Skip to main content

న‌వంబ‌ర్ 2020 వ్యక్తులు

తెలంగాణ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి
Current Affairs
తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ గండికోట శ్రీదేవి నవంబర్ 19 ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ శ్రీదేవిని రెండేళ్ల కిందట తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే జస్టిస్ శ్రీదేవిని పూర్తిస్థాయి జడ్జిగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన జస్టిస్ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో ఉత్తరప్రదేశ్ జ్యుడీషియల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2016లో జిల్లా, సెషన్స్ జడ్జిగా పదోన్నతి పొందారు. అలాగే వివిధ హోదాల్లో పనిచేశారు. ఘజియాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ప్రమాణం
ఎప్పుడు : నవంబర్ 19
ఎవరు : జస్టిస్ గండికోట శ్రీదేవి

ఏ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కొవాగ్జిన్ ప్రయోగాల్లో వాలంటీర్‌గా పాల్గొన్నారు?
ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’ చివరి దశ(మూడో దశ) ప్రయోగాలు హరియాణా రాష్ట్రంలో నవంబర్ 20న ప్రారంభమయ్యాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా మొదటి వాలంటీర్‌గా హరియాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ టీకా డోసు తీసుకున్నారు. అంబాలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 67 ఏళ్ల అనిల్‌కు కొవాగ్జిన్ డోసు ప్రయోగాత్మకంగా ఇచ్చారు. ఒక ప్రజాప్రతినిధి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం భారత్‌లో ఇదే తొలిసారి. టీకా ఇవ్వడంతో ఆయనలో వచ్చే ఆరోగ్యపరమైన మార్పుల్ని నిరంతరం వైద్యులు పరీక్షిస్తారు. నాలుగు వారాల తర్వాత మంత్రికి రెండో డోసు ఇస్తారు. మంత్రి అనిల్ విజ్‌తో పాటు మరో 25 సెంటర్లలో 26 వేల మంది వాలంటీర్లు వ్యాక్సిన్ ట్రయల్‌ను స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కొవాగ్జిన్ ప్రయోగాల్లో వాలంటీర్‌గా పాల్గొన్న రాష్ట్ర మంత్రి
ఎప్పుడు : నవంబర్ 20
ఎవరు : హరియాణా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్
ఎక్కడ : అంబాలా ప్రభుత్వ ఆస్పత్రి, అంబాలా జిల్లా, హరియాణ

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కన్నుమూత
ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవీప్రియ (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ నవంబర్ 21న తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా పల్నాడులోని ఓబులేశుని పల్లెలో 1951, ఆగస్టు 15న జన్మించిన దేవీప్రియ తాడికొండ(గుంటూరు జిల్లా)లో పెరిగారు. ఆయనకు తల్లిదండ్రులు షేక్ ఖాజా హుస్సేన్ అని పేరు పెట్టగా.. ఆయన తన ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తాడికొండ దేవీప్రియ పేరుతో పాటలు, కథలు, వ్యంగ్య వ్యాఖ్యానాలు, ఇతర రచనలు చేశారు. శ్రీశ్రీ ఆత్మకథ...
గుంటూరు ఏసీ కాలేజీలో బీఏ చదివిన దేవిప్రియ... ప్రజాతంత్ర వారపత్రిక, హైదరాబాద్ మిర్రర్‌లకు సంపాదకుడిగా పనిచేశారు. మా భూమి, దాసి, రగులుతున్న భారతం సినిమాలకు స్క్రీన్‌ప్లే, పాటలు, మాటలు రాశారు. అమ్మచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుపాన్ తుమ్మెద, అరణ్య పర్వం, గాలి రంగు తదితర కవితా సంపుటిలతోపాటు ఇన్షా అల్లా పేరుతో కంద పద్యాలు రాశారు. }}తో ఆయన ఆత్మకథ అనంతం’ను రాయించి, సీరియల్‌గా ప్రచురించారు.
గాలి రంగుకు సాహిత్య అకాడమీ అవార్డు...
దేవిప్రియ రచన... గాలి రంగు కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ (2017) పురస్కారం లభించింది. ఏపీ ప్రభుత్వం హంస పురస్కారం (2015), తెలుగు యూనివర్సిటీ పురస్కారం (2016), కెఎన్‌వై పతంజలి అవార్డు(2017), గజ్జెల మల్లారెడ్డి స్మారక అవార్డు (2011), యూనిసెఫ్ పురస్కారం(2011), విశాలాక్షీ సాహితీ పురస్కారం(2009) దేవిప్రియను వరించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : తాడికొండ దేవీప్రియ (69)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : అనారోగ్యం కారణంగా...

జిల్ బెడైన్‌కు పాలసీ డెరైక్టర్‌గా నియమితులైన భారతీయ అమెరికన్?
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బెడైన్ భారతీయ అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబోయే ప్రథమ మహిళ జిల్ బెడైన్(జో బెడైన్ భార్య)కు పాలసీ డెరైక్టర్‌గా మాలా అడిగ(47)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధ విషయాల్లో జిల్ బెడైన్‌కు మాలా సహకరిస్తారు. ప్రస్తుతం బెడైన్ 2020 ప్రచార కార్యక్రమానికి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా, బెడైన్‌కు సీనియర్ అడ్వైజర్‌గా మాలా పనిచేస్తున్నారు. గతంలో బెడైన్ ఫౌండేషన్‌కు హయ్యర్ ఎడ్యుకేషన్, మిలటరీ ఫ్యామిలీస్ విభాగం డెరైక్టర్‌గా పనిచేశారు. ఒబామా హయాంలో ఎడ్యుకేషనల్, కల్చరల్ బ్యూరోలో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ స్టేట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. మాలా పూర్వీకులు కర్ణాటక రాష్ట్రం, ఉడుపి జిల్లా, కక్కుంజే గ్రామస్తులు.
బెడైన్ గెలుపును గుర్తించను: పుతిన్
ఏ అమెరికా నాయకుడితోనైనా తాను కలిసి పని చేస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బెడైన్ విజయాన్ని గుర్తించడానికి తాను సిద్ధంగా లేనని నవంబర్ 22న తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా దేశానికి కాబోయే ప్రథమ మహిళ జిల్ బెడైన్ పాలసీ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : భారతీయ అమెరికన్ మాలా అడిగ
ఎందుకు : విద్యా సంబంధ విషయాల్లో జిల్ బెడైన్‌కు సహకరించేందుకు

సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేత?
సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు. ట్విటర్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్‌‌స మోదీ పేరుపైననే ఉన్నాయి. చెక్‌బ్రాండ్‌‌స’ సంస్థ రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
దాదాపు 10 కోట్ల ఆన్‌లైన్ ఇంప్రెషన్స్...
2020, ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్‌‌సను చెక్‌బ్రాండ్‌‌స సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో 95 మంది టాప్ పొలటికల్ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్‌‌సను చెక్‌బ్రాండ్‌‌స విశ్లేషించింది. దాదాపు 10 కోట్ల ఆన్‌లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది.
మోదీ తర్వాత జగన్...
చెక్‌బ్రాండ్‌‌స నివేదిక ప్రకారం... 2,171 ట్రెండ్‌‌సతో మోదీ తొలి స్థానంలో నిలిచారు. మోదీ తర్వాత 2,137 ట్రెండ్‌‌సతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. తదుపరి స్థానాల్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. మరోవైపు బ్రాండ్ స్కోర్, బ్రాండ్ వ్యాల్యూ విషయంలోనూ ప్రధాని మోదీనే తొలి స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేత ప్రధాని నరేంద్ర మోదీ
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : ‘చెక్‌బ్రాండ్‌‌స’ సంస్థ
ఎక్కడ : దేశంలో

అస్సాం మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్(84) కన్నుమూశారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసీహెచ్)లో నవంబర్ 23న తుదిశ్వాస విడిచారు. 1936, ఏప్రిల్ 1న జోర్హాట్ జిల్లాలో జన్మించిన తరుణ్ గొగోయ్... కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ప్రజాధరణ నేతగా ఎదిగారు. 1971లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన ఆ తరువాత వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. పీవీ నరసింహారావు కేబినేట్‌లో కేంద్ర మంత్రిగా కూడా సేవలందించారు. ఆ తర్వాత 2001, 2006, 2011లలో వరుసగా మూడుసార్లు అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పారు.
గాంధీజీ మునిమనవడు మృతి
దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో ఉంటున్న భారత జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు సతీశ్ ధుపేలియా(66) కోవిడ్-19 సోకి కన్నుమూశారు. కరోనాతోపాటు న్యూమోనియాతో సతమతమవుతున్న ఆయన నవంబర్ 22న గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గాంధీజీ కుమారుడు మణిలాల్ గాంధీ కుటుంబానికి చెందిన సతీశ్ ధుపేలియా డర్బన్‌లో గాంధీజీ స్థాపించిన ఫోనిక్స్ ఆశ్రమ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ఫొటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్‌గా మీడియా రంగంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 23
ఎవరు : తరుణ్ గొగోయ్(84)
ఎక్కడ : గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(జీఎంసీహెచ్), గువాహటి, అస్సాం
ఎందుకు : కోవిడ్-19 అనంతర అనారోగ్య సమస్యలతో

ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి టెస్లా చీఫ్
ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తాజాగా రెండో స్థానానికి ఎగబాకారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. సుమారు 128 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన రెండో స్థానానికి చేరుకున్నారు. నవంబర్ 24న టెస్లా షేరు ధర ఎగియడంతో ఒకే రోజున ఆయన నికర విలువ 7.2 బిలియన్ డాలర్లు పెరిగింది. 2020 ఏడాది ఇప్పటిదాకా ఆయన సంపద 100.3 బిలియన్ డాలర్ల మేర ఎగిసింది. దీంతో 2020, జనవరి నెలలో 35వ స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి దూసుకొచ్చారు. టెస్లా మార్కెట్ విలువ దాదాపు 500 బిలియన్ డాలర్ల దరిదాపుల్లో ఉంది. ప్రపంచ కుబేరులు-100 జాబితాలో భారత్ నుంచి నలుగురు చోటు దక్కించుకున్నారు.
ప్రపంచ కుబేరుల జాబితా...
ర్యాంక్

పేరు

కంపెనీ

సంపద (బి. డాలర్లలో)

1

జెఫ్ బెజోస్

అమెజాన్

181.9

2

ఎలాన్ మస్క్

టెస్లా

128.0

3

బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్

127.7

4

బెర్నార్డ్ ఆర్నాల్ట్

ఎల్‌వీఎంహెచ్

104.5

5

మార్క్ జకర్‌బర్గ్

ఫేస్‌బుక్

101.7

6

వారెన్ బఫెట్

బెర్క్‌షైర్

86.8

7

ల్యారీ పేజ్

గూగుల్

81.3

8

సెర్గీ బ్రిన్

గూగుల్

78.7

9

స్టీవ్ బామర్

మైక్రోసాఫ్ట్

76.1

10

ముకేశ్ అంబానీ

రిలయన్స్

74.0

40

గౌతమ్ అదానీ

అదానీ గ్రూప్

32.1

56

అజీం ప్రేమ్‌జీ

విప్రో

23.4

71

శివ్ నాడార్

హెచ్‌సీఎల్

21.4


కాంగ్రెస్ సీనియర్‌నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్‌నేత, వ్యూహకర్త, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌పటేల్(71) కన్నుమూశారు. నెల రోజులుగా కరోనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హరియాణలోని గురుగావ్‌లో నవంబర్ 25న తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికై న ఎన్నికైన పటేల్ ఐదు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు.
గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో 1949, ఆగస్టు 21 పటేల్ జన్మించారు. భరూచ్ జిల్లాలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన 1977లో 28ఏళ్ల వయసులో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1993లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. రాజీవ్‌గాంధీ హయాంలో ప్రధానికి పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1985, 1992ల్లో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి మూడు దఫాలుగా కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాంగ్రెస్ సీనియర్‌నేత, వ్యూహకర్త, రాజ్యసభ సభ్యుడు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : అహ్మద్‌పటేల్(71)
ఎక్కడ : గురుగావ్, హరియాణ
ఎందుకు : కరోనా సంబంధిత సమస్యలతో

