Digital Loans : ఆర్బీఐ నిబంధనలు కఠినతరం
ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు/ఆర్‌ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్‌బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలన్నది ఆర్‌బీఐ కార్యాచరణగా ఉంది.
Also read: Government e - Marketplace లోకి సహకార సంఘాలు
నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలు..
- రుణ ఒప్పందానికి ముందు రుణ గ్రహీతకు కీలకమైన వాస్తవ సమాచార స్టేట్‌మెంట్ (కేఎఫ్‌ఎస్) ఇవ్వాలని ఆర్‌బీఐ నిర్ధేశించింది. ఆర్‌బీఐ నియంత్రణల కింద పనిచేసే సంస్థలు, డిజిటల్ లెండింగ్ యాప్‌లు, వీటి కింద పనిచేసే రుణ సేవల సంస్థలు (థర్డ్‌పార్టీ) దీన్ని తప్పక పాటించాలి.
- రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిక్‌గా రుణ పరిమితి పెంచడాన్ని నిషేధించింది.
- డిజిటల్ రుణాలను అసలుతోపాటు, అప్పటి వరకు వడ్డీతో చెల్లించి (ఎటువంటి పెనాల్టీ లేకుండా) క్లోజ్ చేసేందుకు వీలుగా కూలింగ్ ఆఫ్/ లుక్ అప్ పీరియడ్‌ను కల్పించాలి.
- రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే.. అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.
- డిజిటల్ లెండింగ్ యాప్‌లు, రుణ సేవల సంస్థలు రుణ గ్రహీత అనుమతితో, కావాల్సిన వివరాలను మాత్రమే తీసుకోవాలి. డేటా వినియోగంపై రుణ గ్రహీత అనుమతి తీసుకోవాలి.
- ఫిన్‌టెక్, డిజిటల్ లెండింగ్ సేవలపై ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా నియంత్రిత సంస్థలు, వాటి కింద రుణ సేవలను అందించే సంస్థలు తగిన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించే రుణాలను డిజిటల్ లెండింగ్‌గా పరిగణిస్తారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP