Skip to main content

డిసెంబర్ 2017 వ్యక్తులు

ఇన్‌స్పైరింగ్ ఐఏఎస్‌లలో ఇద్దరు తెలంగాణ కలెక్టర్లు
Current Affairs బెటర్ ఇండియా వెబ్‌సైట్ దేశంలోని స్ఫూర్తిదాయక ఐఏఎస్ అధికారుల జాబితాను రూపొందించింది. మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొలికెరి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. వినూత్న ఆలోచనలతో కొత్తరకమైన కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి, ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని వీరిద్దరి గురించి బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది.
భారతి హొలికెరి గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యసేవలను మెరుగుపర్చారని పేర్కొంది. మెదక్ జిల్లాను వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చారు.
ఇక రొనాల్డ్ రాస్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రజల అభ్యున్నతికి విభిన్న కార్యక్రమాలను అమలుచేశారు. హరితహారం అమలుచేసి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపారు. దివ్యాంగ సోలార్ సొసైటీ ఏర్పాటుచేసి దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేశారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు అమలుచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బెటర్ ఇండియా ఇన్‌స్పైరింగ్ ఐఏఎస్‌ల జాబితా
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : రొనాల్డ్ రాస్, భారతి హొలికెరికి జాబితాలో చోటు

యూజీసీ చైర్మన్‌గా ధీరేంద్ర పాల్ సింగ్
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్‌ను నియమిస్తూ డిసెంబర్ 22న అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్) డెరైక్టర్‌గా ఉన్నారు. ధీరేంద్ర ఐదేళ్లపాటు యూజీసీ చైర్మన్ పదవిలో కొనసాగుతారని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) తెలిపింది. ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్ యూజీసీ చైర్మన్‌గా 2017 ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందినప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూజీసీకి కొత్త చైర్మన్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్

ఆమ్నెస్టీ జనరల్ సెక్రటరీగా కుమీ నాయుడు
అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు కుమీ నాయుడు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న బెంగళూరుకు చెందిన సలీల్ షెట్టి 2018 ఆగస్టులో రిటైరయిన తరువాత నాయుడు బాధ్యతలు స్వీకరిస్తారు. 52 ఏళ్ల నాయుడు 2009- 2015 మధ్య కాలంలో గ్రీన్‌పీస్ ఇంటర్నేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు. తెలుగు మూలాలున్న తల్లిదండ్రులకు జన్మించినా మిగిలిన భారత సంతతి ప్రజల మాదిరిగానే నాయుడు కూడా తనను నల్లజాతి దక్షిణాఫ్రికా పౌరునిగానే భావించి, తెల్లజాతి పాలకులపై పోరు సాగించారు. చదువుకునే రోజుల్లో అక్కడి ఎమర్జెన్సీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పలుమార్లు అరెస్టయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : కుమీ నాయుడు

ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితా
ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా’ 100 మంది సెలబ్రిటీ జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ మరోసారి తొలి స్థానంలో నిలిచాడు. ఈ మేరకు ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితాను డిసెంబర్ 22న విడుదల చేసింది. అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారి పేర్లతో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. ఇందులో 232.83 కోట్ల ఆదాయంతో సల్మాన్‌ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. 170.50 కోట్ల ఆదాయంతో షారూఖ్‌ఖాన్ రెండో స్థానంలో, 100.72 కోట్ల ఆదాయంతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు.
2017 జాబితా
  1. సల్మాన్ ఖాన్ - రూ.232.83 కోట్లు
  2. షారుఖ్ ఖాన్ - రూ.170 కోట్లు
  3. విరాట్ కొహ్లీ - రూ.100.72 కోట్లు
  4. అక్షయ్ కుమార్ - రూ.98.25 కోట్లు
  5. సచిన్ టెండూల్కర్ - రూ.82.50 కోట్లు
  6. అమీర్ ఖాన్ - రూ.68.75 కోట్లు
  7. ప్రియాంక చోప్రా - రూ.68 కోట్లు
  8. ఎం.ఎస్.ధోని - రూ.63.77 కోట్లు
  9. హృతిక్ రోషన్ - రూ.63.12 కోట్లు
  10. రవీణ్‌వీర్ సింగ్ - 62.63 కోట్లు
తెలుగు సెలబ్రిటీలు
  1. పీవీ సింధూ - 13వ స్థానం - రూ.57.25 కోట్లు
  2. రాజమౌళి - 15వ స్థానం - రూ.55 కోట్లు
  3. ప్రభాస్ - 22వ స్థానం - రూ.36.25 కోట్లు
  4. సైనా నెహ్వాల్ - 29వ స్థానం - 31 కోట్లు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితా
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : తొలి స్థానంలో సల్మాన్ ఖాన్
ఎక్కడ : భారత్‌లో
ఎందుకు : అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారు

దాణా కేసులో లాలూని దోషిగా ప్రకటించిన సీబీఐ కోర్టు
21 ఏళ్లనాటి దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఒక కేసులో ఆయన జైలు శిక్ష ఎదుర్కొంటూ ఉండగా.. డిసెంబర్ 23న మరో కేసులో రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అదే సమయంలో మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(80)తో పాటు ఆరుగురిని నిర్దోషులుగా పేర్కొంది. జనవరి 3న దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 1991-94 మధ్య కాలంలో దేవ్‌గఢ్ ఖజానా నుంచి రూ. 89.27 లక్షల్ని అక్రమంగా విత్‌డ్రా చేసిన దాణా కేసులో ఈ తీర్పు వెలువడింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటించిన కోర్టు
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : సీబీఐ ప్రత్యేక కోర్టు

నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్
అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్‌కు తపాలా శాఖ అరుదైన గౌరవం కల్పించింది. మిమిక్రీ కళలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న వేణుమాధవ్ 86వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనపై తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించింది. డిసెంబర్ 26న హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసు (జీపీవో)లో నిర్వహించిన కార్యక్రమంలో సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ ఈ కవర్‌ను ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : తపాలా శాఖ

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ
వరుసగా రెండోసారి విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ మేరకు డిసెంబర్ 26న నిర్వహించిన కార్యక్రమంలో రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, మంత్రులుగా మరో 18 మంది ప్రమాణం చేశారు. వీరిలో నితిన్ పటేల్ సహా 9 మంది కేబినెట్ మంత్రులు కాగా.. మిగతా 10 మంది సహాయ మంత్రులు.
ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు సాధించి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎందుకు : గుజరాత్‌లో వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజీపీ

హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ (52) డిసెంబర్ 27న ప్రమాణస్వీకారం చేశారు. షిమ్లాలోని రిడ్‌‌జ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సీఎంతోపాటుగా మరో 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్‌కే అడ్వాణీతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గానూ బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జైరామ్ ఠాకూర్

ఐఓఏ కొత్త అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా
Current Affairs
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఎన్నికయ్యారు. డిసెంబర్ 14న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 142 ఓట్లు రాగా ప్రత్యర్థి అనిల్ ఖన్నాకు 13 ఓట్లు వచ్చాయి. ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. బాత్రా ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఐఓఏ కార్యదర్శిగా రాజీవ్ మెహతా ఎన్నికవగా, కోశాధికారిగా ఆనందీశ్వర్ పాండే గెలిచారు. నూతన కార్యవర్గం నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఒలింపిక్ సంఘం కొత్త అధ్యక్షుడి ఎన్నిక
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : నరీందర్ బాత్రా
ఎక్కడ : ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో

ఎన్‌ఐఎన్ డెరైక్టర్‌గా డాక్టర్ హేమలత
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) నూతన డెరైక్టర్‌గా సీనియర్ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్.హేమలత నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం డిసెంబర్ 14 న ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తిచేసిన హేమలత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలోని ఎన్‌ఐఎన్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా చేరారు. గర్భిణులు, నవజాత శిశువులకు పౌష్టికాహారం వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. పరిశోధన రంగంలో ఆమె అందించిన సేవలకు 2016లో ‘ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్’, 2017 లో ‘ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ న్యూట్రిషన్ సెన్సైస్’ అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పోషకాహార సంస్థ నూతన డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఆర్.హేమలత
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : పూర్తిస్థాయి డెరైక్టర్‌ను నియమించడంలో భాగంగా

బాలీవుడ్ నటుడు నీరజ్ ఓరా కన్నుమూత
బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు నీరజ్ ఓరా డిసెంబర్ 14న మరణించారు. ఓరాకు 2016, అక్టోబర్‌లో గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సత్య, ఫిర్ హెరా ఫెరి, దౌడ్ వంటి సినిమాలతో ఓరా గుర్తింపు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీరజ్ ఓరా కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు

రిటైర్‌మెంట్ ప్రకటించిన సోనియా గాంధీ
ఏఐసీసీ అధ్యక్షుడిగా డిసెంబర్ 16న రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ రిటైర్‌మెంట్ ప్రకంటించారు. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా 19 ఏళ్ల 9 నెలలు అధ్యక్షురాలిగా ఉన్నారు. సోనియా నాయకత్వంలో 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 114 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో 1999-2004 మధ్యలో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి విజయంతో సోనియా ప్రధాని కావాల్సి ఉండగా ఆమె విదేశీయురాలు కావడంతో ప్రధాని పదవి చేపట్టలేకపోయారు. దీంతో తన అనుచరుడు మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపికచేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిటైర్‌మెంట్ ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షురాలు
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : సోనియా గాంధీ
ఎందుకు : ఆరోగ్య కారణాలరీత్యా

