CBDT(Central Board of Direct Taxes) చైర్మన్‌గా నితిన్ గుప్తా
ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) చైర్మన్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి నితిన్ గుప్తా నియమితులైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఆదాయపు పన్ను కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి గుప్తా, ప్రస్తుతం సీబీడీటీ బోర్డులో సభ్యుడిగా (విచారణ) పనిచేస్తున్నారు. ఆయన వచ్చే ఏడాది సెప్టెంబర్ లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. గుప్తా నియామకానికి నియామకపు వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసిందని, బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ఉత్తర్వులు తెలిపాయి.
Also read: Chagari Praveen Kumar: న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌గా జస్టిస్ ప్రవీణ్‌కుమార్
జేబీ మహాపాత్ర ఏప్రిల్ 30న పదవీ విరమణ చేసిన తర్వాత సీబీడీటీ చీఫ్ పదవిని ప్రస్తుతం బోర్డు సభ్యురాలు, 1986–బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి సంగీతా సింగ్ అదనపు హోదాలో నిర్వహిస్తున్నారు. సీబీడీటీకి చైర్మన్ నేతృత్వం వహిస్తారు. ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఆరుగురు సభ్యులు బాధ్యతలు నిర్వహించే వీలుంది. అయితే ప్రస్తుతం బోర్డ్‌లో ఐదుగురు సభ్యులు (నితిన్ గుప్తా, సంగీతా సింగ్‌సహా) ఉన్నారు. వీరిలో 1985 బ్యాచ్ ఐఆర్‌ఎస్ అధికారి అనూజా సారంగీ అత్యంత సీనియర్ అధికారి. ఇతర సభ్యులు ప్రగ్యా సహాయ్ సక్సేనా, సుబశ్రీ అనంతకృష్ణన్ ఇరువురూ ఐఆర్‌ఎస్ 1987 బ్యాచ్‌కి చెందినవారు.