Skip to main content

సెప్టెంబర్ 2018 వ్యక్తులు

ఎయిర్ ఇండియా డెరైక్టర్‌గా పురందేశ్వరి
Current Affairs
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బోర్డులో స్వతంత్ర డెరైక్టర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 20న ఉత్తర్వులు జారీ చే సింది. దీంతో ఆమె మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పురందేశ్వరి ప్రస్తుతం మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎయిర్ ఇండియా డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : దగ్గుబాటి పురందేశ్వరి

జపాన్ ప్రధానిగా షింజో అబే
జపాన్ ప్రధానమంత్రిగా షింజో అబే మరోసారి ఎన్నికయ్యారు. జపాన్‌లోని అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ)కి సెప్టెంబర్ 20న జరిగిన ఎన్నికల్లో మెత్తం 807 ఓట్లకుగానూ అబే 553 ఓట్లను దక్కించుకొని విజయం సాధించారు. దీంతో ఆయన 2021, ఆగస్టు వరకు జపాన్ ప్రధానిగా కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో అబే ప్రత్యర్థి, మాజీ రక్షణమంత్రి షిగెరు ఇషిబాకు 254 ఓట్లు లభించాయి. ప్రధాని పదవికి అబే ఎన్నికావడం ఇది మూడోసారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జపాన్ ప్రధానమంత్రి ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : షిజో అబే

వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ కన్నుమూత
వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ (61) అనారోగ్యం కారణంగా వియత్నాం రాజధాని హనొయిలో సెప్టెంబర్ 21 కన్నుమూశారు. 2016 ఏప్రిల్‌లో వియత్నాం అధ్యక్షుడిగా క్వాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకంటే ముందు 4 దశాబ్దాల పాటు ప్రజా భద్రత మంత్రిగా పనిచేసిన క్వాంగ్ మరో నాలుగు దేశ అత్యున్నత పదవుల బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న క్వాంగ్.. పార్టీ అంతర్గత వర్గాల్లో మంచి ప్రభావవంతమైన, గట్టి నేతగా పేరు సంపాదించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వియత్నాం అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 21
ఎవరు : ట్రాన్ డాయ్ క్వాంగ్ (61)
ఎక్కడ : హనొయి, వియత్నాం
ఎందుకు : అనారోగ్యం కారణంగా

అక్షర యోధుడు ప్రకాశ్’ అస్తమయం
అభ్యుదయ కవి, కథా రచయిత చైతన్య ప్రకాశ్ (50) సెప్టెంబర్ 22 సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా పక్షవాతంతో బాధ పడుతున్నారు. సాహిత్యమే ఊపిరిగా జీవించిన చైతన్యప్రకాశ్.. చేతిలో చిల్లిగవ్వలేకుండా అసహాయ స్థితిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. ఆయన శక్తివంతమైన సామాజిక అంశాలపై కథలు, కవిత్వం రాశారు. ఆయన సొంత ఊరు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్. సామాజిక చైతన్యానికి, వామపక్ష భావజాలంతో పాతికేళ్లుగా సాహిత్యాన్ని అందించిన ప్రకాశ్ అవివాహితులు. షుగర్ కారణంగా ఆయన కాలును తొలగించారు. ఒంటికాలితో మృత్యువుతో పోరాడిన ప్రకాశ్ తుదిశ్వాస విడిచారు.
చైతన్య ప్రకాశ్ ఎంఏ తెలుగు చదివారు. 15 ఏళ్లపాటు స్వగ్రామంలోనే ప్రైవేటు టీచర్‌గా విద్యాబోధన చేశారు. పాతికేళ్లుగా శక్తివంతమైన కథలను, కవిత్వాన్ని రాశారు. ఆయన ఇటీవల ఆరు వేల తెలంగాణ సామెతల పుస్తకాన్ని రాయగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆవిష్కరించింది. మరుగున పడిపోయిన తెలంగాణ పల్లెపదాలను, సామెతలను ఆయన అక్షరీకరించారు. గతంలో ‘రేణ’, ‘మూయని దర్వాజ’, ఆమె’వంటి పుస్తకాలను వెలువరించారు. కొండాపూర్ నుంచి ఏడు కిలోమీటర్లు నిత్యం నడిచి వెళ్లి గ్రంథాలయంలో పుస్తకాలు అభ్యసించారు. 14 ఏళ్లపాటు నిత్యం ఈ ప్రయాణం కొనసాగింది. ఒక దశలో పోలీసులు చైతన్య ప్రకాశ్ సాహిత్యంపై కన్నెర్ర జేసి నిర్బంధించి కొట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటీ : అభ్యుదయ కవి, కథా రచయిత చైతన్య ప్రకాశ్ అస్తమయం
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : చైతన్య ప్రకాశ్
ఎక్కడ : రాజన్న సిరిసిల్ల జిల్లా, ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామం

వార్మ్స్ ఎడిటర్‌గా భారతీయుడు
‘వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెరైన్ స్పీసిస్’ (వార్మ్స్) ఎడిటర్‌గా భారత్‌కి చెందిన బయోస్పీయాలజిస్ట్ డాక్టర్ షాబుద్దీన్ షేక్ సెప్టెంబర్ 24న నియమితులయ్యారు. దీంతో ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయుడిగా షాబుద్దీన్ నిలిచాడు. ప్రస్తుతం ఆచార్య నాగార్జున వర్సిటీలో జంతుశాస్త్ర పరిశోధకుడిగా షాబుద్దీన్ పనిచేస్తున్నాడు. గుంటూరు జిల్లాకి చెందిన షాబుద్దీన్ ప్రకృతి సహజ గుహల్లో దాగిఉన్న జీవజాతులపై పరిశోధనలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు 40 కొత్త జీవులను కనుగొన్నారు. అందులో ఒక జీవికి ‘ఆంధ్రా కొయిడస్ షాబుద్దీన్’గా నామకరణం చేశారు.
2008లో బెల్జియంలోని ఓస్టెండ్ నగరంలో ఏర్పాటైన వార్మ్స్ సంస్థ భూమిపైనున్న జంతు జాతుల పేర్ల జాబితాతో కూడిన డేటాబేస్‌ను నిర్వహిస్తుంది. ‘బేథినిల్లేసియా’ అనే నీటి కీటక జాతికి ప్రాతినిథ్యం వహిస్తూ, కొత్త జాతులు, అధికారిక సమాచారం, ఆసక్తికరమైన ప్రాంతీయ జాతుల కొరత, వాటి ఆవాసాలు వంటి అదనపు సమాచారాన్ని పొందుపరిచేందుకు వార్మ్స్ తో షాబుద్దీన్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వార్మ్స్ ఎడిటర్ గా భారతీయుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : డాక్టర్ షాబుద్దీన్ షేక్

మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ సోలిహ్
మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 23న వెలువడ్డ ఎన్నికల ఫలితాల ప్రకారం విపక్షాల అభ్యర్థి సోలిహ్ 58.3 శాతం ఓట్లు దక్కించుకొని విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు, భారత్ విరోధిగా పేరుపడ్డ అబ్దుల్లా యామీన్‌కు 41.7 శాతం ఓట్లు వచ్చాయి. యామీన్ 2013లో అధికారంలోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన సోలిహ్ భారత్ అనుకూలవాది పేరుపడ్డారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాల్దీవుల నూతన అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : ఇబ్రహీం మహ్మద్ సోలిహ్

ఫోర్బ్స్ టైకూన్స్ జాబితాలో సింధు, ఉపాసన
ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ రూపొందించిన ఫోర్బ్స్ టైకూన్స్ జాబితాలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, అపోలో లైఫ్ ఎండీ ఉపాసన కామినేని కి చోటు లభించింది. దీంతో ఈ జాబితాలో స్థానం లభించిన ఏకైక క్రీడాకారిణిగా సింధు నిలిచింది. క్రీడా, వ్యాపార, నటనా రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన 22 మంది భారత యువ సాధకులతో రూపొందించిన ఈ జాబితాను సెప్టెంబర్ 24న విడుదల చేశారు.
నికర సంపద విలువతో పాటు పలు అంశాల ప్రాతిపదికన తయారు చేసిన ఈ జాబితాలో డిస్కౌంటు బ్రోకింగ్ సంస్థ జీరోధా వ్యవస్థాపకులు నిఖిల్ కామత్.. నితిన్ కామత్, ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్, యస్ బ్యాంక్ సీఈవో రాణా కపూర్ కుమార్తె రాధా కపూర్ ఖన్నా తదితరులకు చోటు లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ టైకూన్స్ జాబితాలో పీవీ.సింధు, ఉపాసన కామినేని
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్
ఎక్కడ : భారత్‌లో

సియారామ్ బ్రాండ్ అంబాసిడర్‌గా రణ్‌వీర్ సింగ్
సియారామ్ సిల్క్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు కంపెనీ సీఎండీ రమేష్ పొద్దార్ సెప్టెంబర్ 24న ప్రకటించాడు. ఈ సందర్భంగా నాలుగు దశాబ్ధాలుగా పురుషుల ఫ్యాషన్స్ లో తనదైన ముద్ర వేసిన సియారామ్.. సరికొత్త ఆవిష్కరణలు, అంతర్జాతీయ డిజైన్లను తీసుకొస్తున్నదని రమేష్ అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సియారామ్ సిల్క్స్ బ్రాండ్ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : రణ్‌వీర్ సింగ్

ఐరాసలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు
ఐక్యరాజ్యసమితిలో జరుగుతున్న సదస్సులో ‘సుస్థిర సేద్యం-ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 25న ప్రసంగించారు. 8 మిలియన్ల హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో 28 శాతం వ్యవసాయ రంగానిది కాగా రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయం, అనుబంధ రంగాలు జీవనాధారంగా ఉన్నాయని పేర్కొన్నారు.
వచ్చే ఐదేళ్లలో రైతాంగాన్ని 100 శాతం ప్రకృతి వ్యవసాయం (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) వైపు మళ్లించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చంద్రబాబు చెప్పారు. 2020 నాటికి 1.7 మిలియన్ల రైతులు, 2022 నాటికి 4.1 మిలియన్ల రైతులను ఈ సేద్యం వైపు మళ్లించేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. స్వయంసహాయక బృందాల గురించి కూడా ఆయన మాట్లాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాసలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగం
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎందుకు : సుస్థిర సేద్యం-ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు అనే అంశంపై

దేశంలో అత్యంత సంపన్నుడిగా అంబానీ
దేశంలో అత్యంత సంపన్నుడిగా పారిశ్రామిక వేత్త, రిలయన్‌‌స ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ నిలిచారు. ఈ మేరకు సుమారు రూ.1,000 కోట్లకు పైగా సంపద గల సంపన్న భారతీయులతో రూపొందించిన ‘బార్‌క్లేస్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2018’ సెప్టెంబర్ 25న విడుదలైంది. ఈ జాబితాలో దాదాపు రూ.3,71,000 కోట్ల సంపదతో అంబానీ వరుసగా ఏడోసారి అగ్రస్థానం దక్కించుకోగా రూ. 1,59,000 కోట్లతో హిందుజా కుటుంబం రెండో స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య 2017లో 617 ఉండగా ఈసారి 831కి చేరిందని హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ రెహ్మాన్ జునైద్ తెలిపారు. వీరందరి సంపద కలిపితే 719 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఇది దాదాపు 25 శాతం. హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2018లో ఒరావెల్ స్టేస్ (ఓయో రూమ్స్) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (24 ఏళ్లు) అత్యంత పిన్నవయస్కుడు కాగా.. ఎండీహెచ్ మసాలా వ్యవస్థాపకుడు ధరమ్ పాల్ గులాటి (95 సంవత్సరాలు) అత్యంత పెద్ద వయస్కుడు. ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,000 కోట్లకు పైబడిన సంపద గల వారు దాదాపు 46 మందికి పైగానే ఉన్నారు.
ముంబై టాప్...
అత్యంత సంపన్నులు (రూ.1,000 కోట్లు పైగా సంపద గల వారు) ఉన్న నగరాల జాబితాలో 233 మందితో ముంైబె మొద టి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 163 మంది సంపన్నులతో న్యూఢిల్లీ రెండో స్థానం పొందగా 70 మందితో బెంగళూరు మూడోస్థానంలో ఉంది.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2018

ర్యాంకు

పేరు

సంపద (రూ. కోట్లలో)

1

ముకేశ్ అంబానీ

3,71,000

2

హిందుజా కుటుంబం

1,59,000

3

ఎల్‌ఎన్ మిట్టల్

1,14,500

4

అజీం ప్రేమ్‌జీ

96,100

5

దిలీప్ సంఘ్వీ

89,700

6

ఉదయ్ కొటక్

78,600

7

సైరస్ పూనావాలా

73,000

8

గౌతమ్ అదానీ

71,200

9

సైరస్ మిస్త్రీ

69,400

10

షాపూర్‌జీ పల్లోంజీ

69,400

తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి పది మంది

ర్యాంకు

పేరు

సంపద (రూ.కోట్లలో)

1

పి. పిచ్చిరెడ్డి (మేఘా ఇంజినీరింగ్)

13,000

2

బి.పార్థసారథి రెడ్డి (హెటెరో)

12,800

3

పి.వి.కృష్ణారెడ్డి (మేఘా ఇంజినీరింగ్)

12,400

4

జూపల్లి రామేశ్వరరావు (మైహోమ్)

8,100

5

బి.వంశీకృష్ణ (హెటెరో)

7,800

6

వి.సి. నన్నపనేని (నాట్కో ఫార్మా)

7,000

7

నీలిమ మోటపర్తి (దివీస్ ల్యాబ్స్)

6,800

8

దివి సచ్ఛంద్ర కిరణ్ (దివీస్)

5,800

9

ఎం.సత్యనారాయణరెడ్డి (ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్)

5,000

10

మండవ ప్రభాకరరావు (నూజివీడు సీడ్స్)

4,100

క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యంత సంపన్నుడి గా ముఖే శ్ అంబానీ
ఎప్పుడు : సెప్టెంబర్ 25
ఎవరు : బార్‌క్లేస్ ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్-2018’

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఎండీగా విభ పదాల్కర్
Current Affairs హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓగా విభ పదాల్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు మూడేళ్లపాటు పదాల్కర్ పదవిలో కొనసాగుతారని సెప్టెంబర్ 12న కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ), ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పదాల్కర్ సెప్టెంబర్ 13న మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓగా ఉన్న అమితాబ్ చౌదరి సెప్టెంబర్ 8న తన పదవికి రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : విభ పదాల్కర్

