Skip to main content

G-20 Summit 2021: జి–20 దేశాల 16వ శిఖరాగ్ర సమావేశాలు

2021 G20 Summit

జి–20 దేశాల 16వ శిఖరాగ్ర సమావేశాలు(జి–20 శిఖరాగ్ర సదస్సు–2021) ఇటలీ రాజధాని రోమ్‌ నగరంలోని నువొలా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగాయి. అక్టోబర్‌ 30, 31వ తేదీలలో జరిగిన ఈ సదస్సుకు అతిథ్య దేశం ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ నేతృత్వం వహించారు. సదస్సులో ప్రధానంగా ఆరోగ్య రంగం, ఆర్థిక రంగం, వాతావరణ మార్పులపై చర్చలు జరిపారు. పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల గురించి వివరిస్తూ ‘రోమ్‌ డిక్లరేషన్‌’ జారీ చేశారు.

2021 జి–20 శిఖరాగ్ర సదస్సు నినాదం(Motto): పీపుల్, ప్లానెట్, అండ్‌ ప్రాస్పెరిటీ

రోమ్‌ డిక్లరేషన్‌లోని ముఖ్యాంశాలు...

  • వాతావరణ కాలుష్యం పెరగడంతోపాటు భూమి వేడెక్కడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలి. కర్బన తటస్థీకరణ లేదా ‘నెట్‌ జీరో’ ఉద్గారాల లక్ష్య సాధనకు అందరూ కట్టుబడి ఉండాలి. ఈ శతాబ్ధి మధ్య నాటికి..అంటే 2050 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి.
  • కాలుష్యాన్ని అడ్డుకోవడానికి విదేశాల్లో బొగ్గు ఆధారిత(థర్మల్‌) విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లకు ఇకపై ఎలాంటి ఆర్థిక సాయం అందించరాదు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరుత్సాహపర్చాలి. 2021, ఆఖరి నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలి.   
  • వాతావరణ మార్పుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద దేశాలకు సాయం చేయడానికి గతంలోనే అంగీకరించినట్లుగా ధనిక దేశాలు ప్రతిఏటా 100 బిలియన్‌ డాలర్లు సమీకరించాలి. పేద దేశాలకు రుణ సాయాన్ని పెంచాలి.
  • 2021 ఆఖరుకల్లా ప్రపంచంలో కనీసం 40 శాతం మందికి కరోనా టీకా ఇవ్వాలి. 2022 జూన్‌ ఆఖ రుకి 70 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి. టీకా సరఫరాలో అవరోధాలను తొలగించాలి.

కర్బన తటస్థీకరణ అంటే...

వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు, వాతావరణం నుంచి తొలగించే ఉద్గారాల మధ్య సమతూకం ఉండడమే కర్బన తటస్థీకరణ. అంటే ఏ మేరకు ఉద్గారాలు విడుదలవుతాయో అంతేస్థాయిలో వాటిని వాతావరణం నుంచి తొలగించాలి.

సదస్సులో మోదీ...

జి–20 సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘గ్లోబల్‌ ఎకానమీ, గ్లోబల్‌ హెల్త్‌’ అంశంపై  మాట్లాడారు. తమ దేశంలో ఇప్పటికే 100 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ  చేశామని, 2020 ఏడాది చివరి నాటికల్లా 500 కోట్లకుపైగా కోవిడ్‌–19 టీకా డోసులను ఉత్పత్తి చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్నారు. తద్వారా తమ దేశంతోపాటు ఇతర దేశాలకూ మేలు జరుగుతుందన్నారు. కోవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ప్రక్రియ డబ్ల్యూహెచ్‌ఓ వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. కనిష్ట కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 15 శాతంగా నిర్ధారిస్తూ జి–20 తీసుకున్న నిర్ణయం పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.

జి–20 గురించి...

జి–20(గ్రూప్‌ ఆఫ్‌ 20) అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. 1999లో ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్‌ల వేదికగా ఇది ఏర్పడింది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. ఈ వేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. జీ–20లో 19 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు సభ్యత్వం ఉంది. జీ–20 దేశాలు ప్రపంచంలో మూడింట రెండింతల జనాభా కలిగి ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో దాదాపు 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో సుమారు 80 శాతం వాటా ఈ దేశాలదే. 

జి–20 సభ్యదేశాలు...

1. అర్జెంటీనా
2. ఆస్ట్రేలియా
3. బ్రెజిల్‌
4. కెనడా
5. చైనా
6. ఫ్రాన్స్‌
7. జర్మనీ
8. భారత్‌
9. ఇండోనేషియా
10. ఇటలీ
11. జపాన్‌
12. మెక్సికో
13. రష్యా
14. సౌదీ అరేబియా
15. దక్షిణ కొరియా
16. దక్షిణాఫ్రికా
17. టర్కీ
18. యునెటైడ్‌ కింగ్‌డమ్‌
19. యునెటైడ్‌ స్టేట్స్‌
20. యూరోపియన్‌ యూనియన్‌
 

చ‌ద‌వండి: ‘ఎక్స్‌’ జెండర్‌ పాస్‌పోర్టును జారీ చేసిన దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జి–20 దేశాల 16వ శిఖరాగ్ర సమావేశాలు(జి–20 శిఖరాగ్ర సదస్సు–2021) 
ఎప్పుడు  : 30, 31 అక్టోబర్, 2021
ఎవరు    : జి–20 దేశాల అధినేతలు
ఎక్కడ    : నువొలా కన్వెన్షన్‌ సెంటర్, రోమ్, ఇటలీ 
ఎందుకు  : ఆరోగ్య రంగం, ఆర్థిక రంగం, వాతావరణ మార్పులపై చర్చలు జరిపేందుకు... 

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 01 Nov 2021 04:07PM

Photo Stories