Skip to main content

RBI on Rupee : రూపాయే బలంగా నిలబడిందన్న శక్తికాంతదాస్

Shaktikanta Das that rupee is standing strong
Shaktikanta Das that rupee is standing strong

వర్ధమాన కరెన్సీలు, అభివృద్ధి చెందిన దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి బలంగా నిలబడిందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. డాలర్‌తో రూపాయి 80కు పడిపోవడం, రానున్న రోజుల్లో ఇంకొంత క్షీణించొచ్చంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆయన ఈ అంశంపై స్పందించారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏర్పాటు చేసినఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. రూపాయిలో అస్థిరతలు, ఎత్తు పల్లాలను ఆర్‌బీఐ చూస్తూ కూర్చోదని స్పష్టం చేశారు. సెంట్రల్‌ బ్యాంకు చర్యల వల్లే రూపాయి ప్రయాణం సాఫీగా ఉందన్నారు. రూపాయి ఈ స్థాయిలో ఉండాలనే ఎటువంటి లక్ష్యాన్ని ఆర్‌బీఐ పెట్టుకోలేదని స్పష్టం చేశారు. మార్కెట్‌కు యూఎస్‌ డాలర్లను సరఫరా చేస్తూ తగినంత లిక్విడిటీ ఉండేలా చూస్తున్నట్టు చెప్పారు. విదేశీ రుణాలకు సంబంధించి హెడ్జింగ్‌ చేయకపోవడంపై ఎటువంటి హెచ్చరికలు అవసరం లేదన్నారు. విదేశీ రుణాల్లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ప్రభుత్వరంగ సంస్థలకే ఉందని చెబుతూ.. అవసరమైతే ప్రభుత్వం సాయంగా నిలుస్తుందన్నారు. 2016లో ద్రవ్యోల్బణం నియంత్రణకు సంబంధించి చేపట్టిన కార్యాచరణ మంచి ఫలితాలను ఇచ్చిందంటూ.. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్‌ రంగ ప్రయోజనాల రీత్యా దీన్నే కొనసాగిస్తామని శక్తికాంతదాస్‌ తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి పరిమితం చేయాలన్నది ఈ కార్యాచరణలో భాగం. ప్రతికూల సమయాల్లో దీనిని ప్లస్‌2, మైనస్‌2 దాటిపోకుండా చూడడం లక్ష్యం.   

also read: భారత్‌ GDPని 7.3 శాతానికి తగ్గించిన Morgan Stanley

ఆర్థిక వ్యవస్థ సాఫీగా.. 
‘‘నిర్ణీత కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థ కుదురుకునేలా చూడాలన్నదే మా ప్రయత్నం. అదే సమయంలో వృద్ధిపై పరిమిత ప్రభావం ఉండేలా చూస్తాం’’అని ఆర్‌బీఐ గవర్నర్‌ భరోసా ఇచ్చారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్టాలను తాకిందంటూ, ఆగస్ట్‌లో జరిగే ఎంపీసీ భేటీలో 2022–23 సంవత్సరానికి సంబంధించి 6.7 శాతం ద్రవ్యోల్బణం అంచనాలను సమీక్షిస్తామని చెప్పారు. యూరోప్‌లో (ఉక్రెయిన్‌పై) యుద్ధం కారణంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు.  కమోడిటీ ధరలు, చమురు ధరలు పెరిగిపోయాయని.. వీటి ప్రభావం మనపై పడిందని వివరించారు. "అదే సమయంలో ఇతర సెంట్రల్‌ బ్యాంకులు మానిటరీ పాలసీని కఠినతరం చేయడం వల్ల ఆ ప్రభావాలు మననూ తాకాయి. పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం, కరెన్సీ విలువ క్షీణత ఇవన్నీ ఆర్‌బీఐ నియంత్రణలో లేనివి. లిక్విడిటీ, పాలసీ రేట్లకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా, వాటి ప్రభావం వృద్ధిపై, ఆర్థిక వ్యవస్థ రివకరీపై ఏ మేరకు ఉంటాయన్నది పరిగణనలోకి తీసుకునే చేస్తాం’’అని శక్తికాంతదాస్‌ వివరించారు. ప్రస్తుతం ఆర్‌బీఐ ముందున్న ప్రాధాన్యం ద్రవ్యల్బణాన్ని నియంత్రించడం, తర్వాత వృద్ధికి మద్దతుగా నిలవడమేనని చెప్పారు 

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి దంత ఆరోగ్య బీమా పథకాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది?

Published date : 23 Jul 2022 05:58PM

Photo Stories