Skip to main content

Green Card: ఈ గ్రీన్‌ కార్డులపై పరిమితి ఎత్తివేత!

ఉద్యోగ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ వీసాల విషయంలో అమెరికా గ్రీన్‌ కార్డుల(పర్మనెంట్‌ లీగల్‌ రెసిడెన్సీ) జారీపై దేశాల వారీగా అమల్లో ఉన్న పరిమితిని(క్యాప్స్‌) ఎత్తివేస్తూ కీలకమైన బిల్లుకు హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ ఆమోదం తెలిపింది.
Green Card Visa
Green Card Visa

అలాగే కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రెంట్‌ వీసాల జారీలోనూ దేశాల వారీగా పరిమితిని 7 నుంచి 15 శాతం పెంచారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చి, అమల్లోకి వస్తే అమెరికాలోని భారత్, చైనా ఉద్యోగులకు భారీగా లబ్ధి చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఈ రెండు దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గ్రీన్‌కార్డుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. హెచ్‌ఆర్‌ 3648 లేదా ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌(ఈగల్‌)–యాక్ట్‌ అని పిలుస్తున్న ఈ బిల్లుపై బుధవారం రాత్రి హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. బిల్లుకు అనుకూలంగా 22 ఓట్లు, వ్యతిరేకంగా 14 ఓట్లు వచ్చాయి. బిల్లును తదుపరి హౌస్‌ ఫర్‌ డిబేట్‌కు వెళ్తుంది. అక్కడ ఓటింగ్‌ నిర్వహిస్తారు. అనంతరం యూఎస్‌ సెనేట్‌ సైతం ఆమోదించాల్సి ఉంటుంది. తర్వాత అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. సమాన అర్హతలు కలిగినవారు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ అర్హతలు ఉన్నవారు ఫలానా దేశంలో పుట్టారన్న కారణంతో గ్రీన్‌కార్డు పొందలేకపోతున్నారని, ఈ విధానాన్ని మార్చాల్సి ఉందని అమెరికా పార్లమెంట్‌ సభ్యురాలు జోయ్‌ లాఫ్‌గ్రెప్‌ అన్నారు.

Published date : 08 Apr 2022 05:55PM

Photo Stories