Skip to main content

డిసెంబరు 2018 రాష్ట్రీయం

తిరుపతిలో టీసీఎల్ పరిశ్రమకు భూమిపూజ Current Affairs
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏర్పేడు మండలం వికృతమాల వద్ద ఏర్పాటుచేయనున్న టెలీ కమ్యూనికేషన్ లిమిటెడ్ (టీసీఎల్) పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిసెంబర్ 20న భూమిపూజ చేశారు. 158 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమలో టీవీ ప్యానళ్లను తయారుచేయనున్నారు. ప్రస్తుతం టీవీ ప్యానళ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో టీసీఎల్ మూడోస్థానంలో ఉంది.
టీసీఎల్ భూమిపూజ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తిరుపతి సమీపంలోని ఎలక్టాన్రిక్స్ పరికరాల తయారీ కేంద్రాలన్నింటినీ (ఈఎంసీ) కలిపి సిలికాన్ నగరంగా (సిలికాన్ సిటీ) గుర్తిస్తున్నామని ప్రకటించారు. నెల్లూరు- తిరుపతి- చెన్నై కారిడార్‌కు సిలికాన్ కారిడార్‌గా పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు గుంటూరు జిల్లా తాడేపల్లి ఏపీఎన్‌ఆర్టీ కార్యాలయం ఇన్ఫోసైట్ భవనంలో ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 19న ఆరు ఐటీ కంపెనీలను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టెలీ కమ్యూనికేషన్ లిమిటెడ్ (టీసీఎల్) పరిశ్రమకు భూమిపూజ
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : వికృతమాల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్

ఆపరేషనల్ ఓషనోగ్రఫీ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్)లో నిర్మించిన ‘ఇంటర్నేషనల్ ట్రెయినింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓషనోగ్రఫీ కేంద్రం’ ప్రారంభమైంది. కేంద్ర పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ డిసెంబర్ 22న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు భారత్ నిర్మించిన ఈ కేంద్రంలో మహాసముద్రాలపై అధ్యయనం చేసే వారికి శిక్షణ ఇవ్వనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇంటర్నేషనల్ ట్రెయినింగ్ సెంటర్ ఫర్ ఆపరేషనల్ ఓషనోగ్రఫీ కేంద్రం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్
ఎక్కడ : ఇన్‌కాయిస్, హైదరాబాద్

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్
తెలంగాణ 2వ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) డిసెంబర్ 13న ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే రాష్ట్ర హోం మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కేసీఆర్, అలీతో ప్రమాణం చేయించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను చేపట్టిన తొలి ముస్లిం నేతగా అలీ గుర్తింపు పొందాడు. ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రిగా అలీ తమ పదవులకు రాజీనామా చేశారు.
తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చింతమడకలో 1954, ఫిబ్రవరి 17న వెంకటమ్మ, రాఘవరావు దంపతులకు కేసీఆర్ జన్మించాడు. ఎంఏ చదివిన ఆయన యువజన కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు. 1983లో తెదేపాలో చేరిన కేసీఆర్ 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1994 ఎన్టీఆర్ కేబినేట్‌లో కరువు మంత్రి, 1996-1999 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా మంత్రిగా పనిచేశాడు. అలాగే 1999-2001 వరకు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించాడు.
2001లో ఎమ్మెల్యే పదవి, డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి రాజీనామా చేసిన కేసీఆర్ అదే ఏడాది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. 2001 ఉప ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి గెలిచాడు. 2004లో సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి విజయం సాధించాడు. యూపీఏ ప్రభుత్వంలో కార్మికమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2006లో కేంద్రమంత్రి పదవి, కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశాడు. తర్వాత 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా, 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచాడు. 2009లో సిద్ధిపేట నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టాడు. 2014లో ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజైన 2014 జూన్ 2న తొలి సీఎంగా కేసీఆర్ ప్రమాణం చేశాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రెండోసారి సీఎంగా ప్రమాణం చేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)

