Skip to main content

New Parliament Building: ఇలలో ఇంద్రభవనం.. నూతన పార్లమెంట్‌ భవన విశేషాలు.. పాత‌, కొత్త‌ భ‌వ‌నానికి ఎంత తేడా అంటే..

కొత్త పార్లమెంటు ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. మిర్జాపూర్‌ కార్పెట్లు, నాగపూర్‌ టేక్‌ వుడ్, త్రిపుర వెదురు ఫ్లోరింగ్, రాజస్తాన్‌ శిల్పకళాకృతులతో మన దేశ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ధగధగలాడిపోతోంది
New Parliament Building

ఏక్‌ భారత్‌ శ్రేష్టభారత్‌ అన్న ప్రధాని మోదీ నినాదం అడుగడుగునా కనిపించేలా వివిధ రాష్ట్రాల్లో పేరు పొందిన సామగ్రితో భవన నిర్మాణం జరిగింది. కలర్స్‌ ఆఫ్‌ ఇండియాను తలపించేలా కలర్‌ ఫుల్‌గా ఉన్న పార్లమెంట్‌ భవన విశేషాలు..

► పార్లమెంటు భవన నిర్మాణంలో వినియోగించిన ఎరుపు, తెలుపు శాండ్‌ స్టోన్‌ను రాజస్థాన్‌లోని సర్‌మథుర నుంచి తెచ్చారు. ఢిల్లీలోని ఎర్రకోట, హుమాయూన్‌ సమాధి ఈ రాతితో చేసిన నిర్మాణాలే.
► భవన నిర్మాణంలో తలుపులు, కిటికీలకు వాడిన టేకు చెక్కని మహారాష్ట్ర నాగపూర్‌ నుంచి తెప్పించారు.
► రాజస్తాన్‌ ఉదయపూర్‌ నుంచి కెషారియా గ్రీన్‌
స్టోన్, అజ్మీర్‌ సమీపంలోని లఖ నుంచి రెడ్‌ గ్రానైట్, అంబాజీ నుంచి తెల్ల పాలరాయిని వాడారు.

Rs.75 Coin: రూ.75 నాణెం విడుదల.. ఈ నాణెం బరువు ఎంతంటే..?

► పార్లమెంటులో అమర్చిన కళ్లు చెదిరే ఫర్నిచర్‌ను ముంబైలో చేయించారు.
► లోక్‌సభ, రాజ్యసభ ఫాల్స్‌ సీలింగ్‌లో వాడిన ఉక్కుని కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్, డయ్యూ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.
► భవనంలోకి సహజంగా గాలి వెలుతురు వచ్చేలా ఉత్తరప్రదేశ్‌ లోని నోయిడా, రాజస్థాన్‌ రాజ్‌ నగర్‌ నుంచి జాలీల రాయిని తెప్పించి వేయించారు
► లోక్‌సభ, రాజ్యసభ చాంబర్‌లలో అశోక చక్రం డిజైన్‌ ఆకృతి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్తాన్‌ జైపూర్‌ నుంచి ఈ డిజైన్‌ రూపొందించడానికి కావాల్సిన సామాగ్రిని తీసుకువచ్చారు.


► శిల్ప కళాకృతుల్ని రూపొందించడానికి ఉదయ్‌పూర్‌ నుంచి వచ్చిన శిల్పులు రేయింబవళ్లు శ్రమించారు.  
► అహ్మదాబాద్‌ ఇత్తడిని వాడారు.
► త్రిపుర రాష్ట్రంలో లభించే అరుదైన వెదురుతో తయారు  చేసిన ఫ్లోరింగ్‌పై యూపీలోని మిర్జాపూర్‌లో తయారు చేసిన కార్పెట్లను పరిచారు.
► సనాతన సంప్రదాయాలు ఉట్టిపడేలా, వాస్తు శాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన 5 వేల కళాకృతులైన బొమ్మలు, పెయింటింగ్‌లు, కొన్ని ఫోటోలను ఏర్పాటుచేశారు.

Sengol: రాజరాజ చోళుడి కంటే ముందే ‘సెంగోల్‌’.. కొన్ని వందల ఏళ్ల క్రితమే వినియోగించిన బాదామీ చాళుక్యులు..!

రెండు భవనాలకి ఎంత తేడా..!
1. పాత భవనంలో లోక్‌సభ సభ్యులు 543 మంది రాజ్యసభలో 250 మంది కూర్చొనే సదుపాయం ఉంది. అదే కొత్త భవనంలో సామర్థ్యాన్ని బాగా పెంచారు. లోక్‌సభలో 888 మందికి రాజ్యసభలో 300 మందికి సీట్లు ఏర్పాటు చేశారు.
2- బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ సర్‌ ఎడ్విన్‌ ల్యుటెన్స్, హెర్బర్ట్‌ బేకర్‌ పాత భవనం డిజైన్‌ చేస్తే, కొత్త పార్లమెంటు భవనాన్ని అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్‌ ఆధునికంగా రూపొందించింది. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ బిమల్‌ పటేల్‌ పర్యవేక్షణలో డిజైన్‌ రూపొందించారు.
3. పాత భవనం గుండ్రంగా ఉంటూ 24, 281 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తే, కొత్త భవనాన్ని త్రిభుజాకారంలో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు.

New Parliament Building: ప్రారంభ ‘గౌరవం’పై పెను దుమారం.. గతానుభవాలు, సంప్రదాయాలు చెబుతున్నదేంటి..?

4. పాత భవనం నిర్మాణం రెండు అంతస్తుల్లో ఉంటే, కొత్తది 4 అంతస్తుల్లో నిర్మించారు.
5. పాత నిర్మాణానికి ఆరేళ్లు పడితే  కొత్త భవనాన్ని రెండున్నర ఏళ్లలో నిర్మించారు.
6. 1927లో ప్రారంభోత్సవం జరుపుకున్న పాత భవనానికి అప్పట్లోనే  రూ.85 లక్షలైతే , కొత్త భవనానికి వెయ్యి కోట్ల వరకు ఖర్చు అయింది.
7. పాత భవనంలో ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం సెంట్రల్‌ హాలులో నిర్మిస్తే, కొత్త భవనంలో లోక్‌సభ చాంబర్‌నే ఉభయ సభల సభ్యులు ఒకేసారి కూర్చొనేలా ఎక్కువ సీట్లతో సిద్ధంచేశారు.


8. పార్లమెంటు పాత భవనంలో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ అత్యంత ఆందోళనకరంగా ఉండేది. కొత్త భవనంలో అత్యంత ఆధునిక వ్యవస్థలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం అమర్చారు. అందుబాటులో ఉన్న డిజిటల్‌ టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీ, ఆడియో వీడియో వ్యవస్థ, ఓటింగ్‌కు బయోమెట్రిక్‌ వ్యవస్థ, ట్రాన్స్‌లేషన్‌ వ్యవస్థలు, ప్రోగ్రామబుల్‌ మైక్రోఫోన్స్, రీసౌండ్‌లు వినిపించకుండా వర్చువల్‌ సౌండ్‌ సిస్టమ్‌ వంటివన్నీ ఏర్పాటు చేశారు. భూకంపాలు వస్తే తట్టుకునే వ్యవస్థ ఏర్పాటు చేశారు. 150 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా భవన నిర్మాణం సాగింది.

New Parliament Building: రాజదండం సాక్షిగా.. పార్లమెంటులో చోళుల సెంగోల్‌

Published date : 29 May 2023 11:08AM

Photo Stories