ఇ-సైకిల్ ప్రచారకర్తగా సల్మాన్‌ఖాన్
ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ సైకిల్ తొక్కనున్నాడు. ఢిల్లీ-మీరట్‌ల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైకిల్ ట్రాక్‌పై సల్మాన్ ఇ-సైకిల్ సవారీ చేస్తారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం ఈ ట్రాక్‌ను నిర్మిస్తోందని, దీనికి అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్ కొనసాగుతారని గడ్కరీ తెలిపారు. నగరంలో చిన్నపాటి దూరాలకు సైకిల్ సవారీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సల్మాన్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేశారు. ఢిల్లీలో కాలుష్యం స్థాయికి మించి పెరిగిపోవడంతో... డీజిల్, పెట్రోలు వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇ-సైకిల్ ప్రచారకర్త
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : సల్మాన్ ఖాన్
ఎక్కడ : ఢిల్లీ-మీరట్‌ల మధ్య
ఎందుకు : ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు

‘మిస్ ఇండియా-యూఎస్‌ఏ’గా శ్రీసైని
‘మిస్ ఇండియా యూఎస్‌ఏ-2017’ కిరీటం వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన శ్రీసైని (21) అనే విద్యార్థినిని వరించింది. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా కనెక్టికట్‌కు చెందిన వైద్య విద్యార్థిని ప్రాచీ సింగ్ (22), రెండో రన్నరప్‌గా నార్త్ కరోలినాకు చెందిన ఫరీనా నిలిచారు. న్యూజెర్సీలోని రాయల్ అల్బర్‌‌ట్స ప్యాలెస్‌లో డిసెంబర్ 17న మూడు విభాగాల్లో నిర్వహించిన మిస్ ఇండియా యూఎస్‌ఏ పోటీల్లో 24కు పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 మంది పాల్గొన్నారు. కాగా మిసెస్ ఇండియా యూఎస్‌ఏగా ఫ్లోరిడాకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణురాలు కవితా మల్హోత్రా పట్టాని ఎంపికయ్యారు. మొదటి రన్నరప్ టైటిల్‌ను ప్రేరణ, రెండో రన్నరప్ టైటిల్‌ను ఐశ్వర్య సాధించారు. మిస్ టీన్ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని న్యూజెర్సీకి చెందిన స్వప్న మన్నం(17) గెలుచుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ ఇండియా-యూఎస్‌ఏ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : శ్రీసైనీ
ఎక్కడ : న్యూజెర్సీ

జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు సేవలందించిన జస్టిస్ స్వతంత్ర కుమార్ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత ఈ పదవికి ఇంకా ఎవరినీ నియమించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ కుమార్ 2012 డిసెంబరు 20న ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అనంతరం అనేక కీలక తీర్పులను వెలువరించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడ్డారు. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను నిషేధించడం, గంగ, యమున నదుల ప్రక్షాళన చేపట్టడం, హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమంగా నిర్మించిన హోటళ్లను కూల్చేయడం తదితరాలన్నీ ఈయన తీర్పుల వల్ల జరిగినవే. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి రోజుకు 50 వేల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి వీల్లేదనీ, అమర్‌నాథ్ వద్ద ప్రజలు గట్టిగా అరుస్తూ శివనామ స్మరణ చేయకూడదని కూడా జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆదేశించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ
Current Affairs
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(47) నియమితులయ్యారు. రాహుల్ తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి డిసెంబర్ 16న బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన మొత్తం 89 నామినేషన్లు ఉపసంహరించుకోగా రాహుల్ నామినేషన్ మాత్రమే మిగిలింది. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులైనట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ ఎం.రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ-గాంధీ వారసత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : రాహుల్ గాంధీ

ఆలోచనాపరుల జాబితాలో కమలా హ్యారిస్
ప్రపంచ అత్యుత్తమ ఆలోచనాపరుల జాబితాలో భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ అగ్రస్థానంలో నిలిచారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ మ్యాగజీన్’ 2017 సంవత్సరానికి డిసెంబర్ 5న 50 మంది పేర్లతో ఒక జాబితాను ప్రకటించింది. ఇందులో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్న కమలా హ్యారిస్‌తోపాటు భారత సంతతికి చెందిన హసన్ మిన్హాజ్, నిక్కీ హేలీలకు చోటు దక్కింది.

తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంఎస్ పవార్
తూర్పు నౌకాదళానికి నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంఎస్ పవార్ డిసెంబర్ 11న బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ న్యూఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ డిఫెన్‌‌స స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా బదిలీ అయ్యారు. దీంతో 1978 యూపీఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన ఎంఎస్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. పవార్ ప్రస్తుతం సీబర్డ్ ప్రాజెక్టు డెరైక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు గుజరాత్, మహారాష్ట్రలో ఫ్లాగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. పవార్ 1999 కార్గిల్ యుద్ధం సమయంలో వెస్ట్రన్ ఫ్లీట్‌కు ఫ్లీట్ నేవిగేషన్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు పరమ విశిష్ట సేవా పురస్కారం లభించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఎంఎస్ పవార్
ఎక్కడ : విశాఖపట్నం
ఎందుకు : ప్రస్తుత చీఫ్ అతుల్ కుమార్ జైన్ బదిలీ అవడంతో

డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ కన్నుమూత
ప్రముఖ శాస్త్రవేత్త, భారత డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ (70) డిసెంబర్ 10న కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో జన్మించిన సింగ్ బీహెచ్‌యూలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఇదే యూనివర్సిటీకి 25వ వైస్‌చాన్స్ లర్‌గా పనిచేశారు.
లాల్జీసింగ్ హైదరాబాద్‌లోని కేంద్ర డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఓఎస్డీగా (1995-99)కూడా సేవలందించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపకుల్లో లాల్జీ ఒకరు. ల్యాకోన్‌‌స, జెనోమ్ ఫౌండేషన్ (పేదప్రజలకు జన్యుపరమైన సమస్యలకు చికిత్సనందించే సంస్థ) వంటి పలు సంస్థలను ఆయన స్థాపించారు.
దేశంలో డీఎన్‌ఏ ఆధారంగా పితృత్వాన్ని నిర్ధారించే పరీక్షలను లాల్జీ సింగ్ అభివృద్ధి చేశారు. 1991లోనే డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా డీఎన్‌ఏను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టడం ద్వారా ఓ పితృత్వ కేసును నిర్ధారించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, పంజాబ్ మాజీ సీఎం బియంత్ సింగ్ హత్య కేసుల్లోనూ మృతుల నిర్ధారణకు ఈ టెక్నాలజీనే ఉపయోగించారు.
లాల్జీసింగ్ హైదరాబాద్‌లోని సీసీఎంబీ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల ఆధారంగా అంతరించిపోతున్న జీవజాతుల సంతతిని పెంచేందుకు లేబొరేటరీ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఎన్‌డేంజర్డ్ స్పీషీస్ (ల్యాకోన్‌‌స)ను ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : లాల్జీసింగ్
ఎక్కడ : భారత్‌లో

‘మీ టూ’ ఉచ్చులో ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు తమ వివరాలు బహిర్గతం చేస్తున్న ‘మీ టూ’ హ్యాష్ ట్యాగ్ ఉచ్చులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుకున్నాడు. డిసెంబర్ 12న న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో జెస్సీకా లీడ్‌‌స, రేఛల్ క్రూక్స్, సమంతా హాల్వే అనే మహిళలతో పాటు 16 మంది ట్రంప్ తమపై లైంగికదాడికి యత్నించాడని ఆరోపించారు. తమ అనుమతి లేకుండానే చుంబించడం, సున్నిత ప్రదేశాలను తాకడం వంటి అవాంఛిత చర్యలకు ట్రంప్ పాల్పడ్డారని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మీ టూ’ ఉచ్చులో అమెరికా అధ్యక్షుడు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : మహిళలను లైంగికంగా వేధించినందుకు

సీపీసీ సమావేశాలకు ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు ఆహ్వానం
Current Affairs
బీజింగ్‌లో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సమావేశాలకు సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్‌రెడ్డిలను చైనా ఆహ్వానించింది. ఈ మేరకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే ‘ప్రపంచ రాజకీయ పార్టీలతో సీపీసీ చర్చలు’ సమావేశాల్లో వారు పొల్గొననున్నారు. ఈ సమావేశాలకు 120 దేశాలనుంచి దాదాపు 200 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీపీసీ సమావేశానికి ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు ఆహ్వానం
ఎప్పుడు : నవంబర్ 30 నుంచి డిసెంబర్ 03 వరకు
ఎవరు : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా
ఎక్కడ : బీజింగ్, చైనా

