Chopper Crash: హెలికాప్టర్ కూలి తొలి సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం
భారతీయ సైనిక బలగాల చరిత్రలో ప్రఖ్యాతి గాంచిన వీర యోధుడిని హెలికాప్టర్ ప్రమాదం కబళించింది. డిసెంబర్ 8న తమిళనాడు రాష్ట్రం కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్(చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) జనరల్ బిపిన్ రావత్(63), ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. రావత్ మరణాన్ని భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని ఐఏఎఫ్ ప్రకటించింది. ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే బతికి బయటçపడగా, ఆయన వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు.
మరణించిన వారిలో..
ప్రమాదం కారణంగా మరిణించిన వారిలో జనరల్ రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కే సింగ్, నాయక్ గురుసేవక్‌సింగ్, నాయక్ జితేందర్ కుమార్, లాన్స్‌నాయక్ వివేక్, లాన్స్ నాయక్ బీ సాయితేజ, హవల్దార్ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్ ఉన్నారు. వీరిలో సాయితేజ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. రావత్‌కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు.
కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో..
తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లో ఉన్న డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో ప్రసంగించేందుకు రావత్ రావాల్సిఉంది. ఇదే కాలేజీలో రావత్ గతంలో విద్యాభ్యాసం చేశారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలుత సూలూర్ ఎయిర్‌బేస్(తమిళనాడు)కు రావత్ బృందం చేరింది. అక్కడి నుంచి వెల్లింగ్టన్ స్టాఫ్ కాలేజీకి ఎంఐ– 17వీహెచ్ హెలికాప్టర్‌లో వారు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతం(కూనూర్ సమీపం)లో ఛాపర్ కూలిపోయింది. ప్రమాదం వల్ల చాఫర్‌లో మంటలు చేలరేగాయి. గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు.
సీసీఎస్ అత్యవసర సమావేశం
రావత్ ప్రయాణిస్తున్న ఛాపర్ క్రాష్ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశమైంది. ఇందులో రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. రావత్ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్‌గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.