Coronavirus: పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. అప్రమత్తత ముఖ్యమన్న మోదీ

కోవిడ్ తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ మార్చి 22న ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘కోవిడ్ ఇంకా ముగిసిపోలేదు. జన్యుక్రమ విశ్లేషణ కొనసాగించండి. కోవిడ్ నిబంధనావళిని తప్పక పాటించండి. తీవ్ర శ్వాస సంబంధ కేసులు, ఇన్‌ఫ్లూయెంజా, సార్స్–కోవ్2 పరీక్షలు పెంచండి’ అని ఉన్నతాధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో పడకలు, మానవ వనరుల అందుబాటు తదితర సన్నద్ధతలనూ మోదీ సమీక్షించారు.
2020లో జనతా కర్ఫ్యూ పెట్టిన సరిగ్గా మూడేళ్ల తర్వాత అదేరోజు ప్రధాని కోవిడ్ సమీక్షా సమావేశం నిర్వహించడం గమనార్హం. ఎక్కువవుతున్న కోవిడ్ కేసులు, కోవిడ్ మళ్లీ విజృంభిస్తే ప్రజారోగ్య వ్యవస్థ ఏ మేరకు సంసిద్ధంగా ఉందనే వివరాలను ఆయన ఉన్నతాధికారులను అడిగి తెల్సుకున్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ దేశంలో కోవిడ్ తాజా పరిస్థితిపై మోదీకి ఒక ప్రజెంటేషన్ చూపించారు.