Skip to main content

ఫిబ్రవరి 2018 వ్యక్తులు

క్రైస్తవ మత ప్రబోధకుడు బిల్లీ గ్రాహమ్ కన్నుమూత
Current Affairs
విఖ్యాత క్రైస్తవ మత ప్రబోధకుడు, ప్రచారకర్త బిల్లీ గ్రాహమ్ కన్ను మూశారు. ఆయన వయసు 99 ఏళ్లు. గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 21న ఉత్తర కరోలినాలోని తన స్వగృహంలో మృతిచెందారు. అమెరికాలో ఉదారవాద ప్రొటెస్టాంట్లు, రోమన్ కేథలిక్‌లకు పోటీగా మత ప్రచార కార్యక్రమాలను ఆయన ఒక ఉద్యమంలా నిర్వహించారు. 185కు పైగా దేశాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించి సంప్రదాయ క్రైస్తవుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్టుల పాలనలోని క్రైస్తవులకు కూడా ఆశా కిరణంగా నిలిచారు. మత బోధనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందికి చేరువైంది గ్రాహమే.
‘అమెరికా పాస్టర్’గా పేరొందిన గ్రాహమ్.. ఐసన్‌హోవర్ నుంచి జార్జి డబ్ల్యూ బుష్ వరకు పలువురు అమెరికా అధ్యక్షులకు ఆధ్యాత్మిక సలహాదారుగా, సన్నిహితుడిగా వ్యవహరించారు.

ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్నుమూత
ఐదు దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన అతిలోక సుందరి శ్రీదేవి (54) కన్నుమూశారు. ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీతో కలసి శ్రీదేవి దుబాయ్ వెళ్లారు.
నాలుగేళ్ల వయసు నుంచే..
తమిళనాడులోని శివకాశిలో 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి(అసలు పేరు అమ్మయంగార్ అయ్యప్పన్) నాలుగేళ్ల వయసు నుంచే వెండితెరపై వెలిగారు. 1967లో ‘కందన్ కరుణై’ చిత్రంలో బాలనటిగా రంగప్రవేశం చేశారు. ‘కొందరు సిల్వర్ స్పూన్‌తో పుడతారు.. శ్రీదేవి సిల్వర్ స్క్రీన్‌తో పుట్టింది’ అనే నానుడి స్థిరపడేలా బాలనటిగా దూసుకుపోయారు. 11వ ఏటనే మలయాళంలో హీరోయిన్‌గా నటించినా 13వ ఏట తెలుగులో ‘అనురాగాలు’ (1976), 14వ ఏట ‘మా బంగారక్క’ (1977) సినిమాలతో తెలుగు హీరోయిన్‌గా మారారు. ‘పదహారేళ్ల వయసు’ (1978) ఘన విజయంతో ఆమె దశ తిరిగింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ఇటు దక్షిణాదిని, అటు ఉత్తరాదిని ఏలారు.

యుద్ధవిమానం నడిపిన అవనీ చతుర్వేది
యుద్ధ విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా అవనీ చతుర్వేది గుర్తింపు పొందారు. ఆమె ఫిబ్రవరి 19న జామ్‌నగర్ స్థావరం నుంచి మిగ్-21 బైసన్‌ను నడిపారు.

స్వచ్ఛభారత్ వృద్ధురాలు కున్వర్ బాయ్ మృతి
స్వచ్ఛభారత్ అభియాన్ చిహ్నంగా పేరొందిన 106 ఏళ్ల వృద్ధురాలు కున్వర్ బాయ్ ఫిబ్రవరి 23న ఛత్తీస్‌గఢ్‌లో మరణించారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తితో 2016లో తనకున్న కొన్ని మేకలను అమ్మేసి..ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో కున్వర్ బాయ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు.

నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు
Current Affairs పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)ను రూ. 11,400 కోట్ల మేర మోసగించిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, చోక్సీల పాస్‌పోర్టుల్ని విదేశాంగ శాఖ 4 వారాల పాటు రద్దు చేసింది. వారంలోగా తమ ముందు హాజరుకావాలని ఆదేశిస్తూ వారిద్దరికీ మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఈడీ సమన్లు జారీ చేసింది. నీరవ్, చోక్సీలు దేశం విడిచి పారిపోవడంతో.. ఆ ఇద్దరి కంపెనీల డెరైక్టర్లకు నోటీసులను పంపింది. నీరవ్ మోదీ తన పేరు మీదే నగల దుకాణాల్ని నిర్వహిస్తుండగా, గీతాంజలి జెమ్స్‌కు చోక్సీ ప్రమోటర్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో

భారత్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పర్యటన
ఏడురోజుల పర్యటనలో భాగంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబ సమేతంగా ఫిబ్రవరి 17న భారత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్న ట్రూడో రక్షణ, ఉగ్రవాదంసహా పలు కీలకాంశాలపై చర్చించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ట్రూడో 18న తాజ్‌మహల్‌ను సందర్శించారు. అనంతరం గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని, గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత్‌లో కెనడా ప్రధాని పర్యటన
ఎప్పుడు : ఫిబ్రవరి 17
ఎవరు : జస్టిన్ ట్రూడో

బంగ్లా మాజీ ప్రధాని జియాకు జైలు
Current Affairs బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ప్రతిపక్ష నాయకురాలు ఖలీదా జియా(72)కు ఓ అవినీతి కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. దీంతో డిసెంబర్‌లో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీచేయకుండా ఆమె అనర్హతకు గురయ్యే వీలుంది. తన భర్త, మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన అనాథ శరణాలయానికి సేకరించిన విదేశీ నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఢాకా ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 8న ఈ తీర్పు వెలువరించింది. జియా కొడుకు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తారిక్‌నూ దోషిగా తేల్చిన కోర్టు..ఆయనతో పాటు మరో నలుగురికి 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం తారిక్ లండన్‌లో అజ్ఞాతంలో ఉన్నారు.
ప్రతిపక్ష బీఎన్‌పీకి అధినేత్రిగా వ్యవహరిస్తున్న జియా.. మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జైలు
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ఖలీదా జియా:
ఎందుకు : అవినీతి కేసులో

బాటా’ అంబాసిడర్‌గా స్మృతి మంధన
భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధనను ప్రముఖ పాదరక్షల ఉత్పత్తి సంస్థ బాటా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. సంస్థకు చెందిన క్రీడా సంబంధ బ్రాండ్ ‘పవర్’కు అంబాసిడర్‌గా స్మృతి వ్యవహరించనుంది. 2017లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో విశేషంగా రాణించిన స్మృతి.. తాజాగా ఫిబ్రవరి 7న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలోనూ సెంచరీ చేసి సత్తాచాటింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘బాటా’ అంబాసిడర్‌గా మహిళా క్రికెటర్ స్మృతి మంధన
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎందుకు : క్రీడా సంబంధ బ్రాండ్ ‘పవర్’కు ప్రచారం కోసం

ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డెరైక్టర్‌గా ఇంద్రా నూయీ
పెప్సికో చైర్మన్, సీఈవో ఇంద్రా నూయీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి మహిళా స్వతంత్ర డెరైక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 9న నియామకం ఖరారైంది. ఆమె ఈ ఏడాది జూన్‌లో బోర్డులో చేరతారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ మార్కెట్‌ను విస్తృతం చేసే ఉద్దేశంతో గతేడాది జూన్‌లో ఐసీసీ నియమావళిలో భారీ సంస్కరణలు చేపట్టారు. దీనిలో భాగంగా బోర్డులో తప్పనిసరిగా ఒక మహిళా స్వతంత్ర డెరైక్టర్ ఉండాలని సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. నూయీ నియామకాన్ని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ స్వాగతించారు. తమ పాలనా వ్యవహారాల పరిధి పెంపొందించుకునేందుకు ఆమె సామర్థ్యం ఎంతగానో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి స్వతంత్ర డెరైక్టర్ పదవి రెండేళ్ల పాటు ఉంటుంది. దీనిని వరుసగా రెండు దఫాల్లో ఆరేళ్ల వరకు పొడిగించుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీసీ తొలి మహిళా స్వతంత్ర డెరైక్టర్
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : ఇంద్రా నూయీ

