Animals Protection : కృత్రిమ మేధస్సు.. వన్యప్రాణులకు ఆయుష్షు
వన్యప్రాణుల అభివృద్ధి, కదలికలు, సంతతి అంశాల క్రోడీకరణకు సాంకేతికత రూపొందించడం, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా వివరాలు సేకరించడానికి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌ను ఎంపిక చేసింది.
59 కంపెనీల దరఖాస్తులు..
కృత్రిమ మేధస్సుతో వన్యప్రాణులపై అధ్యయనం చేసే ప్రాజెక్టును చేపట్టడానికి దేశవ్యాప్తంగా టీ ఎయిమ్స్‌కు 59 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆగస్టు 8న ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, అటవీశాఖ పీసీసీఎప్ డోబ్రియాల్, క్యాప్ జెమిని ఇండియా వైస్ ప్రెసిడెంట్ అనురాగ్ ప్రతాప్ సమక్షంలో నిర్వహించిన సదస్సులో థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ కంపెనీ విజేతగా నిలిచి ప్రాజెక్టును దక్కించుకుంది. ఈ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టుకు క్యాప్ జెమిని కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద(సీఎస్‌ఆర్) ప్రోత్సాహకంగా రూ.20 లక్షలు అందజేసింది.
అధ్యయనం చేసే అంశాలు..
థింక్ ఎవాల్వ్ కన్సల్టెన్సీ కంపెనీ కృత్రిమ మేధస్సు ద్వారా వన్యప్రాణుల కదలికలు,వాటి ఆహార అలవాట్లు, సంతతి, వాటి సంఖ్య, అవి ఏ ప్రదేశంలో సంచరిస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, వన్యప్రాణుల సంఖ్యపెరగడానికి, తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తుంది. తాను రూపొందించినసాంకేతికతను వినియోగించి అటవీ శాఖ అధికారుల సహకారంతో అధ్యయనం చేస్తుంది.