ప్రపంచంలోనే అతిపెద్ద హైవే.. 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకు తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండటాన్ని మనం గమనించేవుంటాం. మనదేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికివస్తే అది నేషనల్ హైవే-44.
ఇది 3,745 కిలోమీటర్ల దూరం కలిగివుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే సంగతి మీకు తెలుసా?
ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది. రెండు మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది.
చదవండి: ఎన్‌హెచ్ నిర్మాణాల్లో ఏపీ టాప్
ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది.
కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్‌లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమంలో బైపాస్ చేస్తారు.
ఆ 14 దేశాలు ఇవే..
1. యునైటెడ్ స్టేట్స్
2.కెనడా
3. మెక్సికో
4. గ్వాటెమాల
5. ఎల్ సల్వడార్
6.హోండురాస్
7. నికరాగ్వా
8. కోస్టా రికా
9.పనామా
10.కొలంబియా
11. ఈక్వెడార్
12. పెరూ
13.చిలీ
14. అర్జెంటీనా
ప్రయాణానికి ఎంత సమయం పడుతుందంటే...
ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టివచ్చాడు. ఈ నేపధ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు.
చదవండి: చైనాలో కరోనా కొత్త వేరియంట్ కలకలం..ఏకంగా 6.5 కోట్ల మందికిపైగా..