హైదరాబాద్‌లో యూఏవీ తయారి కేంద్రం ప్రారంభం
హైదరాబాద్‌లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఇజ్రాయేల్‌కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మానవరహిత విమానాల (అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్- యూఏవీ) తయారీ కేంద్రం ప్రారంభమైంది. ‘అదానీ ఎల్బిట్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ కాంప్లెక్స్’ పేరుతో శంషాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని తెలంగాణ హో మంత్రి మహమూద్ అలీ డిసెంబర్ 14న ప్రారంభించారు. దీంతో దేశంలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటైన తొలి యూఏవీగా, ఎల్బిట్ సిస్టమ్స్‌కు ఇజ్రాఝెల్‌కు వెలుపల ఉన్న మొదటి ఉత్పత్తి కేంద్రంగా ఈ వెహికిల్స్ కాంప్లెక్స్ నిలిచింది.
శంషాబాద్ సమీపంలో 20 ఎకరాల్లో ఉన్న అదానీ ఏరోస్పేస్ పార్కులో దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో ఈ యూఏవీ కాంప్లెక్స్‌ను నిర్మించారు. 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కాంప్లెక్స్‌లో హెర్మెస్ 900 యూఏవీ, హెర్మెస్ 450 యూఏవీలకు సంబంధించిన కార్బన్ కాంపోజిట్ ఏరో స్టక్చ్రర్స్‌ను తయారు చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అదానీ ఎల్బిట్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ కాంప్లెక్స్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : తెలంగాణ హో మంత్రి మహమూద్ అలీ
ఎక్కడ : శంషాబాద్, హైదరాబాద్

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
తెలంగాణలో 2013 పంచాయతీ ఎన్నికల్లో ఉన్నట్టుగానే ఈసారి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రిజర్వేషన్లు 50 శాతానికి మించడంతో వీటి అమలుకు వీలుగా ఆర్డినెన్స్ జారీచేసింది. డిసెంబర్ 15 రాత్రి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రతిపాదిత ఆర్డినెన్స్పై సంతకం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. ఈ నేపథ్యంలో ఈ అడ్డంకిని అధిగమించేందుకు ఆర్డినెన్స్ లేదా సభలో బిల్లు పెట్టి చట్టం తేవాలని ప్రభుత్వం భావించింది.
61 శాతానికి రిజర్వేషన్లు...
తెలంగాణలో 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన తండా పంచాయతీలు పూర్తిగా గిజనులకే కేటాయిస్తారు. ఇవి రిజర్వేషన్ల కోటా పరిధిలోకి రావు. ఇక మైదాన ప్రాంతాల్లోని పంచాయతీలకు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలి. దీనిపై ఆరు నెలల క్రితం చేసిన ప్రతిపాదనల ప్రకారం రాష్ట్రంలో రిజర్వేషన్లు 60.19 శాతానికి చేరుకున్నాయి. తాజాగా ఓటరు గణన ప్రకారమైతే ఇవి దాదాపు 61 శాతానికి చేరవచ్చు. సుప్రీంకోర్టు విధించిన పరిమితి కంటే అదనంగా 10 శాతం మేర రిజర్వేషన్లు ఉండటంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎందుకు: పంచాయతీ ఎన్నికల్లో

