Skip to main content

Constitution Day: ప్రాథమిక విధులే ప్రాథమ్యం

నవంబర్‌ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సుప్రీంకోర్టులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాథమిక విధుల నిర్వహణే పౌరుల ప్రథమ ప్రాథమ్యంగా ఉండాలని సూచించారు.

అన్ని రంగాల్లోనూ వృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్న భారత్‌వైపే ప్రపంచమంతా చూస్తోందన్నారు. 2023 జీ 20 శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించనుండటాన్ని ప్రపంచ శ్రేయస్సులో మన పాత్రను అందరి ముందుంచేందుకు అతి గొప్ప అవకాశంగా అభివర్ణించారు. ‘‘ప్రపంచం దృష్టిలో దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాలి. ఇది మనందరి బాధ్యత. రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రాచీనకాలం నుంచి వస్తున్న విలువలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్యానికి మాతృకగా భారత్‌ అలరారుతోంది. ఈ గుర్తింపును మరింత బలోపేతం చేయాలి’’ అని పిలుపునిచ్చారు.
‘‘వందేళ్ల స్వతంత్ర ప్రస్థానం దిశగా భారత్‌ వడివడిగా సాగుతోంది. ఇప్పటిదాకా నడిచింది అమృత కాలమైతే రాబోయే పాతికేళ్లను కర్తవ్య కాలంగా నిర్దేశించుకుందాం. ప్రాథమిక విధులను పరిపూర్ణంగా పాటిద్దాం. రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థల భవిష్యత్తూ దేశ యువతపైనే ఆధారపడి ఉంది. రాజ్యాంగంపై వారిలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరముంది. అప్పుడే సమానత్వం, సాధికారత వంటి ఉన్నత లక్ష్యాలను వారు మరింతగా అర్థం చేసుకుని ఆచరిస్తారు’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిషత్తులో మహిళా సభ్యుల పాత్రకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అందులో 15 మంది మహిళలుండేవారు. వారిలో ఒకరైన దాక్షాయణీ వేలాయుధన్‌ అణగారిన వర్గాల నుంచి వచ్చిన మహిళామణి’’ అని గుర్తు చేశారు. దళితులు, కార్మికులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకునేలా ఆమె కృషి చేశారన్నారు. 
మృతులకు నివాళి.. 
2008 నవంబర్‌ 26న ముంబైపై ఉగ్ర దాడికి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వాటిలో అసువులు బాసిన వారిని మోదీ గుర్తు చేసుకున్నారు. వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇ–కోర్టు ప్రాజెక్టులో భాగంగా తీసుకొచ్చిన వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్, జస్ట్‌ఈజ్‌ మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్ట్, ఎస్‌3వాస్‌ వంటి సైట్లు తదితరాలను ప్రారంభించారు. వీటిద్వారా కక్షిదారులు, లాయర్లు, న్యాయవ్యవస్థతో సంబంధమున్న వారికి టెక్నాలజీ ఆధారిత సేవలందించేందుకు వీలు కలగనుంది.  

సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
  
 

Published date : 28 Nov 2022 12:52PM

Photo Stories