Reserve Bank of India: వరుసగా ఆరోసారి రెపో రేటు పెంచిన ఆర్బీఐ
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీ రేటు 6.50 శాతానికి చేరింది. అలాగే ఎంఎస్‌ఎప్ రేట్లు 25 బీపీఎస్ పాయింట్లు పెరిగి 6.75 శాతానికి చేరింది. ఇది వరుసగా ఆరోసారి వడ్డీ రేటు పెంపు. డిసెంబర్ మానిటరీ పాలసీ సమీక్షలో కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. గత ఏడాది మే నుంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ స్వల్పకాలిక రుణ రేటు, తాజా పెంపుతో కలిపి 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
పెరగనున్న రుణ భారం
దీంతో బ్యాంక్ కస్టమర్లపై నేరుగా ప్రభావం పడనుంది. రుణ గ్రహీతలపై ఎఫెక్ట్ ఉండనుంది. నెలవారీ ఈఎంఐ (EMI) మరింత పెరగొచ్చు. అలాగే రుణాలు మరింత భారం కానున్నాయి. రుణ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే రెపో రేటు పెంపు వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి ఊరట కలుగనుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. కాగా 2023 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనా 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. 2023-24లో జీడీపీ వృద్ధిని 6.4 శాతంగా అంచనా వేసింది.