తదుపరి సీజేఐగా జస్టిస్ రంజన్ గొగొయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగొయ్ నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ సెప్టెంబర్ 13న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న పదవీవిరమణ చేయనుండటంతో 46వ సీజేఐగా అక్టోబర్ 3న జస్టిస్ గొగొయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 2019 నవంబరు 17 వరకు జస్టిస్ గొగొయ్ సీజేఐగా కొనసాగనున్నారు.
1954లో అసోంలో జన్మించిన జస్టిస్ రంజన్ గొగొయ్ 1978లో బార్ అసోసియేషన్‌లో చేరారు. 2001 ఫిబ్రవరి 28న గువాహాటి హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం 2010 సెప్టెంబరులో పంజాబ్, హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన గొగొయ్ 2011 ఫిబ్రవరిలో అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012, ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
కేసుల కేటాయింపులో సీజేఐ జస్టిస్ మిశ్రా వ్యవహరిస్తున్న తీరును విమర్శిస్తూ 2018 జనవరిలో విలేకర్ల సమావేశం నిర్వహించిన నలుగురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తుల్లో జస్టిస్ గొగొయ్ కూడా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 13
ఎవరు : జస్టిస్ రంజన్ గొగొయ్

ఏబీసీ చైర్మన్‌గా హొర్మూస్‌జీ కామా
ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ) 2018-19కి చైర్మన్‌గా ముంబై సమాచార్ డెరైక్టర్ హొర్మూస్‌జీ కామా సెప్టెంబర్ 14న ఎన్నికయ్యారు. 2018-19 సంవత్సరానికి కామా పదవిలో కొనసాగుతారు. గతంలో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్), ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ), మీడియా రీసెర్చ్ యూజర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. ఏబీసీ డిప్యూటీ చైర్మన్‌గా డీడీబీ ముద్ర ప్రైవేట్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మధుకర్ కామత్ ఎన్నిక య్యారు. అలాగే గౌరవ కార్యదర్శిగా దేవేంద్ర వి.గుప్తా (లోక్‌మత్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్), సెక్రటరీ జనరల్‌గా హొర్మూజ్ద్ మసానీ ఎన్నికయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (ఏబీసీ చైర్మన్ ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 14
ఎవరు : హొర్మూస్‌జీ కామా

కిలిమంజారోని అధిరోహించిన గుంటూరు యువకుడు
టాంజానియా దేశంలోని కిలిమంజారో పర్వతాన్ని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామానికి చెందిన దారా తిరుమలరావు అనే యువకుడు అధిరోహించాడు. సెప్టెంబర్ 13న పర్వతారోహణ ప్రారంభించిన తిరుమలరావు సెప్టెంబర్ 16న పర్వతాన్ని అధిరోహించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కిలిమంజారోని అధిరోహించిన గుంటూరు యువకుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 16
ఎవరు : దారా తిరుమలరావు

చంద్రుడిపైకి వెళ్లే తొలి పర్యాటకుడు
చంద్రుడిపైకి వెళ్లే తొలి పర్యాటకుడిగా జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్ట్ క్యురేటర్, వ్యాపార వేత్త యుసాకు మేజావా నిలిచారు. ఈ మేరకు 2023లో బీఎఫ్‌ఆర్ అనే వాహనం ద్వారా మేజావాను చంద్రుడిపైకి పంపనున్నట్లు ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ సెప్టెంబర్ 18న తెలిపింది.
చంద్రుడిపైకి పర్యాటకులను పంపించాలనే ఉద్దేశంతో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ బీఎఫ్‌ఆర్ అనే వాహనంను రూపొందించింది. ఈ ప్రయాణంలో జపాన్‌లోని అతిపెద్ద ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైల్ వెబ్‌సైట్ జోజోటైన్‌కు అధినేత అయిన యుసాకు తోడుగా తన కంపెనీలోని మరో ఎనిమిది మంది ఆర్టిస్టులు తోడు వెళ్లనున్నారు. వీరి అంతరిక్షయానం ఆరు రోజుల పాటు చంద్రమండలంలో 125 మైళ్లు సాగనుంది.
చంద్రుడిపై ఇప్పటి వరకు సుమారు 24 మంది మానవులు అడుగు పెట్టారు. అయితే వీరందరూ పరిశోధనల్లో భాగంగా అక్కడికి వెళ్లిన వ్యోమగాములే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చంద్రుడిపైకి వెళ్లే తొలి పర్యాటకుడు
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : యుసాకు మేజావా