పాక్ ఉద్యమకారిణి అస్మా జహంగీర్ కన్నుమూత
పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది, మానవహక్కుల ఉద్యమకారిణి అస్మా జహంగీర్(66) ఫిబ్రవరి 11న కన్నుమూశారు. 1952లో లాహోర్ జన్మించిన అస్మా, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1978లో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని 1983లో అప్పటి పాక్ నియంత జియా ఉల్ హక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో సైనిక ప్రభుత్వం ఆమెను జైల్లో నిర్బంధించింది. జైలు నుంచి విడుదలైన అనంతరం 1986లో స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు వెళ్లిన ఆమె..డిఫెన్‌‌స ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ సంస్థకు రెండేళ్లు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. 1987లో పాకిస్తాన్‌లో స్థాపించిన జాతీయ మానవహక్కుల సంఘానికి 1993 వరకూ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.
పాకిస్తాన్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన అస్మా.. శక్తిమంతమైన ఆర్మీ, నిఘా సంస్థ ఐఎస్‌ఐల వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించేవారు. మానవహక్కుల రంగంలో చేసిన కృషికి గానూ 2014లో రైట్ లైవ్లీహుడ్ అవార్డు, 2010లో ఫ్రీడమ్ అవార్డు, హిలాల్ ఏ ఇంతియాజ్ అవార్డులను ఆమె అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాక్ మానవహక్కుల ఉద్యమకారిణి కన్నుమూత
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : అస్మా జహంగీర్

దేశంలో ధనిక సీఎం చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఓ నివేదిక విడుదల చేసింది. అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో నిలవగా, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రూ.48 కోట్లతో మూడోస్థానంలో ఉన్నాడు. మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులున్నారు. వీరి సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్‌ఎల్‌డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి.
అతిపేద ముఖ్యమంత్రుల్లో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్ రూ.27 లక్షల ఆస్తులతో తొలిస్థానంలో నిలవగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ(రూ.30 లక్షలుపైగా), జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ(రూ.56 లక్షలు) తర్వాతి స్థానాలో నిలిచారు.
మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది (35శాతం)పై క్రిమినల్ కేసులు, దాదాపు 26 శాతం సీఎంలపై హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. విద్యార్హతల విషయంలో మొత్తం ముఖ్యమంత్రుల్లో 10 శాతం మంది పన్నెండో తరగతి ఉత్తీర్ణులు కాగా, 39 శాతం మంది డిగ్రీ, 32 శాతం మంది వృత్తివిద్యా డిగ్రీ, 16 శాతం మంది పీజీ, 3 శాతం మంది డాక్టరేట్ సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో ధనిక ముఖ్యమంత్రి
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఎందుకు : దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల ఎన్నికల అఫిడవిట్‌లు విశ్లేషించిన ఏడీఆర్, ఎలక్షన్ వాచ్

కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా చంద్రశేఖర కంబార
కేంద్ర సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా కన్నడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య చంద్రశేఖర కంబార ఫిబ్రవరి 12న ఎన్నికయ్యారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీతైన కంబార..కవిగా, నాటకరంగ కళాకారుడిగా విశేష గుర్తింపు పొందారు.

బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా అబ్దుల్ హమీద్
బంగ్లాదేశ్ అధ్యక్షడిగా అబ్దుల్ హమీద్ ఫిబ్రవరి 7న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రెండోసారి బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు.