సంస్కృతంలో న్యూజిలాండ్ ఎంపీ ప్రమాణ స్వీకారం
న్యూజిలాండ్ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందిన భారతీయ సంతతి వ్యక్తి డాక్టర్ గౌరవ్ శర్మ ఆ దేశ పార్లమెంట్‌లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శర్మ లేబర్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. శర్మ తొలుత న్యూజిలాండ్ స్థానిక భాష మౌరిలో అనంతరం సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారని న్యూజిలాండ్‌లో భారత హైకమిషనర్ ముక్తేశ్ పర్దేశి నవంబర్ 25న చెప్పారు. ఇలా చేయడం ద్వారా రెండు దేశాల సంస్కృతులను ఆయన గౌరవించారన్నారు.
శర్మ ఆక్లాండ్‌లో ఎంబీబీఎస్, వాషింగ్టన్‌లో శర్మ ఎంబీఏ పూర్తి చేశారు. హిందీ కన్నా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా భారతీయ భాషలన్నింటినీ గౌరవించినట్లవుతుందని శర్మ చెప్పారు.
న్యూజిలాండ్ రాజధాని: వెల్లింగ్‌టన్; కరెన్సీ: న్యూజిలాండ్ డాలర్

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తొలి తరం నటుడు ఇకలేరు
Current Affairs
ప్రముఖ బెంగాలీ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ సౌమిత్ర ఛటర్జీ (85) ఇక లేరు. అనారోగ్యం కారణంగా కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నవంబర్ 15న తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కరోనా బారిన పడిన ఛటర్జీ అక్టోబర్ 14న కరోనా నుంచి కోలుకున్నారు. అయితే మరోసారి ఆరోగ్యం విషమించి నవంబర్ 15న కన్నుమూశారు. 1935 జనవరి 19న పశ్చిమబెంగాల్‌లోని కృష్ణానగర్‌లో సౌమిత్ర ఛటర్జీ జన్మించారు. సుప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే దర్శకత్వంలో వచ్చిన ‘అపుర్ సంసార్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.
2012లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు...
సత్యజిత్ రే దర్శకత్వం వహించిన 14 సినిమాల్లో నటించిన ఛటర్జీ.. భారత సినిమా రంగంలో అగ్రనటుడిగా గుర్తింపు పొందారు. విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసుకున్న ఛటర్జీ ‘అంతర్థాన్ (1991), దేఖా (2000), పోడోఖేప్ (2006)’ చిత్రాలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, రచయితగా, నటుడిగా సుమారు ఏడు దశాబ్దాల పాటు కొనసాగారాయన. బెంగాలీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 2004లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2012లో ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ అవార్డును ఎనిమిదిసార్లు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ బెంగాలీ నటుడు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : సౌమిత్ర ఛటర్జీ (85)
ఎక్కడ : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
ఎందుకు : అనారోగ్యం కారణంగా

టీఎస్‌ఐడీసీగా చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా అమరవాది లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నవంబర్ 15న అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పనిచేశారు. పలు వ్యాపార సంఘాలు, సామాజిక సేవా సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో ఐఎస్ సదన్ డివిజన్ నుంచి జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్‌గా పోటీ చేశారు. తెలంగాణ రాష్ట్రం లోని పారిశ్రామిక ప్రాంతాలను అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు టీఎస్‌ఐడీసీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : అమరవాది లక్ష్మీనారాయణ

బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణం చేసిన నేత?
బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనతా దళ్ యునెటైడ్(జేడీయూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఏడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ రాజధాని పట్నాలో ఉన్న రాజ్‌భవన్‌లో నవంబర్ 16న జరిగిన కార్యక్రమంలో నితీశ్‌తో రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. నితీశ్‌తో పాటు 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో బీజేపీకి చెందిన తార్‌కిషోర్ ప్రసాద్, రేణుదేవి ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్‌ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. బిహార్ అసెంబ్లీ-2020 ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించిన విషయం తెలిసిందే.
2000లో తొలిసారి...

  • బిహార్‌లోని పట్నా జిల్లా భక్తియార్‌పూర్‌లో 1951, మార్చి 1న జన్మించిన నితిశ్ కుమార్... బిహార్ సీఎంగా తొలిసారి 2000, మార్చి 3న బాధ్యతలు చేపట్టారు. మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల్లోపే రాజీనామా చేశారు.
  • ఐదేళ్ల తరువాత, జేడీయూ- బీజేపీ కూటమి మెజారిటీ సాధించడంతో రెండోసారి సీఎం అయ్యారు. 2010లో అదే కూటమి ఘన విజయంతో మూడో సారి సీఎం పీఠం అధిష్టించారు.
  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత, 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం అయ్యారు.
  • 2015 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి జేడీయూ పోటీ చేసి విజయం సాధించడంతో నితీశ్ మరోసారి సీఎం అయ్యారు.
  • ఆర్జేడీతో విభేదాల కారణంగా 2017లో సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 24 గంటల్లోపే బీజేపీతో మరోసారి జట్టు కట్టి ఆరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. తాజాగా ఏడోసారి బాధ్యతలు చేపట్టారు.
  • బిహార్ సీఎంగా అత్యధిక కాలం కొనసాగిన ఘనత శ్రీకృష్ణ సింగ్ పేరిట ఉంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి : బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏడోసారి ప్రమాణం
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : నితీశ్ కుమార్
ఎక్కడ : రాజ్ భవన్, పట్నా, బిహార్

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రచించిన పుస్తకం పేరు?
అగ్రరాజ్యం అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా రచించిన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకం నవంబర్ 17న మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ పుస్తకం ఒబామా తీసుకురాదలచిన రెండు సంపుటాల్లో మొదటిది. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి తొలివిడత అధ్యక్ష పదవి ముగిసేవరకు తన అనుభవాలు, జీవనయానాన్ని ఒబామా ఈ 768 పేజీల పుస్తకంలో వివరించారు.
దాదాపు రూ.485 కోట్లు...
అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ నవంబర్ 17న విడుదలైంది. రెండో భాగం ప్రచురణ సమయం నిర్ణయించాల్సి ఉంది. పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామాల పుస్తకాల కోసం దాదాపు రూ.485 కోట్లు చెల్లించినట్లు సమాచారం. వైట్‌హౌస్‌లో తన అనుభవాలన్నింటినీ మిషెల్ ఇప్పటికే బికమింగ్’ పేరుతో ప్రచురితమైన పుస్తకంలో వెల్లడించారు.
ఎ ప్రామిస్డ్ ల్యాండ్‌లోని కొన్ని అంశాలు...

  • ప్రభుత్వాలు తరచూ మారిపోయినా.. రాజకీయ పార్టీల్లో కుట్రలు ఎన్ని ఉన్నా.. సాయుధ వేర్పాటు ఉద్యమాలు ఎన్ని నడిచినా, అన్ని రకాల స్కామ్‌లు, అవినీతి ఉన్నప్పటికీ ఆధునిక భారత దేశం సాధించిన ఘనతలు పలు విధాలుగా ఓ విజయగాథ.
  • - నాకు భారత్ పట్ల మక్కువ కలగడానికి కారణం మహాత్మ గాంధీ. గాంధీజీ పోరాటం కేవలం భారత్‌కు స్వాతంత్యాన్న్రి తెచ్చిపెట్టడమే కాకుండా యావత్ ప్రపంచాన్నే ప్రభావితం చేసింది. అమెరికాలో నల్లజాతీయులు తమ స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటానికి ఇది దారి చూపింది.
  • ఢిల్లీలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను తాను కలిసినప్పుడు ఆయనలోని అసాధారణ విజ్ఞానాన్ని, హుందా వ్యవహారశైలిని గుర్తించా. నిష్పాక్షికత..చిత్తశుద్ధి, నిజాయితీ కలిగిన వ్యక్తి ఆయన.
  • అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాతనే తొలిసారి భారత్‌కు వచ్చిన ప్పటికీ.. చిన్నతనంలోనే ఇండోనేసియాలోనే తనకు ఈ దేశంతో పరిచయమైంది. ఇండోనేసియాలోనే రామాయణ, మహా భారత గాథలను విన్నాను.


ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్ తొలి చైర్మన్‌గా నియమితులైన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు?
రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్(ఆర్‌బీఐహెచ్) మొట్టమొదటి చైర్మన్‌గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు సేనాపతి (క్రిష్) గోపాలకృష్ణన్ నియమితులయ్యారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నవంబర్ 17న ఒక ప్రకటన విడుదల చేసింది. చైర్మన్ నేతృత్వంలో పనిచేసే ఆర్‌బీఐహెచ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను కూడా ఆర్‌బీఐ నియమించింది.
ఆర్‌బీఐహెచ్ ఏర్పాటు లక్ష్యం...
అందరికీ ఆర్థిక సేవల విస్తరణ లక్ష్యంగా ఆర్‌బీఐహెచ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు 2020, ఆగస్టులో ఆర్‌బీఐ ప్రకటించింది. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ ఫైనాన్షియల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, ఇందుకు తగిన పరిస్థితులను నెలకొల్పడం ఆర్‌బీఐహెచ్ ఏర్పాటు ప్రధాన లక్ష్యం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్‌బీఐహెచ్ మొట్టమొదటి చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు సేనాపతి (క్రిష్) గోపాలకృష్ణన్
ఎందుకు : అందరికీ ఆర్థిక సేవల విస్తరణ లక్ష్యంగా...

ఇస్లాం మత విద్య పరీక్షలో ముస్లిమేతర విద్యార్థికి తొలి ర్యాంకు
కశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీలోని ఇస్లాం మత విద్యను నేర్చుకోవడానికి నిర్వహించిన అఖిల భారత ప్రవేశ పరీక్షలో ముస్లిమేతర విద్యార్థి మొదటి ర్యాంకు సాధించాడు. 2015లో ఏర్పాటైన కశ్మీర్ యూనివర్సిటీలో ఒక ముస్లిమేతరుడు టాప్ ర్యాంకు సాధించడం ఇదే తొలిసారి. రాజస్తాన్‌కు చెందిన హిందూ విద్యార్థి శుభమ్ యాదవ్ ఈ రికార్డు సాధించాడు. రాజస్తాన్‌లోని అల్వార్ ప్రాంతానికి చెందిన యాదవ్ ఢిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో బీఏ చేశాడు.

గోవా తొలి మహిళా గవర్నర్ కన్నుమూత
గోవా మాజీ గవర్నర్, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి, బీజేపీ సీనియర్ నేత, మృదులా సిన్హా (77) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నవంబర్ 18న తుదిశ్వాస విడిచారు. 1942 నవంబర్ 27న బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో జన్మించిన మృదులా సిన్హా.. హిందీలో అనేక రచనలు చేశారు. దాదాపు 45కి పైగా పుస్తకాలు రాశారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షరాలిగా, కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్‌గా పనిచేశారు. 2014, ఆగస్టు 26 నుంచి 2019 అక్టోబర్ 23 వరకు గోవా తొలి మహిళా గవర్నర్గా పనిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోవా మాజీ గవర్నర్, సుప్రసిద్ధ హిందీ రచయిత్రి, బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : మృదులా సిన్హా (77)
ఎక్కడ : ఢిల్లీ ఎయిమ్స్
ఎందుకు : అనారోగ్య సమస్యలతో

కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్‌గా కొత్తగా నియమితులైన వారు?
Current Affairs
కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్(సీఐసీ)గా యశ్వర్ధన్‌కుమార్ సిన్హా నియమితులయ్యారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 7న ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సీఐసీ పదవీ కాలం అయిదేళ్లుగా ఉంటుంది. లేదా అయిదేళ్లకు ముందే ఆ వ్యక్తికి 65 ఏళ్లు నిండినా పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.
మరో ముగ్గురు...
సిన్హా ప్రమాణ స్వీకార అనంతరం మరో ముగ్గురు.. కేంద్ర సమాచార కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించారు. హీరాలాల్ సమారియా, సరోజ్ పున్హాని, ఉదయ్ మహూర్కర్‌లు కూడా నవంబర్ 7నే ప్రమాణంచేశారు. సీఐసీ యశ్వర్ధన్ వారితో ప్రమాణం చేయించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్(సీఐసీ)గా ప్రమాణం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : యశ్వర్ధన్‌కుమార్ సిన్హా

ఐక్యరాజ్యసమితి ఏసీఏబీక్యూకి ఎంపికైన భారతీయురాలు?
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అనుబంధ సంస్థ అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్(ఏసీఏబీక్యూ) సభ్యురాలిగా భారత్‌కి చెందిన దౌత్యవేత్త విదీషా మైత్రా ఎన్నికయ్యారు. ఆసియా పసిపిక్ దేశాల గ్రూపు నుంచి మైత్రా 126 ఓట్లు సాధించి, గెలుపొందారు. జనవరి 1, 2021 నుంచి మూడేళ్ళపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. వ్యక్తిగత అర్హతలు, అనుభవం, విశాల ప్రాంతాల ప్రాతినిధ్యం ఆధారంగా అడ్వైజరీ కమిటీకి 193 సభ్య దేశాల జనరల్ అసెంబ్లీ సభ్యులను నియమిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్(ఏసీఏబీక్యూ)కు ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : దౌత్యవేత్త విదీషా మైత్రా

అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020లో డెమొక్రాటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్ష పదవి బరిలో నిలిచిన భారత సంతతి మహిళ కమలా దేవి హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ విజయం సాధించడంతో ఇది సాధ్యమైంది. దీంతో అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళగా, తొలి నల్లజాతి అమెరికన్‌గా, తొలి ఇండో-అమెరికన్‌గా, తొలి ఆసియా-అమెరికన్ మహిళగా కమల రికార్డు నెలకొల్పారు.
కమలా గురించి...

  • కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఒక్లాండ్‌లో జన్మించారు.
  • ఆమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడులోని సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు డొనాల్డ్ హ్యారిస్.
  • వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు.
  • యూసీ హేస్టింగ్‌‌స కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు.
  • అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నా రులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు.
  • కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు.
  • శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళ
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా దేవి హ్యారిస్
ఎందుకు : అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020లో డెమొక్రాటిక్ పార్టీ విజయం సాధించడంతో

పెట్రోనెట్ సీఈఓగా నియమితులైన ఐఓసీఎల్ పైప్‌లైన్స్ డెరైక్టర్?
దేశంలో అతిపెద్ద గ్యాస్ దిగుమతిదారు పెట్రోనెట్ ఎన్‌ఎన్‌జీ లిమిటెడ్ (పీఎల్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పైప్‌లైన్స్ డెరైక్టర్ అక్షయ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ప్రభాత్ సింగ్ ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో ఏకే సింగ్ ఎంపికయ్యారు.
అక్షయ్ బిహార్‌లోని ముజఫర్పూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, దక్షిణ గుజరాత్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐఓసీఎల్ కంటే ముందు ఆయన జీఏఐఎల్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు. ఆయనకు ఆయిల్, గ్యాస్ ఇండస్ట్రీలో 34 ఏళ్ల అనుభవం ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పెట్రోనెట్ ఎన్‌ఎన్‌జీ లిమిటెడ్ (పీఎల్‌ఎల్) మేనేజింగ్ డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 8
ఎవరు : ఐఓసీఎల్ పైప్‌లైన్స్ డెరైక్టర్ అక్షయ్ కుమార్ సింగ్

దానశీలుర జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన పారిశ్రామిక వేత్త?
2019-20 సంవత్సరానికి గాను హురున్ రిపోర్ట్ ఇండియా, ఎడెల్‌గివ్ ఫౌండేషన్ రూపొందించిన దానశీలుర జాబితాలో ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ నివేదిక ప్రకారం... ప్రేమ్‌జీ రోజుకు సుమారు రూ. 22 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 7,904 కోట్లు విరాళమిచ్చారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రేమ్‌జీ రూ. 426 కోట్లు విరాళమిచ్చారు.
2019-20 దానశీలుర జాబితా-ముఖ్యాంశాలు

  • జాబితాలో ప్రేమ్‌జీ తర్వాత రూ. 795 కోట్ల విరాళంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ నాడార్ రెండో స్థానంలో నిలిచారు.
  • రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 458 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.
  • 2018-19 ఆర్థిక సంవత్సరంలో శివ నాడార్ రూ. 826 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు.
  • 2019-20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విరాళాల పరిమాణం సుమారు 175 శాతం పెరిగి రూ. 12,050 కోట్లకు పెరిగింది.
  • రూ. 10 కోట్లకు మించి దానమిచ్చిన వ్యక్తుల సంఖ్య స్వల్పంగా 72 నుంచి 78కి పెరిగింది.
  • విద్యారంగానికి అత్యధికంగా విరాళాలు అందాయి. ఆ తర్వాత స్థానంలో హెల్త్‌కేర్, విపత్తు నివారణ విభాగాలు ఉన్నాయి.
  • రూ. 5 కోట్లకు పైగా విరాళమిచ్చిన 109 మంది సంపన్నులతో రూపొందించిన ఈ జాబితాలో ఏడుగురు మహిళలు ఉన్నారు. మహిళల జాబితాలో నందన్ నీలేకని సతీమణి రోహిణి నీలేకని అత్యధికంగా రూ. 47 కోట్లు విరాళమిచ్చారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : 2019-20 దానశీలుర జాబితాలో విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీకి అగ్రస్థానం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : హురున్ రిపోర్ట్ ఇండియా, ఎడెల్‌గివ్ ఫౌండేషన్
ఎక్కడ : భారత్

ప్రముఖ కథా రచయిత, రేడియో ప్రయోక్త కన్నుమూత
ప్రముఖ కథా రచయిత, రేడియో ప్రయోక్త జీడిగుంట రామచంద్రమూర్తి (80) కరోనాతో పోరాడుతూ నవంబర్ 10న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో 1940లో జన్మించిన ఆయన ఆకాశవాణిలో ప్రయోక్తగా, కథా రచయితగా విశేష ప్రాచుర్యం పొందారు. ఎలక్ట్రానిక్ మీడియాలో సీనియర్ పాత్రికేయులుగా సేవలందించారు. 250కిపైగా కథలు రాసిన రామచంద్రమూర్తి ఉత్తమ టీవీ రచయితగా రెండుసార్లు నంది పురస్కారాన్ని పొందారు. ఆయన రచించిన 30 నాటికలు దూరదర్శన్, ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ‘నేను నా జ్ఞాపకాలు’ పేరిట రాసిన బయోగ్రఫీకి మంచి ఆదరణ లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ కథా రచయిత, రేడియో ప్రయోక్త కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : జీడిగుంట రామచంద్రమూర్తి (80)
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా

ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన నేత?
ప్రపంచంలోనే అత్యధిక కాలం దేశ ప్రధాన మంత్రిగా కొనసాగిన బహ్రెయిన్ రాజు, ప్రధానమంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84) నవంబర్ 11న కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఖలీఫా అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం, రోచెస్టర్‌లోని మేయో క్లినిక్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బహ్రెయిన్‌ను 200 ఏళ్లకు పైగా పరిపాలించిన అల్ ఖలీఫా వంశంలో 1935, నవంబర్ 24న ఖలీఫా జన్మించారు. బహ్రెయిన్ స్వాతంత్ర్యం పొందిన 1971, ఆగస్టు 15కు ఒక ఏడాది ముందు నుంచే(1970, జనవరి 10) ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 50 ఏళ్లు ప్రధానిగా పనిచేసి, ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
బహ్రెయిన్ రాజధాని: మనామా; కరెన్సీ: బహ్రెయిన్ దినార్
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రపంచంలోనే సుదీర్ఘకాలం ప్రధాన మంత్రిగా కొనసాగిన నేత కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : బహ్రెయిన్ రాజు, ప్రధానమంత్రి షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా(84)
ఎక్కడ : మేయో క్లినిక్, రోచెస్టర్, మిన్నెసోటా రాష్ట్రం, అమెరికా
ఎందుకు : అనారోగ్యం కారణంగా


గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
Current Affairs
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌నేత కేశూభాయ్ పటేల్(92) కన్నుమూశారు. కోవిడ్-19 బారిన పడి ఇటీవలే కోలుకున్న పటేల్‌అక్టోబర్ 29న గుండెపోటుకు గురై అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1928, జూలై 24న జునాగఢ్ జిల్లా విసవదార్ పట్టణంలో జన్మించిన కేశూభాయ్ 1945లో రాష్టీయ్ర స్వయం సేవక్‌సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)లో ప్రచారక్‌గా చేరారు. జన్ సంఘ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన గుజరాత్‌లో బీజేపీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించారు.
గుజరాత్ పరివర్తన్ పార్టీ స్థాపన...
ప్రఖ్యాత సోమ్‌నాథ్‌ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న కేశూభాయ్ 1995, 1998-2001 సంవత్సరాల్లో గుజరాత్ రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఆయన తర్వాత గుజరాత్‌లో నాడు సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర శాసనసభకు 6 పర్యాయాలు ఎన్నికై న కేశూభాయ్ 2012లో బీజేపీ నుంచి వైదొలిగి గుజరాత్ పరివర్తన్ పేరిట పార్టీని స్థాపించారు. 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.
క్విక్ రివ్వూ :
ఏమిటి : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌నేత కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 29
ఎవరు : కేశూభాయ్ పటేల్(92)
ఎక్కడ : అహ్మదాబాద్, గుజరాత్
ఎందుకు :గుండెపోటు కారణంగా

అలయన్స్ ఎయిర్‌కు సీఈవోగా నియమితులైన మహిళా అధికారి?
దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్ సీఈవోగా కెప్టెన్ హర్‌ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎయిరిండియా సీఎండీ రాజీవ్ భన్సల్ అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈమె ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం హర్‌ప్రీత్ సింగ్ ఎయిరిండియా ఫ్లైట్ సేఫ్టీ విభాగంలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె స్థానాన్ని కెప్టెన్ నివేదితా భాసిన్ భర్తీ చేయనున్నారు. ఎయిరిండియాకు ఎంపికైన తొలి మహిళా పైలట్ హర్‌ప్రీత్ సింగే. ఆరోగ్య సమస్యల వల్ల పైలట్‌గా కాకుండా.. ఫ్లైట్‌సెఫ్టీ విభాగంలో చేరారు. ‘ఇండియన్ వుమెన్ పైలట్ అసోసియేషన్’కు హెడ్‌గా పనిచేశారు.
క్విక్ రివ్వూ :
ఏమిటి :అలయన్స్ ఎయిర్‌సీఈవోగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : కెప్టెన్ హర్‌ప్రీత్ సింగ్

ఆప్టిక్స్ అండ్ ఫొటోనిక్స్ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయురాలు?
గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో పరిశోధక విద్యార్థిగా ఉన్న ప్రీతి జగదేవ్ అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. 2021 సంవత్సరానికి గానూ ఆప్టిక్స్ రంగంలో పరిశోధనలు చేస్తున్న ‘‘అత్యుత్తమ 25 మంది మహిళా శాస్త్రవేత్తలు’’ జాబితాలో ప్రీతి స్థానం సంపాదించారు. దీంతో ఈ ఏడాది ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకై క భారతీయురాలుగా ప్రీతి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఆప్టిక్స్ అండ్ ఫొటోనిక్స్’ ఈ జాబితాను రూపొందించింది.
ప్రస్తుతం...
ప్రీతి జగదేవ్ ప్రస్తుతం గోవా ఎన్‌ఐటీలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్’లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నారు. కృత్రిమ మేథ, ఇన్‌ఫ్రారెడ్ థర్మోగ్రఫీ సాంకేతికత సహాయంతో మానవుల్లో ఆరోగ్య పర్యవేక్షణ విధానాలపై డాక్టర్ లలత్ ఇందు గిరి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నారు.

హెచ్‌ఎఫ్‌ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తెలుగు వ్యక్తి?
భారత హ్యాండ్ బాల్ సమాఖ్య (హెచ్‌ఎఫ్‌ఐ) నూతన అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎ. జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా విజయం సాధించారు. సమాఖ్యకు సీనియర్ ఉపాధ్యక్షులుగా ఆనందీశ్వర్ పాండే, ప్రదీప్ కుమార్ వ్యవహరించనున్నారు.

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ డెరైక్టర్‌గా అభయ్ చౌదరి బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలోకి రాకముందు ఆయన సంస్థ కమర్షియల్, రెగ్యులేటరీ సెల్ ఈడీగా, కోఆర్డినేషన్ సెల్ సీఎండీగా ఉన్నారు. ఎన్‌ఐటీ దుర్గాపూర్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐఎంటీ ఘజియాబాద్ నుంచి మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. విద్యుత్ రంగంలో ఆయనకు 35 ఏళ్ల అనుభవం ఉంది.
క్విక్ రివ్వూ:
ఏమిటి : పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్స్ డెరైక్టర్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 1
ఎవరు : అభయ్ చౌదరి

న్యూజిలాండ్ మంత్రిగా నియమితులైన భారత సంతతి మహిళ?
కేరళ రాష్ట్రానికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిలాండ్‌లో మంత్రిగా నియమితులయ్యారు. న్యూజిలాండ్ ‘కమ్యూనిటి మరియు వాలెంటరీ సెక్టార్’ మంత్రిగా 2020, నవంబర్ 6న బాధ్యతలు స్వీకరించనున్నారు. భారతీయ సంతతికి చెందిన మహిళ న్యూజిలాండ్‌లో మంత్రి పదవి స్వీకరించడం ఇదే ప్రథమం. లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యురాలు అయిన 41 సంవత్సరాల ప్రియాంక సొంత ప్రాంతం కేరళలోని ఎర్నాకుళం సమీపంలోని పరవూర్. ప్రియాంక తల్లిదండ్రులు చెన్నైకు వలస రాగా ప్రియాంక అక్కడే జన్మించారు. అక్కడి నుంచి సింగపూర్‌లో ఆమె చదువు కొనసాగింది. పై చదువుల కోసం న్యూజిలాండ్‌లోని విక్టోరియా యూనివర్సిటీ (వెల్లింగ్‌టన్)కు వెళ్లి ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు.
సామాజిక కార్యకర్తగా...
న్యూజిలాండ్‌లో ఆక్‌లాండ్ కేంద్రంగా సామాజిక కార్యకర్తగా ప్రియాంక పనిచేశారు. ముఖ్యంగా న్యూజిలాండ్ మూలవాసుల కోసం ఆమె పని చేశారు. 2006లో న్యూజిలాండ్ లేబర్‌పార్టీలో చేరి.. 2014 నుంచి ఎన్నికలలో పాల్గొన్నారు. 2017లో ‘మౌంగాకికి’ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎంపికయ్యారు. మంత్రిగా నియమితులవడానికి ముందు ఎత్నిక్ ఎఫైర్స్‌కి పార్లమెంటరీ ప్రయివేట్ సెక్రటరీగా పని చేశారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : న్యూజిలాండ్ ‘కమ్యూనిటి మరియు వాలెంటరీ సెక్టార్’ మంత్రిగా నియామకం
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : ప్రియాంక రాధాకృష్ణన్

దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంగా బాధ్యతలు చేపట్టిన ర్వైల్వే ఇంజనీర్?
దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా అరుణ్‌కుమార్ జైన్ నవంబర్ 2న బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీర్స్-1986 బ్యాచ్‌కు చెందిన ఆయన జోన్ పరిధిలో ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్‌గా పనిచేశారు. ఈ సమయంలో ఆయన ట్రెయిన్ కొలీజన్ అవాయిడెన్స్ సిస్టం (టీకాస్) ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరించి గుర్తింపు పొందారు. అంతకుముందు హైదరాబాద్ డివిజన్ డీఎంగా కూడా పనిచేశారు. 3 దశాబ్దాల రైల్వే ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా ఆయన మధ్య రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వేల్లో పనిచేశారు.
కార్లైల్ సీనియర్ అడ్వైజర్‌గా ఆదిత్యపురి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డెరైక్టర్ ఆదిత్య పురి ఇకపై ప్రపంచ ప్రైవేటు ఈక్విటీ (పీఈ) దిగ్గజ సంస్థ- కార్లైల్‌కు మార్గదర్శకత్వం వహించనున్నారు. కార్లైల్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఆదిత్య పురి చేరనున్నారని కార్లైల్ సంస్థ నవంబర్ 2న తెలిపింది.
క్విక్ రివ్వూ:
ఏమిటి : దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏజీఎం)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : అరుణ్‌కుమార్ జైన్