మాజీ ఫుట్‌బాలర్ లతీఫుద్దీన్ కన్నుమూత
అంతర్జాతీయ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, తెలంగాణ పది జిల్లాల ఫుట్‌బాల్ సంఘం అదనపు కార్యదర్శి సయ్యద్ లతీఫుద్దీన్ (నజమ్) (65) అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో సెప్టెంబర్ 19న కన్నుమూశారు. ఫుట్‌బాల్ జాతీయ టోర్నీ సంతోష్ ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన లతీఫుద్దీన్ ఆ తర్వాత భారత జాతీయ జట్టుకు కూడా ఆడారు. లతీఫుద్దీన్ తండ్రి నూర్ మొహమ్మద్ కూడా ఫుట్‌బాల్ క్రీడాకారుడే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ మాజీ ఫుట్‌బాలర్ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : సయ్యద్ లతీఫుద్దీన్ (నజమ్) (65)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూత
పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య సతీమణి, మహిళా హక్కుల పోరాటయోధురాలు, తొలితరం కమ్యూనిస్టు ఉద్యమనేత, రచయిత, కొండపల్లి కోటేశ్వరమ్మ (99) కన్నుమూశారు. బ్రెయిన్‌ో్టక్ ్రకారణంగా విశాఖపట్నంలో సెప్టెంబర్ 19న ఆమె తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పామర్రులో సుబ్బారెడ్డి, అంజమ్మ దంపతులకు 1918లో కోటేశ్వరమ్మ జన్మించారు. ఐదేళ్ల వయస్సులోనే మేనమామ వీరారెడ్డితో బాల్యవివాహం చేశారు. అయితే పెళ్లయిన రెండేళ్లకే భర్త మరణించటంతో కొండపల్లి సీతారామయ్యను తన 18వ ఏట కోటేశ్వరమ్మ వివాహం చేసుకున్నారు. వారికి కుమార్తె కరుణ, కుమారుడు(చంద్రశేఖర్ ఆజాద్) జన్మించారు. చంద్రశేఖర్ ఆజాద్ కూడా విప్లవోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు.
వివాహమైన కొన్నేళ్లకు సీతారామయ్య పీపుల్స్‌వార్ గ్రూప్‌ను స్థాపించారు. అయితే కొన్ని రోజుల తర్వాత కోటేశ్వరమ్మ వదిలి సీతారామయ్య పిల్లలతో కలిసి వరంగల్ వెళ్లిపోయారు. అనంతర కాలంలో హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళాసభలో మెట్రిక్ చదివిన కోటేశ్వరమ్మ కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల మహిళా హాస్టల్‌లో మేట్రిన్‌గా చేరారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధాలున్న ఆమె ప్రజానాట్యమండలి కార్యక్రమాలు, మహిళాసంఘాల నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నారు. పలు రేడియో నాటకాలు, కథలను రాసిన ఆమె మంచి కవిగా గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలితరం కమ్యూనిస్టు ఉద్యమ నేత కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : కొండపల్లి కోటేశ్వరమ్మ (99)
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

పది ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోల నియామకం
దేశంలోని పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త ఎండీ, సీఈవోలు నియమితులయ్యారు. ఈ మేరకు నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సెప్టెంబర్ 19న ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఎండీ, సీఈవో లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్లు ఐదుగురు ఉన్నారు.
ఎస్‌బీఐ కి చెందిన వారు...
  • ఆంధ్రాబ్యాంక్: జే. పకీర్‌సామి. 2021 ఫిబ్రవరి 28 పదవీ విరమణ వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు.
  • సిండికేట్ బ్యాంక్: మృత్యుంజయ్ మహాపాత్ర. పదవీకాలం పూర్తయ్యే వరకూ అంటే 2020 మే 31 మహాపాత్ర ఈ బాధ్యతలను నిర్వహిస్తారు.
  • ఇండియన్ బ్యాంక్: పద్మజా చంద్రూ. 2021, ఆగస్టు 31న చంద్రూ పదవీ విరమణ చేస్తారు.
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: పల్లవ్ మహాపాత్ర. 2021 ఫిబ్రవరి వరకూ ఉంటారు.
  • దేనా బ్యాంక్: కర్నమ్ శేఖర్. 2020, జూన్ 30 వరకూ బాధ్యతలు నిర్వహిస్తారు.
ఇతర బ్యాంకులకు చెందిన వారు...
  • అలహాబాద్ బ్యాంక్: ఎస్‌ఎస్ మల్లికార్జునరావు. తొలి బాధ్యతల కాలపరిమితి మూడేళ్లు. అయితే ఆయన పదవీ విరమణ సమయం 2022 జనవరి 31 వరకూ బాధ్యత కాలపరిమితిని పొడిగించే వీలుంది. ప్రస్తుతం ఆయన సిండికేట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఏఎస్ రాజీవ్. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీ కాలం మూడేళ్లు. మంచి పనితనం కనబరిస్తే, పదవీకాలం మరో రెండేళ్లు పొడిగించవచ్చు.
  • యూకో బ్యాంక్: అతుల్ కుమార్ గోయెల్. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా పనిచేస్తున్నారు.
  • పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్: ఎస్. హరి శంకర్. అలహాబాద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
  • యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: అశోక్ కుమార్ ప్రధాన్, ప్రస్తుతం ఇదే బ్యాంకులో అశోక్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఆర్‌బీఐ స్థానిక బోర్డ్‌ల నియామకాలు...
రిజర్వ్ బ్యాంక్ స్థానిక బోర్డుల సభ్యుల నియామకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో దక్షిణ(రాకేష్ జైన్), ఉత్తర (రేవతీ అయ్యర్, రాఘవేద్ర నారాయణ్ దుబే), తూర్పు (ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది) ప్రాంత బోర్డులు ఉన్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పది ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈవోల నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 19
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా డేనియల్ జాంగ్
Current Affairs ఈ కామర్స్ సంస్థ అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఆ సంస్థ సీఈఓ డేనియల్ జాంగ్ నియమితులయ్యారు. ఈ మేరకు 2019 సెప్టెంబర్ 10న జాంగ్ పదవీ బాధ్యతలు చేపడతారని అలీబాబా కంపెనీ సెప్టెంబర్ 10న వెల్లడించింది. ప్రస్తుతం అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్న జాక్ మా తన పదవీ నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు. అయితే 2020లో జరిగే సర్వసభ్య సమావేశం వరకు తాను కంపెనీ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లలో ఒకడిగా కొనసాగుతానని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : డేనియల్ జాంగ్

అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం
ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌కు తెలంగాణ ప్రభుత్వం కాళోజీ నారాయణరావు పేరుతో ఏటా అందించే సాహితీ పురస్కారం-2018 లభించింది. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సెప్టెంబర్ 9న జరిగే కార్యక్రమంలో నవీన్‌కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.
1941లో వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో జన్మించిన అంపశయ్య నవీన్ నల్లగొండ, కరీంనగర్, వరంగల్‌లలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 1965-1968 మధ్య కాలంలో తెలుగు నవల ‘అంపశయ్య’ ను నవీన్ రచించారు. ఆయన రాసిన మొదటి నవల అంపశయ్య 1969లో తొలిసారి ప్రచురితమైంది. చైతన్య స్రవంతి విధానంలో రాసిన అంపశయ్య నవల పేరే నవీన్ ఇంటిపేరుగా మారింది. 2004లో కాలరేఖలు రచనకు గాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 2004లో కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న నవీన్ గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహాదారుడిగా వ్యవహరించారు. నవీన్ రాసిన కథల్లో చెర, బలి, దాడి ప్రముఖమైనవి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం-2018
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : అంపశ య్య నవీన్

షేడ్స్ ఆఫ్ ట్రూత్ పుస్తకావిష్కరణ
కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ రాసిన ‘షేడ్స్ ఆఫ్ ట్రూత్-ఏ జర్నీ డిరైల్డ్’ పుస్తకాన్ని ఢిల్లీలో సెప్టెంబర్ 7న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పరిరక్షించాల్సిన విలువలను నిదానంగా, పూర్తిస్థాయిలో నాశనం చేస్తోందని అన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : షేడ్స్ ఆఫ్ ట్రూత్-ఏ జర్నీ డిరైల్డ్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 7
ఎవరు : కాంగ్రెస్ నేత కపిల్ సిబల్
ఎక్కడ : ఢిల్లీ

యాక్సిస్ బ్యాంక్ సీఈఓగా అమితాబ్ చౌదరి
యాక్సిస్ బ్యాంకు కొత్త సీఈఓ, ఎండీగా అమితాబ్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు అమితాబ్ చౌదరి నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపినట్లు యాక్సిస్ బ్యాంక్ సెప్టెంబర్ 8న వెల్లడించింది. దీంతో 2019 జనవరి 1న బాధ్యతలు చేపట్టనున్న అమితాబ్ 2021 డిసెంబర్ 31 వరకు పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంకు సీఈఓగా ఉన్న శిఖా శర్మ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. 2010 జనవరి నుంచి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఎండీగా అమితాబ్ చౌదరి కొనసాగుతున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యాక్సిస్ బ్యాంకు సీఈఓ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 8
ఎవరు : అమితాబ్ చౌదరి

మాజీ ఎంపీ మణెమ్మ కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే టి.మణెమ్మ (75) అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9న కన్నుమూశారు. 1986లో సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న టి.అంజయ్య మరణించడంతో జరిగిన పార్లమెంట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మణెమ్మ పోటీచేసి విజయం సాధించారు. 1989లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రెండవ సారి ఎంపీగా తెలంగాణ నుంచి ఎన్నికయ్యారు. అలాగే 2008లో ముషీరాబాద్ అసెంబ్లీకి జరిగిన ఉపఎన్నికల్లోనూ మణెమ్మ గెలిచారు. అనంతరం 2009లో మళ్లీ ముషీరాబాద్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ ఎంపీ కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 9
ఎవరు : టి.మణెమ్మ (75)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

