ఏప్రిల్ 2018 రాష్ట్రీయం
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు ప్రారంభించనున్న ‘రైతుబంధు’ పథకం అమలు తీరుపై అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అధ్యయనం చేయనుంది. 120 మండలాలను కంప్యూటర్ ద్వారా ర్యాండమ్‌గా పరిశీలించి ‘హై ఫ్రీక్వెన్సీ మానిటరింగ్ ఎవాల్యువేషన్’ పేరిట ఒక నివేదిక రూపొందించనుంది. ఈ అధ్యయనంలో పథకం అమలులో వ్యవసాయ, రెవెన్యూ శాఖల పనితీరు, సామర్థ్యాలను అంచనా వేయడంతో పాటు రైతుల జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలను తెలుసుకుంటారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుబంధు పథకంపై అధ్యయనం
ఎప్పుడు : పథకం ప్రారంభంలో
ఎవరు : మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా
ఎందుకు : పథకం అమలు, పనితీరును తెలసుకోవడానికి
జీహెచ్‌ఎంసీకి పీఎం ఎక్సలెన్సీ అవార్డు
ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎంపికైంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జీహెచ్‌ఎంసీ కి ఈ అవార్డు ఇవ్వనున్నట్లు ఏప్రిల్ 19న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 21న ఢిల్లీలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : జీహెచ్‌ఎంసీ
ఎందుకు : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు
డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి శ్రీకాంత్
భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ గుంటూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) అనిల్ చంద్ర పునీత ఏప్రిల్ 19న నియామక పత్రాలు అందజేశారు. ఏపీ ప్రభుత్వం క్రీడల కోటాలో ఇదివరకే బ్యాడ్మింటన్ మహిళా క్రీడాకారిణి పి.వి. సింధును కూడా డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డిప్యూటీ కలెక్టర్‌గా కిడాంబి శ్రీకాంత్
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : ఏపీ ప్రభుత్వం
ఎక్కడ : గుంటూరు
చంద్రన్న పెళ్లి కానుక పథకం ప్రారంభం
పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు పథకానికి సంబంధించిన లోగో, వెబ్‌సైట్‌ను ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 18న ఆవిష్కరించారు. పథకంలో భాగంగా ఎస్టీ, మైనారిటీలకు రూ. 50,000, ఎస్సీలకు రూ.40,000, బీసీలకు రూ.35,000, దివ్యాంగులకు లక్ష రూపాయలను కానుకగా ఇస్తారు. కులాంతర వివాహాలు చేసుకునే దళితులకు రూ.75,000, బీసీలకు రూ.50,000 లను అందజేస్తారు. మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 20 శాతం, పెళ్లి రోజున 80 శాతం ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చంద్రన్న పెళ్లి కానుక పథకం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : అమరావతి
ఎందుకు : పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం చేసేందుకు
మే 10 న రైతుబంధు పథకం ప్రారంభం
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన రైతు బంధు పథకం మే 10న ప్రారంభం కానుంది. దాదాపు 58 లక్షల మంది రైతులకు అదే రోజున కొత్త పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ మేరకు ఏప్రిల్ 21న ప్రగతిభవన్‌లో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా వ్యవసాయాధికారులకు పథకం అమలుపై కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు.
ఈ పథకం కోసం 2018-19 బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఇందులో మొదటి దశ వర్షాకాలం పంట (ఖరీఫ్) పెట్టుబడి కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రైతుబంధు పథకం ప్రారంభం
ఎప్పుడు : మే 10
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎందుకు : రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు
తెలంగాణలో 12,751 గ్రామపంచాయతీలు
తెలంగాణలో జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త పంచాయతీలు, వార్డుల సంఖ్యకు సంబంధించిన తాజా సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 21న విడుదల చేసింది. దీని ప్రకారం అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 12,751 గ్రామపంచాయతీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 844, అతి తక్కువగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో 61 గ్రామపంచాయతీలున్నాయి.
కొత్త జిల్లాలకు ముందు ఒక గ్రామపంచాయతీలో ఒకటి, అంతకంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలు ఉండగా పునర్విభజన తర్వాత ఒక రెవెన్యూ గ్రామంలో ఒకటి కంటే ఎక్కువగా గ్రామాలు ఉన్నాయి. గతంలో 500 జనాభాకంటే ఎక్కువ ఉన్న ఆవాసాలు మాత్రమే గ్రామపంచాయతీలుగా ఉండేవి. పునర్విభజన తర్వాత 300 కంటే తక్కువ జనాభా ఉన్న ఆవాసాలు కూడా గ్రామ పంచాయతీలుగా మారాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణలో 12,751 గ్రామపంచాయతీలు
ఎప్పుడు : ఏప్రిల్ 21
ఎవరు : రాష్ట్ర ఎన్నికల సంఘం
వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంత్ కన్నుమూత
ప్రముఖ వాగ్గేయకారుడు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు (98) ఏప్రిల్ 22న విజయవాడలో కన్నుమూశారు. సంగీత, సాహిత్యాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రజనీకాంతరావు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు. ఆకాశవాణి రజనీకాంతరావుగా ప్రసిద్ధులైన ఆయన 1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. 1941లో మద్రాస్ ఆలిండియా రేడియోలో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా చేరి స్టేషన్ డెరైక్టర్ స్థాయికి ఎదిగారు. 1947 ఆగస్ట్ 15న బాలాంత్రపు స్వయంగా రచించిన ‘‘మోగించు జయభేరి..వాయించు నగారా’’ గీతం మద్రాసు ఆకాశవాణి నుంచి ప్రసారమైంది.
రజనీకాంత్ రచించిన ‘వాగ్గేయకార చరిత్ర’కి 1961లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దీంతోపాటు కళారత్న అవార్డు, కళాప్రపూర్ణ, ప్రతిభామూర్తి జీవితకాల సాఫల్య బహుమతి, నాథ సుధార్ణవ, పుంభావ సరస్వతి, నవీన వాగ్గేయకార వంటి పురస్కారాలను ఆయన అందుకున్నారు. 2015లో ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వెలుగు పురస్కారంతో సత్కరించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ వాగ్గేయకారుడు, రచయిత కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 22
ఎవరు : బాలాంత్రపు రజనీకాంత్
తూర్పు గోదావరిలో వంద శాతం ఎల్‌ఈడీ దీపాలు
దేశంలోనే వంద శాతం ఎల్‌ఈడీ దీపాలు అమర్చిన తొలి జిల్లాగా తూర్పుగోదావరి నిలిచింది. సుమారు మూడు లక్షలకు పైగా ఎల్‌ఈడీ దీపాలను ఈ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ద్వారపూడిలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందుకు విజయనగరం కలెక్టర్ వివేక్‌యాదవ్‌కు ఉత్తమ కలెక్టర్ అవార్డు ను ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో వంద శాతం ఎల్‌ఈడీ దీపాలు అమర్చిన తొలి జిల్లా
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎక్కడ : తూర్పు గోదావరి, ఏపీ
ఎందుకు : జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల ఎల్‌ఈడీ దీపాలు అమర్చినందుకు
శ్రీసిటీకి అంతర్జాతీయ అవార్డు
చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీకి ‘గోల్డన్ గ్లోబ్ టైగర్స్’ అంతర్జాతీయ అవార్డు లభించింది. ఇంటిగ్రేటడ్ టౌన్‌షిప్ ఆఫ్ ది ఇయర్-ఇండియా విభాగంలో వచ్చిన ఈ అవార్డును ఏప్రిల్ 23న మలేషియాలో జరిగిన కార్యక్రమంలో శ్రీసిటీ ఫౌండేషన్ అధ్యక్షుడు రమేష్ సుబ్రమణ్యం అందుకున్నారు. అలాగే మలేషియాకు చెందిన యూఎస్‌బీ బొరాల్ కంపెనీ కూడా ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పటికే శ్రీసిటీ రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోల్డన్ గ్లోబ్ టైగర్స్ అంతర్జాతీయ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 23
ఎవరు : శ్రీసిటీ
ఎక్కడ : మలేషియా
తెలంగాణకు ‘ఈ పంచాయతీ’ అవార్డు
తెలంగాణకు జాతీయ స్థాయిలో ‘ఈ పంచాయతీ’ పురస్కారం దక్కింది. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖలోని పలు పథకాల వెబ్‌సైట్లను ఏర్పాటుచేసి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేయడంలో మొదటి స్థానంలో నిలిచినందుకు ఈ అవార్డు దక్కింది. పంచాయతీరాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఏప్రిల్ 24న మధ్యప్రదేశ్‌లోని రాంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ ప్రసాద్ అవార్డును అందుకున్నారు. 2016-17లో పంచాయతీల పనితీరు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు ‘ఈ పంచాయతీ’ అవార్డు
ఎప్పుడు : ఏపిల్ 24
ఎవరు : రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ నీతూప్రసాద్
ఎక్కడ : రామ్‌నగర్, మధ్యప్రదేశ్
ఎందుకు : పంచాయతీరాజ్ శాఖ ఉత్తమ పనితీరును కనబరిచినందుకు
క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏప్రిల్ 21న ప్రకటించారు.
తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు
తెలంగాణలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఏప్రిల్ 20న అధికారిక లేఖ పంపింది. లేఖలో సత్వరమే ఆసుపత్రికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించాలని రాష్ట్రాన్ని సూచించింది.
సింగరేణి సీఎండీకి ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవార్డు
సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆసియా పసిఫిక్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవార్డు వరించింది. ఆసియాలోని వివిధ ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల పనితీరు ఆధారంగా గనులు, ఇంధనం విభాగాల్లో ఉత్తమ ప్రతిభ, అసమాన కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు ఎంటర్‌ప్రైజ్ ఆసియా కంపెనీ ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా పసిఫిక్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ అవార్డు 2018
ఎప్పుడు : ఏప్రిల్ 12
ఎవరు : సింగరేణి సీఎండీ శ్రీధర్
ఎందుకు : గనులు, ఇంధనం విభాగాల్లో ఉత్తమ ప్రతిభ, అసమాన కృషి చేసినందుకు
ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న చంద్రబాబు
సింగపూర్‌లో ఏప్రిల్ 13న జరిగిన ‘ హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్’ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఈశ్వరన్, ఇతరపముఖులతో సమావేశమయ్యారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ కార్యకలాపాలను విస్తరించేందుకు త్వరలో ఏపీకి తమ బృందాన్ని పంపుతామని టోనీ బ్లెయిర్ చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆసియా లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న చంద్రబాబు
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎక్కడ : సింగపూర్
‘డిండి’ ప్రాజెక్టుకు విద్యాసాగర్ రావు పేరు
ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా పరిగణిస్తారు.
‘సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన వివక్షను విద్యాసాగర్‌రావు ఎలుగెత్తి చాటారు. సంక్లిష్టమైన విషయాలను సులువుగా అర్థమయ్యేలా చెప్పి ప్రజలను చైతన్య పరిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు తాగునీరు, తెలంగాణలో బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందివ్వాలనేది ఆయన జీవితాశయంగా ఉండేది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘డిండి’ ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు
ఎప్పుడు : ఏప్రిల్ 14
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాదీ చిన్నారుల ప్రపంచ రికార్డు
హైదరాబాద్‌లోని 28 మంది విద్యార్థులు 11 నెలల్లోనే ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 15న ఎంఎస్ హిఫ్జ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఖురాన్‌లోని వ్యాఖ్యలను పఠించారు. గతంలో ఈ రికార్డు ఈజిప్టు పేరిట ఉండేది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్ చిన్నారుల ప్రపంచ రికార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎందుకు : 11 నెలల్లోనే ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసినందుకు
ప్రముఖ వైద్యుడు ఏపీ రంగారావు కన్నుమూత
108, 104 అంబులెన్స్ సహాయ సేవల వ్యూహకర్త డాక్టర్ అయితరాజు పాండు రంగారావు (75) ఏప్రిల్ 15న కన్నుమూశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన రంగారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శిగా, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి చైర్మన్‌గా, భద్రాచలం ట్రైబల్ ఏరియా ఆస్పత్రి వైద్యాధికారిగా పలు సేవలందించారు. జోగినీ వ్యవస్థ నిర్మూలనకు, వారి పిల్లల చదువుల కోసం విశేషంగా కృషి చేశారు. ‘హాపింగ్ మెమరీస్’ పేరుతో ఈయన ఆత్మకథ కూడా ప్రచురితమైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 108, 104 సేవల వ్యూహకర్త, ప్రముఖ వైద్యుడు కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎవరు : డాక్టర్ అయితరాజు పాండు రంగారావు(75)
ఎక్కడ : హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో
ఎందుకు : కేన్సర్ వ్యాధితో
ఏపీ ఐఎంఏకు జాతీయ అవార్డు
ఉత్తమ సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అవార్డు అందుకుంది. ఏప్రిల్ 15న అహ్మదాబాద్‌లో జరిగిన సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రవి వన్‌కేడ్కర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు కి ఈ అవార్డును అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు జాతీయ అవార్డు
ఎప్పుడు : ఏప్రిల్ 15
ఎందుకు : ఉత్తమ సేవలకు
ఆంధ్రప్రదేశ్ నేర గణాంక నివేదిక-2017
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 12న మంగళగిరిలో రాష్ట్ర నేర గణాంక నివేదిక-2017ను విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో సగటున రోజుకు 311 కేసులు నమోదవుతున్నాయి. 2016తో పోల్చితే 2017లో నేరాలు 19.97 శాతం పెరిగాయి.
భూధార్ కార్యక్రమం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో భూధార్ ప్రయోగాత్మక పథకాన్ని ఏప్రిల్ 11న విజయవాడలో ప్రారంభించారు. దీన్ని కృష్ణా జిల్లా ఉయ్యూరు, జగ్గయ్యపేట మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నారు. భూములు, ఆస్తుల లావాదేవీల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం భూధార్‌ను ప్రారంభించింది.
మక్కా మసీదు పేలుడు కేసు కొట్టివేత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం ఏప్రిల్ 16న కొట్టివేసింది. నిందితులు నేరం చేసినట్టుగా ఆధారాలు చూపలేకపోవడంతో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రవీందర్ రెడ్డి తీర్పు వెలువరించారు.
హైదరాబాద్‌లోని మక్కా మసీదులో 2007 మే 18న జరిగిన బాంబు పేలుడులో తొమ్మిది మంది మరణించగా 58 మంది గాయపడ్డారు. దీనిపై తొలుత స్థానిక పోలీసులు, అనంతరం సీబీఐ, ఎన్‌ఐఏలు దర్యాప్తు చేసి చార్జిషీట్లు దాఖలు చేశాయి.
నిందితులు - అభియోగాలు
దేవేందర్ గుప్తా: మిగతా నిందితులతో కలసి బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడు.
లోకేశ్ శర్మ: మొబైల్ ఫోన్లు సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు.
స్వామి అసీమానంద: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా.. మక్కా మసీదు, అజ్మీర్ దర్గాలలో పేలుళ్లు జరపాలని ప్రతిపాదించాడు.
భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్: పేలుడు కుట్రకు సంబంధించి కీలక పాత్ర పోషించాడు.
రాజేంద్ర చౌదరి: మక్కా మసీదులో బాంబు పెట్టిన ప్రధాన వ్యక్తి. సంరతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు, మాలేగావ్ పేలుళ్ల కేసుల్లోనూ రాజేంద్ర నిందితుడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మక్కా మసీదు బాంబు పేలుడు కేసు కొట్టివేత
ఎప్పుడు : ఏప్రిల్ 16
ఎవరు : ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం
ఎందుకు : పేలుళ్లకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లేనందుకు
ఏపీలో మహిళా రిజర్వేషన్లు కుదింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల రిజర్వేషన్లను కుదించింది. ఓపెన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లలో 1996 నుంచి అమలుచేస్తున్న 33.33 శాతం కోటాలో సవరణలు చేస్తూ ఏప్రిల్ 17 న జీవో జారీ చేసింది. దీంతో మహిళలు ఇకపై మెరిట్ ఉన్నా ఓపెన్, ఆయా రిజర్వ్‌డ్ కేటగిరీ జనరల్ కోటాలో కూడా పోటీపడే అవకాశం లేదు. ఆయా కేటగిరీల్లో నిర్ణీత కోటా ప్రకారమే వారికి పోస్టులు దక్కనున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీలో మహిళా రిజర్వేషన్లు కుదింపు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎమ్మెల్యేల బహిష్కరణ న్యాయ విరుద్ధం: హైకోర్టు
కాంగ్రెస్ ఎమ్యెల్యేలు కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌లను అసెంబ్లీ నుంచి బహిష్కరించ డం న్యాయ విరుద్ధమని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఏప్రిల్ 17న తీర్పునిచింది. ఈ మేరకు మార్చి 13న అసెంబ్లీ జారీ చేసిన ప్రొసీడింగ్‌స, నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. వారికి వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకపోవడం, బహిష్కరణ ప్రొసీడింగ్‌సను అందజేయకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఇది వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని జస్టిస్ బి.శివశంకరరావు వ్యాఖ్యానించారు. 2018 మార్చిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్‌ఫోన్ విసిరి అయనను గాయపరిచారని వీరిని సస్పెండ్ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎమ్మెల్యేల బహిష్కరణ న్యాయ విరుద్ధం: హైకోర్టు
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్
రాష్ట్ర పండుగగా జగ్జీవన్‌రామ్ జయంతి
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ ఏప్రిల్ 4న జీవో జారీ చేశారు. ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలను నిర్వహించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్ర పండుగగా జగ్జీవన్‌రామ్ జయంతి
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్
తెలంగాణ హోంమంత్రికి లోహియా పురస్కారం
రామ్‌మనోహర్ లోహియా 108వ జయంతి సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి లోహియా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఏప్రిల్ 4న రవీంద్రభారతిలో లోహియా విచార్‌మంచ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అయనకు ఈ అవార్డును అందచేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ హోంమంత్రికి లోహియా పురస్కారం