తొలి జేమ్స్ బాండ్ హీరో ఇకలేరు
స్కాటిష్ నటుడు, నిర్మాత, ఆస్కార్ విజేత, జేమ్స్ బాండ్ సిరీస్ తొలి పాత్రధారి సర్ థామస్ సీన్ కానరీ(90) కన్నుమూశారు. బహమాస్ రాజధాని నగరం నస్సౌలో అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. 1930 ఆగస్టు 25న స్కాట్‌లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో జన్మించిన సీన్‌కానరీ మొత్తం ఏడు చిత్రాల్లో జేమ్స్ బాండ్‌గా నటించారు. తొలుత ‘డాక్టర్ నో’ (1962) చిత్రం ద్వారా బాండ్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, ‘గోల్డ్ ఫింగర్’, ‘తండర్‌బాల్’, ‘యు ఓన్లీ లివ్ టై్వస్’, ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ సినిమాల్లో బాండ్ పాత్ర చేశారు.
ఉత్తమ సహాయ నటుడిగా...
కేరిర్ తొలినాళ్లలో మిల్క్‌మాన్‌గా, లారీడ్రైవర్‌గా, కార్మికుడిగా పనిచేసిన సీన్‌కానరీ ‘ది అన్ టచ్‌బుల్స్’ చిత్రంలో నటనకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 1989 సంవత్సరంలో పీపుల్ మ్యాగజైన్ ఆయనను ‘సెక్సియస్ట్ మ్యాన్ ఎలైవ్’గా, 1999లో ‘సెక్సియస్ట్ మ్యాన్ ఆఫ్ ది సెంచరీ’గా ప్రశంసించింది. 2006లో అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : స్కాటిష్ నటుడు, నిర్మాత, ఆస్కార్ విజేత, జేమ్స్ బాండ్ సిరీస్ తొలి పాత్రధారి కన్నుమూత
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : సర్ థామస్ సీన్ కానరీ(90)
ఎక్కడ : నస్సౌ, బహమాస్

వేయి పడగల మేధావి పుస్తక రచయిత ఎవరు?
భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జీవితం ఆధారంగా సీనియర్ జర్నలిస్టు వి.చంద్రశేఖరరావు రచించిన ‘వేయి పడగల మేధావి’ పుస్తకం విడుదలైంది. నవంబర్ 3న హైదరబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీవీ గొప్ప సాహితీమూర్తి అని, భారత జాతి ఖ్యాతిని దశదిశలా చాటిన పరిపాలనాధ్యక్షుడని కేశవరావు పేర్కొన్నారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : వేయి పడగల మేధావి పుస్తక రచయిత ఎవరు?
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : సీనియర్ జర్నలిస్టు వి.చంద్రశేఖరరావు
ఎక్కడ : రవీంద్రభారతి, హైదరాబాద్
ఎందుకు : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జీవితం ఆధారంగా ఈ పుస్తకాన్ని రచించారు.

పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి ఇకలేరు
ప్ర‌ముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ (92) ఇకలేరు. వయో సంబంధిత సమస్యలతో నవంబర్ 2న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1928 అక్టోబర్ 6న కేరళలోని త్రిపునిథురలో జన్మించిన కృష్ణన్ తన తండ్రి నారాయణ అయ్యర్ వద్ద సంగీత మెలుకువలు నేర్చుకున్నారు. శాస్త్రీయ సంగీతంలో ప్రఖ్యాతిగాంచిన సెమ్మన్‌గుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద శిక్షణపొందారు. తన 11వ ఏటనే ప్రదర్శన ఇచ్చిన ఆయన ఢిల్లీ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్‌లో మ్యూజిక్ టీచర్‌గా కూడా పని చేశారు. కృష్ణన్ ప్రతిభను మెచ్చిన భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో ఆయనను సత్కరించింది.
క్విక్ రివ్వూ:
ఏమిటి : పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : టీఎన్ కృష్ణన్ (92)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : వయో సంబంధిత సమస్యలతో

యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడు?
2020 ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్(32) సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూఎస్ కాంగ్రెస్(పార్లమెంట్)కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడిగా(గే) టోరెస్ రికార్డుకెక్కాడు. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా పని చేస్తున్న ఆయన న్యూయార్క్ రాష్ట్రంలోని 15వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. తన సమీప ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి పాట్రిక్ డెలిసెస్‌ను ఓడించాడు. తాను ఆఫ్రో-లాటినో అని టోరెస్ తెలిపాడు. 2013 నుంచి న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)కు ఎన్నికైన తొలి నల్ల జాతి స్వలింగ సంపర్కుడు
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్
ఎక్కడ : అమెరికా

ఒహాయో నుంచి సెనేట్‌కు ఎన్నికైన తొలి భారతీయ సంతతి అభ్యర్థి?
2020 ఉడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన నీరజ్ అంతాని (29) అరుదైన రికార్డు సృష్టించారు. ఒహాయో రాష్ట్రం నుంచి సెనేట్‌కు ఎన్నికై న తొలి భారతీయ సంతతి అభ్యర్థిగా రికార్డుల్లోకి ఎక్కారు. స్టేట్ రిప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్ రిపబ్లికన్ పార్టీ తరఫున సెనేట్‌కు పోటీ చేశారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి మార్క్ ఫోగెల్‌పై విజయం సాధించారు. రాజకీయ శాస్త్రం పట్టభద్రుడైన నీరజ్ 2014లో 23 ఏళ్ల వయసులోనే ఓహాయో స్టేట్ హౌస్‌కు ఎన్నికై న ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించారు. నీరజ్ తల్లిదండ్రులు 1987లో వాషింగ్టన్‌కు వలస వచ్చారు. ఆ తరువాత మయామీకి తమ నివాసాన్ని మార్చారు.
క్విక్ రివ్వూ:
ఏమిటి : ఒహాయో నుంచి సెనేట్‌కు ఎన్నికై న తొలి భారతీయ సంతతి అభ్యర్థి
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : నీరజ్ అంతాని
ఎక్కడ : అమెరికా
Published date : 05 Dec 2020 02:51PM

Photo Stories