డిసెంబర్ 2020 ఎకానమీ
దక్షిణ, నైరుతి ఆసియా దేశాల్లో దీర్ఘకాలికంగా చూస్తే భారత ఎకానమీ అత్యంత పటిష్టమైనదిగా ఉండగలదని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. కోవిడ్-19 పరిణామాల అనంతరం.. వృద్ధి కాస్త మందగించినా సానుకూలంగానే ఉండటం, భారీ స్థాయి మార్కెట్ కావడం తదితర అంశాల నేపథ్యంలో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగగలదని తెలిపింది. ‘2020/2021లో ఎఫ్‌డీఐ ధోరణులు - ఆసియా, పసిఫిక్ దేశాలపై అంచనాలు’ అనే నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది.
2018లో దక్షిణ, నైరుతి ఆసియా దేశాల్లోకి 67 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా.. 2019లో స్వల్పంగా 2 శాతం మేర తగ్గి 66 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని ఐరాస నివేదిక తెలిపింది.
దేశీయంగా మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్ వాటా?
అసోచాం ఫౌండేషన్ డే వీక్ 2020 కార్యక్రమంలో కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిసెంబర్ 17న పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... దేశీయంగా గ్యాస్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు 2024 నాటికి 60 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు వెల్లడించారు. 2030 నాటికి మొత్తం ఇంధనాల వినియోగంలో గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇది 6 శాతంగా ఉంది.
భారత కంపెనీలు ఏ దేశంలో అత్యధిక పెట్టుబడులను పెట్టాయి?
విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఎనిమిది నెలల కాలంలో భారత కంపెనీలు విదేశాల్లో 1,225 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. కేర్ రేటింగ్‌స డిసెంబర్ 18న విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు
- భారత కంపెనీలు అత్యధికంగా అమెరికాలో 236 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.
- అమెరికా తర్వాత సింగపూర్‌లో 207 కోట్ల డాలర్లు, నెదర్లాండ్‌సలో 150 కోట్ల డాలర్లు, బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్‌సలో 137 కోట్ల డాలర్లు, మారిషస్‌లో 130 కోట్ల డాలర్లు చొప్పున పెట్టుబడులు పెట్టాయి. భారత కంపెనీలు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన నిధుల్లో దాదాపు 70 శాతం వాటా ఈ ఐదు దేశాలదే.
- కంపెనీల పరంగా అత్యధికంగా విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా ఓఎన్‌జీసీ విదేశ్ (185 కోట్ల డాలర్లు) నిలిచింది.
- ఓఎన్‌జీసీ తర్వాతి స్థానాల్లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్(87 కోట్ల డాలర్లు), హల్దియా పెట్రోకెమికల్స్(60 కోట్ల డాలర్లు) ఉన్నాయి.
- 2008-09 ఆర్థిక సంవత్సరంలో మన కంపెనీలు అత్యధికంగా 1,900 కోట్ల డాలర్లు విదేశాల్లో ఇన్వెస్ట్ చేశాయి.
అదనపు రుణాలను సమీకరించుకొనేందుకు అనుమతి పొందిన రాష్ట్రాలు?
సులభతర వాణిజ్యంలో నిర్దేశిత సంస్కరణలను అమలు చేసినందుకుగాను బహిరంగ మార్కెట్ ద్వారా అదనపు రుణాలను సమీకరించుకొనేందుకు ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 20న కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్రం తాజా అనుమతితో... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కలిపి మొత్తంగా రూ. 16,278 కోట్లను అదనపు రుణాలు సేకరించుకొవచ్చు. ఇందులో తెలంగాణ రూ. 2,508 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 2,525 కోట్లు బహిరంగ మార్కెట్ ద్వారా సమీకరించుకొవచ్చు.
జీఎస్‌డీపీలో రెండు శాతం...
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు అదనపు నిధుల అవసరాలను తీర్చుకొనేందుకు వీలుగా రాష్ట్రాల రుణ పరిమితిని జీఎస్‌డీపీలో రెండు శాతం మేర(ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్రాల రుణ పరిమితి మూడు శాతం మించి) పెంచాలని కేంద్రం 2020, మే నెలలో నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అదనపు రుణాలు సమీకరించుకొనేందుకు అర్హత సాధించాలంటే 2021 ఫిబ్రవరి 15లోగా నాలుగు రకాల సంస్కరణలను అమలు చేయాలని షరతు విధించింది.
నాలుగు రకాల సంస్కరణలు
- ఒక దేశం-ఒకే రేషన్ కార్డు విధానాన్ని అమలు చేయాలి.
- సులభతర వాణిజ్యం, పట్టణ స్థానిక సంస్థలు, విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టాలి.
బీవోబీలో విలీనమైన బ్యాంకులు?
విజయా బ్యాంకు, దేనా బ్యాంకులకు చెందిన 3,898 శాఖలను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)తో అనుసంధానించడం పూర్తయింది. ఈ విషయాన్ని డిసెంబర్ 20న బీవోబీ ప్రకటించింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయాబ్యాంకు, దేనా బ్యాంకులు 2019 ఏప్రిల్ 1 నుంచి విలీనమైన విషయం తెలిసిందే.
బ్యాంకుల విలీనం-వివరాలు
యూఎస్ సంస్థ ఆక్యుజెన్‌తో భాగస్వామ్యం చేసుకున్న భారత ఫార్మా సంస్థ?
బయోటెక్నాలజీ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్, యూఎస్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్ సంస్థ ఆక్యుజెన్ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌తో (ఐసీఎంఆర్) కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ క్యాండిడేట్ కోవాగ్జిన్ను యూఎస్ మార్కెట్ కోసం సహ అభివృద్ధి చేస్తారు.
జాతీయ స్టార్టప్ అవార్డులు
జాతీయ స్టార్టప్ అవార్డులు (ఎన్‌ఎస్‌ఏ) -2021 రెండో ఎడిషన్‌ను కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) ప్రారంభించింది. 15 విసృ్తత రంగాల్లో 49 విభాగాల్లో స్టార్టప్‌లకు ఈ అవార్డులు ఇస్తారు. విజేతలకు రూ.5లక్షల నగదు ఇవ్వడంతోపాటు రన్నరప్‌లకు కూడా పెలైట్ ప్రాజెక్టులు, వర్క్ ఆర్డర్లు పొందడానికి అవకాశాలు కల్పిస్తారు. ఎన్‌ఎస్‌ఏ -2021కు జనవరి 31,2021 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : యూఎస్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్ సంస్థ ఆక్యుజెన్‌తో భాగస్వామ్యం
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : భారత్ బయోటెక్
ఎందుకు : కోవాగ్జిన్‌ను యూఎస్ మార్కెట్ కోసం అభివృద్ధి చేసేందుకు
బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగంలో ఎఫ్‌డీఐల వాటా ఎంత శాతం?
డీటీహెచ్ (ఇళ్లకు నేరుగా ప్రసారాలు అందించే) బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో డిసెంబర్ 23న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డీటీహెచ్ రంగంలో 49 శాతం ఎఫ్‌డీఐకే అనుమతి ఉందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
మరోవైపు డీటీహెచ్ సంస్థలకు 20 ఏళ్ల కాలానికి లెసైన్స్ మంజూరు చేసేందుకు వీలుగా నిబంధనల సవరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సవరణల ప్రకారం ప్రతీ పదేళ్ల కాలానికి లెసైన్స్ ను పునరుద్ధరించుకోవచ్చు. లెసైన్స్ ఫీజును స్థూల ఆదాయంలో 10 శాతం కాకుండా.. సవరించిన స్థూల ఆదాయం (జీఎస్‌టీని మినహాయించిన తర్వాత)లో 8 శాతంగా మార్పు చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎఫ్‌డీఐల వాటా 100 శాతానికి పెంపుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎక్కడ : బ్రాడ్‌కాస్టింగ్ సేవల రంగంలో
వ్యాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీను ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బ్యాంక్?
