Skip to main content

Supreme rejects same-sex marriage: స్వలింగ వివాహాల చట్టబద్ధతను నిరాకరించిన‌ సుప్రీం

స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది.
Supreme rejects same-sex marriage,Indian Supreme Court denies legalizing same-sex marriages, defers to Parliament
Supreme rejects same-sex marriage

‘‘అది న్యాయస్థానానికి సంబంధించింది కాదు. పార్లమెంటు పరిధిలోని అంశం. కోర్టులు చట్టాలు చేయవు. వాటిని మంచి చెడులను బేరీజు వేస్తాయంతే’’ అని పేర్కొంది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకు పెళ్లాడే స్వేచ్ఛ, హక్కు ఉంటాయని స్పష్టం చేసింది.

Indian Army installs first ever mobile tower at Siachen Glacier: ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో మొబైల్‌ టవర్‌ను ఏర్పాటు చేసిన‌ భారత జవాన్లు

అంతేగాక ఇతరుల మాదిరిగానే వారికి అన్ని రకాల హక్కులూ సమానంగా ఉంటాయని, వారిపై వివక్ష చూపొద్దని పేర్కొంది. వారి హక్కులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయమై సాధారణ ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. తద్వారా స్వలింగ సంపర్కులు వివక్ష ఎదుర్కోకుండా చూడాలని పేర్కొంది. అలాగే స్వలింగ బంధాలు పట్టణ, సంపన్న వర్గాలకు పరిమితమైన ధోరణి అన్న కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని ధర్మాసనం తప్పుట్టింది.

‘‘స్వలింగ సంపర్కం అనాది కాలం నుంచీ ఉన్న సహజ ధోరణే. అది కేవలం పట్టణాలకో, సంపన్న వర్గాలకో సంబంధించింది కాదు. ఈ విషయంలో కుల, సామాజిక వర్గ భేదాలూ ఉండవు. కనుక ఆ అపోహను వదిలించుకోవాలి’’ అని సూచించింది. కాకపోతే స్వలింగ జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కుండబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 3:2తో మెజారిటీ తీర్పు వెలువరించింది. దత్తతతో పాటు పలు న్యాయపరమైన అంశాల విషయంలో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌తో న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్, జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ విభేదించారు. 

Why Mahatma Gandhi Opposed Jewish Nation: పాలస్తీనాలో ప్రత్యేక యూదుల‌ రాజ్య స్థాపనను గాంధీ ఎందుకు వ్యతిరేకించారు

నాలుగు తీర్పులు 

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2018లో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కూడా కల్పించాలంటూ ఎల్‌జీబీటీక్యూఐఏ++ వర్గాల తరఫున 21 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుదీర్ఘ విచారణ అనంతరం గత మే 11న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా దీనిపై మొత్తం 4 తీర్పులు వెలువరించింది. మొత్తం అంశంపై సీజేఐ 247 పేజీల తీర్పు వెలువరించారు. స్వలింగ జంటల దత్తత తదితర అంశాలపై సీజేఐ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ జస్టిస్‌ కౌల్‌ విడిగా 17 పేజీల తీర్పు వెలువరించారు.

కాగా వాటితో విభేదిస్తూ తనతో పాటు జస్టిస్‌ కోహ్లీ తరఫున జస్టిస్‌ భట్‌ 89 పేజీల తీర్పు వెలువరించారు. దానితో పూర్తిగా ఏకీభవిస్తూ జస్టిస్‌ నరసింహ 13 పేజీల తీర్పు రాశారు. స్వలింగ ప్రవృత్తి సహజమైనదే తప్ప మానసిక రుగ్మత కాదని సీజేఐ స్పష్టం చేశారు. లైంగిక గుర్తింపు, ప్రవృత్తుల గురించి విచారణ జరిపే నెపంతో స్వలింగ జంటలను పోలీసులు వేధించవద్దని ఆదేశించారు. ఈ నిమిత్తం వారిని పోలీస్‌ స్టేషన్లకు పిలిపించడం గానీ, వారి నివాసాలకు వెళ్లడం గానీ చేయొద్దని చెప్పారు.  

దత్తతపై... 

అవివాహితులకు, స్వలింగ జంటలకు దత్తత హక్కుండదంటూ ధర్మాసనం 3:2 మెజారిటీతో తీర్పు వెలువరించింది. వారికి ఆ హక్కును నిషేధిస్తున్న దత్తత చట్ట నిబంధనలను సమర్థిస్తున్నట్టు పేర్కొంది. అయితే దీనిపై కూడా పార్లమెంటు సమగ్రంగా చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది.  

