Goods and Services Tax: ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జీఎస్‌టీ సమీక్ష కమిటీకి నేతృత్వం వహించనున్నారు?
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థ సమీక్షకు రాష్ట్రాల మంత్రులతో కూడిన రెండు కీలక కమిటీలను కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 27న ఆర్థిక శాఖ తెలిపిన వివరాల ప్రకారం... ఒక కమిటీకి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నేతృత్వం వహించనుండగా, మరొక కమిటీకి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సారథ్యం వహిస్తారు. రేట్ స్లాబ్‌లు– విలీనం, జీఎస్‌టీ మినహాయింపు వస్తువుల సమీక్ష, పన్ను ఎగవేతల గుర్తింపు, ఎగవేతలు నివారించడానికి మార్గాల అన్వేషణ, ట్యాక్స్ బేస్ పెంపు తత్సంబంధ అంశాలపై ఈ కమిటీలు సమీక్ష జరపనున్నాయి.
కమిటీలు ఇలా...
బసవరాజు బొమ్మై నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీలో పశ్చిమబెంగాల్ ఆర్థికమంత్రి అమిత్ మిశ్రా, కేరళ ఆర్థికమంత్రి కేఎన్ బాలగోపాల్, బిహార్ ఉపముఖ్యమంత్రి తార్‌కిషోర్ ప్రసాద్ తదితరులు సభ్యులుగా ఉంటారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎనిమిది సభ్యుల కమిటీలో... ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగ రాజన్, ఛత్తీస్‌గఢ్ ఆర్థికమంత్రి టీఎస్ సింగ్ డియో తదితరులు ఉన్నారు.
చదవండి: కేంద్ర ఐటీ శాఖతో ఒప్పందం చేసుకున్న సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రాష్ట్రాల మంత్రులతో కేంద్ర ఆర్థికశాఖ ఏర్పాటు చేసిన రెండు కీలక కమిటీలకు నేతృత్వం వహించనున్న వారు?
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్
ఎందుకు : వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థ సమీక్షకు...