ఆసియా పసిఫిక్ దేశాల కూటమిలోని (ఏపీఏసీ) వర్ధమాన ఎకానమీలు కోవిడ్-19 టీకాలను కొనుగోలు, పంపిణీ చేసేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఆర్థికపరమైన తోడ్పాటు అందించనుంది. ఇందుకోసం 9 బిలియన్ డాలర్లతో ఆసియా-పసిఫిక్ వ్యాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీ (ఏపీవ్యాక్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ఏడీబీ ప్రెసిడెంట్ మసత్సుగు అసకావా డిసెంబర్ 11న తెలిపారు. వర్ధమాన దేశాలు.. కరోనా మహమ్మారిపరమైన సవాళ్లను అధిగమించి, ఆర్థిక రికవరీపై దృష్టి పెట్టేందుకు ఏపీవ్యాక్స్ తోడ్పడగలదని ఆయన వివరించారు.
బ్లాక్‌స్టోన్ చేతికి పిరమల్ గ్లాస్...
పిరమల్ గ్లాస్ కంపెనీని బ్లాక్‌స్టోన్ సంస్థ వంద కోట్ల డాలర్లకు (రూ.7,500 కోట్లు)కొనుగోలు చేయనున్నది. 1,000 కోట్ల డాలర్ల పిరమల్ గ్రూప్‌నకు చెందిన పిరమల్ గ్లాస్ కంపెనీ ప్రత్యేకమైన గ్లాస్ రకాలను తయారు చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 9 బిలియన్ డాలర్లతో ఆసియా-పసిఫిక్ వ్యాక్సిన్ యాక్సెస్ ఫెసిలిటీ (ఏపీవ్యాక్స్) ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)
ఎందుకు : ఆసియా పసిఫిక్ దేశాల కూటమిలోని (ఏపీఏసీ) వర్ధమాన ఎకానమీలు కోవిడ్-19 టీకాలను కొనుగోలు, పంపిణీ చేసేందుకు
జీవితకాల గరిష్టానికి విదేశీ మారకపు నిల్వలు
భారత విదేశీ మారకపు నిల్వలు(ఫారెక్స్ నిల్వలు) 2020, డిసెంబర్ 4తో ముగిసిన వారం నాటికి జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. ఫారెక్స్ నిల్వలు 469 మిలియన్లు పెరిగి 579.346 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గణాంకాలు తెలిపాయి. అంతకు ముందు నవంబర్ 27తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 574.821 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం...
- బంగారం నిల్వల విలువ 535 మిలియన్ డాలర్లు పెరిగి 35.728 బిలియన్ డాలర్లకు ఎగసింది.
- అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద భారత్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ స్వల్పంగా 12 మిలియన్ డాలర్లు పెరిగి 1.506 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
- ఐఎంఎఫ్ వద్ద నిల్వల స్థితి 46 మిలియన్ డాలర్లు పెరిగి 4.725 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
సీసీఎంబీ, అపోలో మధ్య భాగస్వామ్య ఒప్పందం
సీఎస్‌ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్, మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ), అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రెసైస్ మధ్య భాగస్వామ్యం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా కోవిడ్-19 నిర్ధారణకై సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ అభివృద్ధి చేసిన డ్రై స్వాబ్ టెస్ట్ కిట్స్ తయారీ, వాణిజ్యీకరణ బాధ్యతలను అపోలో చేపడుతుంది. సురక్షితమైన ఈ కిట్స్ ధర తక్కువగా ఉండడంతోపాటు నిర్ధారణ పరీక్ష ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు. వీటిని అపోలో ఆసుపత్రుల ద్వారా అందుబాటులోకి తెస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రెసైస్‌తో భాగస్వామ్యం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : సీఎస్‌ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్, మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)
ఎందుకు : సీఎస్‌ఐఆర్-సీసీఎంబీ అభివృద్ధి చేసిన కోవిడ్ కిట్‌లను అపోలో ఆసుపత్రుల ద్వారా అందుబాటులోకి తెచ్చెందుకు
స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర
2021, మార్చిలో భారీ స్థాయి స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 16న ఆమోదముద్ర వేసింది. ఈ బిడ్డింగ్ ద్వారా 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను విక్రయించనున్నారు. ఈ మొత్తం స్పెక్ట్రమ్ కనీస వేలం ధర (బేస్ ప్రైస్) రూ.3.92 లక్షల కోట్లుగా అంచనా. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం...
- 700, 800, 900, 2100, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్‌త ఫ్రీక్వెన్సీల్లో 2,251.25 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వేలంలో అందుబాటులో ఉంటుంది.
