Skip to main content

SBI Chairman: ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సీఎస్‌ సెట్టీ

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్‌ శెట్టి) బాధ్యతలు స్వీకరించారు.
Challa Sreenivasulu Setty Takes Charge As SBI Chairman

ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన దినేష్‌ ఖరా పదవీ కాలం ఆగ‌స్టు 27వ తేదీ ముగిసింది. 
ఎస్‌బీఐ దేశంలోనే అత్యంత విలువైన ఆర్థిక సేవల సంస్థగా ఎదిగేందుకు కృషి చేస్తుందని, నికర లాభాలు పెంచుకుంటుందని సీఎస్‌ శెట్టి అన్నారు.

ఎస్‌బీఐని అత్యుత్తమ బ్యాంక్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని సీఎస్‌ శెట్టి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. 50 కోట్లకు పైగా కస్టమర్లకు ఎస్‌బీఐ సగర్వంగా సేవలు అందిస్తోందని, వివిధ విభాగాల్లో మార్కెట్‌ అగ్రగామిగా ఉందని, అతిపెద్ద బ్యాలెన్స్‌ షీట్‌ పరంగా ఆస్తులపై ఒక శాతం రాబడి నిష్పత్తిని సాధించింద‌ని ఆయ‌న అన్నారు.  

2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ లాభం రూ.61,077 కోట్లుగా ఉంది. బ్యాంక్‌ చరిత్రలో ఇదే గరిష్ట రికార్డు. 

తెలుగుతేజం.. అపార అనుభవం.. 
కొత్త చైర్మన్ శ్రీనివాసులు శెట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా, మానవపాడు మండలంలోని ఓ మారుమూల గ్రామం పెద్దపోతులపాడులో జన్మించారు. ఆయన బాల్యం పూర్తిగా ఇదే గ్రామంలో గడిచింది. 7వ తరగతి వరకూ గ్రామంలోనే విద్యనభ్యసించిన ఆయన, అనంతరం గద్వాల్‌లో పదవ తరగతి, ఇంటర్‌ పూర్తిచేశారు. అటు తర్వాత హైదరాబాద్‌ వచ్చి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రికల్చరల్‌ బీఎస్సీ పూర్తిచేశారు. 

ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్‌ ప్రారంభం..  
1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో తన కెరీర్‌ను ప్రారంభించారు. గుజరాత్‌లో తొలుత పోస్టింగ్‌లో చేరిన ఆయనకు బ్యాంకింగ్‌లో మూడు దశాబ్దాల అపార అనుభవం  ఉంది. ఎస్‌బీఐలో పలు బాధ్యతలను ఆయన నిర్వహించారు. ముఖ్యంగా నాలుగేళ్లపాటు ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్స్‌లో భాగంగా ఎస్‌బీఐ ఓవర్సీస్‌ బాధ్యతలు స్వీకరించి అమెరికాలో పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎస్‌బీఐ ఎండీగా పదోన్నతి పొందారు.

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌లో సర్టిఫైడ్‌ అసోసియేట్‌గా పనిచేశారు. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ టాస్క్‌ఫోర్స్‌లు, కమిటీలకు నేతృత్వం వహించిన శెట్టి, ఎస్‌బీఐ మెనేజింగ్‌ డైరెక్టర్‌గా, బ్యాంక్‌ రిటైల్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించారు.

Sindhu Gangadharan: నాస్కామ్‌ చైర్‌పర్సన్‌గా సింధు గంగాధరన్‌

Published date : 30 Aug 2024 08:49AM

Photo Stories