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : నాయిని నర్సింహారెడ్డి
ఏపీలో నాలుగు రైల్వేస్టేషన్‌లకు అంతర్జాతీయ హోదా
ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు రైల్వేస్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లతో పాటు రాయలసీమలోని కర్నూలు, గుంతకల్ కు ఇందులో చోటు దక్కింది. ఒక్కో రైల్వే డివిజన్ నుంచి ఒక స్టేషన్‌ను ఎంపిక చేసి రూ.25 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలనేది రైల్వేశాఖ ఉద్దేశం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో నాలుగు రైల్వేస్టేషన్‌లలో అంతర్జాతీయ హోదా
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : రైల్వేశాఖ
ఎక్కడ : విజయవాడ, గుంటూరు, కర్నూలు, గుంతకల్
ఎందుకు : అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు
కడక్‌నాథ్ కోడి కి జీఐ గుర్తింపు
కడక్‌నాథ్ కోడి మధ్యప్రదేశ్ కు చెందినదే అని చెన్నైలోని భారత మేధోహక్కుల సంస్థ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 6న దానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్‌ను జారీ చేసింది. ఈ కోడి తమదంటూ మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు జీఐకు దరఖాస్తు చేశాయి. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన గ్రామ్ వికాస్ ట్రస్ట్ కడక్‌నాథ్ కోడి జీఐ గుర్తింపు కోసం మొదట రిజిస్ట్రేషన్ చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కడక్‌నాథ్ కోడి మధ్యప్రదేశ్‌కే చెందినదిగా జీఐ గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : భారత మేధోహక్కుల సంస్థ, చెన్నై
హైదరాబాద్‌లో బస్తీ దవాఖానా ప్రారంభం
హైదరాబాద్‌లో నిరుపేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడానికి ఉద్దేశించిన బస్తీ దవాఖానా ఏప్రిల్ 6న ప్రారంభమైంది. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ దవాఖానాను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. నగరంలో ప్రతి 10వేల మందికి ఒక దవాఖానా చొప్పున వెయి్య బస్తీ దవాఖానాలను దశలవారీగా ఏర్పాటు చేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బస్తీ దవాఖానా ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు
ఎక్కడ : మల్కాజ్‌గిరి, హైదరాబాద్
ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు లోక్‌సభ సభ్యులు ఏప్రిల్ 6న రాజీనామా చేశారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి తమ రాజీనామా లేఖలను సభాపతి సుమిత్రా మహాజన్‌కు అందచేశారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఆమరణ దీక్ష ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామా
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాష్‌రెడ్డి
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం
‘ఆకాశం కోల్పోయిన పక్షి’ కవితా సంపుటి ఆవిష్కరణ
జర్నలిస్టు, కవి ఎ.కృష్ణారావు రచించిన ‘ఆకాశం కోల్పోయిన పక్షి’ కవితా సంపుటి ఆవిష్కరణ ఏప్రిల్ 7న హైదరాబాద్ లో జరిగింది. సభకు ముఖ్య అతిథిగా హాజరైన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార దీనిని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆకాశం కోల్పోయిన పక్షి కవితా సంపుటి ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : జర్నలిస్టు, కవి ఎ.కృష్ణారావు
ఎక్కడ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
‘తెలంగాణ చరిత్ర-నూతన కోణం’ పుస్తకావిష్కరణ
ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ రచించిన ‘తెలంగాణ చరిత్ర-నూతన కోణం’ పుస్తకావిష్కరణ ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ ఉద్యమంలో బడుగు, బలహీన వర్గాల పాత్ర, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత తెలంగాణను విలీనం చేసే విషయం, సాయుధ పోరాటం తర్వాత భూస్వాములే పాలించి, దళితులు, మైనారిటీలను అణిచివేతకు గురిచేసిన విధానం, తెలంగాణలోని మిశ్రమ సంస్కృతిని ఈ పుస్తకంలో పొందుపరిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘తెలంగాణ చరిత్ర-నూతన కోణం’ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ
తెలంగాణ యువతుల బైక్ యాత్ర విజయవంతం
