World Directory of Modern Military Aircraft: ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌ఫోర్స్‌లలో.. భారత వైమానిక దళం

ప్రపంచంలో ఎక్కడైనా, ఏ యుద్ధమైనా ఇప్పుడు వైమానిక దళాలే కీలకం. వేగంగా, సులువుగా చొచ్చుకుపోయి శత్రువును తుద ముట్టించడం ఎయిర్‌ఫోర్స్‌కే సాధ్యం. మరి ఈ విషయంలో భారత వైమానిక దళం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌ఫోర్స్‌లలో.. దేశాల వారీగా చూస్తే మూడో స్థానంలో, వైమానిక దళాల వారీగా చూస్తే ఆరో స్థానంలో నిలిచింది. మొత్తంగా చైనా కన్నా మన ఎయిర్ ‘ఫోర్స్’ పైన ఉండటం గమనార్హం. ‘వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ (డబ్ల్యూడీఎంఎంఏ)’ సంస్థ క్షుణ్నంగా అధ్యయనం చేసి ఈ ర్యాంకులను ఇచ్చింది. ఈ వివరాలు ఏమిటో చూద్దామా..
అన్ని అంశాలనూ పరిశీలించి..
- ప్రతిదేశానికి నేరుగా ఎయిర్‌ఫోర్స్‌తోపాటు పదాతిదళం (ఆర్మీ), నావికా (నేవీ) దళాలకు కూడా అనుబంధంగా ప్రత్యేకంగా వైమానిక దళ విభాగాలు ఉంటాయి. ‘డబ్ల్యూడీఎంఎంఏ’ ఇలాంటి వాటన్నింటినీ కూడా ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేసింది. కేవలం యుద్ధ, రవాణా విమానాలు, హెలికాప్టర్ల సంఖ్యను మాత్రమేగాకుండా.. విమానాలు, సాంకేతికతల ఆధునీకరణ, రవాణా సౌకర్యం, తక్షణ యుద్ధ సన్నద్ధత, వేగంగా దాడులు చేయడంతోపాటు స్వీయ రక్షణ చర్యలు, భవిష్యత్తులో రానున్న కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ సదుపాయాలు, స్థానికంగా వైమానిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలన్నింటినీ పరిశీలించింది. వీటి ఆధారంగా 98 దేశాలకు చెందిన 124 వైమానిక/అనుబంధ దళాలకు.. ‘ట్రూవ్యాల్యూ రేటింగ్ (టీవీఆర్)’లను ఇచ్చింది.
- క్వాంటిటీ (సంఖ్య)తోపాటు క్వాలిటీ రెండింటి లోనూ అమెరికా దళాలు ప్రపంచంలోనే టాప్‌లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో యూఎస్ ఎయిర్‌ఫోర్స్ (టీవీఆర్ 242.9), యూఎస్ నేవీ (142.4) నిలవగా.. రష్యన్ ఎయిర్‌ఫోర్స్ (114.2) మూడో స్థానం సాధించింది. తిరిగి నాలుగు, ఐదో స్థానాల్లో యూఎస్ ఆర్మీ ఏవియేషన్ (112.6), యూఎస్ మెరైన్ కార్ప్స్ (85.3) నిలిచాయి. ఆరో స్థానంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (69.4) నిలిచింది.
- ఇదే దేశాల వారీగా చూస్తే మన ఎయిర్‌ఫోర్స్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడం గమనార్హం.
- మన కన్నా ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ (63.8) ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే చైనా పీఎల్‌ఏ నేవీ ఎయిర్‌ఫోర్స్ (49.3) 15వ స్థానంలో నిలిచింది.
- మన ఇండియన్ నేవీ ఏవియేషన్ (41.2 స్కోర్) 28వ స్థానంలో, ఆర్మీ ఏవియేషన్ (30 స్కోర్) 36వ స్థానంలో ఉండిపోయాయి.
రాశి కాదు.. వాసి ముఖ్యం
- ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు.. శత్రువులపై పైచేయి చూపించుకోవడం కోసం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర సాంకేతికలను విచ్చలవిడిగా పోగేసి పెట్టుకుంటున్నాయి. కానీ ఏళ్లు గడుస్తున్నా వాటి ఆధునీకరణ, ఆధునిక సాంకేతికతలను సమకూర్చుకోవడం, సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వడం వంటివి చేపట్టడం లేదు. అందుకే ‘అసలు’ సామర్థ్యంలో వెనుకబడిపోయినట్టు డబ్ల్యూడీఎంఎంఏ స్పష్టం చేసింది.
- యుద్ధ విమానాల సంఖ్య ఇండియాలో కంటే చైనాలో 30 శాతం ఎక్కువ. అయినా ర్యాంకింగ్స్‌లో చైనా ఎయిర్‌ఫోర్స్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెనుక నిలిచింది.
- దక్షిణ కొరియా ఎయిర్‌ఫోర్స్‌కు 890 విమానాలున్నా.. బ్రిటిష్ (475 విమానాలు11వ ర్యాంకు), ఇజ్రాయెల్ (581 విమానాలు9వ ర్యాంకు), ఫ్రాన్స్ (658 విమానాలు 10వ ర్యాంకు), జపాన్ (779 విమానాలు8వ ర్యాంకు)లకన్నా వెనుకబడి 12వ స్థానంలో నిలిచింది.
- ఇలాగే ఈజిప్ట్ ఎయిర్‌ఫోర్స్ (1,066 విమానాలు 22వ ర్యాంకు), ఉత్తర కొరియా ఎయిర్‌ఫోర్స్ (951 విమానాలు45వ ర్యాంకు) బాగా వెనుకబడి ఉన్నాయి.
దేశం |
యుద్ధవిమానాలు/హెలికాప్టర్ల సంఖ్య |
అమెరికా |
13,247 |
రష్యా |
4,173 |
చైనా |
3,285 |
ఇండియా |
2,186 |
దక్షిణ కొరియా |
1,595 |
జపాన్ |
1,449 |
పాకిస్తాన్ |
1,386 |
ఈజిప్ట్ |
1,062 |
టర్కీ |
1,057 |
ఫ్రాన్స్ |
1,055 |