Skip to main content

మార్చి 2018 అంతర్జాతీయం

457 వీసా పథకాన్ని రద్దు చేసిన ఆస్ట్రేలియా
Current Affairs
ఆస్ట్రేలియాపభుత్వం విదేశీ నిపుణులకు జారీచేసే 457 వీసా పథకాన్ని రద్దు చేసింది. భారతీయులు ఎక్కువగా లబ్ధిపొందుతున్న ఈ వీసా స్థానంలో కఠిన నిబంధనలతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఆస్ట్రేలియా వీసా పొందాలంటే ఇంగ్లిష్‌లో మంచి ప్రావీణ్యం, ఉద్యోగ నైపుణ్యం తప్పనిసరి.
అమెరికా తరహాలోనే ఆస్ట్రేలియా కూడా తమ పౌరులకే తొలి ప్రాధాన్యం ఇచ్చేలా 'ఆస్ట్రేలియా ఫస్ట్' విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 457 వీసా పథకాన్ని రద్దు చేస్తామని గతేడాదే ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్నబుల్ ప్రకటించారు. ఆ క్రమంలో 457 వీసాని రద్దు చేస్తూ.. దాని స్థానంలో టెంపరరీ స్కిల్ షార్టేజ్ (టీఎస్‌ఎస్) అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మార్చి 18 నుంచి ఈ కొత్త వీసా విధానం అమల్లోకి వచ్చింది.
విదేశీ ఉద్యోగుల వల్ల స్థానికులకు అవకాశాలు దక్కడం లేదని కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో తాజా వీసా పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఈ పరిణామం భారత్ టెకీలపై ప్రభావం చూపనుంది. 2017 చివరి నాటికి ఈ వీసా కింద ఆ దేశంలో 90,033 మంది ఉంటే వారిలో 21 శాతం మంది భారతీయులే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 457 వీసా పథకం రద్దు
ఎప్పుడు : మార్చి 18
ఎవరు : ఆస్ట్రేలియా
ఎందుకు : 'ఆస్ట్రేలియా ఫస్ట్' విధానంలో భాగంగా

చైనాపై వాణిజ్య ఆంక్షలు విధించిన యూఎస్
చైనా దిగుమతులపై 60 బిలియన్ డాలర్ల వార్షిక సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 22న కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ఏ వస్తువుపై ఎంత పన్ను విధించాలనే విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. ట్రంప్ నిర్ణయంతో చైనా నుంచి దిగుమతయ్యే 1300(దాదాపు) వస్తువుల ధరలు పెరగుతాయని ఆర్థికవేత్తల అంచనా. అయితే దీనికి ప్రతిగా చైనా సైతం అమెరికా వస్తువులపై టారిఫ్‌లు పెంచింది.

రష్యాలో అగ్ని ప్రమాదం.. 64 మంది మృతి
తూర్పు రష్యా, సైబీరియా ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌లో మార్చి 25న జరిగిన అగ్నిప్రమాదంలో 64 మంది మృతి చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. కెమెరొవో పట్టణంలో ఉన్న వింటర్ చెర్రీ అనే షాపింగ్ మాల్‌లో పిల్లల ఆటల కేంద్రాలు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు తదితర సౌకర్యాలు ఉంటాయి. వారాంతపు సెలవులకు సరదాగా గడపడానికి వచ్చిన పిల్లలు, తల్లితండ్రులతో షాపింగ్‌మాల్ రద్దీగా తయారైంది. వారంతా సంబరాలు చేసుకుంటుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : షాపింగ్‌మాల్‌లో అగ్ని ప్రమాదం.. 64 మంది మృతి
ఎప్పుడు : మార్చి 25
ఎక్కడ : సైబీరియాలోని కెమెరొవో పట్టణం, రష్యా
ఎందుకు : అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో

రష్యా దౌత్యవేత్తల బహిష్కరణ

బ్రిటన్‌లో రష్యా మాజీ గూఢచారిపై జరిగిన రసాయన దాడికి నిరసనగా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరిస్తున్నట్లు అమెరికా, కెనడా, ఉక్రెయిన్, ఈయూ(ఐరోపా సమాఖ్య) దేశాలు మార్చి 26న ప్రకటించాయి. ఇదే బాటలో మరికొన్ని దేశాలు సైతం నడవనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం రష్యా మాజీ గూఢచారి స్క్రిపాల్, ఆయన కుమార్తె యులియాపై విషప్రయోగం (నొవిచోక్-నెర్వ్ ఏజెంట్ ప్రయోగం) జరిగింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్క్రిపాల్‌పై దాడి చేసింది రష్యా అధికారులేనని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే రష్యా మాత్రం వాటిని ఖండించింది.

భూమిపై మిగిలిన ఒకేఒక తెల్లని మగ ఖడ్గమృగం మృతి
Current Affairs భూమిపై మిగిలిన ఒకేఒక తెల్లని మగ ఖడ్గమృగం "సుడాన్"కన్నుమూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న సూడాన్ చనిపోయిందని కెన్యాలోని ఓఐ పెజెతా కన్జర్వెన్సీ మార్చి 20న తెలిపింది. వయోభారం, కాలికి సోకిన ఇన్ఫెక్షన్ కారణంగానే సూడాన్ మరణించిందని వెల్లడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూమిపై మిగిలిన ఒకేఒక తెల్లని మగ ఖడ్గమృగం "సుడాన్"మృతి
ఎప్పుడు : మార్చి 20
ఎక్కడ : నైరోబి, కెన్యా

చైనా రక్షణమంత్రిగా లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘే
ప్రపంచంలో చైనాను మరింత శక్తిమంతంగా నిలిపేలా.. సమర్థవంతంగా, సేవా దృక్పథంతో పనిచేసేలా కొత్త మంత్రి వర్గాన్ని చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఏర్పాటు చేశారు. నలుగురు ఉప ప్రధానులతో పాటు 26 మంత్రిత్వ శాఖలు, కమిషన్లతో కూడిన కొత్త కేబినెట్‌కు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. భారత్ సహా పలు సరిహద్దు దేశాలతో విభేదాల నేపథ్యంలో క్షిపణి రంగ నిపుణుడు లెఫ్టినెంట్ జనరల్ వై ఫెంఘేను రక్షణ శాఖ మంత్రిగా నియమించింది. చైనాలో సైనిక ఆధునికీకరణ, పునర్వ్యవస్థీకరణకు ఆయన కృషి చేశారు.

కూలిన యూన్ వారసత్వ సంపద ఐస్‌బర్గ్
అర్జెంటీనాలో యునెస్కో వారసత్వ సంపదగా భాసిల్లుతున్న ఐస్ బ్రిడ్జి మార్చి 11న కుప్పకూలింది. పెంటగోనియాలోని లాస్ గ్లేసియర్ జాతీయ పార్కులో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ ఐస్ బ్రిడ్జి.. భారీ తుపాను ధాటికి కూలిపోయింది.

అమెరికాలో ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు
Current Affairs అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు విధించారు. ఈ మేరకు చేసిన ప్రతిపాదనలకు మార్చి 9న ఆమోదముద్ర వేశారు. తద్వారా అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాల భయాలకు ఆజ్యం పోశారు. ట్రంప్ ప్రస్తుత నిర్ణయంతో... ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై 10 శాతం మేర దిగుమతి సుంకాలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి. అయితే, పొరుగుదేశాలైన మెక్సికో, కెనడాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. మిగతా దేశాలు కూడా మినహాయింపులు కావాలనుకుంటే అమెరికా వాణిజ్య శాఖ ప్రతినిధులతో (యూఎస్‌టీఆర్) చర్చల ద్వారా సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తం కాగా.. కీలక వ్యాపార భాగస్వామ్య దేశాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలు విధింపు
ఎప్పుడు : మార్చి 9
ఎక్కడ : అమెరికా
ఎవరు : డొనాల్డ్ ట్రంప్

సర్వోన్నత నేత స్థాయికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇక జీవితకాలం ఆ పదవిలో కొనసాగేందుకు మార్గం అధికారికంగా సుగమమైంది. ఓ వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువసార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంటు మార్చి 11న ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జిన్‌పింగ్ రెండోసారి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇకపై కూడా ఆయన ఎన్నాళ్లు కోరుకుంటే అన్నాళ్లు, అధ్యక్షుడిగా ఉండొచ్చు. ఇటీవలి దశాబ్దాల్లో చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్‌పింగ్ ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) స్థాపక చైర్మన్ అయిన మావో జెడాంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సర్వోన్నత నేత స్థాయికి చైనా అధ్యక్షుడు
ఎప్పుడు : మార్చి 11
ఎక్కడ : చైనాలో
ఎవరు : షీ జిన్‌పింగ్

నేపాల్‌లో విమాన ప్రమాదం
నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. మార్చి 12న యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ కు చెందిన బాంబార్డియర్ డాష్ 8 క్యూ 400 విమానం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయల్దేరి.. కఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం ఒరిగి పక్కనున్న ఫుట్‌బాల్ మైదానంలోకి దూసుకెళ్లింది. మంటలు అంటుకోవడంతో అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
విమానంలో 33 మంది నేపాలీలు ఉండగా.. 32 మంది బంగ్లాదేశీయులు, చైనా, మాల్దీవులకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.

అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా పాంపియో
అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా సీఐఏ డైరక్టర్ మైక్ పాంపియోను నియమిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. రెక్స్ టిల్లర్సన్‌పై కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న ట్రంప్ టిల్లర్సన్ ఆఫ్రికా పర్యటనలో ఉండగా కొత్త విదేశాంగ మంత్రిని ప్రకటించాడు. ఉత్తర కొరియా, రష్యాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలతో పాటు పలు అంశాలపై ట్రంప్, టిల్లర్సన్ మధ్య విభేదాలున్నాయి. పాంపియో నియామకం నేపథ్యంలో ప్రస్తుతం సీఐఏ డిప్యూటీ డెరైక్టర్‌గా ఉన్న జినా హాస్పెల్‌ను సీఐఏ కొత్త డెరైక్టర్‌గా నియమించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా విదేశాంగ శాఖ కొత్త మంత్రి
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : మైక్ పాంపియో

చైనా రక్షణ బడ్జెట్ 175 బిలియన్ డాలర్లు
Current Affairs భారత్ సహా వివిధ దేశాలతో సరిహద్దు వివాదాలను ఎదుర్కొంటున్న చైనా ఈ ఏడాది తన రక్షణ, సైనిక కార్యకలాపాల కోసం బడ్జెట్‌లో భారీగా నిధులను కేటాయించింది. బడ్జెట్ నివేదికను చైనా ప్రధాన మంత్రి లీ కెఖియాంగ్ ఆ దేశ పార్లమెంటు ఎన్‌పీసీ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కి సమర్పించారు. 6.5 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును ఈ ఏడాదికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు బడ్జెట్ నివేదికలో చైనా పేర్కొంది. రక్షణ కోసం 175 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11.40 లక్షల కోట్లు) నిధులను కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 8.1 శాతం ఎక్కువ. అమెరికా తర్వాత రక్షణ విభాగానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తున్న దేశం చైనాయే. భారత్ తన బడ్జెట్‌లో రక్షణ విభాగానికి కేటాయించిన నిధుల (46 బిలియన్ డాలర్లు- దాదాపు రూ.2.99 లక్షల కోట్లు) కన్నా చైనా బడ్జెట్ దాదాపు మూడున్నర రెట్లు ఎక్కువ.

శ్రీలంకలో అత్యవసర పరిస్థితి
శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మత ఘర్షణల నేపథ్యంలో దేశంలో పది రోజుల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు అక్కడి సామాజిక సాధికారత శాఖ మంత్రి ఎస్.బి. దిస్సనాయకే మార్చి 6న వెల్లడించారు. శ్రీలంకలోని కాండీ జిల్లాలో బౌద్ధులు, ముస్లింల మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. పలు మసీదులు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలు దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా నిరోధించేందుకు పది రోజుల పాటు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆధ్వర్యంలోని మంత్రిమండలి ప్రకటించింది.

