Covid Cases: విలయ తాండవం చేస్తున్న కరోనా.. ఆ ఒక్క నగరంలోనే రోజుకు 10 లక్షల కేసులు నమోదు
Sakshi Education
చైనాలో కరోనా నానాటికీ చుక్కలు చూపుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక నగరం జిజెయాంగ్‌లో రోజుకు కనీసం 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
గ్వాంగ్‌జోయూ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికులను క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్న దృశ్యం
కొద్ది రోజుల్లోనే ఇవి రోజుకు పాతిక లక్షలు దాటొచ్చని చెబుతున్నారు! దేశవ్యాప్తంగా ఆస్పత్రులకు రోగుల వెల్లువ నానాటికీ పెరుగుతోంది. మార్చురీల బయట శవాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. చాలాచోట్ల కనీసం 10 రోజులకు పైగా వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.
ఒకవైపు కేసులు ఇలా కట్టలు తెంచుకుంటుంటే మరోవైపు వాటి కట్టడి ప్రయత్నాలను, నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తూ చైనా ప్రభుత్వం హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను పూర్తిగా తెరవాలని నిర్ణయించింది. అంతేగాక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడేళ్లుగా అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనను కూడా పూర్తిగా ఎత్తేయనుంది. ఇవన్నీ జనవరి 8 నుంచి అమల్లోకి వస్తాని ప్రకటించింది. ఇందుకు వీలుగా కరోనాను డెంగీ తదితర జ్వరాలతో సమానమైన బి కేటగిరీకి తగ్గిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది.