5G Spectrum : రూ. 1.5 లక్షల కోట్ల బిడ్లు
అమ్ముడైన స్పెక్ట్రంలో దాదాపు సగ భాగాన్ని (24,740 మెగాహెట్జ్) దక్కించుకుని టెలికం దిగ్గజం రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా రూ. 88,078 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలు చేసింది. భారతి ఎయిర్‌టెల్ రూ. 43,084 కోట్లు (19,867.8 మెగాహెట్జ్), వొడాఫోన్ ఐడియా రూ. 18,799 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను (6,228 మెగాహెట్జ్) కొనుగోలు చేశాయి. ప్రైవేట్ సర్వీసుల కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ సుమారు రూ. 212 కోట్లతో 400 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మొత్తం 10 బ్యాండ్లలో 72,098 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలం వేయగా 51,236 మెగాహెట్జ్ (71 శాతం) అమ్ముడైనట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం మీద రూ. 1,50,173 కోట్ల బిడ్లు వచ్చాయని, తొలి ఏడాది ప్రభుత్వ ఖజానాకు రూ. 13,365 కోట్లు రాగలవని ఆయన పేర్కొన్నారు. ‘దేశంలో దాదాపు అన్ని సర్కిళ్లకు సరిపడేంతగా టెల్కోలు స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. దీంతో రాబోయే 2–3 ఏళ్లలో మెరుగైన 5జీ కవరేజీ లభించగలదు‘ అని ఆయన చెప్పారు. ఆగస్టు 10 నాటికి స్పెక్ట్రం కేటాయించవచ్చని, అక్టోబర్ కల్లా సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో అనిశ్చితి, రిస్కులు తొలగిపోవడంతో రాబోయే రెండేళ్లలో టెలికం రంగంలో రూ. 2–3 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇకపైనా సర్వీసులను చౌకగానే అందించే ధోరణే కొనసాగవచ్చని విశ్వసిస్తున్నట్లు వివరించారు. జులై 26న ప్రారంభమైన వేలంలో రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను విక్రయానికి ఉంచారు. తొలి రోజునే ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లు రాగా.. ఆ తర్వాత మిగతా రోజుల్లో మాత్రం బిడ్డింగ్ నామమాత్రంగా పెరుగుతూ వచ్చింది.
Also read: GSTకి ఐదేళ్లు పూర్తి
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP