Skip to main content

డిసెంబర్ 2019 వ్యక్తులు

ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌గా మలాలా : ఐరాస
Current Affairs
ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌గా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్థాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ నిలిచింది. 21వ శతాబ్దపు రెండో దశకంలో ఫేమస్ టీనేజర్‌గా మలాలా నిలిచినట్లు ఐక్యరాజ్యసమితి(ఐరాస) డిసెంబర్ 26న ప్రకటించింది. 2010-2019 మధ్య మలాలాకు వచ్చిన గుర్తింపు ఆధారంగా ఐరాస ఈ విషయాన్ని వెల్లడించింది. పాక్‌లో బాలికల విద్య కోసం మలాలా చేసిన పోరాటాన్ని ఐరాస గుర్తుచేసింది. చిన్నప్పటి నుంచే మలాలా బాలికల విద్య గురించి మాట్లాడిందని, తాలిబన్ల అకృత్యాలపై పోరాడిందని పేర్కొంది.
డెకేడ్ ఇన్ రివ్యూ
ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ‘డెకేడ్ ఇన్ రివ్యూ’ అనే నివేదికను ఐరాస రూపొందించింది. దీనిలో 2010లో భయంకర విధ్వసాన్ని సృష్టించిన హైతీ భూకంపం, 2011లో మొదలై ఇప్పటివరకు కొనసాగుతున్న సిరియా అంతర్యుద్ధం, బాలికల విద్య కోసం 2012లో మలాలా కృషి వంటి సంఘటనలను ప్రధానాంశాలుగా ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐరాస ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్‌గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : ఐక్యరాజ్యసమితి(ఐరాస)

ముంబై మారథాన్ అంబాసిడర్‌గా షానన్ మిల్లర్
టాటా ముంబై మారథాన్ 17వ ఎడిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఏడుసార్లు ఒలింపిక్ పతక విజేత, తొమ్మిది సార్లు ప్రపంచ చాంపియన్ అయిన అమెరికా జిమ్నాస్ట్ షానన్ మిల్లర్(42) ఎంపికయ్యారు. ఈ విషయాన్ని మారథాన్ నిర్వాహకులు డిసెంబర్ 27న వెల్లడించారు. ఈ మారథాన్ 2020, జనవరి 19న ముంబై నగరంలో జరగనుంది.
హాల్ ఆఫ్ ఫేమ్‌లో...
యూఎస్ ఒలింపిక్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రెండు సార్లు(2006లో వ్యక్తిగత, 2008లో టీమ్ విభాగం) చోటు దక్కించుకున్న ఏకైక మహిళా క్రీడాకారిణిగా మిల్లర్ గుర్తింపు పొందింది. 1992 ఒలింపిక్స్‌లో ఐదు(2 రజతం+ 3 కాంస్యం) పతకాలు సాధించిన మిల్లర్.. ఈ టోర్నీలో ఒకేసారి ఇన్ని పతకాలు నెగ్గిన అమెరికన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించారు. మొత్తం మీద ఆమె 59 అంతర్జాతీయ, 49 జాతీయ స్థాయి టోర్నీల్లో విజేతగా నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టాటా ముంబై మారథాన్ 17వ ఎడిషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : అమెరికా జిమ్నాస్ట్ షానన్ మిల్లర్

ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు 1.3 కోట్ల పరిహారం
గూఢచర్యం కేసులో నిరపరాధిగా విడుదలైన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.1.3కోట్ల పరిహారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 1994లో దేశ రహస్యాలను ఇతరులకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై నారాయణన్‌పై కేసు నమోదు కాగా.. విచారణలో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన కారణంగా నష్టపరిహారం చెల్లించాలని 77 ఏళ్ల నారాయణన్ కేసు దాఖలు చేయగా కోర్టు అనుకూల తీర్పునిచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం, మానవ హక్కుల కమిషన్ ఈ కేసులో ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ.50 లక్షలు, రూ. పది లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చాయి.
తాజాగా కేరళ ప్రభుత్వం నిర్ణయించిన రూ.1.3 కోట్లు సుప్రీంకోర్టు పరిహారానికి అదనం. నారాయణన్ లేవనెత్తిన అంశాల పరిశీలనకు ప్రభుత్వం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జయకుమార్‌కు బాధ్యతలు అప్పగించగా ఆయన రూ.1.3 కోట్ల పరిహారం చెల్లించాలని సిఫారసు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.1.3కోట్ల పరిహారం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : కేరళప్రభుత్వం

జార్ఖండ్ 11వ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్ హేమంత్ సోరెన్ డిసెంబర్ 28న ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని మోరబడి మైదానంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ద్రౌపది ముర్ము ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. సోరెన్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడు అలంఘీర్ ఆలమ్, జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రామేశ్వర్ ఒరాయన్, ఆర్‌జేడీ ఎమ్మెల్యే సత్యానంద భోక్త కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆయన సోదరి కనిమొళి, ఆర్‌జేడీ నేత తేజస్వి యాదవ్‌లు హాజరయ్యారు.
సీఎంగా రెండోసారి
జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన శిబూసోరెన్ వారసుడిగా హేమంత్ సోరెన్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆయన రాష్ర్ట పగ్గాలను చేపట్టడం ఇది రెండోసారి. సోరెన్ గతంలో ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే సీఎంగా కేవలం 14 నెలలు మాత్రమే ఉన్నారు.
హేమంత్ నేపథ్యం...
  • గిరిజన పోరాటయోధుడు బిర్సా ముండాయే తనకు స్ఫూర్తి అని చెప్పుకునే హేమంత్.. కేంద్ర మాజీ మంత్రి, మూడుసార్లు జార్ఖండ్ సీఎంగా పనిచేసిన ఆదివాసీ నేత శిబూ సోరెన్ కుమారుడు.
  • తల్లిదండ్రులు: రూపి, శిబూ సోరెన్
  • జననం: 1975 ఆగస్ట్ 10.
  • స్వస్థలం: రామ్‌గఢ్ జిల్లా నేమ్రా గ్రామం, జార్ఖండ్
  • విద్య: ఇంటర్, ఇంజినీరింగ్ (డిస్‌కంటిన్యూ)
  • హాబీలు: వంట చేయడం, క్రికెట్ ఆడటం
  • భార్య: కల్పనా సోరెన్
రాజకీయ ప్రవేశం
  • సోదరుడు దుర్గ హఠాన్మరణంతో హేమంత్ 2009లో జేఎంఎం పగ్గాలు చేపట్టారు.
  • 2005లో తొలిసారి దుమ్కా స్థానం నుంచి ఎన్నికల బరిలోకి. జేఎంఎం తిరుగుబాటు నేత స్టీఫెన్ మరాండీ చేతిలో ఓటమి.
  • 2009- 2010లో రాజ్యసభ సభ్యుడు.
  • 2010లో జార్ఖండ్ డెప్యూటీ సీఎంగా బాధ్యతలు.
  • 2013 జూలై 13న జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన ఎత్తివేసిన తరువాత కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో 2013 జూలై 15న సుమారు 38 ఏళ్లకే రాష్ట్రానికి అత్యంత చిన్న వయస్కుడైన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 డిసెంబర్ వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
  • 2014 డిసెంబర్ 23న బార్‌హైత్ ఎమ్మెల్యేగా ఎన్నిక.. ప్రతిపక్ష నేతగా ఎంపిక.
  • 2019 డిసెంబర్ 23న దుమ్కా ఎమ్మల్యేగా ఎన్నిక... ముఖ్యమంత్రిగా ప్రమాణం.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జార్ఖండ్ 11వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్
ఎక్కడ : మోరబడి మైదానం, రాంచీ, జార్ఖండ్

ద రినైసన్స్ మ్యాన్ అరుణ్ జైట్లీ పుస్తకావిష్కరణ
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్, కూతురు దీప తీసుకొచ్చిన ‘ద రినైసన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జైట్లీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో డిసెంబర్ 28న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తర్వాత వెంకయ్య మట్లాడుతూ... దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టిన జైట్లీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలుపుకొని ఏకాభిప్రాయ సాధనతో కీలకమైన జీఎస్టీ వంటి పన్ను సంస్కరణలు తీసుకొచ్చారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జైట్లీ భార్య సంగీత, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి మురళీధరన్ పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ద రినైసన్స్ మ్యాన్: ద మేనీ ఫాసెట్స్ ఆఫ్ అరుణ్ జైట్లీ పుస్తకావిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : న్యూఢిల్లీ