- మొత్తం 20 ఏళ్ల వ్యవధికి గాను ఈ బిడ్డింగ్‌లో స్పెక్ట్రమ్‌ను దక్కించుకోవచ్చు.
- బేస్/రిజర్వ్ ధర ప్రకారం ఇప్పుడు వేలం వేయనున్న స్పెక్ట్రమ్ విలువ రూ.3,92,332.70 కోట్లు. తమ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)లో 3 శాతం వాటాను స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
- 5జీ సేవల కోసం నిర్దేశించిన 3,300-3,600 మెగాహెట్జ్ బ్యాండ్‌విడ్‌త ఫ్రీక్వెన్సీలను మాత్రం ఈ తాజా వేలంలో విక్రయించడం లేదు.
చక్కెర పరిశ్రమకు రూ. రూ.3,500 కోట్ల సబ్సిడీ
ప్రస్తుత 2020-21 మార్కెటింగ్ సంవత్సరంలో చక్కెర మిల్లులకు 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతులపై రూ.3,500 కోట్ల సబ్సిడీకి కేంద్ర కేబినెట్ డిసెంబర్ 16న ఆమోదం తెలిపింది. ఈ మొత్తం నేరుగా రైతులకు చెల్లించడం జరుగుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గడిచిన రెండు మూడేళ్లుగా చక్కెర పరిశ్రమ, అలాగే చెరుకు రైతులు కూడా అధిక దేశీ ఉత్పత్తి కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పారు. 2020 ఏడాది కూడా వార్షిక డిమాండ్ 260 లక్షల టన్నులు కాగా, 310 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
చైనా టెలికం పరికరాలకు చెక్
చైనా నుంచి దేశంలోకి దిగుమతయ్యే టెలికం పరికరాలకు మరింతగా అడ్డుకట్ట వేసే విధంగా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ‘‘నమ్మకమైన విక్రేత (సోర్స్)’’ నుంచి మాత్రమే దేశీ టెలికం సేవల సంస్థలు తమకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన ప్రకారం... దేశీ టెలికం నెట్‌వర్క్‌లో ఉపయోగించదగిన నమ్మకమైన విక్రేతలు అలాగే పరికరాల జాబితాను డాట్ ప్రకటిస్తుంది. డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు నేతృత్వంలోని కమిటీ ఈ జిబితాను రూపొందిస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చక్కెర పరిశ్రమకు రూ. రూ.3,500 కోట్ల సబ్సిడీ ఇచ్చందుకు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : చెరుకు రైతులకు మేలు కలిగించేందుకు
ఎఫ్‌ఎస్‌డీసీ 23వ సమావేశం
ఆర్థికాభివృద్ధికి రానున్న బడ్జెట్ (2021-22)లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) చర్చించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన డిసెంబర్ 15న ఎఫ్‌ఎస్‌డీసీ 23వ సమావేశం వర్చువల్‌గా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎఫ్‌ఎస్‌డీసీ నాల్గవ సమావేశం ఇది.
భారత్ ఆర్థికవ్యవస్థపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక
భారత్ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన నివేదికను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) డిసెంబర్ 16న విడుదల చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీకి సంబంధించి తన తొలి క్షీణత అంచనాలను 10.9 శాతం నుంచి 7.4 శాతానికి మెరుగుపరుస్తున్నట్లు ఎస్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్‌ఎస్‌డీసీ) 23వ సమావేశం
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : వర్చువల్‌గా
ఎందుకు : ఆర్థికాభివృద్ధికి రానున్న బడ్జెట్ (2021-22)లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు
నీతి అయోగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంస్థ?
మహిళల్లో వ్యవస్థాపకత పెంపొందించే లక్ష్యంగా నీతి అయోగ్‌తో సెకోయా ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వ్యాపారాలు ప్రారంభించేందుకు, విస్తరణకు కావాల్సిన పరిజ్ఞానం, నైపుణ్యం అందించేందుకు ఎంపిక చేసిన మహిళలకు సాయపడతారు. నీతి అయోగ్‌కు చెందిన వుమెన్ ఎంట్రప్రెన్యూర్షిప్ ప్లాట్‌ఫాంతో సెకోయా స్పార్క్ కలిసి పనిచేస్తుంది. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి అయోగ్‌తో భాగస్వామ్యం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : సెకోయా ఇండియా
ఎందుకు : మహిళల్లో వ్యవస్థాపకత పెంపొందించే లక్ష్యంగా
రెపో రేటు అంటే? ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు ఎంత శాతంగా ఉంది?
కీలక పాలసీ వడ్డీ రేట్లు అయిన రెపో రేటు, రివర్స్ రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2 నుంచి 4 వరకు వరుసగా మూడు రోజులు సమావేశమైన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఆర్‌బీఐ-ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌బీఐ రెపో రేటు 4.00 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు వీలుగా సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించనున్నట్లు ఆర్‌బీఐ ఎంపీసీ వెల్లడించింది.
ఆర్‌బీఐ పాలసీ రేట్ల తీరు ఇదీ...
రెపో రేటు అంటే ఏమిటీ?
ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటు అంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
ద్రవ్యోల్బణం...
వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ ఎంపీసీ తాజా నిర్ణయాలను తీసుకుంది. ఆర్‌బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం స్థాయిలో ఉండాలి. అయితే ప్రస్తుతం దీనికి మించి కొనసాగుతోంది.
ఆర్‌బీఐ-ఎంపీసీ నిర్ణయాలు...
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 7.5 శాతం ఉంటుందని అంచనా.
- కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000కు పెంపు. డిసెంబర్ 14వ తేదీ నుంచి ఇది అమలు.
- భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ (ఆర్‌టీజీఎస్) ఇక నిరంతరాయంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అందుబాటులో ఉంటున్నాయి.
స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్‌ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి?
డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) 63వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో డిసెంబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. దేశంలోకి పసిడి, విదేశీ కరెన్సీ, నార్కోటిక్ డ్రగ్‌స మొదలైన వాటి స్మగ్లింగ్ విధానాల గురించి విశ్లేషించే ‘స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2019-20’ నివేదికను ఈ సందర్భంగా నిర్మల ఆవిష్కరించారు.
1957లో...
1957, డిసెంబర్ 4న డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ)ను స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డెరైక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) అధ్వర్యంలో డీఆర్‌ఐ పనిచేస్తుంది. ప్రస్తుతం డీఆర్‌ఐ డెరైక్టర్ జనరల్‌గా బాలేశ్ కుమార్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2019-20 ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశంలోకి పసిడి, విదేశీ కరెన్సీ, డ్రగ్‌స మొదలైన వాటి స్మగ్లింగ్ విధానాల గురించి విశ్లేషించేందుకు
భారత్‌కు అత్యధిక ఎఫ్‌డీఐలు ఏ దేశం నుంచి వచ్చాయి?
కీలకమైన పెట్టుబడి కేంద్రంగా భారత్ ఆవిర్భవిస్తోందనడానికి సూచనగా గడిచిన ఇరవై ఏళ్లలో భారీ స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వెల్లువెత్తాయి. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) గణాంకాల ప్రకారం... 2000 ఏప్రిల్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య కాలంలో 500.12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా 29 శాతం(144.71 బిలియన్ డాలర్లు) ఎప్‌డీఐలు మారిషస్ దేశం నుంచి వచ్చాయి.
మారిషస్ తర్వాత... సింగపూర్ (21 శాతం), అమెరికా(7 శాతం), నెదర్లాండ్‌స(7 శాతం), జపాన్ (7 శాతం), బ్రిటన్ (6 శాతం) దేశాల నుంచి అధిక ఎఫ్‌డీఐలు దేశంలోకి వచ్చాయి. 2019-20లో రికార్డు స్థాయిలో 50 బిలియన్ డాలర్లు వచ్చాయి.
సేవల రంగంలో అధికంగా...
సేవల రంగం, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్.. హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్స్, ట్రేడింగ్, నిర్మాణ రంగం, ఆటోమొబైల్, రసాయనాలు, ఫార్మా తదితర రంగాలు.. దేశంలోకి అత్యధిక స్థాయిలో ఎఫ్‌డీఐలను ఆకర్షించాయి.
మారిషస్ రాజధాని: పోర్ట్ లూయిస్; కరెన్సీ: మారిషస్ రుపీ
మారిషస్ ప్రస్తుత అధ్యక్షుడు: పృథ్వీరాజ్‌సింగ్ రూపన్
మారిషస్ ప్రస్తుత ప్రధాని: ప్రవీంద్ జుగ్నౌత్
యూకేలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన భారత సంస్థ?
భారత్‌కి చెందిన ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) యూకేలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. ఈ విషయాన్ని డిసెంబర్ 7న టీసీఎస్ తెలిపింది. యూకే డిజిటల్ ఎకానమీలో టీసీఎస్ ప్రభావ వంతమైన బ్రాండ్‌గా ఎదిగింది. వరుసగా 6 సార్లు ఐటీ సేవల్లో 3 ప్రధాన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.
కాఫీ డే సీఈవోగా మాళవిక...
కేఫ్ కాఫీ డే రెస్టారెంట్లను నిర్వహిస్తున్న కాఫీ డే ఎంటర్‌ప్రెసైస్ సీఈవోగా మాళవిక హెగ్డే నియమితులయ్యారు. అయిదేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు కంపెనీలో డెరైక్టర్‌గా ఉన్నారు. ఆమె సంస్థ వ్యవస్థాపకులు, దివంగత వి.జి.సిద్ధార్థ సతీమణి.
బయోఫ్యూయెల్ అభివృద్ధికి భారత్‌కు సాయం అందించిన సంస్థ?
అత్యాధునిక బయోఫ్యూయెల్ అభివృద్ధికిగాను ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) భారత్‌కు 2.5 మిలియన్ డాలర్లను (దాదాపు రూ.18 కోట్లు) సాంకేతిక సహాయంగా మంజూరు చేసింది.
గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రంతో భాగస్వామ్యం చేసుకున్న సంస్థ?
కామన్ సర్వీసెస్ సెంటర్(సీఎస్‌సీ) అకాడమీ ద్వారా గ్రామీణ యువతకు సాంకేతిక విద్యా, నైపుణ్య శిక్షణ అందించేందుకు... కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం మధ్య భాగస్వామ్యం కుదిరింది. దీంతో గ్రామీణ యువత, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ టెక్నాలజీ వంటి ప్రత్యేకమైన కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం సహకరిస్తుంది. ఈ కార్యక్రమంలో ఐబీఎంతో పాటు సీఎస్‌ఆర్ బాక్స్, యువ జాగృతి సంస్థాన్‌లు భాగస్వామ్యమయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అందించే లక్ష్యంతో కేంద్ర ఐటీ విభాగం రూపొందించిన కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సీఎస్‌సీ)లో భాగమే సీఎస్‌సీ అకాడమీ.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు : ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం
ఎందుకు : కామన్ సర్వీసెస్ సెంటర్(సీఎస్‌సీ) అకాడమీ ద్వారా గ్రామీణ యువతకు సాంకేతిక విద్యా, నైపుణ్య శిక్షణ అందించేందుకు..
సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ క్షీణ రేటు?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-2021) జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితమైంది. జాతీయ గణాంకాల కార్యాలయం నవంబర్ 27న ఈ విషయాన్ని తెలిపింది. కఠిన లాక్‌డౌన్ పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారీగా 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం(2019-2020) ఇదే త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతం వృద్ధి రేటు నమోదైంది.
క్షీణత ఇలా...:
జాతీయ గణాంకాల కార్యాలయం ప్రకటన ప్రకారం... 2020-21 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.33.14 లక్షల కోట్లు. 2019-20 ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 35.84 లక్షల కోట్లు. అంటే విలువలో ఎటువంటి వృద్ధిలేకపోగా 7.5 శాతం క్షీణత నమోదయి్యందన్నమాట.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2020-2021 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ క్షీణ రేటు 7.5 శాతానికి పరిమితం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : జాతీయ గణాంకాల కార్యాలయం
అమల్లోకి లక్ష్మీ విలాస్ బ్యాంక్ విలీనం
ప్రైవేట్ రంగ లక్ష్మీ విలాస్ బ్యాంక్ (ఎల్‌వీబీ) నవంబర్ 27 నుంచి కొత్తగా డీబీఎస్ బ్యాంక్ ఇండియాగా (డీబీఐఎల్) మారింది. దీంతో దాదాపు శతాబ్దకాలం చరిత్ర గల బ్యాంక్ కనుమరుగైనట్లయింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎల్‌వీబీని గట్టెక్కించేందుకు డీబీఐఎల్‌లో విలీనం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నవంబర్ 27 నుంచి ఈ విలీన నిర్ణయం అమల్లోకి వచ్చింది.