ఆంధ్రప్రదేశ్‌లో ‘పెథాయ్’ తుపాను
ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 17న ‘పెథాయ్’ తూపాను రెండుసార్లు తీరం దాటింది. మొదటగా కాకినాడ సమీపంలోని తాళ్లరేవు-కాట్రేనికోన మధ్య తీరాన్ని తాకిన పెథాయ్ దిశను మార్చుకుని బంగాళాఖాతంలోకి మళ్లింది. మళ్లీ దిశను మార్చుకున్న తూపాను తూర్పుగోదావరి జిల్లా యానాం-కాకినాడ మధ్య 50-70 కి.మీ. వేగంతో మరోసారి తీరం దాటింది. ఒకే తూపాను రెండుసార్లు తీరం చాలా అరుదుగా జరుగుతుంది.
పెథాయ్ తీరం దాటే ముందు కురిసిన కుండపోత వర్షానికి, ఈదురుగాలులకు కోస్తాంధ్ర జిల్లాలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, సెల్‌టవర్లు నేలకొరిగాయి. మరికొన్నిచోట్ల రోడ్లు ధ్వంసమవడంతోపాటు పూరిళ్లు, రేకుల షెడ్లు నేలకూలాయి. 9.37లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం కలిగింది. మరోవైపు తూపాన్ కారణంగా వీచిన చలిగాలుల చలిగాలుల తీవ్రతను తట్టుకోలేక తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 26మంది మృత్యువాత పడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కోల్లేరు ప్రాంతంతో మేతకు వెళ్లిన సుమారు వెయి్య గొర్రెలు కూడా చలికి తట్టుకోలేక చనిపోయాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తీరం దాటిన పెథాయ్ తుపాను
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎక్కడ : యానాం-కాకినాడ మధ్య, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్

‘పెథాయ్’ తుపాన్ పేరు వెనక...
మొన్న తిత్లి. నిన్న గజ. నేడు పెథాయ్. పేర్లు వేరైనా అవన్నీ ఇటీవల వేర్వేరు రాష్ట్రాల్లో విరుచుకుపడిన తుపానులు. వాతావరణ కేంద్రాల నుంచి వెలువడే సమాచారం ఎలాంటి గందరగోళం లేకుండా ప్రజలకు సవ్యంగా చేరేందుకే తుపానులకు పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఒకే ప్రాంతంలో ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ తుపానులు సంభవిస్తే వాటి మధ్య తేడా, ప్రభావాల్ని గుర్తించేందుకు ఈ పేర్లు ఉపయోగపడతాయి. ఆగ్నేయాసియాలో దేశాలే తుపానులకు పేర్లు పెడుతున్నాయి. ఉదాహరణకు తిత్లి పేరును పాకిస్తాన్, గజను శ్రీలంక సూచించాయి. తాజాగా తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతున్న తుపానుకు పెథాయ్ అని పేరు పెట్టింది థాయిలాండ్. పెథాయ్ అంటే థాయిలాండ్ భాషలో గింజ అని అర్థం. కనీసం 61 కి.మీ. వేగం గాలులతో కూడిన తుపాను సంభవించినప్పుడే పేర్లు పెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుపానులకు పేర్లు పెట్టడం 2004లో ప్రారంభమైంది. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల్లో వచ్చే తుపానులకు వాడిన పేర్లను మళ్లీ ఆరు సంవత్సరాల తరువాత వాడుతారు. ఇందుకోసం కొన్ని దేశాలు సూచించిన పేర్లతో ఒక జాబితాను ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భవిష్యత్తులో సంభవించే తుపాను ఊహించిన దానికన్నా తీవ్రతరమైనా, ఆ పేరు అయోగ్యమైనదని భావించినా దాన్ని జాబితా నుంచి తొలగించి కొత్త పేరు చేర్చుతారు. కానీ ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒకసారి వాడిన పేరును మళ్లీ వాడరు. భవిష్యత్‌లో సంభవించే తుపానులకు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భారత్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, థాయిలాండ్ దేశాలు సూచించిన పేర్లతో ఇప్పటికే జాబితా సిద్ధమైంది. రాబోయే తదుపరి తుపానుకు ఫణి, వాయు, మహా, బుల్‌బుల్‌లలో ఏదో ఒక పేరును పెట్టనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పెథాయ్ తుపాన్
ఎందుకు: తుపానులకు పేర్లు
ఎవరు: ఆగ్నేయాసియాలోని దేశాలు

కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
Current Affairs కేరళలోని కన్నూర్ నగరానికి సమీపంలోని మట్టన్నూర్‌లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం డిసెంబర్ 9న ప్రారంభమైంది. మొదటగా 186 మందితో అబుదాబి వెళ్లనున్న ఎయిర్ ఇండియా విమానంను పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జెండా ఊపి ప్రారంభించారు. దీంతో దేశంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఈ విమానాశ్రయాన్ని ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో నిర్మించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : సురేశ్ ప్రభు, పినరయి విజయన్
ఎక్కడ : మట్టన్నూర్, కన్నూర్, కేరళ

ఏఎన్‌యూలో దస్సాల్ట్ సెంటర్ ప్రారంభం
గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో దస్సాల్ట్ సంస్థ ఏర్పాటు చేసిన త్రీడీ యానిమేషన్ మాస్టర్ సెంటర్ ప్రారంభమైంది. భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్‌తో కలసి ఏపీ నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిసెంబర్ 10న ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్ ద్వారా పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, పలు కళాశాలల్లో జరిగే శిక్షణా తరగతులు పర్యవేక్షించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దస్సాల్ట్ త్రీడీ యానిమేషన్ మాస్టర్ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎక్కడ : ఏఎన్‌యూ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్

 

అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా హరీశ్
2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా తన్నీరు హరీశ్‌రావు నిలిచాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2018లో హరీశ్ సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) పోటీచేసి 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. దీంతో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మేల్యేగా నిలవడంతోపాటు అతిపిన్న వయసులో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తిగా 47 ఏళ్ల హరీశ్ గుర్తింపుపొందాడు. మరోవైపు పోటీ చేసిన ఐదు వరుస ఎన్నికల్లోనూ పోలైన ఓట్లలో 80 శాతానికిపైగా ఓట్లు సాధించి మరో ఘనత సాధించాడు.
ఇప్పటివరకు అతిపిన్న వయసులో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తిగా కేరళకి చెందిన కాంగ్రెస్ నేత కె.ఎం. మణి (49 ఏళ్ల వయసులో) ఉన్నారు.
సిద్దిపేటలో హరీశ్‌రావు మెజారిటీ ఇలా..

ఎన్నిక

మెజారిటీ (ఓట్లు)

2004 ఉప ఎన్నిక

24,594

2008 ఉప ఎన్నిక

58,000

2009 సాధారణ ఎన్నికలు

64,667

2010 ఉప ఎన్నిక

93,858

2014 సాధారణ ఎన్నికలు

95,328

2018 సాధారణ ఎన్నికలు

1,18,699

క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే
ఎప్పుడు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2018
ఎవరు : తన్నీరు హరీశ్‌రావు
ఎక్కడ : సిద్దిపేట, సిద్దిపేట జిల్లా, తెలంగాణ

అమరావతిలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నీరుకొండలోని ఎత్తై కొండపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీనటుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) కాంస్య విగ్రహంను ఏర్పాటుచేయనున్నారు. ఎన్టీఆర్ స్మారక(మెమోరియల్) ప్రాజెక్టులో భాగంగా కొండపై 32 మీటర్ల ఎత్తున నిర్మించే భవనంపై 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ కాంస్యవిగ్రహాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు అమరావతిలో డిసెంబర్ 12న జరిగిన సీఆర్‌డీఏ సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
ఎన్టీఆర్ మెమోరియల్ ప్రాజెక్టు ఆకృతులను ఎల్‌అండ్‌టీకి చెందిన ‘డిజైన్స్ అసోసియేట్స్’ సంస్థ రూపొందించింది. మొత్తం 200 ఎకరాల్లో పర్యాటక ఆకర్షక ప్రదేశంగా ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేసే భవనంలో.. మ్యూజియం, ఆడిటోరియం, కేఫ్, ఫనిక్యులర్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం ఏర్పాటుకు 14 ఎకరాలు కేటాయిస్తారు. ప్రాజెక్టుకు రూ.406 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా వేసింది. ఇందులో చాలావరకు విరాళాల ద్వారా సేకరించేందుకు ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేయనున్నారు. నీరు కొండ చుట్టూ 7080 ఎకరాల్లో జలాశయం నిర్మించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 60 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : నీరుకొండ, అమరావతి, ఆంధ్రప్రదేశ్