తెలుగులో సానియా మీర్జా ఆత్మకథ
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ‘ఏస్ అగెనైస్ట్ ఆడ్‌‌స’ తెలుగు అనువాదం ‘టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా’ పేరుతో నవంబర్ 29న విడుదలైంది. సానియా కెరీర్ విశేషాలతో కూడిన ఈ పుస్తకంను ‘సాక్షి’ క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది తెలుగులోకి తర్జుమా చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగులో సానియా మీర్జా ఆత్మకథ
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : సాక్షి క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది

జీఈఎస్ సదస్సులో స్టార్టప్‌ల చాంపియన్ అజైతా షా
హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో స్టార్టప్‌ల ‘పిచ్’ కాంపిటీషన్‌లో రాజస్తాన్‌కు చెందిన అజైతా షా తుది విజేత (గ్రాండ్ చాంపియన్)గా నిలిచారు. సదస్సును పురస్కరించుకుని స్టార్టప్ కంపెనీలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్‌‌స అండ్ టెక్నాలజీ (జిస్ట్)’ఆధ్వర్యంలో పిచ్ కాంపిటీషన్‌ను నిర్వహించారు.
అజైతా షా రాజస్తాన్‌లో ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారు. సౌరశక్తి వినియోగం, సౌరశక్తి ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటంతో పాటు మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె కృషి చేస్తుంది.ఆమెకు దాదాపు 4 లక్షల డాలర్ల విలువైన బహుమతులను అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టార్టప్‌ల పిచ్ కాంపిటీషన్ గ్రాండ్ చాంపియన్
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : అజైతా షా
ఎక్కడ : జీఈఎస్ సదస్సు, హైదరాబాద్
ఎందుకు : మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె చేస్తున్న కృషికి

ఐరాస ప్రచారకర్తగా దియామీర్జా
బాలీవుడ్ నటి దియామీర్జా ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారవేత్తగా నియమితులయ్యారు. భారత్‌లో పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, సముద్రాల పరిరక్షణ, అడవుల సంరక్షణ తదితర అంశాలపై పలు కార్యక్రమాల ద్వారా ఆమె అవగాహన కల్పించనున్నారు. కేట్ బ్లాంకెట్, అన్నా హాతావే, ఏంజెలీనా జోలీ తదితర హాలీవుడ్ నటులు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రచారంలో భాగస్వామ్యులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారవేత్త నియామకం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : బాలీవుడ్ నటి దియామీర్జా
ఎక్కడ : భారత్
ఎందుకు : కాలుష్యం, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి

మాజీ సీజేఐ ఆదర్శ్ సేన్ ఆనంద్ కన్నుమూత
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ సేన్ ఆనంద్ (81) గుండె పోటుతో డిసెంబర్ 1న కన్నుమూశారు. 1936లో కశ్మీర్‌లో జన్మించిన ఆనంద్ లక్నో వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 1975లో కశ్మీర్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు. 1998-2001 కాలంలో సుప్రీంకోర్టుకు 29వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2003-06 కాలంలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. డీకే బసు కేసులో ఖైదీల హక్కులపై ఆయన ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా పరిగణిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ సీజేఐ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఆదర్శ్ సేన్ ఆనంద్
ఎందుకు : గుండెపోటుతో

ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా సలీల్ పరేఖ్
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కొత్త సీఈవో, ఎండీగా సలీల్ ఎస్ పరేఖ్ డిసెంబర్ 2న నియమితులయ్యారు. 2018 జనవరి 2న బాధ్యతలు చేపట్టనున్న పరేఖ్ అయిదేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఐటీ సేవల రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గల పరేఖ్ ప్రస్తుతం క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ కొత్త సీఈవో నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : సలీల్ ఎస్ పరేఖ్

బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత
బాలీవుడ్ నటుడు శశికపూర్(79) డిసెంబర్ 4న ముంబైలో కన్నుమూశారు. ఈయన పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడు. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లో కన్పించారు. 1961లో ధర్మపుత్ర సినిమాతో హీరోగా ప్రస్థానం ప్రారంభించి 116 చిత్రాల్లో నటించారు. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శశి కపూర్ 2011లో పద్మభూషణ్, 2015లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎక్కడ : ముంబై
ఎందుకు : మూత్రపిండాల సమస్యతో

వ్యవసాయ పథకాలకు ప్రచారకర్తగా అక్షయ్ కుమార్
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన వంటి వ్యవసాయ పథకాలకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. టీవీల్లో ప్రకటనల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి అక్షయ్‌ను ప్రచారకర్తగా నియమించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 6న తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర వ్యవసాయ పథకాలకు ప్రచారకర్త నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : అక్షయ్ కుమార్
ఎందుకు : టీవీ ప్రకటనల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి
Published date : 16 Dec 2017 03:32PM

Photo Stories