తెలంగాణ యువతులు జయభారతి, ప్రియా బహదూర్, శిల్పా బాలకృష్టన్, ఏఎస్‌డీ శాంతి చేపట్టిన సాహసయాత్ర ‘రోడ్ టు మెకాంగ్ ఎక్స్‌పెడిషన్’ ను విజయవంతంగా పూర్తిచేశారు. రెండు నెలల కాలంలో ఆరు దేశాల్లో 17 వేల కిలోమీటర్ల దూరాన్ని మోటార్ బైక్‌పై చుట్టి ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు చేరుకున్నారు. మన దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, కాంబోడియా, బంగ్లాదేశ్‌ల మీదుగా ఈ యాత్ర జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ యువతుల సాహస యాత్ర విజయవంతం
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : జయభారతి, ప్రియా బహదూర్, శిల్పా బాలకృష్టన్, ఏఎస్‌డీ శాంతి
ఎందుకు : తెలంగాణ పర్యాటకాన్ని ప్రచారం చేయడానికి
అమరావతిలో సంతోష నగరాల సదస్సు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సంతోష నగరాల సదస్సు (హ్యాపీ సిటీస్ సమిట్) ఏప్రిల్ 10న ప్రారంభమైంది. సదస్సును ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించాడు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 37 దేశాల నుంచి దాదాపు 1200 మంది ప్రతినిధులు హాజరై అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు పరిష్కార మార్గాలు, ఆవిష్కరణలపై చర్చిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో సంతోష నగరాల సదస్సు
ఎప్పుడు : ఏప్రిల్ 10 - 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : అమరావతి
తెలంగాణ డీజీపీగా మహేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ఎం.మహేందర్ రెడ్డి ఏప్రిల్ 9న నియమితులయ్యారు. ఈ మేరకు 2017 నవంబర్ 12 నుంచి ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీని నియమించుకునే అధికారాన్ని రాష్ట్రానికే కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆయనను నియమించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ డీజీపీ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : ఎం.మహేందర్ రెడ్డి
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : పూర్తిస్థాయి డీజీపీ నియామకంలో భాగంగా
తితిదే చైర్మన్‌గా సుధాకర్ యాదవ్
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. ఏపీఎస్‌ర్‌టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్యను నియమించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 10న ఉత్తర్వులు జారీ చేసింది.
కార్పోరేషన్లు - చైర్మన్‌ల జాబితా
సంస్థ | పేరు | జిల్లా |
తిరుమల తిరుపతి దేవస్థానం | పుట్టా సుధాకర్ యాదవ్ | వైఎస్సార్ కడప |
ఏపీఎస్ ఆర్‌టీసీ | వర్ల రామయ్య | కృష్ణా |
ఆర్‌టీసీ విజయనగరం | తెంటు లక్ష్మీనాయుడు | విజయనగరం |
ఆర్‌టీసీ విజయవాడ | మెంటే పార్థసారథి | పశ్చిమగోదావరి |
ఆర్‌టీసీ నెల్లూరు | సుభాష్‌చంద్రబోస్ | చిత్తూరు |
ఆర్‌టీసీ కడప | చల్లా రామకృష్ణారెడ్డి | కర్నూలు |
ఏపీ గ్రంథాలయ పరిషత్ | దాసరి రాజారావు | గుంటూరు |
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ(శాప్) | పి. అంకమ్మచౌదరి | కృష్ణా |
ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ | నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి | చిత్తూరు |
ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ | డాక్టర్ దివి శివరాం | ప్ర కాశం |
ఏపీ స్టేట్ మైనారిటీస్ కమిషన్ | ఎస్‌ఎం జీయావుద్దీన్ | గుంటూరు |
ఏపీ మైనారిటీ ఫైనాన్‌స కార్పొరేషన్ | ఎండీ హిదాయతుల్లా | గుంటూరు |
ఏపీ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ | వై నాగేశ్వరరావు యాదవ్ | కర్నూలు |
ఏపీ మినిమం వేజెస్ బోర్డు | రఘుపతుల రామ్మోహనరావు | తూర్పుగోదావరి |
ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ | నామన రాంబాబు | తూర్పుగోదావరి |
ఏపీ ఎస్‌సీ కో-ఆపరేటివ్ ఫైనా న్స్ కార్పొరేషన్ | జూపూడి ప్రభాకర్ | ప్రకాశం |
ఏపీ కాపు కార్పొరేషన్ | కొత్తపల్లి సుబ్బారాయుడు | పశ్చిమగోదావరి |
ఏమిటి : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : పుట్టా సుధాకర్ యాదవ్
దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు
దేశంలోని 16 భారతీయ రైల్వే జోన్లలో దక్షిణ మధ్య రైల్వే అగ్రస్థానంలో నిలిచి ప్రతిష్టాత్మక పండిత్ గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డుకు ఎంపికైంది. ప్రయాణికుల సేవలు, మౌలిక సదుపాయాలు, ఆదాయ సముపార్జన తదితర అంశాల్లో సాధించిన ప్రగతికి ఉత్తమ రైల్వేజోన్‌గా గుర్తింపు పొంది ఏడు ప్రధాన విభాగాల్లో అవార్డులనూ దక్కించుకుంది.