నా వోట్’ యాప్ ఆవిష్కరణ
Current Affairs ఓటర్ల సౌలభ్యం కోసం రూపొందించిన ‘నా వోట్ యాప్’ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్ కుమార్ హైదరాబాద్‌లో నవంబర్ 29న ఆవిష్కరించారు. ఈ యాప్‌లో పేరు లేదా ఎపిక్ నంబరు టైప్ చేస్తే... ఓటరుకు సమీపంలో ఉన్న పోలింగ్ బూత్, అధికారుల వివరాలు కనిపిస్తాయి. నా వోట్ ద్వారా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నా వోట్ యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కూమార్
ఎక్కడ : హైదరాబాద్

విశాఖ జైలులో సుధార్’ ప్రారంభం
విశాఖపట్నం కేంద్ర కారాగారంలో వస్తు విక్రయ కేంద్రం ‘సుధార్’ ను జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ ఇండ్ల శ్రీనివాసరావు డిసెంబర్ 3న ప్రారంభించారు. సుధార్ కేంద్రంలో జైలు లోపల పరిశ్రమల్లో ఖైదీలు తయారుచేసిన కలర్ డర్రీస్, డోర్ మేట్స్, యోగా మేట్స్, బెడ్‌షీట్లు, క్లాత్ సంచులు, సెంటెడ్ పినాయిల్, బేకరీ పదార్థాలు, కూరగాయలు విక్రయించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వస్తు విక్రయ కేంద్రం ‘సుధార్’ ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎక్కడ : విశాఖపట్నం కేంద్ర కారాగారం, ఆంధ్ర ప్రదేశ్

గన్నవరంలో ఎయిర్‌పోర్టు టెర్మినల్‌కు శంకుస్థాపన
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులకు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు డిసెంబర్ 4న శంకుస్థాపన చేశారు. సుమారు రూ.611 కోట్ల వ్యయంతో 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ టెర్మినల్‌ను నిర్మించనున్నారు. ప్రస్తుతం విమానాశ్రయంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెర్మినల్స్ వేర్వేరుగా ఉన్నాయి.
అంతర్జాతీయ విమాన సర్వీస్ ప్రారంభం
గన్నవరం విమానాశ్రయం నుంచి తొలి అంతర్జాతీయ విమాన సర్వీస్ డిసెంబర్ 4న ప్రారంభమైంది. సింగపూర్ వెళ్లనున్న ఇండిగో విమాన సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ-320ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు జెండా ఊపి ప్రారంభించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
ఎప్పుడు : డి సెంబర్ 4
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్

ఏపీలో సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్‌లో చైనాకు చెందిన బహుళజాతి సంస్థ, ఎలక్టాన్రిక్స్ దిగ్గజం సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ రూ.500కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో డిసెంబర్ 4న ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో 200 ఎకరాల్లో ఎనిమిది నెలల వ్యవధిలో కంపెనీ ఏర్పాటుచేసి 2019 ఆగస్టులో కెమెరా, లెన్స్, వెహికల్ కెమెరా మాడ్యూల్స్ ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడంపై కంపెనీ ప్రతినిధులకు రాష్ట్ర ఐటీ, ఎలక్టాన్రిక్‌శాఖల మంత్రి లోకేశ్ ధన్యవాదాలు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సన్నీ ఆప్టికల్ టెక్నాలజీస్ రూ.500కోట్ల పెట్టుబడులు
ఎప్పుడు : డి సెంబర్ 4
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 15 Dec 2018 11:51AM

Photo Stories