ఎగ్జామ్ వారియర్స్’ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ
విద్యారులు పరీక్షలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రచించిన ‘ఎగ్జామ్ వారియర్స్’ తెలుగు అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సెప్టెంబర్ 11న ఎమెస్కో విజయకుమార్ ఆధ్వర్యంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తొలి ప్రతిని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకి అందజేశారు.
పుస్తకావిష్కరణ సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్ మాట్లాడుతూ... ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం ఒక విశిష్టమైన అనుభవం అని చెప్పారు. ఏ దేశ ప్రధాని కూడా విద్యార్థుల కోసం పుస్తకం రాయలేదని అన్నారు. ఈ పుస్తకాన్ని అందరూ చదివి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని సూచించారు. ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం దేశంలోని 14 భాషల్లోకి అనువదించబడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘ఎగ్జామ్ వారియర్స్’ తెలుగు అనువాద పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
ఎక్కడ : రవీంద్ర భారతి, హైదరాబాద్

హీరోమోటో కార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీ
ద్విచక్ర వాహన సంస్థ హీరోమోటో కార్ప్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నియమితులయ్యారు. ఈ మేరకు మొదటగా ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ప్రీమియం మోటార్‌సైకిల్‌కు కోహ్లీ ప్రచారం చేస్తారని హీరో సీఈఓ పవన్ ముంజాల్ ఢిల్లీలో సెప్టెంబర్ 11న ప్రకటించారు. సెప్టెంబర్ 12న విడుదలైన 200ఆర్ బైక్ ధర రూ.89,900గా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హీరోమోటో కార్ప్ బ్రాండ్ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : విరాట్ కోహ్లీ

ఐబీఏ చైర్మన్‌గా సునీల్ మెహతా
Current Affairs ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డెరైక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. ఈ మేరకు 2018-19 కాలానికి మెహతాను చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు నిర్వహణ కమిటీ ఆగస్టు 31 ప్రకటించింది. అలాగే ఐబీఏ డిప్యూటీ చైర్మన్‌గా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్రను కమిటీ ఎన్నుకుంది. ప్రస్తుతం ఐబీఏ డిప్యూటీ చైర్మన్లుగా ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్ ఎంపిక
ఎప్పుడు : ఆగస్టు 31
ఎవరు : సునీల్ మెహతా

దర్శకురాలు జయ కన్నుమూత
టాలీవుడ్ దర్శకురాలు బి. జయ(54) గుండెపోటు కారణంగా ఆగస్టు 30న హైదరాబాద్‌లో కన్నుమూశారు. తెలుగు పరిశ్రమలో అతి తక్కువ మంది మహిళా దర్శకుల్లో ఒకరైన జయ డైనమిక్ దర్శకురాలిగా పేరొందారు.
1964 జనవరి 11న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామంలో నర్సింహరాజు, విమలాదేవి దంపతులకు జయ జన్మించారు. విజయవాడ మాంటిస్సోరిలో పదవ తరగతి వరకు చదివిన జయ చెన్నై యూనివ ర్శిటీలో యం.ఎ ఇంగ్లీష్, అన్నామలై యూనివర్శిటీలో యం.ఎ సైకాలజీ పూర్తి చేయడంతో పాటు జర్నలిజంలో డిప్లొమా కూడా సంపాదించారు. 1986లో పాత్రికేయ వృత్తిని ప్రారంభించిన ఆమె పలు ప్రముఖ పత్రికల్లో పని చేశారు. మరోవైపు కథలు, నవలలు కూడా రాసేటువంటి జయ సుమారు 50కు పైగా షార్ట్ స్టోరీలు, కొన్ని సీరియల్స్, నవల్స్ రాశారు. అలాగే తెలుగు, తమిళ, ఇంగ్లీష్‌లో 100కు పైగా కార్టూన్స్ వేశారు.
పాత్రికేయుడు, సినీ పీఆర్వో బీఏ రాజుని జయ పెళ్లాడిన తర్వాత ప్రారంభించిన ‘సూపర్ హిట్’ పత్రికకు ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. ప్రేమలో పావనీ కల్యాణ్ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా జయ వ్యవహరించారు. చంటిగాడు (2003) సినిమాతో దర్శకురాలిగా మారిన జయ ప్రేమికులు (2005), గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. డైనమిక్ జర్నలిస్ట్ అనిపించుకున్న జయకు ‘ఆనందో బ్రహ్మ’ అనే షార్ట్ స్టోరీకి నేషనల్ అకాడమీ అవార్డు లభించింది. అలాగే ‘స్పర్శ’, ‘నీతి’ కథలకు కూడా అవార్డులు దక్కాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాలీవుడ్ దర్శకురాలు కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 30
ఎవరు : బి. జయ (54)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : గుండెపోటు కారణంగా

