Skip to main content

Supreme Court: ‘పెగాసస్‌’పై విచారణకు ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది?

Surpeme Court

దేశంలో కొంతమంది విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ పెగాసస్‌ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు కమిటీ నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో 300మందికి పైగా మొబైల్‌ ఫోన్లపై నిఘా ఉంచారంటూ మనోహర్‌లాల్‌ శర్మ,  ఎడిటర్స్‌ గిల్డ్‌ సహా పలువురు జర్నలిస్టులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం అక్టోబర్‌ 27న 46 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.

కమిటీ సభ్యులు

  • జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తులపై ఇటీవల కుట్ర ఆరోపణలు వచ్చినపుడు విచారణకు నియమితులైన జస్టిస్‌ రవీంద్రన్‌  ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీఎస్‌ఏ)కు 2013 నుంచి 2019 వరకూ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
  • ఆలోక్‌ జోషి: జస్టిస్‌ రవీంద్రన్‌కు సహాయకారిగా ఉంటారు. 1976 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆలోక్‌ జోషి ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంయుక్త డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషమైన దర్యాప్తు అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రిసెర్చ్, ఎనాలసిస్‌ వింగ్‌ (రా)లో కార్యదర్శిగా, నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చీ ఆర్గనైజేషన్‌కు చైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
  • డాక్టర్‌ సందీప్‌ ఒబెరాయ్‌ : ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సెక్యురిటీ నిపుణుడుగా గుర్తింపు పొందారు. టీసీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీస్‌ సర్వీసెస్‌ గ్లోబల్‌ హెడ్‌గా పనిచేశారు. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల రంగంలో సదుపాయాల అభివృద్ధికి సబ్‌ కమిటీ అయిన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ స్టాండరైజేషన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రో టెక్నికల్‌ కమిషన్, జాయింట్‌ టెక్నికల్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు.

సాంకేతిక కమిటీ సభ్యులు

  • డాక్టర్‌ నవీన్‌కుమార్‌ చౌధరి(సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ప్రొఫెసర్‌)
  • డాక్టర్‌ పి.ప్రభాహరన్‌(కంప్యూటర్‌ సైన్స్, సెక్యూరిటీ విభాగంలో ప్రొఫెసర్‌) 
  • డాక్టర్‌ అశ్విన్‌ అనిల్‌ గుమస్తే(కంప్యూటర్‌సైన్స్‌ ఇంజినీరింగ్‌లో ఇన్‌స్టిట్యూట్‌ చైర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

 

చ‌ద‌వండి: ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌వీ రవీంద్రన్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్‌ 27
ఎవరు    : భారత సుప్రీంకోర్టు
ఎందుకు : దేశంలో కొంతమంది విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ పెగాసస్‌ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 28 Oct 2021 03:19PM

Photo Stories