ద్రవ్యలోటు ఆందోళన...
ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు- పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. వార్షిక బడ్జెట్ నిర్దేశించిన లక్ష్యానికి మించి కొనసాగుతోంది. 2020 అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు 120 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నవంబర్ 27న విడుదల చేసిన గణాంకాలకు పరిశీలిస్తే...
- 2020-21లో ద్రవ్యలోటు రూ.7.96 లక్షల కోట్లు ఉండాలని 2020, ఫిబ్రవరిలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇది 2020-21 భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోల్చితే 3.5 శాతం.
- 2020, ఏప్రిల్ నుంచి అక్టోబర్ నాటికే ద్రవ్యోలోటు 120 శాతానికి అంటే రూ.9,53,154 కోట్లకు ఎగసింది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని దాటిపోవడం ఇది వరుసగా ఐదవనెల.
ఎన్నేళ్లలో కార్పొరేట్ రుణ వ్యాపారానికి ఇండోస్టార్ గుడ్‌బై చెప్పనుంది?
బ్యాంకింగ్‌యేతర ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ 2022 మార్చి నాటికి కార్పొరేట్ రుణ వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోనుంది. ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ శ్రీధర్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. గత రెండు సంవత్సరాలుగా కంపెనీ తన కార్పొరేట్ రుణ మంజూరీలను క్రమంగా తగ్గించుకుంటోందని ఆయన తెలిపారు. దీనితో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పుస్తక విలువ రూ.3,500 కోట్లకు పరిమితమయి్యందని వివరించారు. 2018లో ఈ విలువ రూ.6,000 కోట్లని తెలిపారు. ప్రస్తుతం తమ మొత్తం రుణ పుస్తకంలో రిటైల్ విభాగానికి 73 శాతం వాటా ఉంటే, కార్పొరేట్ సెగ్మెంట్ వాటా 27 శాతమని తెలిపారు. రిటైల్ వ్యాపారానికి సంబంధించి ఫైనాన్స్, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), చౌక గృహ రుణాలపై కంపెనీ ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. 2020 సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన త్రైమాసికానికి ఇండోస్టార్ క్యాపిటల్ కన్సాలిడేటెడ్ లాభం 36 శాతం తగ్గి రూ.32 కోట్లుగా నమోదయి్యంది. ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్ బ్రూక్‌ఫీల్డ్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ- ఎవర్‌స్టోన్‌లు ఇండోస్టార్‌ను ప్రమోట్ చేస్తున్నాయి.
ఐహెచ్‌ఎస్ మార్కిట్ సంస్థను కొనుగోలు చేయనున్న సంస్థ?
ఆర్థిక గణాంకాలు అందించే ఐహెచ్‌ఎస్ మార్కిట్ సంస్థను ఎస్ అండ్ పీ గ్లోబల్ కొనుగోలు చేస్తోంది. అంతా షేర్ల లావాదేవీగా జరిగే ఈ ఒప్పందం విలువ 4,400 కోట్ల డాలర్లు (దాదాపు రూ.3.3 లక్షల కోట్లు)గా ఉంది. ఆర్థిక గణాంకాల సమాచార రంగంలో ఇదే అతిపెద్ద విలీనం. ఈ ఒప్పందంలో భాగంగా ఒక్కో ఐహెచ్‌ఎస్ మార్కిట్ షేర్‌కు 0.2838 ఎస్ అండ్ పీ గ్లోబల్ షేర్ లభిస్తుంది.
2021, జూన్ నాటికి...
