World Wide Fund: ప్రపంచంలో అత్యుత్తమ ఆహారం.. భారతదేశానిదే..
వాటిలో ఏ దేశ ఆహారం, పద్ధతులు ఉత్తమమైనవి అంటే.. కచ్చితంగా భారత దేశానివేనని అంతర్జాతీయ అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. మానవుల ఆరోగ్యంతోపాటు, భూమిపై కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడటంలోనూ భారత ఆహార (ఇండియన్ ఫుడ్ ప్లేట్) పద్ధతులు, సాగు విధానాలే భేషైనవని తేల్చి చెబుతున్నాయి. కొన్ని దేశాల ఆహారం మొత్తం భూమండలానికే డేంజర్ అని కూడా ఆ సంస్థలు లెక్కలు కట్టి మరీ చెబుతున్నాయి.
ఆరోగ్యం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో భారత ఆహారం కీలక పాత్ర పోషిస్తోందని స్విట్జర్లాండ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రపంచ వన్యప్రాణి ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) కూడా తన లివింగ్ ప్లానెట్ పరిశోధనలో తాజాగా వెల్లడించింది. ఎక్కువ శాకాహారం, తక్కువ మాంసాహారం ఉండే భారత విధానం అత్యుత్తమమైనదని తెలిపింది. తక్కువ రసాయన ఎరువులతో ఆరోగ్యకరమైన భారత దేశ సాగు విధానం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని వెల్లడించింది.
ఈ పంటల ఉత్పత్తి విధానాన్ని అన్ని దేశాలు అనుసరిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపింది. తద్వారా 2050 నాటికి పర్యావరణ కాలుష్యానికి చాలా వరకు అడ్డుకట్ట వేయవచ్చని సూచించింది. భారత్ తర్వాత ఇండొనేసియా, చైనాలో ఆహార పద్ధతులు భేషైనవని పేర్కొంది. అమెరికా, అర్జెంటీనా, ఆ్రస్టేలియా వంటి దేశాల ఆహార పద్ధతులు ప్రపంచానికి, పర్యావరణానికి ప్రమాదకరమని చెబుతోంది.
Top Pulses Producing Countries: పప్పుధాన్యాల ఉత్పత్తిలో టాప్-10లో ఉన్న దేశాలు ఇవే..
తృణధాన్యాలతో ఎంతో మేలు..
భారతదేశ సంప్రదాయ ఆహారంలో తృణ ధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది. ప్రజల ఆరోగ్యం, వాతావరణ పరిరక్షణకు తృణ ధాన్యాలు (మిల్లెట్లు) మేలైనవని చెప్పింది. ఉత్తర భారత దేశంలో తృణ ధాన్యాలు, గోధుమ ఆధారిత రోటీలు, అప్పుడప్పుడు మాంసం వంటకాలు, దక్షిణాదిలో ప్రధానంగా అన్నం, ఇడ్లీ, దోస వంటి బియ్యం ఆధారిత ఆహారం, పశ్చిమ, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో రకరకాల చేపలతో పాటు జొన్న, సజ్జలు, రాగి, గోధుమలు వంటి పురాతన మిల్లెట్లతో అధిక ప్రయోజనాలు కలుగుతున్నాయని పేర్కొంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొవ్వు, చక్కెర పదార్థాల వినియోగం పెరగడం వల్ల స్తూలకాయులు పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
తక్కువ భూమి వినియోగించాలి..
మేలైన పంటల సాగు ద్వారా వ్యవసాయ భూమిని గణనీయంగా తగ్గించవచ్చని ఆ నివేదిక తెలిపింది. ఇందుకు కూడా భారత విధానాలే ఉత్తమమైనవని తెలిపింది. భారత విధానాలను ఇతర దేశాలు అనుసరిస్తే 2050 నాటికి ప్రపంచ ఆహార ఉత్పత్తికి ఒక భూమి (ఎర్త్)లో 0.84 కంటే తక్కువ అవసరం ఉంటుందని వివరించింది. ఇతర దేశాల్లోని విధానాలే పాటిస్తే మన భూగ్రహం సరిపోదని, ఒకటి కంటే ఎక్కువే అవసరమవుతాయని హెచ్చరించింది.
ఉదాహరణకు అర్జెంటీనా ఆహార పద్ధతులను అవలంభిస్తే ఆహార ఉత్పత్తులకు ఏడు భూగ్రహాలు కూడా సరిపోవని వివరించింది. పప్పులు, తృణధాన్యాలు, మొక్కల ఆధారిత ఆహారం, మాంసానికి ప్రత్యామ్నాయంగా అధిక పోషక విలువలు ఉండే ఆల్గే (నీటిలో పెరిగే మొక్కలు) వినియోగించాలని కోరుతోంది.
Food Safety: తెలంగాణలో వెనుకబడిన ఆహార నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