ఉడుపి పెజావర స్వామీజీ అస్తమయం
దక్షిణాది ఆధ్యాత్మిక ప్రముఖుల్లో ఒకరైన ఉడుపి పెజావర మఠాధిపతి శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన డిసెంబర్ 29న ఉడుపి పెజావర మఠంలో తుదిశ్వాస విడిచారు. స్వామీజీ భౌతిక కాయంపై కర్ణాటక సీఎం యెడియూరప్ప జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య బెంగళూరులోని విద్యాపీఠ ఆవరణలో అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
మధ్వాచార్యుడు స్థాపించిన మఠం
800 ఏళ్ల క్రితం శ్రీ మధ్వాచార్యుడు స్థాపించిన ఉడుపి అష్ట మఠాల్లో పెజావర మఠం ఒకటి. ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ ఆలయ బాధ్యతలను ఈ మఠాలు విడతల వారీగా పర్యవేక్షిస్తుంటాయి. పెజావర మఠ పెద్దల్లో విశ్వేశ స్వామీజీ 33వ వారు. 1931 ఏప్రిల్ 27న రామ కుంజలోని బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 1938లో సన్యాసం స్వీకరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఉడుపి పెజావర మఠాధిపతి అస్తమయం
ఎప్పుడు : డిసెంబర్ 29
ఎవరు : శ్రీ విశ్వేశతీర్థ స్వామీజీ(88)
ఎక్కడ : ఉడుపి పెజావర మఠం
ఎందుకు : అనారోగ్యం కారణంగా

రొమైరాను అధిరోహించిన తొలి మహిళ
మూడు దేశాల(వెనుజులా, బ్రెజిల్, గయానా) సరిహద్దులో 31 చ.కి.మీ వైశాల్యంలో ఉన్న రొమైరా పర్వతాన్ని బ్రిటన్‌కు చెందిన 21 ఏళ్ల అన్నా టేలర్ అధిరోహించింది. దీంతో విష సర్పాలు, సాలె పురుగులు, తేళ్లు, క్రూర జంతువులకు ఆలవాలమైన రొమైరా పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా టేలర్ రికార్డు సృష్టించింది. నిట్టనిలువుగా దాదాపు 1,500 అడుగుల ఎత్తుతో ఉన్న రొమైరా పర్వతాన్ని లియో హోల్డింగ్(39) అనే పర్వాతారోహకుడి సారథ్యంలోని ఐదుగురు సభ్యుల బృందంతో కలసి టేలర్ అధిగమించింది. దట్టమైన కీకారణ్యంలో 33 మైళ్లు నడుచుకుంటూ ప్రమాదకరమైన జలపాతాలు దాటుకుంటూ గమ్యస్థానానికి చేరుకోవడానికి దాదాపు నెల పట్టినట్లు ఈ సాహస బృందం వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రొమైరా పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : అన్నా టేలర్
ఎక్కడ : వెనుజులా, బ్రెజిల్, గయానా సరిహద్దు

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్‌పవార్ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల అనంతరం డిసెంబర్ 30న మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా 36 మందిని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. వీరితో విధాన భవన్ ప్రాంగణంలో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రితో కలుపుకుని, మొత్తం మంత్రుల సంఖ్య 43కి చేరింది. 15 శాతం నిబంధన మేరకు.. 288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర మంత్రివర్గ సంఖ్య 43కి మించకూడదు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : ఎన్సీపీ సీనియర్ నేత అజిత్‌పవార్
ఎక్కడ : విధాన భవన్, మహారాష్ట్ర

విన్సన్ పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ
ప్రపంచంలోని ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన అంటార్కిటికా ఖండంలోని విన్సన్ మాసిఫ్(16,050)ను తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ డిసెంబర్ 26న అధిరోహించింది. ఏడు ఖండాల్లోని 7 ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనేది పూర్ణ లక్ష్యం. ఇందులో విన్సన్ మాసిఫ్‌తో కలిపి ఇప్పటికే 6 పర్వతాలను అధిరోహించింది. ఉత్తర అమెరికాలోని దెనాలి పర్వతాన్ని అధిరోహించడమే మిగిలి ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని ఐదేళ్ల కిందట 13 ఏళ్ల 11 నెలల వయస్సులోనే పూర్ణ అధిరోహించిన సంగతి తెలిసిందే. దీంతో అతి పిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించిన బాలికగా పూర్ణ రికార్డులకెక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విన్సన్ మాసిఫ్ పర్వతం అధిరోహణ
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : మాలావత్ పూర్ణ
ఎక్కడ : అంటార్కిటికా ఖండం

ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న మహిళ
ఒకే మిషన్‌లో ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామిగా నాసా ఫ్లైట్ ఇంజనీర్ క్రిస్టినా కోచ్ రికార్డు నెలకొల్పారు. డిసెంబర్ 28 నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లో 289 రోజులను ఆమె పూర్తి చేసుకున్నారు. తద్వారా పెగ్గీ విట్సన్ పేరిట ఉన్న రికార్డును (288) అధిగమించారు. 2019, మార్చి 14న అంతరిక్షానికి వెళ్లిన కోచ్.. 2020 ఫిబ్రవరి 6న భూమిపైకి తిరిగి రానున్నారు.
2019, అక్టోబర్లో మరో మహిళా వ్యోమగామి జెప్సికా మీర్‌తో కలసి స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా.. ‘ఫస్ట్ ఆల్ ఉమెన్ స్పేస్ వాక్’రికార్డును కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒకే మిషన్‌లో ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామి
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : నాసా ఫ్లైట్ ఇంజనీర్ క్రిస్టినా కోచ్

తెలంగాణ నూతన సీఎస్‌గా సోమేశ్‌కుమార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 2018 ఫిబ్రవరి 1 నుంచి సీఎస్‌గా కొనసాగుతున్న శైలేంద్ర కుమార్ జోషి డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. దీంతో వెంటనే 1989 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్.. కొత్త సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నారు. 2020 జనవరి 1 నుంచి పదవీ విరమణ రోజైన 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ సీఎస్‌గా కొనసాగుతారు.
ప్రభుత్వ సలహాదారుగా జోషి...
సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఎస్‌కే జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (నీటిపారుదల వ్యవహారాలు)గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సోమేశ్ కుమార్ నేపథ్యం...
పుట్టిన తేదీ, ప్రాంతం: 22.12.1963, బిహార్
విద్య: ఎంఏ (సైకాలజీ), ఢిల్లీ యూనివర్సిటీ
భార్య: డాక్టర్ జ్ఞాన్ముద్ర, పీహెచ్‌డీ, డీన్ అండ్ ప్రొఫెసర్, ఎన్‌ఐఆర్‌డీపీఆర్, హైదరాబాద్
  • 1987 నవంబర్ నుంచి 1989 వరకు డీఆర్డీవో సైకాలజిస్టుగా సాయుధ బలగాల అధికారుల ఎంపిక కోసం మానసిక పరీక్షలు నిర్వహించారు
    ఐఏఎస్‌గా తొలి కొలువు: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్‌కలెక్టర్ (ఆగస్టు 1991- మే 93)
  • ఐటీడీఏ, పాడేరు ప్రాజెక్టు ఆఫీసర్‌గా 1993 మే నుంచి 1995 ఏప్రిల్ వరకు
  • హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా 1995 మే- 1996 జూన్ వరకు
  • యాక్షన్ ఎయిడ్ ఇండియా డెరైక్టర్/వ్యవస్థాపక సీఈవోగా 1996 జూన్ - 2000 జనవరి వరకు
  • అనంతపురం జిల్లా కలెక్టర్‌గా జూన్ 2000 నుంచి 02 డిసెంబర్ వరకు
  • ఏపీ అర్బన్ సర్వీస్ ఫర్ పూర్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా జనవరి 2003 నుంచి మే 2005 వరకు
  • ఎయిడ్ ఎట్ యాక్షన్ దక్షిణాసియా రీజనల్ డెరైక్టర్‌గా మే 2005 నుంచి డిసెంబర్ 2009 వరకు
  • ఏపీ కళాశాల విద్య కమిషనర్‌గా జూలై 2008 నుంచి డిసెంబర్ 2009 వరకు
  • గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌గా డిసెంబర్ 2011 నుంచి అక్టోబర్ 2013 వరకు
  • జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అక్టోబర్ 2013 నుంచి అక్టోబర్ 2015 వరకు
  • గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవంబర్ 2015 నుంచి డిసెంబర్ 2016 వరకు
  • రెవెన్యూ, ఎక్సైజ్, సీసీఎల్‌ఏ, రెరా, కమర్షియల్ ట్యాక్స్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా డిసెంబర్ 2016 నుంచి ఇప్పటి వరకు
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన సీఎస్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : సోమేశ్ కుమార్

సైనిక దళాధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్
దేశ 28వ సైనిక దళాధిపతిగా జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌ను కొత్తగా ఏర్పాటైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (సీడీఎస్)కు అధిపతిగా కేంద్ర ప్రభుత్వం నియమించడంతో.. ఆర్మీ వైస్‌చీఫ్‌గా ఉన్న జనరల్ మనోజ్ ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ... పొరుగుదేశం ఉగ్రవాదానికి ఊతం ఇవ్వడం మానని పక్షంలో ఆ దేశంలోని ఉగ్రమూలాలను దెబ్బతీసే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేశారు.
మనోజ్ ముకుంద్ నరవాణే నేపథ్యం..
మహారాష్ట్రలోని పుణేకు చెందిన 59 ఏళ్ల మనోజ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలటరీ అకాడమీల్లో శిక్షణ పొందారు. 1980లో సిఖ్ లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్ 7వ బెటాలియన్‌లో చేరారు. 37 ఏళ్ల సర్వీసులో చైనాతో 4వేల కిలోమీటర్ల మేర సరిహద్దు ఉన్న ఈస్టర్న్ కమాండ్‌తోపాటు పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లలో ఉగ్రవ్యతిరేక చర్యల్లో పాల్గొన్నారు. కశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. శ్రీలంక వెళ్లిన శాంతి పరిరక్షణ దళంలోనూ, మయన్మార్‌లోను మూడేళ్లపాటు పనిచేశారు. సేనా పతకం, విశిష్ట సేవా, అతి విశిష్ట సేవా పతకాలను ఈయన అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశ 28వ సైనిక దళాధిపతిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే

హిందుస్తాన్ కాపర్ సీఎండీగా అరుణ్ కుమార్
ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ కాపర్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా అరుణ్ కుమార్ శుక్లా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని జనవరి 1న హిందుస్తాన్ కాపర్ సంస్థ వెల్లడించింది. డెరైక్టర్ (ఆపరేషన్స్)గా 2018లో కంపెనీలో చేరిన చేపట్టిన శుక్లా.. తాజాగా సీఎండీ పదవిని చేపట్టారని ప్రకటించింది. గతంలో ఎన్‌ఎండీసీకి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా సేవలందించారని పేర్కొంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిందుస్తాన్ కాపర్ సీఎండీగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : అరుణ్ కుమార్ శుక్లా

సీడీఎస్‌గా జనరల్ రావత్ బాధ్యతల స్వీకరణ
దేశ మొట్టమొదటి రక్షణ బలగాల అధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ - సీడీఎస్)గా జనరల్ బిపిన్ రావత్ జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఆర్మీ చీఫ్‌గా డిసెంబర్ 31న రావత్ పదవీ విరమణ చేశారు. సీడీఎస్‌గా రావత్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ 2019, డిసెంబర్ 30న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్రివిధ బలగాలకు సంబంధించి రక్షణ మంత్రికి అన్ని అంశాల్లోనూ సలహాదారుగా ఉండడం, మూడు బలగాల మధ్య సమన్వయం సాధిస్తూ ఉన్న వనరులనే సంపూర్ణంగా సద్వినియోగం చేయడమే సీడీఎస్ ప్రధాన విధి.
బాధ్యతల స్వీకరణ సందర్భంగా రావత్ మాట్లాడుతూ... సాయుధ బలగాలు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తాయని అన్నారు. మూడు దళాలు సమన్వయంతో కలసికట్టుగా పనిచేయాలని, అలా చేసేలా చూడడమే సీడీఎస్ పని అని స్పష్టం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీడీఎస్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : జనరల్ బిపిన్ రావత్

ఏఎండీ డెరైక్టర్‌గా డాక్టర్ డీకే సిన్హా
అటామిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(ఏఎండీ) డెరైక్టర్‌గా డాక్టర్ డీకే సిన్హా నియమితులయ్యారు. ప్రస్తుతం ఏఎండీ అదనపు డెరైక్టర్‌గా ఉన్న సిన్హా డెరైక్టర్‌గా జనవరి 1న బాధ్యతలు చేపట్టారని ఏఎండీ ప్రకటించింది. దేశంలోని తూర్పు, పశ్చిమ, మధ్య భాగాల్లో విస్తరించి ఉన్న అణు ఖనిజాల అన్వేషణలో సిన్హాకు 35 ఏళ్ల విశేష అనుభవం ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పెద్దఎత్తున అణు ఖనిజాల నిక్షేపాల గుర్తింపులో సిన్హా విశేష కృషి చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అటామిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్(ఏఎండీ) డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : డాక్టర్ డీకే సిన్హా

తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ సీవీ రాములు
Current Affairs
తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చింతపంటి వెంకట రాములు, ఉప లోకాయుక్తగా జిల్లా, సెషన్స్ రిటైర్డ్ జడ్జి వొలిమినేని నిరంజన్‌రావు నియమితులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో లోకాయుక్త ఎంపిక కమిటీ డిసెంబర్ 19న ప్రగతి భవన్‌లో సమావేశమై ఈ మేరకు వారి ఎంపికను ఖరారు చేసింది. ఆ వెంటనే వారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి లోకాయుక్త, ఉప లోకాయుక్త ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జస్టిస్ సీవీ రాములు నేపథ్యం...
నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని అచ్చన్నపల్లి గ్రామంలో 1949 ఫిబ్రవరి 20న జన్మించారు. బోధన్‌లోని శంకర్‌నగర్‌లో ప్రాథమిక విద్య అనంతరం నిజామాబాద్‌లోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివారు. 1978లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యాక సీనియర్ న్యాయవాది సి.ఆనంద్ దగ్గర జూనియర్‌గా చేశారు. ఉమ్మడి ఏపీలో 24ఏళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్టీసీకి 13 ఏళ్లకు పాటు స్టాండింగ్ కౌన్సిల్‌గా పని చేశారు. 2002 డిసెంబర్ 2న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పలు తీర్పులు చెప్పారు.
వొలిమినేని నిరంజన్‌రావ్ నేపథ్యం...
జిల్లా జడ్జిగా పలు జిల్లాల్లో పనిచేశారు. సీనియర్ జిల్లా జడ్జిగా ఉండగా రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శిగా సమర్ధంగా విధులు నిర్వహించారు. దీంతో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ప్రభుత్వం ఆయన సేవలను కొనసాగించింది. ఇటీవలే ఆయన న్యాయ శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. ఆయన పనితీరు, సమర్థతను సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు అభినందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చింతపంటి వెంకట రాములు

తెలంగాణ హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం (హెచ్‌ఆర్సీ) చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ గుండా చంద్రయ్య నియమితులయ్యారు. అలాగే హెచ్‌ఆర్సీ సభ్యులుగా జిల్లా, సెషన్స్ రిటైర్డ్ జడ్జి నడిపల్లి ఆనందరావు(జ్యుడీషియల్), ముహమ్మద్ ఇర్ఫాన్ మొయినొద్దీన్ (నాన్ జ్యుడీషియల్) నియమితులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో హెచ్‌ఆర్సీ చైర్మన్ ఎంపిక కమిటీ డిసెంబర్ 19న ప్రగతి భవన్‌లో సమావేశమై ఈ మేరకు వారి ఎంపికను ఖరారు చేసింది. ఆ వెంటనే వారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి హెచ్‌ఆర్సీ చైర్మన్, సభ్యులిద్దరూ మూడేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జస్టిస్ జి.చంద్రయ్య నేపథ్యం...
ఆదిలాబాద్ జిల్లా జొన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో 1954 మే 10న జన్మించారు. స్వగ్రామంలో మూడో తరగతి వరకు చదివారు. తపలాపూర్‌లో పదో తరగతి చదివాక ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఆర్‌‌ట్స అండ్ సైన్స్ కాలేజీలో ఇంటర్, బీఏ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1980 నవంబర్ 6న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. సాంఘిక సంక్షేమ, మున్సిపల్ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2005 మే 26న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వా త శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. న్యాయమూర్తిగా తన పరిధిలోని అనేక అంశాలపై కక్షిదారులకు ఉపయుక్తంగా ఉండేలా మానవీయ కోణంలో పలు తీర్పులు చెప్పారు. 2016 మే 9న పదవీ విరమణ చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ గుండా చంద్రయ్య

అదనపు సొలిసిటర్ జనరల్‌గా సూర్యకరణ్
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్‌జోన్ నుంచి భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది టి.సూర్యకరణ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సూర్యకరణ్ మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో కూడిన సౌత్‌జోన్ పక్షాన అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి సూర్యకరణ్ కావడం గమనార్హం. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సౌత్‌జోన్ నుంచి భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : టి.సూర్యకరణ్ రెడ్డి

అమెరికా ఎన్‌ఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా సేతురామన్
అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్) డెరైక్టర్‌గా భారత సంతతి శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్‌ను ఎంపిక చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా ఫ్రాన్స్ కార్డోవా ఉన్నారు. 2020, ఏడాది ఆమె పదవీకాలం ముగిశాక సేతురామన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఎస్‌ఎఫ్ సైన్స్, ఇంజనీరింగ్‌లోని నాన్-మెడికల్ అంశాల్లో పరిశోధనలు, విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది.
తమిళనాడుకు చెందిన సేతురామన్ ప్రస్తుతం ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో ముఖ్య పరిశోధనాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన 1984లో బెంగళూరు ఐఐఎస్‌సీ నుంచి ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ఆ తర్వాత మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ, అనంతరం కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ అట్టావాలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్‌డీ పూర్తిచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : భారత సంతతి శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్

ఉన్నావ్ అత్యాచారం కేసులో సెంగార్‌కు జీవిత ఖైదు
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఉన్నావ్ అత్యాచారం కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. సెంగార్ తన తుది శ్వాస విడిచేవరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది. ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు జిల్లా న్యాయమూర్తి జస్టిస్ ధర్మేశ్ శర్మ డిసెంబర్ 20న తుది తీర్పు వెలువరించారు. నెల రోజుల్లోగా రూ.25 లక్షలు జరిమానా కూడా చెల్లించాలని సెంగార్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. జరిమానా చెల్లించకపోతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం యూపీ ప్రభుత్వమే ఆ మొత్తాన్ని కట్టాలని చెప్పారు. నష్ట పరిహారం కింద అదనంగా రూ.10 లక్షలు ఉన్నావ్ బాధితురాలి తల్లికి అందజేయాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో సహ నిందితురాలు శశి సింగ్‌ను నిర్దోషిగా ప్రకటించారు.
అందుకే జీవిత ఖైదు...
మైనర్‌లపై అత్యాచార నేరానికి గాను పోక్సో చట్టం కింద మరణ శిక్ష విధించాలి కానీ, ఈ నేరం జరిగిన 2017లో ఆ చట్టానికి సవరణలు జరగలేదు. అందుకే సెంగార్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, కస్టడీ డెత్..
ఉద్యోగం కోసం వెళ్లిన బాధితురాలిపై బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సెంగార్ 2017 జూన్ 4వ తేదీన అత్యాచారానికి పాల్పడ్డాడు. సెంగార్ అనుచరులు ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదు. 2018 ఏప్రిల్‌లో బాధితురాలి తండ్రిపై దాడి జరిగింది. దీంతో బాధితురాలు ముఖ్యమంత్రి నివాసం ఎదుటే ఆత్మాహుతికి యత్నించింది. అనంతరం బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే చనిపోయాడు. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సెంగార్‌ను సీబీఐ అరెస్ట్ చేిసినా బెదిరింపులు వస్తున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బాధితురాలు లేఖ రాసింది. ఆ తర్వాత ఆమె ప్రయాణిస్తున్న కారుని ఒక లారీ ఢీకొంది. దీంతో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన కేసులన్నిటి ఢిల్లీ కోర్టుకు మార్చాలని ఆదేశించింది.

జైపూర్ పేలుళ్ల కేసులో నలుగురికి ఉరి
2008 నాటి జైపూర్ వరుస బాంబు పేలుళ్ల ఘటనలో దోషులు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ పేలుళ్లలో 71 మంది మరణించగా, 185 మంది గాయపడిన విషయం తెలిసిందే. దీనిపై ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ శర్మ డిసెంబర్ 20న తుదితీర్పు వెలువరించారు. దోషులకు రూ.50 వేల జరిమానా విధించారు. రెండు రోజుల క్రితం మహమ్మద్ సైఫ్, మహమ్మద్ సర్వార్ అజ్మీ, మహమ్మద్ సల్మాన్, సైఫురీష్మన్ అనే నలుగురిని దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మరో నిందితుడు షాబాజ్ హుస్సేన్‌ను బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషిగా విడుదల చేసింది. నిందితులుగా ఉన్న మరో ఇద్దరు అదే ఏడాది ఢిల్లీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

తెలంగాణ హెచ్చార్సీ తొలి చైర్మన్‌గా జస్టిస్ చంద్రయ్య
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ) తొలి చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య డిసెంబర్ 23న బాధ్యతలు చేపట్టారు. హెచ్చార్సీ సభ్యులుగా రిటైర్డ్ జిల్లా సెషన్స్ జడ్జి నడిపల్లి ఆనందరావు, నాన్ జ్యుడీషియల్ సభ్యులుగా మహ్మద్ ఇర్ఫాన్ మొయినుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. 2016, డిసెంబర్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చివరి చైర్మన్‌గా జస్టిస్ సిస్సార్ అహ్మద్ కక్రూ పనిచేశారు. తదనంతరం కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం జరగలేదు. ప్రస్తుతం తెలంగాణ పేరుతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ప్రత్యేకంగా చైర్మన్, సభ్యులతో బెంచ్ ఏర్పాటైంది. నూతనంగా నియమితులైన చైర్మన్, సభ్యులు మూడేళ్ల పాటు కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ హెచ్చార్సీ తొలి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య
ఎక్కడ : హైదరాబాద్

తెలంగాణ లోకాయుక్తగా సీవీ రాములు ప్రమాణం
తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చింతపంటి వెంకట రాములు, ఉప లోకాయుక్తగా జిల్లా, సెషన్స్ రిటైర్డ్ జడ్జి వొలిమినేని నిరంజన్‌రావు ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో డిసెంబర్ 23న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. లోకాయుక్త, ఉప లోకాయుక్త ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగుతారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణ రాష్ట్ర లోకాయుక్తగా ప్రమాణం
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : హెకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చింతపంటి వెంకట రాములు
ఎక్కడ : రాజ్‌భవన్, హైదరాబాద్

బోయింగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా డేవిడ్
మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వివాదం కారణంగా ప్రతిష్ట మసకబారడంతో .. విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డెనిస్ ములెన్‌బర్గ్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ కాలోన్‌కు సీఈవో, ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించింది. దీని ప్రకారం డెనిస్ ములెన్‌బర్గ్ తక్షణమే పదవి నుంచి తప్పుకోనున్నారు. 2020, జనవరి 13న డేవిడ్ కొత్త బాధ్యతలు చేపడతారని బోయింగ్ డిసెంబర్ 23న తెలిపింది. ఈలోగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గ్రెగ్ స్మిత్.. తాత్కాలిక సీఈవోగా వ్యవహరిస్తారని వివరించింది. 737 మ్యాక్స్ రకానికి చెందిన రెండు విమానాలు కుప్పకూలడంతో ఈ విమానాలను పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బోయింగ్ నూతన సీఈవో, ప్రెసిడెంట్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : డేవిడ్ కాలోన్

విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా హర్ష్ వర్ధన్
భారత విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా హర్ష్ వర్ధన్ ష్రింగ్లా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ డిసెంబర్ 23న ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. హర్ష్ వర్ధన్ ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు. 1984 ఐఎఫ్‌ఎస్ అధికారుల బ్యాచ్‌కు చెందిన ఆయన 2020, జనవరి 29న నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న విజయ్ కేశవ్ గోఖలే పదవీ కాలం 2020, జనవరి 28న ముగియనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : హర్ష్ వర్ధన్ ష్రింగ్లా

ప్రపంచ సంపన్నుల్లో ముకేశ్‌కు 12వ స్థానం
బ్లూమ్‌బర్గ్ సంస్థ డిసెంబర్ 24న విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితా-2019(బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 12వ స్థానంలో నిలిచారు. ఈ జాబితా ప్రకారం 2019 ఏడాదిలో ముకేశ్ సంపద విలువ 16.5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగి... 60.8 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు)కు చేరింది.
అగ్రస్థానంలో బిల్ గేట్స్..
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నిలిచాడు. బిల్ గేట్స్ సంపద 2019 ఏడాదిలో 22.4 బిలియన్ డాలర్లు పెరిగి 113 బిలియన్ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద మాత్రం 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు, చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరిగింది. అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన 19వ స్థానంలో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ 2019లో 12వ స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 24
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ
ఎక్కడ : ప్రపంచంలో

రచయిత, సినీనటుడు గొల్లపూడి ఇకలేరు
Current Affairs
ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు (81) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 12న తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో అన్నపూర్ణ, సుబ్బారావు దంపతులకు జన్మించారు. విశాఖపట్నంలో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేశారు. తొలి రోజుల్లో ఆంధ్రప్రభ పత్రికలో ఉప సంపాదకుడిగా పనిచేశారు. 14 ఏళ్ల ప్రాయంలో తొలి కథ ‘ఆశాజీవి’, 16 ఏళ్ల వయసులో తొలి నాటకం ‘అనంతం’ రాశారు. 80 చిత్రాలకు రచయితగా పని చేసిన గొల్లపూడి ‘ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణ్ణయ్య’తో నటుడిగానూ అడుగుపెట్టారు. దాదాపు 290 చిత్రాల్లో నటించిన ఆయన ఆరు నంది పురస్కారాలను అందుకున్నారు.
సాహితీవేత్తగా, పత్రికల్లో కాలమిస్టుగానూ పేరొందిన గొల్లపూడి 9 నాటకాలు, 18 నాటికలు, 12 నవలలు, 4 కథా సంపుటాలను వెలువరించారు. ‘టాంజానియా తీర్థయాత్ర’ అనే ట్రావెలాగ్‌ను, ‘అమ్మ కడుపు చల్లగా’ పేరుతో తన ఆత్మకథను తీసుకొచ్చారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక వ్యాసాలు పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలయ్యాయి. ‘కళ్లు’ నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రముఖ రచయిత, సినీనటుడు ఇకలేరు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : గొల్లపూడి మారుతీరావు (81)
ఎక్కడ : చెన్నై, తమిళనాడు
ఎందుకు : అనారోగ్యం కారణంగా

అశోక్ లేలాండ్ సీఈఓగా విపిన్ సోంధి
హిందుజా గ్రూప్‌నకు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అశోక్ లేలాండ్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ), మేనేజింగ్ డెరైక్టర్‌గా విపిన్ సోంధి నియమితులయ్యారు. ఈ పదవి నుంచి వైదొలగిన వినోద్ కే దాసరి స్థానంలో విపిన్ బాధ్యతలు చేపట్టినట్లు డిసెంబర్ 12న కంపెనీ తెలిపింది. విపిన్ 2019, డిసెంబర్ 12 నుంచి 2024 డిసెంబర్ 11 వరకు అశోక్ లేలాండ్ సీఈఓ, ఎండీగా కొనసాగుతారని పేర్కొంది. ఇంతకుముందు జేసీబీ ఇండియా, టాటా స్టీల్, శ్రీరామ్ హోండా సంస్థలకు విపిన్ సేవలందించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అశోక్ లేలాండ్ కొత్త సీఈఓ, మేనేజింగ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : విపిన్ సోంధి

విశ్వనాథన్ ఆనంద్ పుస్తకం మైండ్‌మాస్టర్ విడుదల
భారత సూపర్ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ రచించిన ‘మైండ్ మాస్టర్’ పుస్తకం విడుదలైంది. తమిళనాడు రాజధాని చెన్నైలో డిసెంబర్ 13న జరిగిన కార్యక్రమంలో ది హిందు పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ... ‘మీరు చెస్ రొమాంటిక్ అయితే ఈ ఆట అందాన్ని ఆస్వాదిస్తారు. ఈ కంప్యూటర్ల యుగంలోనూ చెస్ ఆట అనుభూతే వేరు. కంప్యూటర్లు కూడా అంతే అనంతమైన సాధ్యాల్ని సాకారం చేస్తాయి’ అని అన్నాడు. తన పుస్తకంలో చెస్ గడులతో పాటు కంప్యూటర్‌కూ చోటిచ్చానని పేర్కొన్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : విశ్వనాథన్ ఆనంద్ రచించిన మైండ్ మాస్టర్ పుస్తకం విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ది హిందు పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్
ఎక్కడ : చెన్నై, తమిళనాడు

ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల్లో నిర్మలా
ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ‘‘ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలు-2019(ది వరల్డ్స్ 100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్)’’ జాబితాలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ డిసెంబర్ 12న విడుదల చేసిన ఈ జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా 34వ స్థానంలో నిలిచారు. గతంలో భారత రక్షణరంగానికి సారథ్యం వహించిన నిర్మలా.. ప్రస్తుతం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తిస్థాయి బాధ్యతలు వహిస్తూ దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్ణయాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు.
భారత్ నుంచి మరో ఇద్దరు
ఫోర్బ్స్ మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్‌తో పాటు మరో ఇద్దరు భారతీయ మహిళలకు స్థానం లభించింది. ఈ జాబితాలో హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రెజైస్ ఎగ్జిక్యూ టివ్ డెరైక్టర్, సీఈఓ రోష్ని నాడార్ మల్హోత్రా 54వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా 65వ స్థానాన్ని దక్కించుకున్నారు.
అగ్రస్థానంలో ఏంజెలా మెర్కల్
ఫోర్బ్స్ మహిళల జాబితాలో 2019 ఏడాది కూడా జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మెర్కల్ అగ్రస్థానంలో నిలిచారు. గత తొమ్మిదేళ్ళుగా అత్యంత శక్తివంతమైన మహిళగా ఆమె తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూనే ఉన్నారు. ఈ జాబితాలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీనా లగార్‌‌డ రెండో స్థానం పొందగా... అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ మూడో స్థానంలో ఉన్నారు.
ఫోర్‌‌బ్స అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలు
ర్యాంక్ పేరు దేశం
1 ఏంజెలా మెర్కల్ జర్మనీ
2 క్రిస్టీనా లగార్‌‌డ ఫ్రాన్స్
3 నాన్సీ పెలోసీ అమెరికా
4 ఉర్సులా వాన్ డెర్ లేయన్ బెల్జియం
5 మేరీ బరా అమెరికా
29 షేక్ హసీనా బంగ్లాదేశ్
34 నిర్మలా సీతారామన్ భారత్
42 ఇవాంకా ట్రంప్ అమెరికా
54 రోష్ని నాడార్ మల్హోత్రా భారత్
65 కిరణ్ మజుందార్ షా భారత్
100 గ్రేటా థన్‌బర్గ్ స్వీడన్
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళలు-2019 జాబితాలో 34వ స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

తదుపరి ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్
భారత సైనిక దళ ప్రధానాధికారి(చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే నియమితులు కానున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ 2019, డిసెంబర్ 31న పదవీ విరమణ పొందనున్నారు. సంప్రదాయం ప్రకారం ఆయన తర్వాత అత్యంత సీనియర్ అయిన మనోజ్ ఆర్మీ చీఫ్‌గా నియమితులుకానున్నారు. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్‌గా మనోజ్ పనిచేస్తున్నారు. నేషనల్ డిఫెన్‌‌స అకాడెమీ, ఇండియన్ మిలిటరీ అకాడెమీ పూర్వ విద్యార్థి అయిన మనోజ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతాల వద్ద పనిచేస్తున్న ఈస్ట్రన్ కమాండ్‌ను నడిపించారు. 37 ఏళ్ల తన సర్వీసులో సమస్యాత్మక ప్రాంతాలైన జమ్మూకశ్మీర్ వంటి చోట్ల పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్‌కు నాయకత్వం వహించారు. మూడేళ్ల పాటు మయన్మార్‌లో ఉండి భారత ఎంబసీతో కలసి పని చేశారు. గతంలో ‘విశిష్ట సేవా అవార్డ్’తో పాటు ‘అతి విశిష్ట సేవా మెడల్’ను మనోజ్ అందుకున్నారు. తన బెటాలియన్‌ను జమ్మూకశ్మీర్‌లో చక్కగా నడిపించినందుకు సేనా మెడల్ కూడా అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తదుపరి ఆర్మీ చీఫ్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే

లోక్‌సభ సీట్లను వెయ్యికి పెంచాలి : ప్రణబ్ ముఖర్జీ
భారత్‌లోని జనాభాను పరిగణనలోకి తీసుకుంటే పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ సీట్లకు ప్రస్తుతమున్న 543 నుంచి 1000కి, అదే శాతంలో రాజ్యసభ సీట్లను పెంచాలని సూచించారు. ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ‘భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతమైందా? ముందున్న సవాళ్లేంటి’ అనే అంశంపై డిసెంబర్ 16న అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ ప్రసంగాన్ని ప్రణబ్ వెలువరించారు.
ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ... ‘1971 జనాభా లెక్కల ఆధారంగా చివరగా 1977లో లోక్‌సభ సభ్యుల సంఖ్యను సవరించాం. అప్పటి జనాభా 55 కోట్లు. ప్రస్తుత జనాభా అందుకు రెండింతలు. అందువల్ల లోక్‌సభ సభ్యుల సంఖ్యను కూడా కనీసం 1000 చేయాలి’ అన్నారు. ఓటరు ఇచ్చే తీర్పును పార్టీలు సరిగ్గా అర్థం చేసుకోవాలని సూచించారు.

పాక్ మాజీ సైనికాధ్యక్షుడు ముషారఫ్‌కు మరణశిక్ష
సైనికాధ్యక్షుడిగా ఉంటూ సైనికపాలన విధించిన పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా రద్దు చేసి, సైనిక పాలన విధించి తీవ్ర దేశద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై కోర్టు మరణశిక్ష విధించింది. 1999లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. 2014లో ముషారఫ్‌పై ఈ కేసు నమోదైంది.
పెష్వార్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వక్వార్ అహ్మద్ సేథ్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల స్పెషల్ కోర్టు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి నందుకుగాను, రాజ్యాంగంలోని ఆర్టికల్ 6 ప్రకారం పర్వేజ్ ముషారఫ్‌ను దోషిగా ఉగ్రవాద నిరోధక ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. నవంబర్ 19న రిజర్వులో ఉంచిన తీర్పుని సింధ్ హైకోర్టు (ఎస్‌హెచ్‌సీ) జస్టిస్ నజర్ అక్బర్, లాహోర్ హై కోర్టు జస్టిస్ షాహీద్ కరీమ్‌ల బెంచ్ డిసెంబర్ 17న వెల్లడించింది.
2007లో ముషారఫ్ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, సైనిక పాలన విధించారు. అత్యవసర పరిస్థితి విధించడంతో దేశంలో పౌరుల హక్కులు హరణకు గురయ్యాయి, మానవ హక్కులకు అర్థం లేకుండా పోయింది. సుప్రీంకోర్టు జడ్జీలనూ గృహ నిర్బంధంలో ఉంచారు. 2007 నవంబర్ నుంచి 2008 ఫిబ్రవరి వరకు పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి కారణంగా ఎటువంటి ప్రజాస్వామిక పాలనకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. 2008 సార్వత్రిక ఎన్నికల్లో ముషారఫ్ పాకిస్తాన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత ముషారఫ్ విదేశాలకు పారిపోయాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : పాకిస్తాన్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు
ఎందుకు : దేశద్రోహ నేరానికి పాల్పడ్డారని

ఎన్‌పీఏ నూతన డెరైక్టర్‌గా అతుల్ కర్వాల్
హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ) నూతన డెరైక్టర్‌గా అతుల్ కర్వాల్ నియమితులయ్యారు. ఈ మేరకు డిసెంబర్ 18న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2021 డిసెంబరు 5 లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అతుల్ ఎన్‌పీఏ డెరైక్టర్‌గా కొనసాగనున్నారు. 1988 ఐపీఎస్ బ్యాచ్, గుజరాత్ కేడర్‌కు చెందిన అతుల్ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్‌పీఏ డెరైక్టర్‌గా ఉన్న అభయ్ ఒడిశా డీజీపీగా వెళ్లడంతో ఆయన స్థానంలో అతుల్ నియమితులయ్యారు. సాధారణంగా వాస్తవంగా ఎన్‌పీఏ డెరైక్టర్‌గా డీజీ హోదా అధికారిని నియమిస్తారు. అయితే ఈ పోస్టును అదనపు డీజీ స్థాయికి తగ్గించి అతుల్‌ను నియమించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సర్దార్ వల్లభ్‌భాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ) నూతన డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 18
ఎవరు : అతుల్ కర్వాల్

టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మిస్త్రీ
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి నాటకీయ ఫక్కీలో ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీకి ఎట్టకేలకు ఊరట లభించింది. మళ్లీ ఆయన్ను ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించాలని, గ్రూప్ సంస్థల బోర్డుల్లో డెరైక్టరుగా కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) డిసెంబర్ 17న ఆదేశించింది. టాటా సన్‌‌స చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ నియామకం చట్టవిరుద్ధమని జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ్ సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది. అలాగే, టాటా సన్‌‌స స్వరూపాన్ని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీగా మార్చడం కూడా చెల్లదని పేర్కొంది. వీటికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. ఈ ఆదేశాలు నాలుగు వారాల్లో అమల్లోకి వస్తాయి. 2016, అక్టోబర్ 24న టాటా సన్‌‌స చైర్మన్‌గా మిస్త్రీని తొలగించారు. రతన్ టాటాను తాత్కళిక చైర్మన్‌గా నియమించారు.

ప్లాగింగ్ అంబాసిడర్... బేవ్లీ
ప్లాగ్ మెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తున్న రిపూ దామన్ బేవ్లీ... ప్లాగింగ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. ఫిట్ ఇండియా ఉద్యమానికి స్వచ్ఛభారత్ లక్ష్యాన్ని కూడా చేర్చి... జాగింగ్ చేస్తూ పరిసరాలను పరిశుభ్రం చేస్తూ ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాన్ని ప్లాగ్ రన్‌గా పిలుస్తున్నారు. 2017లో బేవ్లీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి 50 నగరాలను చుడుతూ రెండు నెలల్లో 1,000 కి.మీ. కవర్ చేశారు బేవ్లీ. 2.7 టన్నుల చెత్తను సేకరించారు.

మారిషస్ కొత్త అధ్యక్షుడు.. ప్రదీప్ రూపన్
ద్వీపరాజ్యం మారిషస్‌కు కొత్త అధ్యక్షుడిగా పృథ్వీరాజ్‌సింగ్ (ప్రదీప్) రూపన్‌ను జాతీ య అసెంబ్లీ ఎన్నుకుంది. నిజానికిక్కడ ప్రధానిదే అధికారం కాగా.. అధ్యక్షుడనేది అలంకారప్రాయం మాత్రమే. రూపన్ గతంలో కళలు, సాంస్కృతిక మంత్రిగా పనిచేశారు. ప్రధాని ప్రవింద్‌కుమార్ జగన్నాథ్ సహా మంత్రులంతా రూపన్ పేరును ప్రతిపాదించటంతో... అసెంబ్లీ ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

ఏపీబీడీబీ చైర్మన్‌గా డాక్టర్ బీఎంకే రెడ్డి
Current Affairs
ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డ్ (ఏపీబీడీబీ) చైర్మన్‌గా విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ బి.మరియకుమార్ రెడ్డి (బీఎంకే రెడ్డి) డిసెంబర్ 6న ఆచార్య నాగార్జున వర్సిటీ సమీపంలోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఏపీబీడీబీ చైర్మన్‌గా డాక్టర్ బీఎంకే రెడ్డి
ఎవరు: డాక్టర్ బీఎంకే రెడ్డి
ఎప్పుడు: డిసెంబర్6, 2019
ఎక్కడ: ఆంధ్రప్రదేశ్

నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎన్‌వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సీనియారిటీలో రెండో స్థానంలో ఉన్న జస్టిస్ నూతలపాటి వెంకట రమణ జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈమేరకు భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 27 నుంచే ఈ నియామకం వర్తిస్తుందని ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటి వరకు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. అట్టడుగు వర్గాలు, వెనకబడిన వర్గాలకు నిష్పాక్షికమైన, అర్థవంతమైన న్యాయం అందించే లక్ష్యంగా సమీకృత న్యాయ వ్యవస్థను ప్రోత్సహించేందుకు 1987లో నల్సాను స్థాపించారు. జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీం కోర్టు లీగల్ సర్వీస్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా(ఎస్సీఎల్‌ఎస్‌సీ) కూడా ఉన్నారు. నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ డిసెంబర్ 6వ తేదీ జామ్‌నగర్ హౌజ్‌లోని నల్సా కార్యాలయం సందర్శించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎన్‌వీ రమణ నియమాకం
ఎవరు: జస్టిస్ ఎన్‌వీ రమణ
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: న్యూఢిల్లీ

ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది నియమితులయ్యారు. మునుపటి చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా తరువాత ఈ ఏడాది జనవరి నుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే కాగా, డిసెంబర్ 6న చతుర్వేది చైర్మన్ బాధ్యతలను స్వీకరించారని ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఇందుకు సెబీ అనుమతి లభించినట్లు ప్రకటించింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శిగా సేవలందించిన ఈయన నియామకాన్ని స్వాగతిస్తున్నట్లు ఎక్స్ఛేంజ్ బోర్డ్ వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఎన్‌ఎస్‌ఈ చైర్మన్‌గా గిరీష్ చంద్ర చతుర్వేది
ఎవరు: గిరీష్ చంద్ర
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: న్యూఢిల్లీ

దేశంలో అత్యంత ధనిక రియల్టర్‌గా లోధా
దేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో అత్యంత ధనికుడిగా మాక్రోటెక్ డెవలపర్స్ (గతంలో లోధా డెవలపర్స్) అధినేత మంగళ్ ప్రభాత్ లోధా నిలిచారు. డిసెంబర్ 9న విడుదలైన ‘హురున్- గ్రోహే ఇండియా ద రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్- 2019’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదికలో రూ.31,960 కోట్ల సంపదతో లోధా అగ్రస్థానంలో ఉండగా... రూ. 25,080 కోట్లతో డీఎల్‌ఎఫ్ అధినేత రాజీవ్ సింగ్ రెండోస్థానంలో ఉన్నారు.
రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్- 2019 విశేషాలు
  • గతేడాదితో పోలిస్తే లోధా కుటుంబ సంపద 18 శాతం వృద్ధి చెందింది. 100 మందితో కూడిన ఈ జాబితాలో మిగతా 99 మంది రియల్టీ టైకూన్స్ సంపదలో లోధా కుటుంబ సంపద వాటా 12 శాతంగా ఉంది.
  • దేశంలో అగ్రస్థానంలో ఉన్న 100 మంది రియల్టీ టైకూన్స్ సంపద విలువ రూ.2,77,080 కోట్లుగా అంచనా. గతేడాదితో పోలిస్తే ఇది 17 శాతం వృద్ధి చెందింది. ఈ వంద మంది జాబితాలో 37 మంది ముంబైవాసులే. ఢిల్లీలో 19 మంది, బెంగళూరులో 19 మంది ఉన్నారు.
  • ఈ పారిశ్రామికవేత్తల సగటు వయసు 59 ఏళ్లు. ఆరుగురు మాత్రం 40 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు. ముగ్గురు 80 ఏళ్లు పైబడిన వారు.
  • ఈ జాబితాలో తొలిసారి 8 మంది మహిళలకు స్థానం దక్కింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ స్మిత వీ స్రిశ్న మహిళల్లో టాప్‌లో ఉండగా.. మొత్తం జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.3,560 కోట్లు.
యంగ్ టైకూన్స్
దేశంలోనే యువ ధనిక రియల్టీ టైకూన్స్ గా హైదరాబాద్‌లోని మై హోమ్ గ్రూప్‌నకు చెందిన జూపల్లి రామురావు, జూపల్లి శ్యామ్‌రావు చోటు దక్కించుకున్నారు. వీళ్ల వయ స్సు 33 ఏళ్లు. వీరి సంపద విలువ రూ.740 కోట్లు. ఈస్ట్ ఇండియా హోటల్స్‌కు చెందిన పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్... వృద్ధ రియల్టీ టైకూన్‌గా నిలిచారు. ఈయన వయస్సు 90 ఏళ్లు. ఈయన సంపద రూ.3,670 కోట్లు.
హురున్- గ్రోహే ఇండియా ద రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్- 2019

ర్యాంకు

కంపెనీ

పేరు

సంపద (రూ.కోట్లలో)

1

మాక్రోటెక్‌ డెవలపర్స్‌

ఎంపీ లోధా

31,960

2

డీఎల్‌ఎఫ్‌

రాజీవ్‌ సింగ్‌

25,080

3

ఎంబసీ గ్రూప్‌

జితేంద్ర విర్వాణీ

24,750

4

హిరానందానీ గ్రూప్‌

నిరంజ‌న్ హిరానందానీ

17,030

5

కె రహేజా గ్రూప్‌

చంద్రు రహేజా

15,480

6

ఒబెరాయ్‌ రియ‌ల్టీ

వికాస్‌ ఒబెరాయ్‌

13,910

7

బాగ్మనీ డెవలపర్స్‌

రాజా బాగ్మనీ

9,960

8

హిరానందానీ సింగపూర్‌

సురేంద్ర హిరానందానీ

9,720

9

రున్వాల్‌ డెవలపర్స్‌

సుభాష్‌ రున్వాల్‌

7,100

10

పిరమల్‌ రియల్టీ

అజయ్‌ పిరమల్‌

6,560

క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో అత్యంత ధనిక రియల్టర్‌గా మంగళ్ ప్రభాత్ లోధా
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : హురున్- గ్రోహే ఇండియా ద రియల్ ఎస్టేట్ రిచ్ లిస్ట్- 2019
ఎక్కడ : దేశంలో

అతి పిన్న వయస్సు ప్రధానిగా సనా మారిన్
ప్రపంచంలోనే అతి పిన్న వయస్సు ప్రధానిగా ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్(34) రికార్డు నెలకొల్పారు. ఫిన్లాండ్‌లో రాజకీయ సంక్షోభానికి తెరదించుతూ ఆమె నూతన ప్రధానిగా ఎంపికయ్యారు. అంటీ రిన్నే ప్రధాని పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన సనాను సోషల్ డెమొక్రాట్ పార్టీ సభ్యులు ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ప్రధాని పదవి అధిష్టించిన మహిళగా సనా రికార్డులకెక్కారు.
సనా మారిన్ కంటే ముందు ఉక్రెయిన్ ప్రధాని ఓలెక్సీ హాంచరుక్(35) అత్యంత పిన్న వయస్సులో ప్రధాని పదవి దక్కించుకున్న మహిళగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అతి పిన్న వయస్సు ప్రధానిగా రికార్డు
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్(34)
ఎక్కడ : ప్రపంచంలోనే

డోపింగ్ నిరోధక వ్యవస్థ ప్రచారకర్తగా సునీల్ శెట్టి
జాతీయ డోపింగ్ నిరోధక వ్యవస్థ (నాడా) ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ‘క్రీడల్లో డోపింగ్‌ను దూరం చేసే చర్యల్లో భాగంగా సునీల్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేశాం. అంతేకాకుండా తాజా అథ్లెట్లు వివిధ టోర్నీల్లో బిజీగా ఉండడంతో ప్రచారానికి తగిన సమయం కేటాయించలేరు’ అని నాడా డిసెంబర్ 9న తెలిపింది. 2019 ఏడాది జాతీయ డోపింగ్ నిరోధక లేబొరేటరీపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో అథ్లెట్ల డోప్ నమూనాలను నాడా భారత్ వెలుపల పరీక్షిస్తోంది. 2019 ఏడాదే 150 మందికి పైగా అథ్లెట్లు డోపింగ్‌లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. అందులో బాడీబిల్డర్లు 1/3 వంతు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ డోపింగ్ నిరోధక వ్యవస్థ (నాడా) ప్రచారకర్తగా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి
ఎందుకు : క్రీడల్లో డోపింగ్‌ను దూరం చేసే చర్యల్లో భాగంగా

టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గ్రెటా థన్‌బర్గ్
ఐక్యరాజ్య సమితి సమావేశంలో ‘హౌ డేర్ యూ ?’ అంటూ ప్రపంచ నేతలనుద్దేశించి ప్రశ్నించిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ (16) టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా నిలిచింది. మానవాళికి ఉన్న ఒకే గృహాన్ని నాశనం చేయవద్దంటూ ఆమె చేసిన పోరాటం మన్ననలు అందుకుందని టైమ్స్ మేగజీన్ డిసెంబర్11న తెలిపింది. వ్యక్తిగతంగా ఈ రికార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలు గ్రెటానే అంటూ టైమ్స్ ఆమెను కొనియాడింది.
స్పెయిన్ వేదికగా డిసెంబర్ 13 వరకు జరుగుతున్న సీఓపీ25 వాతావరణ సదస్సులో భాగంగా గ్రెటా(స్వీడన్) ప్రసంగించారు. వాతావరణ కాలుష్యంపై పాలకులు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా మణిపూర్‌కు చెందిన ఎనిమిదేళ్ల లిసిప్రియా కంగుజమ్ కూడా సీఓపీ25 వాతావరణ సదస్సులో ప్రసంగించింది. వాతావరణంలో వస్తున్న మార్పులపై చర్యలు తీసుకోండి అంటూ ప్రపంచ అధినేతలను లిసిప్రియా కోరుతోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టైమ్స్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా ఎంపిక
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : గ్రెటా థన్‌బర్గ్
ఎందుకు : పర్యావరణ పరిరక్షణకై కృషి చేస్తున్నందుకు

ఐఎండీబీ’ ర్యాంకింగ్స్ లో ప్రియాంకకు తొలిస్థానం
ఐఎండీబీ ‘టాప్ 10 స్టార్స్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ టెలివిజన్’ జాబితాలో ప్రియాంక చోప్రా తొలిస్థానంలో నిలిచారు. ఐఎండీబీ ప్రో స్టార్ మీటర్ ర్యాంకింగ్‌‌స నుంచి వచ్చిన డేటా ఆధారంగా ఈ జాబితా రూపొందిస్తారు. నెలకు 200 మిలియన్లకు పైగా వీక్షణల డేటాను విశ్లేషించి, ఆయా నటులకు సంబంధించి సంవత్సరం పొడవుగా సాధించిన ‘వీక్షణల’ద్వారా ర్యాంకులు ప్రకటిస్తారు. సల్మాన్ హీరోగా నటించిన ‘భారత్’ సినిమాలో నటించిన నటి దిశా పటాని జాబితాలో రెండవ స్థానంలో ఉండగా, ‘వార్’నటుడు హృతిక్ రోషన్ మూడవ స్థానంలో ఉన్నారు. కియారా అద్వానీ నాల్గవ స్థానం సాధించగా, సూపర్ స్టార్స్ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వరుసగా ఐదు, ఆరవ స్థానాల్లో ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ‘ఐఎండీబీ’ ర్యాంకింగ్స్ లో ప్రియాంక కు తొలిస్థానం
ఎవరు: ప్రియాంక చోప్రా
ఎక్కడ: ముంబై
ఎందుకు: నెలకు 200 మిలియన్లకు పైగా వీక్షణల డేటాను విశ్లేషించి, ఆయా నటులకు సంబంధించి సంవత్సరం పొడవుగా సాధించిన ‘వీక్షణల’ద్వారా ర్యాంకులు ప్రకటన.

ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీకి 9వ స్థానం
Current Affairs ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ తాజాగా ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితా-2019లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ముకేశ్ సంపద విలువ 60 బిలియన్ డాలర్లు (రూ. 4.3 లక్షల కోట్లు) అని ‘రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్’ పేరిట విడుదల చేసిన జాబితాలో ఫోర్బ్స్ పేర్కొంది. 2018లో 13వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ.. ఈసారి ఏకంగా టాప్-10లోకి చేరి... ఈ స్థాయి సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి అమెజాన్ ఫౌండర్, సీఈఓ జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయన సంపద విలువ 113 బిలియన్ డాలర్లు... అంటే దాదాపు రూ.8 లక్షల కోట్లు. ఆ తరువాతి స్థానంలో 107.4 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నిలిచారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్‌లో 9వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : ఆర్‌ఐఎల్ అధిపతి ముకేశ్ అంబానీ
ఎక్కడ : ప్రపంచంలో

ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ రాజీనామా
ఇరాక్ ప్రధాని అదెల్ అబ్దుల్ మహ్తి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు నవంబర్ 29న ప్రకటించారు. తన రాజీనామాను పార్లమెంటుకు సమర్పిస్తానని, దాంతో పార్లమెంటు ఇతర అవకాశాలను పరిశీలించుకుంటుందని చెప్పారు. ఇరాక్ ప్రధానికి మద్దతు ఉపసంహరించుకోవాలంటూ చట్టసభ సభ్యులకు అత్యున్నత షియా మతగురువు పిలుపునివ్వటంతో రెండు నెలలుగా అల్లర్లు జరుగుతున్నాయి. అల్లర్లలో 400 మంది మృతి చెందగా, 15 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని అదెల్ రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇరాక్ ప్రధాని పదవికి రాజీనామా
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : అదెల్ అబ్దుల్ మహ్తి
ఎందుకు : ఇరాన్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం
మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి మహా వికాస్ ఆఘాడి(మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్) తరఫున శివసేన చీఫ్ ఉద్ధవ్ బాల్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ పార్క్ గ్రౌండ్‌లో నవంబర్ 28న జరిగిన కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రేతో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయి, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ బుజ్‌బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ తోరట్, నితిన్ రౌత్‌లతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణం చేయించారు.
మహారాష్ట్ర శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడు కాకుండానే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తులు, ఆరు నెలల్లోగా శాసన సభకు కానీ, శాసనమండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది.
ఉద్ధవ్ ఠాక్రే గురించి...
  • బాల్ ఠాక్రే, మీనా ఠాక్రే దంపతులకు ముంబైలో 1960, జూలై 27న ఉద్దవ్ ఠాక్రే జన్మించారు.
  • ఠాక్రే జేజే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్ కాలేజీలో డిగ్రీ చేశారు. ఆ తరువాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీని స్థాపించారు.
  • 1989లో శివసేన ప్రారంభించిన పత్రిక ‘సామ్నా’ పత్రికను వెనకుండి నడిపించారు.
  • 1990లో ములుంద్‌లోని శివసేన శాఖ సమావేశంలో తొలిసారి రాజకీయాల్లో అడుగుపెట్టారు.
  • 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంటయ్యారు.
  • 2012లో బాల్ ఠాక్రే మరణానంతరం పార్టీని నిలబెట్టుకోవడానికి ఉద్ధవ్ తీవ్ర కృషి చేశారు.
  • 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 సీట్లల్లో శివసేన 63 స్థానాలను గెలుచుకుంది.
  • 2019 ఎన్నికల్లో 288 సీట్లకు శివసేన 56 స్థానల్లో విజయం సాధించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం
ఎప్పుడు : నవంబర్ 28
ఎవరు : శివసేన చీఫ్ ఉద్ధవ్ బాల్ ఠాక్రే
ఎక్కడ : శివాజీ పార్క్ గ్రౌండ్, ముంబై, మహారాష్ట్ర

నాడు-నేడు పర్యవేక్షణాధికారిగా పీటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ, వైద్య ఆరోగ్యశాఖలో ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద చేపట్టిన పనులకు పర్యవేక్షణాధికారిగా రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్‌చీఫ్ (రిటైర్డ్) అధికారి ఎఫ్‌సీఎస్ పీటర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని డిసెంబర్ 1న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు శాఖల్లో చేపట్టే కార్యక్రమాలకు ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను పీటర్ పర్యవేక్షిస్తారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లో నాడు-నేడు ద్వారా సకాలంలో పనులు జరుగుతున్నాయా లేదా, నిర్మాణాల తీరు, మౌలిక వసతుల కల్పన, టెండర్ల వ్యవహారం తదితర అంశాలను ఆయన పరశీలించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నాడు-నేడు పర్యవేక్షణాధికారిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఎఫ్‌సీఎస్ పీటర్

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నానా పటోలె
మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి కిసాన్ కఠోర్ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవడంతో పటోలె స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సె పాటిల్ డిసెంబర్ 1న ప్రకటించారు. రైతు నాయకుడిగా విశిష్టమైన సేవలు అందించిన పటోలె 56 ఏళ్ల పటోలే కాంగ్రెస్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. 2017లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం విదర్భ ప్రాంతంలోని సకోలీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఎన్నిక
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలె

విశ్వాస పరీక్షలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విజయం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నవంబర్ 30న ఆ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 కాగా 169 మంది ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ప్రభుత్వానికి మద్దతు పలికారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి(మహా వికాస్ ఆఘాడి) ప్రభుత్వంపై కాంగ్రెస్‌కు చెందిన మాజీ సీఎం అశోక్ చవాన్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని సీనియర్ ఎన్సీపీ, సేన సభ్యులు బలపరిచారు. బీజేపీకి చెందిన 105 మంది సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయగా వేర్వేరు పార్టీలకు నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా దూరంగా ఉన్నారని ప్రొటెం స్పీకర్ దిలీప్ వల్సే సభలో ప్రకటించారు. అనంతరం సభలో ఉన్న సభ్యులను లెక్కించి ఉద్ధవ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వానికి 169 మంది అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు.
అసెంబ్లీలో బలాబలాలు..
మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 మంది సభ్యుల్లో అతిపెద్ద పార్టీ బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యుల బలముంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహారాష్ట్ర శాసనసభ విశ్వాస పరీక్షలో విజయం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే

నేవీలో మొదటి మహిళా పైలట్‌గా శివాంగీ
భారత నావికాదళానికి చెందిన సబ్-లెఫ్టినెంట్ శివాంగీ నావికా దళ పైలట్ అయిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. కేరళలోని కొచ్చిలో శిక్షణ పూర్తిచేసుకున్న ఆమె డిసెంబర్ 2న పైలట్‌గా విధుల్లో చేరారు. శివాంగీతో పాటు 7వ డోర్నియర్ కన్వర్జన్ కోర్సుకు చెందిన మరో ఇద్దరు అధికారులు కూడా డోర్నియర్ పైలట్లుగా క్వాలిఫై అయినట్లు రక్షణ శాఖ ప్రతినిధులు తెలిపారు. దీనిపై శివాంగీ స్పందిస్తూ తొలి మహిళా పైలట్‌గా నిలిచినందుకు గర్వంగా ఉందని, ఇదో కొత్త అనుభూతి అని పేర్కొన్నారు. దీనికోసమే ఎంతోకాలంగా ఎదురు చూసినట్లు తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత నావికా దళ పైలట్ అయిన తొలి మహిళ
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : సబ్-లెఫ్టినెంట్ శివాంగీ

రోజర్ ఫెడరర్ గౌరవార్థం వెండి నాణేలు
ప్రపంచ టెన్నిస్ వేదికలపై విశేష ప్రతిభ కనబరుస్తున్న తమ విఖ్యాత ఆటగాడు రోజర్ ఫెడరర్ గౌరవార్థం వెండి నాణేలు విడుదల చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. స్విట్జర్లాండ్ కరెన్సీలో 20 ఫ్రాంక్ విలువైన నాణేలపై ఫెడరర్ తన ట్రేడ్‌మార్క్ షాట్ అయిన బ్యాక్‌హ్యాండ్‌తో కనిపిస్తాడు. 2020, జనవరి 23న ఈ నాణేలను లాంఛనంగా జారీ చేస్తామని స్విస్ మింట్ తెలిపింది. ఇప్పటిైకైతే మొత్తం 55 వేల నాణేలను ముద్రించినట్లు పేర్కొంది. జీవించివున్న వ్యక్తి ముఖచిత్రంతో ఇలా నాణేలను విడుదల చేయడం స్విట్జర్లాండ్ చరిత్రలో ఇదే తొలిసారి.

అల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్
టెక్ దిగ్గజం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ)గా ఉన్న సుందర్ పిచాయ్... తాజాగా దాని మాతృసంస్థ అల్ఫాబెట్‌కూ సీఈవోగా నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఈ బాధ్యతల్లో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్ వాటి నుంచి తప్పుకున్నారు. తాజా పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరిగా సుందర్ పిచాయ్ నిలవనున్నారు. కొత్త మార్పులపై కంపెనీ ఉద్యోగులకు పేజ్, బ్రిన్ డిసెంబర్ 4న లేఖ రాశారు. రాబోయే రోజుల్లోనూ బోర్డు సభ్యులుగా, షేర్‌హోల్డర్లుగా, సహ-వ్యవస్థాపకులుగా గూగుల్, అల్ఫాబెట్ వృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని లేఖలో పేర్కొన్నారు.
అల్ఫాబెట్(గూగుల్) ప్రస్తుత మార్కెట్ విలువ : 89,300 కోట్ల డాలర్లు
ఆదాయం(2018) : 13,682 కోట్ల డాలర్లు
నికర లాభం : 3,074 కోట్ల డాలర్లు
సుందర్ పిచాయ్ 2018 సంపాదన (షేర్ల విలువతో కలిపి) : 47 కోట్ల డాలర్లు (సుమారు రూ.3,300 కోట్లు)
మదురై టు సిలికాన్ వ్యాలీ...
తమిళనాడులోని మదురైలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సుందర్ పిచాయ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జికల్ ఇంజనీరింగ్ చేశారు. తరవాత అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో ఎంఎస్ చేశారు. ఎంబీఏ అనంతరం 2004లో గూగుల్‌లో చేరారు. కీలకమైన క్రోమ్ బ్రౌజర్ ప్రాజెక్టును విజయవంతం చేశాక కంపెనీలో ఆయన వేగంగా ఎదిగారు. 2013లో ముఖ్యమైన ఆండ్రాయిడ్ డివిజన్ ఇన్‌చార్జిగా... తర్వాత రెండేళ్లకే 2015లో గూగుల్ సీఈవో అయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అల్ఫాబెట్ సీఈవోగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ) సుందర్ పిచాయ్
Published date : 31 Dec 2019 04:55PM

Photo Stories