విలీన సంస్థ న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థకు సీఈఓగా ఎస్ అండ్ పీ గ్లోబల్ ప్రస్తుత సీఈఓ డగ్లస్ పీటర్సన్ వ్యవహరిస్తారు. 2021, జూన్‌కల్లా ఈ లావాదేవీ పూర్తవుతుందని అంచనా. ఎస్ అండ్ పీ సంస్థ కంపెనీలకు, దేశాలకు డెట్ రేటింగ్‌సను ప్రకటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాపిటల్, కమోడిటీ మార్కెట్లకు సంబంధించిన గణాంకాలను విడుదల చేస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐహెచ్‌ఎస్ మార్కిట్ సంస్థను కొనుగోలు చేయనున్న సంస్థ
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : ఎస్ అండ్ పీ గ్లోబల్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4.2 శాతం క్షీణత: ఓఈసీడీ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020 ఏడాదిలో 4.2 శాతం క్షీణిస్తుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) అంచనా వేసింది. ఈ మేరకు డిసెంబర్ 1న ఒక నివేదికను విడుదల చేసింది. 2021 నుంచీ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందని తన నివేదికలో పేర్కొంది. అయితే అన్ని దేశాల్లో రికవరీ ఒకే తీరున ఉండే అవకాశం లేదని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడ్డానికి ప్రపంచదేశాల పరస్పర సహకారం కీలకమని వెల్లడించింది. ఓఈసీడీలో 37 దేశాలకు సభ్యత్వం ఉంది. ప్రస్తుతం ఓఈసీడీ చీఫ్ ఎకనమిస్ట్‌గా లారెన్స్ బూన్ ఉన్నారు.
భారత్‌లో అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిచిన బ్రాండ్?
అమెరికాకు చెందిన కంప్యూటర్స్ బ్రాండ్ ‘డెల్’.. భారత్‌లో వరుసగా రెండో ఏడాదీ అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిచింది. డెల్ తర్వాత చైనాకు చెందిన షావోమి మొబైల్స్ రెండో స్థానంలో, కొరియన్ దిగ్గజం శాంసంగ్ మొబైల్స్ మూడో స్థానం దక్కించుకున్నాయి. మొత్తం మీద ఎనిమిదో స్థానంలో ఉన్నప్పటికీ ఆటోమొబైల్ విభాగంలో మారుతి సుజుకీ అగ్రస్థానంలో నిలిచింది. విశ్వసనీయ బ్రాండ్‌సపై వినియోగదారులతో నిర్వహించిన సర్వే ఆధారంగా టీఆర్‌ఏ రీసెర్చ్ సంస్థ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 16 నగరాల్లో 1,711 మంది వినియోగదారులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 323 కేటగిరీల్లో మొత్తం 8,000 బ్రాండ్‌సను పరిగణనలోకి తీసుకున్నారు.
బ్రాండ్ | ర్యాంకు |
డెల్ | 1 |
షావోమి మొబైల్స్ | 2 |
శాంసంగ్ మొబైల్స్ | 3 |
యాపిల్ ఐఫోన్ | 4 |
ఎల్‌జీ టెలివిజన్ | 5 |
ఒప్పో | 6 |
సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ | 7 |
మారుతి సుజుకీ | 8 |
శాంసంగ్ టెలివిజన్స్ | 9 |
వివో మొబైల్స్ | 10 |
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరుసగా రెండో ఏడాదీ అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌గా డెల్
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : టీఆర్‌ఏ రీసెర్చ్ సంస్థ
ఎక్కడ : భారత్
ఫార్చూన్-500 జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ?
ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్‌లో భాగమైన ఫార్చూన్ ఇండియా విడుదల చేసిన ‘ఫార్చూన్ ఇండియా-500’ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం నిలిచింది. ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.
ఫార్చూన్ ఇండియా టాప్-500 సంస్థల జాబితా
ర్యాంకు | సంస్థ |
1 | రిలయన్స్ ఇండస్ట్రీస్ |
2 | ఐవోసీ |
3 | ఓఎన్‌జీసీ |
4 | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా |
5 | భారత్ పెట్రోలియం |
6 | టాటా మోటార్స్ |
7 | రాజేష్ ఎక్స్‌పోర్‌ట్స |
8 | టీసీఎస్ |
9 | ఐసీఐసీఐ బ్యాంక్ |
10 | ఎల్‌అండ్‌టీ |
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫార్చూన్ ఇండియా-500 జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : రిలయన్స్ ఇండస్ట్రీస్
ఎక్కడ : భారత్