ఏప్రిల్‌లో కొరియా’ శిఖరాగ్ర భేటీ
దేశ రక్షణకు పూచీ ఇస్తే అణ్వాయుధాలను త్యజించేందుకు సిద్ధమని ఉత్తరకొరియా తెలిపింది. దీంతోపాటు దక్షిణ కొరియా అధ్యక్షుడితో సమావేశమయ్యేందుకు కూడా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సంసిద్ధత తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ జాతీయ భద్రతా సలహాదారు చుంగ్-ఇయు-యాంగ్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ఇటీవల ఉత్తర కొరియా వెళ్లింది. రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ఈ బృందం సమావేశమైంది. మార్చి 6న తిరిగి స్వదేశానికి చేరుకున్న ఈ బృందం చర్చల ఫలితాలను వెల్లడించింది. ఉత్తర కొరియాతో చర్చల్లో గణనీయ పురోగతి కనిపించిందని పేర్కొంది. సరిహద్దు గ్రామం పన్‌మున్‌జోంలో ఏప్రిల్‌లో రెండు దేశాల అధ్యక్షుల సమావేశానికి అంగీకారం కుదిరిందని తెలిపింది. తమపై సైనిక పరమైన ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా చేసి, ప్రభుత్వ మనుగడకు గ్యారెంటీ ఇచ్చిన పక్షంలో అణ్వాయుధాలను, క్షిపణులను కలిగి ఉండటంలో అర్థం లేదని, వాటిని త్యజిస్తామని ఉత్తరకొరియా పాలకుడు చెప్పినట్లు యాంగ్ వెల్లడించారు. తాము ఎలాంటి అణు, మిస్సైల్ పరీక్షలు జరుపబోమని ఉత్తరకొరియా హామీ ఇచ్చిందన్నారు.

మహిళా దినోత్సవ ఇతివృత్తం - ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్’
2018 మహిళా దినోత్సవం(మార్చి 8) ఇతివృత్తంగా ‘ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్’ (ప్రగతి కోసం పట్టుబట్టండి) నినాదాన్ని ఐక్యరాజ్య సమితి ఖరారు చేసింది. గత కొన్నేళ్లుగా స్త్రీలు అనేక రంగాల్లో పరుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా ఆడ-మగ తారతమ్యాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించి పురుషులతో సమానంగా హక్కులు సాధించే లక్ష్యంతో ఈ నినాదాన్ని ఎంపిక చేశారు. 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అయితే దీనికి ఎన్నో ఏళ్ల ముందు నుంచి కూడా అనేక దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తొలిసారిగా అమెరికాలో 1909లో ఫిబ్రవరి 28ని మహిళా దినోత్సవంగా పాటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2018 మహిళా దినోత్సవ ఇతివృత్తం - ‘ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్’
ఎప్పుడు : మార్చి 7
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా
ఎవరు : ఐరాస

మహిళా సాధికారత కోసం గేట్స్ ఫౌండేషన్ భారీ విరాళం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిల్‌గేట్స్ దంపతులు భారీ విరాళాన్ని ప్రకటించారు. మహిళలు ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా భారత్ సహా నాలుగు దేశాలకు 170 మిలియన్ డాలర్ల(అంటే వెయి్యకోట్లకు పైమాటే) ప్రాజెక్ట్‌ను బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఇండియా, కెన్యా, టాంజానియా, ఉగాండా దేశాల్లో లింగ సమానత్వాన్ని పెంచడం, డిజిటల్ ఆర్థిక సమ్మేళనాన్ని విస్తరించడం, ఉద్యోగ అవకాశాలు పెంచడం, వ్యవసాయ రంగానికి, మహిళా బృందాలకు మద్దతునివ్వడం వంటి వాటికోసం ఈ నిధులను ఖర్చుచేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళా సాధికారత కోసం 170 మిలియన్ డాలర్ల విరాళం
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్
Published date : 15 Mar 2018 12:48PM

Photo Stories