లాలాగూడ రైల్వే వర్క్‌షాపు ఉత్తమ వర్క్‌షాపు, విశాఖపట్టణం రన్నింగ్ రూమ్ అత్యుత్తమ రన్నింగ్‌రూమ్‌గా గుర్తింపు పొందాయి. రైల్వేలైన్‌ల విద్యుదీకరణ, డబ్లింగ్, కొత్త లైన్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా రంగంలోనూ మొదటిస్థానంలో నిలిచింది. ఏప్రిల్ 16న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరగనున్న 63వ రైల్వే వారోత్సవాల్లో అవార్డులు స్వీకరించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దక్షిణ మధ్య రైల్వేకు 7 అవార్డులు
ఎప్పుడు : ఏప్రిల్ 10
ఎవరు : ఇండియన్ రైల్వే
ఎందుకు : సేవలు, మౌలిక సదుపాయాలు, ఆదాయ సముపార్జనలో సాధించిన ప్రగతికి
హైదరాబాద్‌లో జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్
తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 9 నుంచి జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. ఏటా ఏప్రిల్‌లో జరిగే ఫంటాస్టిక్ 5 ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా ఈసారి జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. ఈ ఉత్సవంలో అగ్విరా రత్ ఆఫ్ గాడ్ (1972), ఫిజ్కారాల్డో (1981), చోస్ ఫ్రమ్ ఏ సంబర్ ఎంపైర్ (1990), ఫతా మోర్గానా (1970), బెల్స్ ఫ్రమ్ ద డీప్ (1993) అనే 5 చిత్రాలను 5 రోజులపాటు ప్రదర్శిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్‌లో జర్మన్ ఫిల్మ్ ఫెస్టివల్
ఎప్పుడు : 2018 ఏప్రిల్ 9
ఎవరు : తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ
ప్రైవేటు వర్సిటీల బిల్లుకు ఆమోదం
తెలంగాణలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును మార్చి 28న శాసనసభ ఆమోదించింది. ఈ యూనివర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలనే నిబంధనను బిల్లులో పొందుపరిచారు. సామాజిక రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వీటికి వర్తించవు. తెలంగాణ విద్యార్థులకు కూడా ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య అందించే ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చామని, దీనిపై ఎలాంటి ఆందోళన, అపోహ అవసరం లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రైవేటు యూనివర్శిటీల బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : తెలంగాణ శాసనసభ
ఎందుకు : తెలంగాణ విద్యార్థులకు ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య అందించేందుకు
ఏపీలో ఫైళ్ల మార్పిడికి ఈ-ఆఫీస్ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ స్థాయి నుంచి సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లోనే ఫైళ్ల మార్పిడికి ఉద్దేశించిన ఈ-ఆఫీస్ వ్యవస్థ ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరి కానుంది. ఈ మేరకు ఫైళ్లను ఇ-ఆఫీస్ ద్వారానే ఆన్‌లైన్‌లోనే పంపించాలని, ఫిజికల్ ఫైళ్లు ఎవరు పంపినా తీసుకోకూడదని, బయోమెట్రిక్ హాజరునే పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫైళ్ల మార్పిడికి ఈ ఆఫీస్ తప్పనిసరి
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రభుత్వ ఫైళ్లను ఆన్‌లైన్‌లోనే పంపేందుకు
కేజీబీవీలను 12వ తరగతి వరకు విస్తరించాలి: కేబ్ కమిటీ
దేశవ్యాప్తంగా ఉన్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ను 12వ తరగతి వరకు విస్తరించనున్నారు. ఇప్పటివరకు కేజీబీవీల్లో 6, 7, 8 తరగతుల్లో (ఏపీ, తెలంగాణలో పదో తరగతి వరకు) నివాస వసతితో కూడిన విద్యను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇకపై 12వ తరగతి వరకు విద్యను అందించాలని నిర్ణయించింది. దీంతో సామాజిక, ఆర్థిక కారణాల వల్ల డ్రాపవుట్స్‌గా మిగిలిపోతున్న వారి సంఖ్య తగ్గిపోనుంది.