సమస్యల పరిష్కారానికి కమిటీ  

స్వలింగ సంపర్కులకు చట్టబద్ధ వివాహ హక్కు లేదని, రాజ్యాంగం ప్రకారం దాన్ని మౌలిక హక్కుగా పొందజాలరని పేర్కొంటూ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. అదే సమయంలో, స్వలింగ జంటల సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి తీసుకోవాల్సిన పాలనాపరమైన చర్యలను పరిశీలించేందుకు కేబినెట్‌ కార్యదర్శి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ వేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఎల్‌జీబీటీ కమ్యూనిటీతో పాటు సామాజిక తదితర రంగాల నిపుణులకు అందులో చోటుండాలని సూచించింది.

వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయానికైనా వచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు అన్ని వర్గాల వారి వాదనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేసింది. రేషన్‌ కార్డు తదితరాల నిమిత్తం స్వలింగ జంటను ఒకే కుటుంబంగా పరిగణించడం, ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరవడం, డెత్‌ బెనిఫిట్స్‌ తదితరాల నిమిత్తం తమలో ఒకరిని నామినీగా పేర్కొనడం వంటి సౌకర్యాలను కల్పించవచ్చేమో పరిశీలించాలని సూచించింది.
దాంతో ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హామీ ఇచ్చారు. అన్ని అంశాలనూ సమగ్రంగా పరిశీలించిన మీదట కమిటీ ఇచ్చే తుది నివేదికను కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాలనపరంగా అన్ని స్థాయిల్లోనూ అమలు చేయాలని సీజేఐ స్పష్టం చేశారు. ‘స్వలింగ జంటల బంధాన్ని చట్టపరంగా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేదంటే వారికి అన్యాయం చేసినట్టే అవుతుంది’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు.  

ఎల్‌జీబీటీక్యూఐఏ++ అంటే

లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్, క్వశ్చనింగ్, ఇంటర్‌సెక్స్, పాన్‌సెక్సువల్, టూ స్పిరిట్, అసెక్సువల్‌ తదితరులు  
కేవలం లైంగిక ప్రవృత్తి ఆధారంగా పెళ్లి చేసుకునే విషయంలో ఫలానా వారికి ఫలానా హక్కు వర్తించబోదని చెప్పబోవడం పొరపాటే అవుతుంది. స్వలింగ జంటలు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడాన్ని ఎవరూ నిషేధించలేరు. కానీ దానికి చట్టపరమైన గుర్తింపును మాత్రం ఇప్పటికైతే వారు కోరజాలరు. అలాగే దత్తత హక్కును కూడా! ఈ విషయంలో జస్టిస్‌ భట్‌ తీర్పుతో పూర్తిగా ఏకీభవిస్తున్నా        – జస్టిస్‌ నరసింహ 

ఎవరేమన్నారు..  

అవివాహితులు, స్వలింగ జంటలు దత్తత తీసుకోవడాన్ని నిషేధిస్తున్న సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌అథారిటీ (సీఏఆర్‌ఏ) నిబంధన 5(3) రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధం. స్త్రీ పురుష జంటలు మాత్రమే మంచి తల్లిదండ్రులు కాగలరన్న భావన సరికాదు. అది స్వలింగ జంటల పట్ల వివక్షే అవుతుంది. అసలు వివాహమనే బంధానికి సమానంగా వర్తించే సార్వత్రిక భావనంటూ ఏదీ లేనే లేదు – సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ 

స్వలింగ సంపర్కుల పట్ల జరుగుతున్న చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకు బహుశా ఇది సరైన సందర్భం. ఈ దిశగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ సకారాత్మక చర్యలు చేపట్టాలి. ఈ విషయంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నా  – జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ 

ఎల్‌జీబీటీక్యూఏఐ++ జంటల సమస్యలు మా దృష్టికి రాకపోలేదు. కానీ వారికి దత్తత హక్కు లేదన్న సీఏఆర్‌ఏలోని నిబంధన 5(3) చెల్లుబాటవుతుంది. అయితే స్వలింగ స్వభావులకు భాగస్వాములను ఎంచుకునేందుకు, సహజీవనం చేసేందుకు పూర్తి హక్కుంటుంది. అయితే ఆ బంధంతో వారికి దఖలు పడాల్సిన హక్కులను గుర్తించాల్సిన అనివార్యత మాత్రం ప్రభుత్వాలకు లేదు  -జస్టిస్‌ రవీంద్ర భట్, జస్టిస్‌ హిమా కోహ్లీ 

Published date : 19 Oct 2023 08:02AM

Photo Stories