారా నిధుల ఖర్చు
ఆధునికీకరణ పనుల నిధులు మదర్స్ కమిటీ సభ్యులతో ఖర్చు చేయిస్తాం. మదర్స్ కమిటీ ద్వారా బ్యాంకులో జాయింట్ అకౌంట్ తెరిచాం. ఇప్పటికే నిధులు నేరుగా వారి ఖాతాలో జమఅవుతున్నాయి. వారి పర్యవేక్షణలోనే అభివృద్ధి పనులు జరుగుతాయి. బి.ఉమాదేవి, అంగన్‌వాడీ కార్యకర్త, కొత్తకొప్పెర్ల–2, పూసపాటిరేగ మండలం
త్వరలో ఆధునికీకరణ పనులు
జిల్లాలోని 752 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆధునికీకరణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆయా కేంద్రాలకు నిధుల కేటాయింపుపై ఉత్తర్వులు ఇచ్చాం. అంగన్‌వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తాం. మదర్స్ కమిటీ ద్వారా అభివృద్ధి పనులు చేపడతాం.
బి.శాంతకుమారి, ఐసీపీడీఎస్ పీడీ, విజయనగరం