దేశవ్యాప్తంగా బాలికా విద్యకు ప్రోత్సాహం అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై 2017లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) సబ్ కమిటీని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ ఏర్పాటు చేసింది. అస్సాం మంత్రి హేమంత బిస్వాశర్మ, జార్ఖండ్ మంత్రి నీరా యాదవ్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కేజీబీవీలను 12వ తరగతి వరకు కొనసాగించాలని సిఫారసు
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : కేబ్ కమిటీ
ఎక్కడ : దేశ వ్యాప్తంగా
ఎందుకు : డ్రాపవుట్స్‌ని తగ్గించడానికి
కుఫ్టి బహుళార్థ్ధ సాధక ప్రాజెక్టుకు అనుమతి
కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టుకు సమృద్ధిగా నీటి లభ్యతను పెంచే లక్ష్యంతో కుఫ్టి బహుళార్థ్ధ సాధక ప్రాజెక్టును చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుఫ్టి గ్రామం వద్ద 5.32 టీఎంసీల సామర్ధ్యంతో రూ.870 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే, లోయర్ పెన్‌గంగ నదిపై రూ.369 కోట్లతో 1.42 టీఎంసీల సామర్థ్యంతో పిప్పల్‌కోటి, రూ.215 కోట్లతో 0.7 టీఎంసీల సామర్థ్యంతో గోముత్రి రిజర్వాయర్ నిర్మాణానికి కూడా అనుమతిచ్చింది. దీంతో అదిలాబాద్‌లో మొత్తం మూడు కొత్త ప్రాజెక్టులు రానున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కుఫ్టి బహుళార్థ్ధ సాధక ప్రాజెక్టుకు అనుమతి
ఎప్పుడు : త్వరలో
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : అదిలాబాద్
ఎందుకు : కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టుకు నీటి లభ్యతను పెంచేందుకు
ప్రముఖ ఇంజనీర్ ఆచార్య శివాజీరావు కన్నుమూత
ప్రముఖ ఇంజనీర్, ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యుడు తిపిరినేని శివాజీరావు మార్చి 31న మృతి చెందారు. 1932లో కృష్ణాజిల్లా ముదినేపల్లిలో జన్మించిన శివాజీరావు బెంగళూర్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. టెక్సాస్‌లోని రైస్ యూనివర్సిటీలో ఎంఎస్ ఎన్విరాన్‌మెంటల్ సైన్‌స అండ్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. అనంతరం రెండేళ్ల పాటు నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి ఫీల్డ్ ఇంజనీర్‌గా సేవలందించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. ఆచార్యుడిగా, సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, ఏయూ ఇంజ నీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా సేవలందించి పదవీ విరమణ పొందారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును అందుకున్న శివాజీరావు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా, బోర్డు టెక్నికల్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. తాజ్‌మహల్, పోలవరంతో పాటు అనేక పర్యావరణ సంబంధిత అంశాలకు సంబంధించి 85కు పైగా ఆయన రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమయ్యాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రా విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యుడు కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : శివాజీరావు
మూమెంటమ్ ఇండెక్స్‌లో హైదరాబాద్‌కు అగ్ర స్థానం
స్వల్ప కాలంలో వృద్ధి పరంగా అంతర్జాతీయంగా టాప్ 30 నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, పుణె 4, కోల్‌కతా 5, ఢిల్లీ 8, చెన్నై 14, ముంబై 20వ స్థానంలో ఉన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్ (జోన్‌స లాంగ్ లాసల్లే) తెలిపింది. ఈ మేరకు భారత నగరాలు స్వల్పకాలంలో వృద్ధిని సూచించే జేఎల్‌ఎల్ సిటీ ‘మూమెంటమ్ ఇండెక్స్ 2018’ ని జేఎల్‌ఎల్ ఏప్రిల్ 1న విడుదల చేసింది. ఈ సూచీ పట్టణాల ఆర్థిక వృద్ధి, రియల్టీ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మూమెంటమ్ ఇండెక్స్ 2018లో హైదరాబాద్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : జోన్‌స లాంగ్ లాసల్లే
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
తెలంగాణ జన సమితి పార్టీ ఆవిష్కరణ
తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం నేతృత్వంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అసంతృప్త పాలనకు ప్రత్యామ్నాయంగా ‘తెలంగాణ జన సమితి-టీజేఎస్’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు కోదండరాం ఏప్రిల్ 2న ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ జన సమితి పార్టీ ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : ఎం.కోదండరాం
ఎక్కడ : తెలంగాణ
విద్యుదుత్పత్తిలో సింగరేణికి ఐదో స్థానం
మంచిర్యాలలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ) 2017-18లో 91.1 శాతం విద్యుదుత్పత్తి సామర్థ్యం (పీఎల్‌ఎఫ్) సాధించి జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. ఉత్పత్తి ప్రారంభించిన 18 నెలల్లోనే సింగరేణి ఈ రికార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) జాతీయ స్థాయిలో అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల జాబితాను ఏప్రిల్ 2న ప్రకటించింది. ఈ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యం 1200 మెగావాట్లు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విద్యుదుత్పత్తిలో సింగరేణికి 5వ స్థానం
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ)
ఎక్కడ : దేశవ్యాప్తంగా
పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణకు ఆమోదం
పంచాయతీరాజ్ చట్ట సవరణ, పురపాలక చట్ట సవరణ బిల్లులను తెలంగాణ రాష్ట్ర శాసనసభ మార్చి 29న ఆమోదించింది. పంచాయతీలు, మున్సిపాలిటీల స్వరూపాన్ని మార్చేందుకే నూతన చట్టం తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.