మిస్ దివా యూనివర్స్’గా నేహల్
‘మిస్ దివా యూనివర్స్ 2018’గా 22 ఏళ్ల నేహల్ చుడాసమా ఎంపికైంది. ఈ మేరకు ముంబైలో సెప్టెంబర్ 1న జరిగిన అందాల పోటీలలో అగ్రస్థానంలో నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో 2018 డి సెంబర్‌లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున నేహల్ పోటీపడనుంది. మరోవైపు ‘మిస్ దివా సుప్రానేషనల్’గా అదితి హుండియ, మిస్ దివా 2018 రన్నరప్‌గా రోష్నీ షెరన్ నిలిచారు. ఈ పోటీలలో మిస్ యూనివర్స్ 2017 విజేత డెమి పీటర్స్, బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శిల్పా శెట్టి, నేహా దూఫియా, లారా దత్తా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నే హ మాట్లాడుతూ మిస్ యూనివర్స్ పోటీలు ముగిశాక సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతానని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ దివా యూనివర్స్ 2018 ఎంపిక
ఎప్పుడు : సెప్టెంబర్ 1
ఎవరు : నేహల్ చుడాసమా
ఎక్కడ : ముంబై

ఎ ఇయర్ ఇన్ ఆఫీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు రచించిన ‘మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్’ పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెప్టెంబర్ 2న ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలు, చేపట్టిన కార్యక్రమాలతో వెంకయ్యనాయుడు ఈ పుస్తకాన్ని రచించారు.
ఈకార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ నేతలపై కాకుండా రాజకీయ పార్టీలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని అన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే తన ఏడాది ప్రయాణానికి పుస్తక రూపం కల్పించినట్లు చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : విజ్ఞాన్ భవన్, ఢిల్లీ

పాకిస్థాన్ అధ్యక్షునిగా ఆరిఫ్ అల్వీ
పాకిస్థాన్ నూతన అధ్యక్షునిగా అధికార తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఆరిఫ్ అల్వీ ఎన్నికయ్యారు. ఈ మేరకు సెప్టెంబర్ 4న జరిగిన పోలింగ్‌లో నేషనల్ అసెంబ్లీ, సెనేట్‌కు సంబంధించిన 430 ఓట్లలో అల్వీకి 212 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో పాకిస్థాన్ ముస్లింలీగ్-ఎన్ బలపరిచిన మౌలానా ఫజుల్-ఉర్-రహ్మాన్‌కు 131 ఓట్లు రాగా పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అభ్యర్థి ఐత్‌జాజ్ అహ్సాన్‌కు 81 ఓట్లు వచ్చాయి. పాకిస్థాన్ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న మమ్నూన్ హుస్సేన్ పదవీకాలం సెప్టెంబర్ 8న ముగియనుండగా 9వ తేదీన నూతన అధ్యక్షుడిగా అల్వీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశాధినేతగా వ్యవహరించే పాకిస్థాన్ అధ్యక్షుడు ఆదేశ ప్రధానమంత్రి సలహా మేరకు అధికారాలను చలాయిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్థాన్ నూతన అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : డాక్టర్ ఆరిఫ్ అల్వీ
ఎక్కడ : పాకిస్థాన్

తదుపరి సీజేఐగా జస్టిస్ గొగోయ్
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగోయ్ పేరును సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా సిఫార్సు చేశారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి సెప్టెంబర్ 4న లేఖ రాశారు. జస్టిస్ దీప్‌క్ మిశ్రా సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపితే అక్టోబర్ 3న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2012 ఏప్రిల్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ పదోన్నతి పొందారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ మిశ్రా పదవీకాలం అక్టోబర్ 2న ముగియనుంది.
సాధారణంగా సీజేఐ పదవీకాలం ముగిసేందుకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాలని కేంద్ర న్యాయ శాఖ సీజేఐని కోరుతుంది. దీంతో తన తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తర్వాతి ప్రధాన న్యాయమూర్తిగా సీజేఐ ప్రతిపాదిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తదుపరి సీజేఐగా జస్టిస్ రంజన్ గొగోయ్
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా
ఎందుకు : ప్రస్తుత సీజేఐ పదవీకాలం అక్టోబర్ 2న ముగియనందున

కేసీఆర్‌కు బిజినెస్ రిఫార్మర్ పురస్కారం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్-2018 అవార్డు లభించింది. ఈ మేరకు టైమ్స్ గ్రూపు ఎండీ వినీత్ జైన్ సెప్టెంబర్ 5న ప్రకటించాడు. ముంబైలో అక్టోబర్ 27న జరిగే కార్యక్రమంలో కేసీఆర్‌కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ 2014 నుంచి 2017 వరకు సగటున ఏడాదికి 17.17 శాతం చొప్పున, 2018 మొదటి ఐదు నెలల్లో 21.96 శాతం ఆదాయాభివృది సాధించిందని కేసీఆర్ తెలిపారు. అలాగే టీఎస్ ఐపాస్ సింగిల్ విండో పారిశ్రామిక అనుమతుల విధానం ద్వారా ఇప్పటివరకు 7,000 పరిశ్రమలు అనుమతులు పొందాయని వివరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్-2018 అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 5
ఎవరు : కె.చంద్రశేఖర్‌రావు
Published date : 20 Sep 2018 04:04PM

Photo Stories