బళ్లారి ఎంపీకి ట్రంప్ ఆహ్వానం
Current Affairs కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఏర్పాటు చేసిన విందుకు భారతదేశం నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. వీరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒకరు కాగా, బళ్లారి ఎంపీ శ్రీరాములు మరొకరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బళ్లారి ఎంపీకి ట్రంప్ ఆహ్వానం
ఎప్పుడు : ఫిబ్రవరి 2న
ఎవరు : శ్రీరాములు
ఎందుకు : అధ్యక్షుడి అధికారిక విందులో పాల్గొనడానికి

కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియామకం దాదాపుగా ఖాయమైంది. ఈ మేరకు ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతత్వంలోని కొలీజియం జస్టిస్ దినేశ్ మహేశ్వరి పేరును ప్రతిపాదించింది. అక్టోబర్ 9వ తేదీన జస్టిస్ ఎస్‌కే ముఖర్జీ పదవి విరమణ చేయగా.. అప్పటి నుంచి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది. దినేశ్ మహేశ్వరి ప్రస్తుతం మేఘాలయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్ణాటక హైకోర్టు సీజే నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : జస్టిస్ దినేశ్ మహేశ్వరి

విద్యార్థుల కోసం మోదీ పుస్తకం - ఎగ్జామ్ వారియర్స్
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసేందుకు తన అనుభవాలతో 25 అధ్యాయాలు (మంత్రాలు, యోగాసనాలతో) పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాశారు. ఎగ్జామ్ వారియర్స్ (పరీక్షా యోధులు) పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఫిబ్రవరి 3న ఢిల్లీలో విడుదల చేశారు. ఈ పుస్తకం రాయటం ద్వారా.. ఇంతవరకు ఏ దేశాధ్యక్షుడు గానీ.. ప్రధాని గానీ సాధించని అరుదైన ఘనతను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. భారత యువతకు అంకితమిచ్చిన ఈ పుస్తకాన్ని ‘ది ఐడియా’ అనే నరేంద్రమోదీ మొబైల్ యాప్‌తో అనుసంధానించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఎగ్జామ్స్ వారియర్స్ పుస్తకం
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ

తేజస్‌లో అమెరికా వాయు సేనాధిపతి
దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను అమెరికా వాయు సేనాధిపతి జనరల్ డేవిడ్ గోల్డ్‌ఫీన్ ఫిబ్రవరి 3న నడిపారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న వైమానికస్థావరం వద్ద భారత ఎయిర్ వైస్ మార్షల్ ఏపీ సింగ్‌తో కలసి ఆయన తేజస్‌లో చక్కర్లు కొట్టారు. భారత వాయుసేన ఈ సమాచారాన్ని ట్వీటర్‌లో ప్రకటించింది. భారత, అమెరికా వాయుసేనల మధ్య బంధాన్ని మరింత దృఢపరిచేందుకు కృషిచేస్తానని గోల్డ్‌ఫీన్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తేజస్‌ను నడిపిన అమెరికా వాయు సేనాధిపతి
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎక్కడ : జోధ్‌పూర్
ఎవరు : డేవిడ్ గోల్డ్‌ఫీన్

నీతి ఆయోగ్ సీఈవో పదవీకాలం పొడిగింపు
నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని 2019 జూన్ 30 వరకు పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించడంతో అమితాబ్ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కాలపరిమితి రెండేళ్లు ఉండే నీతి ఆయోగ్ సీఈవో పదవిని అమితాబ్ 2016 ఫిబ్రవరి 17న చేపట్టారు. నీతి ఆయోగ్‌లో పదవిచేపట్టకముందు ఆయన పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అమితాబ్ కేరళ కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : 2019 జూన్ 30 వరకు
ఎవరు : కేంద్ర ప్రభుత్వం

కొత్త డీజీఎంఓ అనిల్ చౌహాన్
భారత సైన్యం నూతన డీజీఎంఓ(డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ జనవరి 30న బాధ్యతలు స్వీకరించారు. చౌహాన్‌కు జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లలో అపార అనుభవం ఉంది.

ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడి ఆత్మహత్య
క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు డియాజ్ బలర్ట్(68) ఫిబ్రవరి 2న హవానాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. డియాజ్ రాజకీయాల్లో లేనప్పటికీ అచ్చు తండ్రి పోలికలతో ఉండటంతో అక్కడి వారు ఆయన్ను ఫిడెల్ జూనియర్‌గా పిలుస్తుంటారు. ఫిజిక్స్ శాస్త్రవేత్తయిన డియాజ్.. క్యూబా అణుశక్తి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు.
Published date : 21 Feb 2018 03:58PM

Photo Stories